జో బైడెన్ విజయానికి 5 ప్రధాన కారణాలివే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆంథొని జూర్చర్
- హోదా, బీబీసీ ఉత్తర అమెరికా ప్రతినిధి
దాదాపు 50 ఏళ్లు ప్రజా ప్రతినిధిగా, తర్వాత రెండు సార్లు ఉపాధ్యక్షుడుగా ఉన్న జో బైడెన్ చివరికి అమెరికా కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
మెజారిటీకి అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను ఆయన దాటేశారని బీబీసీ లెక్క తేల్చింది.
కానీ, ఈసారీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మనం ఏ ఫలితాన్నైనా ఊహించగలిగేలా సాగలేదు.
ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలో ఈ ఎన్నికలు జరిగాయి. కోవిడ్-19 ప్రభావం అమెరికాలో తీవ్రంగా ఉంది. దీనికి తోడు దేశంలో అదే సమయంలో సామాజిక సంక్షోభం కూడా ఏర్పడింది.
ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య బైడెన్, డోనల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు.
కానీ, అధ్యక్షుడుగా మూడోసారి పోటీపడిన బైడెన్ ప్రచార బృందం రాజకీయ సవాళ్లను అధిగమించే దారులు అన్వేషించడంలో విజయవంతం అయ్యింది. చివరకు బైడెన్‌ను ఆయన గమ్యానికి చేర్చగలిగింది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విషయానికి వస్తే బైడెన్, ట్రంప్‌కు వచ్చిన ఓట్ల మధ్య తేడా పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ, దేశంలో పోలయిన ఓట్ల గణాంకాలన్నీ చూస్తే ట్రంప్ కంటే బైడెన్ లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కానీ, డెలావర్‌కు చెందిన ఒక కార్ల సేల్స్ మాన్ కొడుకు దేశంలో అత్యున్నత పదవి వరకూ ఎలా చేరుకోగలిగాడు.
బైడెన్ ఈరోజు వైట్ హౌస్ వరకూ చేరుకోవడం వెనుకున్న ఆ ఐదు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1. కోవిడ్, కోవిడ్, కోవిడ్
పూర్తిగా బైడెన్ అదుపులో లేని ఒకటి, బహుశా ఆయన విజయానికి అత్యంత ముఖ్యమైన కారణం అయ్యింది.
అదే కరోనావైరస్. ఈ మహమ్మారి అమెరికాలో 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు తీసింది. ఈ వైరస్ వల్ల ప్రజల జీవితాలతోపాటూ రాజకీయాలు కూడా తలకిందులయ్యాయి.
అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో స్వయంగా డోనల్డ్ ట్రంప్ కూడా దానిని అంగీకరించారు.
"ఫేక్ న్యూస్‌తోపాటూ అన్ని చోట్ల ఏదైనా ఒకటి ఉందంటే, అదే కోవిడ్, కోవిడ్, కోవిడ్" అని ట్రంప్ గత వారం విస్కాన్సిన్‌లో జరిగిన ఒక ర్యాలీలో అన్నారు.
ఇటీవల విస్కాన్సిన్‌లో కరోనా కేసులు వేగంగా పెరిగాయి.
అమెరికా మీడియా ఫోకస్ ఎప్పుడూ పూర్తిగా కోవిడ్ పైనే ఉంటూ వచ్చింది. అంటే, అది ఆ మహమ్మారి గురించి ప్రజల్లో ఆందోళన ఎంత తీవ్రంగా ఉందనే విషయం చెబుతుంది. కానీ, అధ్యక్షుడు ఎన్నికల అంశంలో మాత్రం అది లేదు. మహమ్మారి నియంత్రణ కోసం ట్రంప్ చేపట్టిన చర్యలపై వెల్లువెత్తిన అసంతృప్తి ఆయన పాపులారిటీని తగ్గిస్తూ వచ్చింది.
గత నెలలో ప్యూ రీసెర్చ్ ఒక సర్వే చేసింది. అందులో కోవిడ్ సంక్షోభాన్ని నియంత్రించడం గురించి ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఈ సర్వే ప్రకారం ట్రంప్ కంటే బైడెన్ 17 పాయింట్లు ముందంజలో నిలిచారు. ట్రంప్ తన ప్రచారంలో అభివృద్ధి, శ్రేయస్సు గురించే ఊదరగొట్టారు. కానీ, నిజానికి కోవిడ్ వల్ల ఆర్థికవ్యవస్థ క్షీణించింది.
దీనితోపాటూ సైన్స్ గురించి ప్రశ్నలు మొదలయ్యాయి, చిన్నా పెద్దా విధానాల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకపోవడం లాంటి ఎన్నో కారణాలతో ట్రంప్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది. గాలప్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది వేసవిలో ట్రంప్ అప్రూవల్ రేటింగ్ దాదాపు 38 శాతం వరకూ పడిపోయింది. కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోవడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.
ట్రంప్ ప్రచారంలో ఈ లోపాలను, బైడెన్ తన ప్రచారంలో ఆయుధంలా ఉపయోగించారు.

ఫొటో సోర్స్, Getty Images
2. మెరుపులు లేని ఎన్నికల ప్రచారం
రాజకీయ కెరీర్‌లో చేసిన స్వయంకృతాపరాధాలతో బైడెన్ కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అందరూ భావిస్తారు.
తన తప్పు వల్లే 1987లో ఆయన మొదటిసారి అధ్యక్ష పదవి పోటీ చేసినా, తర్వాత తప్పుకున్నారు. ఆ తర్వాత 2007లో మళ్లీ పోటీకి దిగినా తగిన మద్దతు లేక విరమించుకున్నారు.
మూడోసారి ప్రయత్నించినపుడు కూడా బైడెన్ దారిలో కష్టాలకు కొదవ లేదు. కానీ, ఈసారీ అవి ఆయనకు అంత పెద్ద సమస్యలు సృష్టించలేదు.
దానికి మొదటి కారణం అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తన ప్రకటనలతో పతాకశీర్షికల్లో నిలవడం.
దానితోపాటూ గత కొన్ని నెలలుగా అమెరికాను వణికిస్తున్న కరోనా మహమ్మారి, జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత తలెత్తిన ఆందోళనలు, హింస, ఆర్థిక సమస్యలు లాంటి ఎన్నో అంశాలు మీడియాను బిజీ బిజీగా ఉంచాయి. ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి.
ఈ విజయానికి బైడెన్ తన ఎన్నికల ప్రచార బృందాన్ని కూడా అభినందించాలి. ఎందుకంటే, వారు తమ ప్రచారానికి ఎంత అవసరమో అంత వరకే బైడెన్ మీడియాలో కనిపించేలా చేశారు. దాంతో, ఆయనకు నోరుజారే అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. అలా, ఆయన తప్పుడు వాదనలతో వార్తల్లో నిలవకుండా బయటపడ్డారు.
కానీ, ఇవి సాదాసీదా ఎన్నికలు అయ్యుంటే, కరోనా నుంచి కాపాడుకోడానికి చాలామంది అమెరికన్లు అసలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేవారే కాదు. అలా జరిగితే, బైడెన్ టీమ్ వ్యూహం బెడిసికొట్టేది.
అదే సమయంలో "బైడెన్ దాక్కున్నాడు" అనే ట్రంప్ ప్రకటనలను జనం మరోలా చూసే అవకాశం ఉండేది.
కానీ, ఆ కష్ట సమయంలో బైడెన్ ఎన్నికల టీమ్ పరిస్థితులకు దూరంగా ఉంటూ వచ్చింది. అదే సమయంలో నోరు జారిన ట్రంప్ చాలాసార్లు ఇబ్బంది పడ్డారు, ఆయన్ను వివాదాలు చుట్టుముట్టాయి. అవన్నీ బైడెన్‌కు కలిసొచ్చాయని నిరూపితమైంది.

ఫొటో సోర్స్, Getty Images
3. ట్రంప్ కాకుండా, మరొకరు అయితే...
ఎన్నికలకు వారం ముందు వరకూ బైడెన్ ప్రచార బృందం, తమ చివరి టెలివిజన్ ప్రకటనలో భాగంగా ఒక సందేశం చూపించడం ప్రారంభించింది.
అదే సందేశం, అంతకు ముందు ఏడాది బైడెన్ ప్రచారం ప్రారంభించినపుడు కూడా కనిపించింది. ఆగస్టులో, ఆయన నామినేషన్ వేసినపుడు కూడా అందరూ దాని గురించే గురించే మాట్లాడుకున్నారు.
ఆ సందేశంలో ఆయన ఈ ఎన్నికలను "అమెరికా ఆత్మను కాపాడుకోడానికి చేస్తున్న యుద్ధంగా, గత నాలుగేళ్లలో ఏర్పడిన విభజనవాదం, గందరగోళాలను సరి చేయడానికి లభించిన జాతీయ అవకాశం"గా వర్ణించారు.
ఈ స్లోగన్ వెనుక ఒక చిన్న కాలికులేషన్ కూడా ఉంది.
"ట్రంప్ పోలరైజేషన్ కోరుకుంటున్నారు. ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. అమెరికాకు ప్రశాంతమైన, స్థిర నాయకత్వం కావాలనే" వాదనతో బైడెన్ రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
"ట్రంప్ వైఖరి చూసి చూసి నేను విసిగిపోయాను" అని మియామీలో మొదటిసారి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిన 18 ఏళ్ల థియెర్రీ ఆడమ్స్ చెప్పారు.
ఈ ఎన్నికలు ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగేవి కావని, ఇవి ట్రంప్ పాలనకు రెఫరండం లాంటివని ప్రచారం చేయడంలో డెమాక్రాట్లు విజయవంతం అయ్యారు. 'ట్రంప్ వద్దు' అని బైడెన్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు.
బైడెన్ గెలిస్తే కొన్ని వారాల వరకూ రాజకీయాల గురించి ఆలోచించడానికి సమయం దొరుకుతుందని కూడా ఆయన మద్దతు దారులు అనుకునేవారు. అయితే, అది మొదట్లో ఒక జోక్‌లా అనుకున్నారు. కానీ దాన్లో ఎక్కోడో వాస్తవం కూడా దాగుంది.

ఫొటో సోర్స్, Getty Images
4. మధ్యేమార్గం ఎంచుకోవాలనే వ్యూహం
జో బైడెన్ డెమాక్రటిక్ అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచినప్పుడు, బెర్నీ శాండర్స్, ఎలిజబెత్ వారన్ ఆయనకు పోటీ వచ్చారు. బాగా డబ్బు ఖర్చు చేసిన ఈ ఇద్దరూ పక్కా ప్రణాళిక ప్రకారం నిర్వహించిన ప్రచారాలకు, భారీగా జనాలను కూడా రప్పించారు.
లిబరల్ పక్షం నుంచి ఈ సవాలు ఎదురైనప్పటికీ, మధ్యేమార్గం ఎంచుకోవాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ద్వారా నడిచే ఆరోగ్య సేవలు, కాలేజీలో ఉచిత విద్య, సంపద పన్నులు లాంటి వాటికి మద్దతు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.
అలా చేయడం వల్ల ఎన్నికల ప్రచారంలో ఆయన అపీల్ మాడరేట్, అసంతృప్తి రిపబ్లికన్ల వరకూ చేరుకోవడానికి చాలావరకూ సాయపడింది.
కమలా హ్యారిస్‌ను బైడెన్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకున్నారు. అయితే, పార్టీ లెఫ్ట్ వింగ్ నుంచి మరింత మద్దతు పొందడానికి ఆయన వేరే ఎవరినైనా ఎంచుకుని ఉండచ్చు.
పర్యావరణం, వాతావరణ మార్పు అంశాల విషయంలో మాత్రం బైడెన్‌కు బెర్నీ శాండర్స్, వారెన్ దగ్గరగా వచ్చారు. అలా, దానిని తీవ్రమైనదిగా పరిగణించే యువతను తమవైపు తిప్పుకోవాలని వారు భావించారు.
అయితే, అలా చేయడం వల్ల వారికి స్వింగ్ స్టేట్స్ లో శక్తి ఆధారిత(కాలుష్యానికి కారణమయ్యే ఉత్పత్తులు) పరిశ్రమల్లో పనిచేసే ఓటర్ల నుంచి మద్దతు చేజారిపోయే పోయే ప్రమాదం ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని నిరూపితం అయ్యింది.
"గతంలో ఉపాధ్యక్షుడు బైడెన్ పథకాలను, కట్టుబాట్లను మేం విమర్శిస్తూ వచ్చామనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆయన ఆ విమర్శలకు సమాధానం ఇచ్చారు. పెట్టుబడులు పెంచి, పర్యావరణాన్ని కాపాడ్డానికి వెంటనే ఎలాంటి చర్యలు చేపడతామో చెప్పారు. దానితోపాటూ ఉపాది అవకాశాలను భారీగా పెంచడం గురించి కూడా వివరంగ చెప్పార"ని పర్యావరణం కోసం పనిచేసే సన్‌రైజ్ మూవ్‌మెంట్ సంస్థ సహ-వ్యవస్థాపకులు వర్షిణి ప్రకాశ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
5. ఎక్కువ డబ్బు, తక్కువ సమస్యలు
ఈ ఏడాది మొదట్లో బైడెన్ దగ్గర ఎన్నికల ప్రచారం కోసం పెద్దగా నిధులు లేవు. ఆయన జేబులు ఖాళీగా ఉన్నాయి.
కానీ, ఆయన ఆ నష్టాన్ని భరిస్తూనే ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించారు. అధ్యక్షుడుగా తన పదవీకాలంలో ప్రచారం కోసం బిలియన్ డాలర్లు కూడబెట్టిన ట్రంప్‌తో పోటీకి దిగాలనుకున్నారు.
ఏప్రిల్ తర్వాత బైడెన్ తన ప్రచారాన్ని 'ఫండ్ రైజింగ్'(విరాళాలు సేకరించే) కార్యక్రమంగా మార్చేశారు. బహుశా, ట్రంప్ దానిని పెద్దగా పట్టించుకోవడంతో ఆయన కంటే భారీగా నిధులు జమ చేయగలిగారు.
అక్టోబర్ చివరి నాటికి ట్రంప్ టీమ్‌తో పోలిస్తే బైడెన్ ఎన్నికల ప్రచార బృందం దగ్గర 14.4 కోట్ల డాలర్లు ఎక్కువ నిధులు ఉన్నాయి. కీలక రాష్ట్రాల్లో ఆయన భారీ స్థాయిలో టీవీ ప్రకటనలు ఇచ్చారు. వాటితో ట్రంప్ అసలు పోటీపడలేకపోయారు.
కానీ, డబ్బే ముఖ్యం అనుకోలేం. నాలుగేళ్ల డోనల్డ్ ట్రంప్ తక్కువ నిధులతో తన ప్రచారం నిర్వహించిన సమయంలో, క్లింటన్ దగ్గర ప్రచారం కోసం డబ్బుకు ఏ లోటూ లేదు.
2020లో కరోనా మహమ్మారి వల్ల ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేయడం సాధ్యం కాలేదు. దాంతో, ఎక్కువ మంది అమెరికన్లు ఇళ్లలోనే టీవీలు చూస్తూ గడిపారు. అదే సమయంలో బైడెన్ ప్రకటనలు వారిపై పని చేశాయి. అవి ఇంట్లోని ఓటర్లకు ఆయన సందేశాన్ని సులభంగా చేర్చాయి.
అలా, ఆయన ప్రచారం జోరు పెంచారు. టెక్సస్, జార్జియా, ఒహాయో, ఆయోవా లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువమందిని చేరుకోవడంలో విజయవంతం అయ్యారు.
ఇదే వ్యూహంతో సంప్రదాయ ఆరిజోనా, హోరాహోరీ పోటీ ఉన్న జార్జియాలో ట్రంప్‌కు గట్టి పోటీ ఇవ్వడంలో కూడా బైడెన్ సక్సెస్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
- జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- శ్రీరాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అసోం ప్రొఫెసర్‌పై కేసు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








