కరోనా కాలంలో మహిళలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారా

- రచయిత, నిధి రాయ్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్, ముంబయి
పబ్లిక్ రిలేషన్స్ రంగంలో పని చేసే సకీనా గాంధీ ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నారు. ఆమెకు స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి పెరిగింది. దానిపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు.
"లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. అప్పుడు షేర్ మార్కెట్ వైపు దృష్టి మళ్లింది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాను."
"మొదట 15 రోజులు నాకు మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికే సరిపోయింది. అక్కడ షేర్ల జాబితా ఇచ్చారు. అవి ఎలా మారుతాయో తెలుపుతూ విశ్లేషణలున్నాయి. నా సహోద్యోగులతో చర్చించిన తరువాత కొన్ని షేర్లు కొన్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టాను" అని సకీనా వివరించారు.
కోవిడ్ 19 మొదలైన తొలి దశలో స్టాక్ మార్కెట్ పడిపోతుండడం సకీనా గమనించారు. అప్పుడు ఆమెకు దీనిపై ఆసక్తి పెరిగింది.
షేర్ మార్కెట్లో పెట్టుబడి ప్రయోజనకారిగా తోచింది. వెంటనే ఆమె తన డీమాట్ ఖాతాను తెరిచారు.
"ఇది నేను సంపాదించిన డబ్బు, ఇందులో నా భర్త లేదా మరెవరి జోక్యంగానీ లేదు. అందుకే కొంచం రిస్క్ తీసుకుని చూద్దాం అనుకున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం అని ముందుకు వెళ్లాను."
"రోజూ వార్తా పత్రికల్లో వచ్చే షేర్ మార్కెట్ వ్యవహారాలు జాగ్రత్తగా గమనించడమే పనిగా పెట్టుకున్నాను. కంపెనీలు, స్టాక్ మార్కెట్ సంబంధిత సమాచారం కోసం గూగుల్ అలర్ట్ పెట్టుకున్నాను" అని సకీనా తెలిపారు.
స్టాక్ మార్కెట్లో మొదటిసారి అడుగుపెట్టినవారి సంఖ్య పెరిగింది
సకీనా మాత్రమే కాదు అనేకమంది ఈ కరోనా కాలంలో తొలిసారిగా షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టారు.
కరోనా వైరస్ చాలా రకాల వ్యాపారాలను దెబ్బతీసింది. దీనినుంచీ కోలుకోవడానికి వారందరికీ సమయం పడుతుంది.
అయితే, స్టాక్ మార్కెట్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో స్టాక్ ధరలు బాగా తగ్గడం వలన రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది.
ఇప్పటివరకూ షేర్ మార్కెట్‌కు దూరంగా ఉన్నవాళ్లు చాలామంది తొలిసారిగా ఇందులోకి అడుగుపెట్టారు.
36 ఏళ్ల రితికా షా కూడా పబ్లిక్ రిలేషన్స్‌లోనే పని చేస్తున్నారు. ఆవిడ కూడా కరోనా సమయంలో తొలిసారిగా షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టారు.
"మా కుటుంబంలో కొందరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. నేను కూడా ఇందులోకి దిగాలనుకున్నాను. కానీ సరైన సమయంకోసం వేచి చూస్తూ ఉన్నాను. లాక్‌డౌన్‌లో షేర్ మార్కెట్ గురించి అధ్యయనం చెయ్యడానికి నాకు కావలసినంత సమయం దొరికింది. నా ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోగలిగాను" అని రితికా, బీబీసీకి తెలిపారు.
మార్చి నెలలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉందని రితికా భావించారు.
"ఇది పన్ను ఆదా చెయ్యడానికి కూడా సహాయపడుతుంది. నేను ప్రతి నెలా 50వేల రూపాయల పెట్టుబడి పెడుతున్నాను. మరో 10వేలు పెంచాలని చూస్తున్నాను" అని రితికా తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
రిటైల్ పెట్టుబడిదారులు పెరుగుతున్నారు
స్టాక్ మార్కెట్ ప్రాధికార, నియంత్రణ సంస్థ (సెబీ) తాజా డేటా ప్రకారం రిటైల్ పెట్టుబడిదారులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 54 శాతం పెరిగారు.
"2020 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 63 లక్షల కొత్త డీమాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. కిందటేడాది ఇదే సమయంలో 27.4 లక్షల ఖాతాలు తెరుచుకున్నాయి. దానితో పోలిస్తే ఈ ఏడాది డీమాట్ ఖాతాల్లో 130 శాతం పెరుగుదల కనిపిస్తోంది" అని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు.
భారతదేశంలోని అతి పెద్ద ట్రేడింగ్ అకౌంట్ డిపాజిటరీ అయిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) ప్రకారం 2020లో మొదటి తొమ్మిది నెలల్లో 50 లక్షలమంది పెట్టుబడిదారులు కొత్తగా డీమాట్ ఖాతాలను తెరిచారు. గత ఐదేళ్లల్లో తెరిచిన ఖాతాలలో ఇది సగానికి సమానం.
జెరోదాలాంటి బ్రోకింగ్ కంపెనీలు పెట్టుబడిదారుల సంఖ్యలో వృద్ధిని గమనించాయి. పెట్టుబడిదారులంతా డీమాట్ ఖాతా ద్వారా షేర్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఈ కంపెనీ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ప్రారంభించారు.
"ఈ మార్చినుంచీ ప్రతి నెలా ఓపెన్ అయిన సగటు డీమాట్ ఖాతాల్లో 100 శాతం పెరుగుదల కనిపించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగానే ఈ వృద్ధి కనిపిస్తోంది" అని జెరోదా సహ వ్యవస్థాపకుడు, సీఐఓ నిఖిల్ కామత్ తెలిపారు.
జెరోదాలో ప్రస్తుతం 30 లక్షలమంది పెట్టుబడిదారులున్నారు. వీరిలో 10 లక్షలమంది లాక్‌డౌన్ మొదలయ్యాక..అంటే మార్చి నుంచి చేరినవాళ్లే.

లాక్‌డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ కలిసొచ్చాయి
స్టాక్ మార్కెట్లో అమాంతంగా పెట్టుబడిదారులు పెరగడానికి లాక్‌డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్లో ఉండడంతో మిగులు సమయం పెరిగి అనేకమంది స్టాక్ మార్కెట్ మీద దృష్టి పెట్టారని అంటున్నారు.
స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉన్నా కూడా రోజువారీ వ్యవహారాలతో తగినంత సమయం చిక్కక ఇన్నాళ్లూ దూరంగా ఉన్నవారు కూడా లాక్ డౌన్ సమయంలో షేర్ మార్కెట్‌వైపు దృష్టి మళ్లించారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"స్టాక్ మార్కెట్లో పెద్ద కంపెనీల ధరలు తగ్గడం, వడ్డీ రేట్లు తగ్గడం, గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ స్థిరంగా ఉండడం, లాక్‌డౌన్ కాలంలో ఖాళీ సమయం చేతికి చిక్కడం...ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు పెరగడానికి కారణమని" నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సన్నగిల్లడం, పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి బ్రోకింగ్ కంపెనీలు అవలంబిస్తున్న సాంకేతిక పద్ధతులు కూడా కలిసొచ్చాయని నిశ్లేషకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర కారణాలు
పెరిగిన మొబైల్ ఫోన్ల వాడకం, చౌక ధరలకే ఇంటర్నెట్ లభ్యమవ్వడం, బ్రోకింగ్ సంస్థలు పెట్టుబడిదారులనుంచీ బ్రోకింగ్ ఫీజు తీసుకోకపోవడంతో పాటు వారు సరైన నిర్ణయాలు తీసుకునేలా సహాయపడడం కూడా స్టాక్ మార్కెట్లో వృద్ధికి కారణాలని విశ్లేషకులు అంటున్నారు.
ఉదాహరణకు జెరోధా సంస్థ స్టాక్ మార్కెట్ ట్యూషన్ ప్రారంభించింది. ఈ పేజీని చూసేవాళ్లు సగటున రోజుకు 45 వేలమంది ఉంటారు. లాక్‌డౌన్ సమయంలో ఈ సంఖ్య 85 వేలకు పెరిగింది.
దీనికి తోడు సెబీ, డీమాట్ ఖాతా తెరిచే ప్రక్రియను సులభతరం చేసింది. ఎలక్ట్రానిక్ 'నో యువర్ కస్టమర్' (కేవైసీ)తో పెట్టుబడిదారులు నిముషాల్లో డీమాట్ ఖాతా తెరవగలుగుతారు.
ఈ-సైన్, డిజీ-లాకర్స్‌లాంటి సౌకర్యాలను కూడా సెబీ ప్రవేశపెట్టింది. దీంతో పెట్టుబడిదారులు వారి పత్రాలను భద్రపరుచుకోవడమే కాకుండా సులభంగా, త్వరగా రిజిస్టర్ చేసుకోగలుగుతారు.

ఫొటో సోర్స్, AFP
అధిక సంఖ్యలో మహిళలు
మహిళలు ఆన్‌లైన్ ట్రేడింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని జెరోధా డాటా చెబుతోంది.
"మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోంది. చాలామంది కొత్తగా షేర్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారని" నిఖిల్ కామత్ తెలిపారు.
లాక్‌డౌన్ కాలంనుంచీ జెరోధాలో 15 లక్షలకన్నా ఎక్కువమంది ఖాతాదారులు చేరారు. ఇందులో 2 లక్షల 35 వేలమంది మహిళలు ఉన్నారు.
జెరోధాలో మొత్తం ఐదు లక్షల 60 వేల మంది మహిళా పెట్టుబడిదారులు ఉన్నారు. వారి సగటు వయస్సు 33 సంవత్సరాలు.
కరోనా కాలం మొదలయిన దగ్గరనుంచీ మహిళా పెట్టుబడిదారుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని ఫయెర్స్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కూడా తెలిపింది.
"మహిళలు నేరుగా వ్యాపారాలు చెయ్యడంకన్నా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారు. బంగారంమీద పెట్టుబడి పెట్టడం లేదా ఫిక్సిడ్ డిపాజిట్స్, పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే, లాక్‌డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ వలన వారికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశం వచ్చింది" అని ఫయెర్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ తేజస్ ఖోడే, బీబీసీకి తెలిపారు.
యువత కూడా పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపుతున్నారు
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చెయ్యడానికి యువత ముందుకొస్తున్నారు.
20నుంచీ 30 వయసు మధ్యగల పెట్టుబడిదారుల సంఖ్య కరోనా తరువాత బాగా పెరిగిందని, వారి సంఖ్య అంతకుముందు 50-55 శాతం ఉండేదని, కరోనా తరువాత 69 శాతానికి పెరిగిందని జెరోధా సంస్థ తెలిపింది.
అలాగే, ఆన్‌లైన్ బ్రోకింగ్ ప్లాట్ఫారం అప్‌స్టాక్ వినియోగదారుల సగటు వయసు ఏప్రిల్-ఆగస్ట్ మధ్యలో 29 కి తగ్గిందని, అంతకుముందు 31 ఉండేదని సమాచారం.
ఫయెర్స్‌లో కూడా 50% యువ పెట్టుబాడుదారులు ఉన్నారు.
"గత కొన్ని నెలలుగా యువత స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించినప్పటినుంచీ మొబైల్ ట్రేడింగ్ జోరు పెరిగింది. ట్రేడింగ్ టిప్స్ అనుసరించడంకంటే మార్కెట్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్న ఒక కొత్త తరాన్ని మేము మొదటిసారి చూస్తున్నాం" అని తేజస్ ఖోడే తెలిపారు.
ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ 5paisa.com డేటా ప్రకారం తమ ప్లాట్ఫారంపై 18నుంచీ 35 వయసులోపు పెట్టుబడిదారులు 81 శాతానికి పెరిగారు. కరోనా కాలానికి ముందు వీరు 74 శాతం ఉండేవారు.
పెట్టుబాడిదారులకు చిట్కాలు
స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి, పెట్టుబడులు పెట్టే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
"ఏదైనా కంపెనీలో షేర్లు కొనాలనుకునేముందు ఆ కంపెనీ బ్యాలన్స్ షీట్‌ను పరిశీలించాలి. కష్ట సమయాల్లో బయటపడడానికి ఆ కంపెనీ దగ్గర తగినంత డబ్బు ఉందా లేదా అనే విషయంపై శ్రద్ధ పెట్టాలి" అని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) అధ్యక్షుడు నీలేష్ షా తెలిపారు.
నీలేష్ షా గత 25 సంవత్సరాలుగా షేర్ మార్కెట్‌ను ట్రాక్ చేస్తున్నారు. కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఆయన కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చారు.
"రాబోయే కాలంలో గడ్డు పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకని షేర్లు కొనబోయే ముందు కంపెనీ బలాబలాలు పరిశీలించాలి."
"బ్యాలెన్స్ షీట్‌తో పాటూ వ్యాపార ఖర్చులను తగ్గించడానికి కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తోందా లేదా అనే దానిపై కూడా పెట్టుబడిదారులు దృష్టి పెట్టాలి."
"అంతే కాకుండా, కంపెనీ డిజిటల్‌గా ఎంత బలపడుతోందో గమనించాలి. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికను అవలంబిస్తోందో లేదో పరిశీలించాలి" అని నీలేష్ షా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- కఠినమైన సవాళ్ల నడుమ ‘కమలం’ ఎలా వికసించింది
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








