కరోనావైరస్ కూడా చేరని మారుమూల ద్వీపం ఇది... ఇక్కడ జీవితం ఎలా ఉంటుందో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే అత్యంత మారుమూల ద్వీప సమూహాల్లో ట్రిస్డన్ డ కూనా ఒకటి. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతం చుట్టూ 2 వేల కి.మీ.ల పరిధిలో ఎక్కడా జనావాసాలన్నవే లేవు.
అందుకే ఇక్కడికి కరోనావైరస్ కూడా చేరుకోలేదు.
ట్రిస్డన్ డ కూనాను సంక్షిప్తంగా టీడీసీ అని పిలుస్తుంటారు. అక్కడికి వెళ్లడం చాలా ప్రయాసతో కూడుకున్న పని.
కేవలం పడవల్లోనే వెళ్లగలం. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నగరం నుంచి అక్కడికి 18 రోజుల ప్రయాణం. అది కూడా తీవ్రమైన ఆటుపోట్లు ఉండే సముద్రంలో ప్రయాణించాలి.
ఒకవేళ వేగంగా ప్రయాణించే ఎస్ఏ అగుల్హాస్ పడవైతే, ఆరు రోజుల్లో ప్రయాణం పూర్తవుతుంది. కానీ, ఏడాదికి ఒక్కసారి ఆ పడవ అక్కడికి వెళ్తుంది. పైగా దాని టికెట్ దొరకడం చాలా కష్టం.
కొన్ని చేపలు పట్టే బోట్లు కూడా టీడీసీకి వెళ్లి, వస్తుంటాయి. అలాంటివారు ఎవరైనా దయతలిస్తే కూడా అక్కడికి వెళ్లొచ్చు.

ఫొటో సోర్స్, penguins-and-potatoes.co.uk
టీడీసీ ద్వీప సమూహంలోని ప్రధాన ద్వీపాన్ని కూడా టీడీసీ అని పిలుస్తారు. ఇది సుమారు 11 కిలో మీటర్ల వ్యాసంతో ఉన్న ఓ అగ్నిపర్వత ప్రాంతం. చివరిసారిగా 1961లో ఈ అగ్నిపర్వతం లావాను వెళ్లగక్కింది.
ఈ ద్వీపంపై ఎడిన్‌బరో ఆఫ్ ద సెవెన్ సీస్ పేరుతో ఓ చిన్న ప్రాంతం ఉంది. ఈ మొత్తం ద్వీప సమూహంలో జనం నివసించే ఏకైక ప్రాంతం ఇదే.
టీడీసీ మొత్తం జనాభా 245. ఇందులో మహిళలు 133 మంది, పురుషులు 112 మంది. ఓ కేఫ్, ఓ పోస్ట్ ఆఫీస్, ఓ పబ్, ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఓ హాలు, ఒక చిన్న ఆధునిక ఆసుపత్రి, చిన్న బడి ఇక్కడ ఉన్నాయి.
ఈ ద్వీపంపై ఉండటం ఓ ఊరిలో జీవిస్తున్నట్లే ఉంటుంది.
‘‘మనతోపాటు స్కూల్లో చదువుకున్నవారు జీవితాంతం మనకు మిత్రులుగా ఉంటారు. కొత్తవాళ్లు మన జీవితంలోకి రావడం అరుదు’’ అని అలాస్డేర్ విల్లీ బీబీసీతో అన్నారు. కొంతకాలం కిందటి వరకూ ఆయన టీడీసీలోనే ఉన్నారు. అక్కడ ఆయన వ్యవసాయ సలహాదారుడిగా పనిచేసేవారు.

ఫొటో సోర్స్, Google
టీసీడీలో ప్రధానంగా ఆరు ఇంటిపేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. అవి... లావారెల్లో, రాపెట్టో, రోజర్స్, స్వెయిన్, గ్రీన్, గ్లాస్.
వివాహాలు సాధారణంగా స్థానికుల మధ్యే జరుగుతుంటాయి.
ద్వీపంలో ఇప్పుడు ఉన్నవారిలో ఇద్దరు మినహా అందరూ ఇక్కడివారే. ఆ ఇద్దరూ ఈ ద్వీపవాసులను పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు.
టీడీసీ బ్రిటన్‌కు చెందిన భూభాగం. బ్రిటన్ ఇక్కడ ఓ డాక్టర్‌ను, ఓ టీచర్‌ను నియమిస్తూ ఉంటుంది. అయితే, వాళ్లు మారుతూ ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడ గడ్డి పరకల చప్పుడు కూడా వినిపిస్తుంటుందని స్థానికుడు హరాల్డ్ చెబుతున్నారు. టీడీసీలో ఉండే ప్రశాంతమైన వాతావరణం తనకు చాలా ఇష్టమని ఆయన అన్నారు.
ఈ ద్వీపంలో ఇళ్లకు ఎవరు తాళాలు కూడా వేసుకోరని హరాల్డ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టీసీడీలో ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉండదు. ఫోన్ సేవలు మాత్రం ఉచితం.
ఈ ద్వీపంపై తీరం వెంబడి మూడు కి.మీ.ల పొడవైన ఓ రోడ్డు కూడా ఉంది. పంటపొలాలుండే ‘ద పాచెస్’ ప్రాంతానికి ఇది వెళ్తుంది.

ఫొటో సోర్స్, Alasdair Wyllie
ఈ పొలాల్లో కూరగాయలు, ముఖ్యంగా ఆలుగడ్డలు పండిస్తారు. ఎండాకాలంలో అక్కడికి వెళ్లి వన భోజనాల్లాంటివి చేసుకుంటామని స్థానికులు చెప్పారు.
అప్పుడప్పుడు టీడీసీవాసులు అందరూ కలిసి బార్బీక్యూ విందులు కూడా చేసుకుంటుంటారు.
‘‘ఒకప్పుడు ఈ ద్వీపంలోని జనాల జీవితాల్లో సంగీత వాయిద్యాలు, పాటలు ముఖ్య భాగంగా ఉండేవి. కానీ, ఇప్పుడు చాలా మంది ఖాళీ సమయాలను స్క్రీన్లకు కళ్లప్పగించేసి గడుపుతున్నారు’’ అని అలాస్డేర్ అన్నారు.
అద్భుతమైన కొండలు, లోయలతో ఉండే ఈ ద్వీపంపై ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. సముద్ర మట్టానికి 2,062 మీటర్ల ఎత్తులో ఉన్న కొండలు కూడా ఇక్కడ ఉన్నాయి.
టీసీడీ తీరంలో మూడింట రెండొంతల భాగం కొండలతోనే ఉంది. ఇక్కడ మైదాన ప్రాంతం చాలా తక్కువ.

ఫొటో సోర్స్, Brian Gratwicke
టీసీడీ పరిధిలో నైటింగల్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. టీడీసీవాసులు ఎప్పుడైనా విడిది కోసం ఆ ద్వీపానికి వెళ్తుంటారు. టీసీడీతో పోల్చితే ఇక్కడ సముద్రంలో ఆటుపోట్లు, షార్క్‌లు తిరగడం తక్కువ. కాబట్టి, వారికి ఈత కొట్టేందుకు కాస్త అనుకూలంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్‌యాక్సిసెబుల్ ఐలాండ్, గాగ్ ఐలాండ్ అనే మరో రెండు ద్వీపాలు టీసీడీ పరిధిలో ఉన్నాయి.
గాగ్ ఐలాండ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన పరిశోధకుల బృందం ఉంటుంది. ఏటా ఆ బృంద సభ్యులు మారుతూ ఉంటారు.
‘‘టీసీడీ లాంటి మారుమూల ద్వీపంలో జీవితం అద్భుతంగా ఉంటుందని కొందరు అనుకుంటుంటారు. కానీ, ఇక్కడి కష్టాలు ఇక్కడ ఉంటాయి. ఈ ప్రాంతం అందంగా ఉంటుందన్నది వాస్తవం. కానీ, ఇది స్వర్గమైతే కాదు’’ అని అలాస్డేర్ అన్నారు.

ఫొటో సోర్స్, penguins-and-potatoes.co.uk
టీడీసీ ద్వీప సమూహంలో గాలుల సవ్వడి, ప్రధాన ద్వీపంలో ఆవుల సందడి మినహా పెద్దగా చప్పుళ్లు వినిపించవు.
నిజానికి ఈ ద్వీపాల్లో చాలా పక్షులు ఉంటాయి. ఎందుకో, అవి శబ్దాలు మాత్రం పెద్దగా చేయవు.

ఫొటో సోర్స్, Brian Gratwicke
తమను వేటాడే జీవులేవీ లేకపోవడంతో కొన్ని పక్షులు ఇక్కడ ఎగరకుండానే ఉండిపోతాయి.
ఇన్‌యాక్సిసెబుల్ ఐలాండ్ రైల్ పక్షి వీటిలో ఒకటి. ఈ ద్వీప సమూహంలో మాత్రమే కనిపించే అరుదైన జీవి ఇది.

ఫొటో సోర్స్, penguins-and-potatoes.co.uk
ఇలాంటి మారుమూల ద్వీపంలో ఉన్నవారు ప్రత్యేకంగా ఐసోలేషన్ పాటించాల్సిన అవసరం ఏముంటుంది? అందుకే, ఇక్కడికి కరోనావైరస్ కూడా ఇంకా రాలేదు.
అయితే, కోవిడ్ మహమ్మారి లేకున్నా, దాని ప్రభావమైతే తమపై ఉందని స్థానికురాలు ఫియోనా క్లిపాట్రిక్ అంటున్నారు.
కోవిడ్ కారణంగా దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్ అమలు కావడంతో టీడీసీకి కేప్‌టౌన్ నుంచి సరుకులు తెచ్చే పడవలు అక్కడే ఆగిపోయాయి.
''మాములు సమయాల్లోనే టీసీడికి వస్తువులు రావడం అన్నది సంక్లిష్టైమన వ్యవహారం. చిన్న తేడా వచ్చినా, సమస్యలు వస్తాయి. అలాంటిది కోవిడ్ సమయంలో ఈ ప్రక్రియపై ఇంకా తీవ్ర ప్రభావం పడింది'' అని అలాస్డేర్ అన్నారు.

ఫొటో సోర్స్, penguins-and-potatoes.co.uk
కోవిడ్ కారణంగా టీసీడీలో ఓ అరుదైన ఘటన కూడా జరిగింది. చాలా ఏళ్ల తర్వాత టీసీడీలో ఓ తల్లి పాపకు జన్మనిచ్చారు.
''సాధారణంగా ఇక్కడ గర్భంతో ఉన్నవాళ్లు డెలివరీ సమయానికి సమస్యలేవీ రాకూడదని దక్షిణాఫ్రికా వెళ్తారు. లాక్‌డౌన్ కారణంగా ఇలా వెళ్లే పరిస్థితి ఆ మహిళకు లేకపోయింది. అలా చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఓ పాప పుట్టింది'' అని అలేస్డేర్ అన్నారు.
ఆ తల్లి, పాప క్షేమంగానే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టీసీడీకి మొట్టమొదటగా జనం 1800ల్లో వచ్చి స్థిరపడ్డారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జనాభా తగ్గుతూ వస్తోంది.
''నేను అక్కడున్న సమయంలో 15 మంది వృద్ధాప్యంతో చనిపోయారు. ఇద్దరే పుట్టారు'' అని అలెస్డేర్ చెప్పారు.
''ఇక్కడి అమ్మాయిలు ముగ్గురు బ్రిటన్‌లో సెకండరీ స్కూల్‌లో చదువుకుంటున్నారు. వారిలో ఒకామె ఉన్నత విద్య చదవాలని నిర్ణయించుకున్నారు'' అని అలస్డేర్ చెప్పారు.
టీసీడీ వాసుల్లో యూనివర్సిటీకి వెళ్తున్న తొలి యువతిగా ఆమె ఘనత అందుకోనుంది. ఇదివరకు టీడీసీలో ఓ యువతి డిస్టేన్స్ ఎడ్యుకేషన్ పద్ధతి ద్వారా డిగ్రీ పూర్తి చేశారు.
టీడీసీ గురించి వివరాలు తెలుసుకున్న తర్వాత... ఆ ద్వీసానికి వెళ్లి, సెటిలైతే బాగుండు అని చాలా మందికి అనిపించవచ్చు. కానీ, వారి ఆశలు తీరే అవకాశాలు చాలా తక్కువ.
''ఎవరైనా ఇక్కడ శాశ్వతంగా ఉండాలని అనుకుంటే, టీడీసీ మండలి ఆమోదం తప్పనిసరి. కానీ, చాలా దరఖాస్తులను మండలి తిరస్కరిస్తుంటుంది’’ అని అలాస్డేర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








