డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు?

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిక్ బ్రియాంట్
    • హోదా, బీబీసీ న్యూయార్క్ ప్రతినిధి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 2016 తీర్పు చారిత్రక ప్రమాదం (హిస్టారికల్ యాక్సిడెంట్) అనే పొరపాటు అభిప్రాయాన్ని 2020 ఎన్నికల ఫలితాలు సమాధి చేశాయి.

డోనల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో ఏడు కోట్లకు పైగా ఓట్లు గెలిచారు. అమెరికా చరిత్రలో అత్యధిక ఓట్ల పోలైన అధ్యక్ష అభ్యర్థుల్లో ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు.

జాతీయ స్థాయిలో ఆయన ఓట్ల వాటా 47 శాతం కన్నా ఎక్కువే ఉంది. ఆయనకు ఎంతో ఇష్టమైన ఫ్లోరిడా, టెక్సస్ సహా 24 రాష్ట్రాలను గెలుచుకుంటున్నారు కూడా.

దేశంలో భారీ జన సమూహాలపై ట్రంప్‌కు అసాధారణ పట్టు ఉంది. ఆయనను తమ ఆరాధ్యదైవంగా కొలిచే అభిమానులు వేలాదిగా ఉన్నారు.

2020 ఎన్నికల్లో ట్రంప్ రాజకీయ బలహీనత గురించి విశ్లేషించేటపుడు.. ఆయన రాజకీయ బలాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది.

అయినాకానీ ఆయన ఓడిపోయారు. ఆధునిక శకంలో రెండోసారి అధ్యక్షుడు కాలేకపోయిన నలుగురు సిటింగ్ ప్రెసిడెంట్లలో ఒకరయ్యారు.

వరుసగా రెండు ఎన్నికల్లో పాపులర్ ఓట్ (మొత్తం ప్రజల ఓట్ల సంఖ్యలో) ఓడిపోయిన మొట్టమొదటి అధ్యక్షుడు కూడా ఆయనే.

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

2016లో అధ్యక్షుడిగా ఎన్నికవటానికి ఒక కారణం.. సంప్రదాయాలను బద్దలుకొడుతూ, అప్పటివరకూ అనలేని మాటలు అనటానికి సంసిద్ధంగా ఉన్న రాజకీయాలకు వెలుపలి వ్యక్తి కావటం. ఇదే వ్యవహార శైలి.. 2020 ఎన్నికల్లో ఓడిపోవటానికి కూడా ఒక కారణం.

న్యూయార్క్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారి 'ఫిఫ్త్ అవెన్యూ మీద నేను ఎవరినైనా కాల్చి చంపినా నాకు పడే ఓట్లు ఏమాత్రం తగ్గవు' అంటూ నాలుగేళ్ల కిందట గొప్పగా చెప్పకున్న ట్రంప్ మాటలకు, ఆయన సాహసానికి ముగ్ధులై ఆయన మద్దతుదారులు చాలా మంది ఓటు వేసి ఉండొచ్చు. అయితే.. నాలుగేళ్ల కిందట ట్రంప్‌కు మద్దతిచ్చిన ఇతరులు ఆయన దుందుడుకు ప్రవర్తనతో విముఖలయ్యారు.

ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో ఇది వాస్తవం. దేశవ్యాప్తంగా 373 పట్టణ ప్రాంత కౌంటీల్లో 2016లో హిల్లరీ క్లింటన్‌కు వచ్చిన ఓట్ల కన్నా ఇప్పుడు జో బైడెన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇది.. రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా వ్యవహరించే పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్‌లను డెమోక్రాట్లు తిరిగి రాబట్టుకోవటంతో పాటు.. జార్జియా, ఆరిజోనాలను కూడా గెలుచుకోవటానికి తోడ్పడింది.

ప్రత్యేకించి ట్రంప్ పట్ల పట్టణ ప్రాంత మహిళల్లో ఎక్కువ విముఖత ఉంది.

2018 మధ్యంతర ఎన్నికల్లో కనిపించిన దృశ్యాలు 2020 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ కనిపించాయి.

ట్రంప్ మద్దతుదారులు

ఫొటో సోర్స్, Getty Images

నాలుగేళ్ల కిందట ట్రంప్‌కు ఒక అవకాశం ఇవ్వటానికి సిద్ధపడిన విద్యాధికులైన రిపబ్లికన్లు.. ఆయన వ్యవహార శైలి అధ్యక్ష పదవికి తగిన విధంగా లేదని భావించారు.

ట్రంప్ సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తారని వారు అర్థం చేసుకున్నప్పటికీ.. ఎన్నో సంప్రదాయాలు, ప్రవర్తనా నియమాలను ఆయన ఉల్లంఘించిన తీరు వారికి వెగటు పుట్టించింది. చాలాసార్లు కోపం కూడా తెప్పించింది.

జాత్యహంకార ఉద్రిక్తతలను ఆయన రెచ్చగొట్టటం. భిన్న వర్ణాల వారిని కించపరిచేలా ఆయన ట్వీట్లలో జాతివివక్షాపూరిత భాషను ఉపయోగించటం. శ్వేతజాతి ఆధిక్యతా వాదాన్ని తగిన విధంగా ఖండించటంలో ఆయన విఫలమవటం. అమెరికా సంప్రదాయ మిత్రులను కొట్టిపారేయటం. వ్లాదిమిర్ పుతిన్ వంటి అధికారవాద శక్తిమంతులను ఆయన ప్రశంసించటం... ట్రంప్ దుందుడుకుతనం విద్యాధికులైన రిపబ్లికన్లను ఆయనకు దూరం చేసింది.

తాను చాలా స్థిరమైన మేధావినంటూ విచిత్రమైన గొప్పలు చెప్పుకోవటం. కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేయటం. నేరస్తుల ముఠా నాయకుడి తరహా భాషను ఉపయోగించటం. ఇవి కూడా కొందరు మద్దతుదారులు ట్రంప్‌కు దూరం జరగటానికి కారణమయ్యాయి.

ఇక ఎన్నికల ఫలితాలను అంగీకరించటానికి ట్రంప్ తిరస్కరించటంలో కనిపించిన భయంగొలిపే అధికారవాదం కూడా ఒక కారణం.

ఎన్నికల ప్రచార సమయంలో పిట్స్‌బర్గ్‌కు చెందిన చక్ హోవెన్‌స్టీన్‌తో నేను మాట్లాడినపుడు ఇది నిశ్చయమైంది. ట్రంప్‌ మద్దతుదారుడైన ఆయన జో బైడెన్‌కు ఓటువేశారు.

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, CARLOS BARRIA / REUTERS

''జనం అలసిపోయారు. దేశంలో తిరిగి సాధారణ స్థితి నెలకొనాలని కోరుకుంటన్నారు. సభ్యతను చూడాలని కోరుకుంటున్నారు. ఈ విద్వేషం ఆగిపోవాలని కోరుకుంటున్నారు. ఈ దేశం సమైక్యం కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ కలిసి జో బైడెన్‌ను అధ్యక్షుడిగా గెలిపించబోతున్నాయి'' అని ఆయన జోస్యం చెప్పారు.

ట్రంప్‌ విషయంలో ఒక రాజకీయ సమస్య ఏమిటంటే.. తనను అభిమానించే కీలక సముదాయానికి వెలుపల తనకు లభించే మద్దతును విస్తరించుకోలేకపోయారు. అసలు అందుకోసం ఆయన ప్రయత్నం కూడా చేయలేదు.

2016లో ఆయన 30 రాష్ట్రాలు గెలిచారు. తాను కేవలం సంప్రదాయవాద, రిపబ్లిక్ పార్టీకి చెందిన అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిని అన్నట్లుగానే ఎక్కువగా పరిపాలించారు. గత 100 ఏళ్లలో బాహాటంగా విచ్ఛిన్నతను పెంపొందించిన అధ్యక్షుల్లో అగ్రగణ్యుడైన ట్రంప్.. హిల్లరీ క్లింటన్‌కు ఓటు వేసిన 20 రాష్ట్రాలను ఆకట్టుకోవటానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.

నాలుగేళ్లు విసిగిపోయిన తర్వాత చాలా మంది ఓటర్లు.. మరింత మామూలుగా, సంప్రదాయబద్ధంగా నడుచుకునే అధ్యక్షుడు ఉండాలని మాత్రమే కోరుకున్నారు. చిన్నపిల్లాడిలా తిట్టటం, అసహ్యకరమైన భాష, అంతులేని ఘర్షణలతో వారు వేసారిపోయారు. ఏదోరకమైన సాధారణ స్థితి తిరిగి నెలకొనాలని కోరుకున్నారు.

అయితే.. 2020 ఎన్నికలు 2016 ఎన్నికలు ఒకటి కాదు. ఇప్పుడు ట్రంప్ సిటింగ్ అధ్యక్షుడు. తిరుగుబాటుదారు కాదు. ఆయన సమర్థించుకోవాల్సిన రికార్డు ఉంది. అందులో కరోనావైరస్ విజృంభణ ఒకటి. ఎన్నికల రోజు నాటికి 2,30,000 మంది అమెరికన్లను ఈ మహమ్మారి బలితీసుకుంది. ప్రతిపక్షాన్ని ద్వేషించటం ద్వారా రాజకీయాలు నడిచే ఈ వ్యతిరేక పక్షపాత శకంలో.. ఈసారి హిల్లరీ క్లింటన్ వంటి విద్వేషాత్మక వ్యక్తికి వ్యతిరేకంగా ఆయన పోటీ చేయలేదు.

అమెరికా ఎన్నికలు

ఫొటో సోర్స్, EPA

జో బైడెన్‌ను రాక్షసుడిగా చూపటం కష్టం. ఆయనను అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టాలని డెమొక్రటిక్ పార్టీ కోరుకోవటానికి ఇది కూడా ఒక కారణం. ఈ 77 ఏళ్ల మధ్యేవాది తనకు అప్పగించిన పనిని పూర్తిచేశారు కూడా. ఆ పని.. రస్ట్ బెల్ట్‌లోని శ్వేతజాతి శ్రామిక ఓటర్లను తిరిగి పార్టీవైపు రప్పించటం.

ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? అనే ప్రశ్న.. అసలు ఆయన ఎప్పుడు ఓడిపోయారు? అనే ప్రశ్నగా కూడా మారుతుంది.

2016లో వాషింగ్టన్‌లోని రాజకీయ వ్యవస్థకు నిరసనగా ఆయనకు ఓట్లేసిన వారు.. ఆ వెంటనే ఆందోళనకు గురైనపుడే ట్రంప్ ఓడిపోయారా? అసలు ఆయన గెలుస్తారని వారు అప్పుడు భావించలేదు.

అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు.. ఆ ప్రసంగంలో, మొదటి రోజు ముగిసే సరికే.. ఆయన అధ్యక్ష పదవి తీరుతెన్నులను మార్చేస్తారని స్పష్టమైపోయినపుడే.. ఆయన ఓడిపోయారా?

లేదంటే.. ఇన్ని వివాదాలు, తిట్లు, ఇంతమంది సిబ్బంది తిరగబడటం, ఇంత గందరగోళం అంతా కలిసి ప్రభావం చూపాయా?

లేక.. ట్రంప్ అధ్యక్ష పదవిని చుట్టుముట్టిన అతిపెద్ద సంక్షోభం కరోనావైరస్ కారణంగానా? కరోనావైరస్ అమెరికా తీరానికి రాకముందు.. ట్రంప్ రాజకీయ బలం చాలా శక్తిమంతంగా ఉంది. ఆయన తన అభిశంసన విచారణను ఎదుర్కొని బయటపడ్డారు. ఆయనకు ప్రజామోదం రేటు అత్యధిక స్థాయికి - 49 శాతానికి - పెరిగింది. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, తాము అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉందని చెప్పుకోగలిగేవారు. సాధారణంగా సిటింగ్ ప్రెసిడెంట్ రెండోసారి గెలవాటనికి ఉపయోగపడే జంట అంశాలివి.

అధ్యక్ష ఎన్నికలు తరచుగా ఒక మామూలు ప్రశ్నతో మలుపు తిరుగుతాయి: దేశం పరిస్థితి నాలుగేళ్ల కిందటికన్నా ఇప్పుడు మెరుగుగా ఉందా? కోవిడ్ దాడిచేయటం, దానిననుసరించి వచ్చిన ఆర్ధిక సంక్షోభం.. ట్రంప్‌ అలా వాదించటానికి వీలులేకుండా చేశాయి.

ట్రంప్ మద్దతుదారులు

ఫొటో సోర్స్, Reuters

కానీ కరోనావైరస్ కారణంగానే ట్రంప్ మునిగిపోయారనటం తప్పవుతుంది. సాధారణంగా.. దేశం సంక్షోభాలు ఎదుర్కొన్నపుడు దేశాధ్యక్షులు మరింత శక్తిమంతం అవుతుంటారు. సంక్షోభాలు గొప్పదనాన్ని వెలికితీసుకురాగలవు. ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ విషయంలో ఇలాగే జరిగింది. మహా మాంద్యం నుంచి అమెరికాను గట్టెక్కించిన ఆయన రాజకీయంగా అజేయుడయ్యారు.

సెప్టెంబర్ 11 దాడుల విషయంలో జార్జి డబ్ల్యూ. బుష్ తొలి ప్రతిస్పందన కూడా ఆయన ప్రజాదరణను పెంపొందించింది. రెండోసారి గెలవటానికి తోడ్పడింది. అంటే.. డోనాల్డ్ ట్రంప్‌ను కోవిడ్ అంతం చేస్తుందనేది ముందే నిశ్చయమైన ఫలితం ఏమాత్రం కాదు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ఆయన వైఫల్యం ఆయన పతనానికి దోహదపడింది.

అయినప్పటికీ.. వందేళ్లలో అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా కూడా, 1930ల తర్వాత అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా కూడా, 1960ల తర్వాత జాతి కలహాలు అధికంగా విస్తరించివున్నా కూడా.. డోనాల్డ్ ట్రంప్ చివరివరకూ రాజకీయంగా ఆమోదనీయంగానే ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఆయన తిరిగి రావాలని.. రిపబ్లికన్ అమెరికాలో అధిక భాగం, సంప్రదాయవాద ఉద్యమంలో అధికభాగం చాలా బలంగా కోరుకుంటుంది. రాబోయే చాలా ఏళ్ల వరకూ సంప్రదాయ ఉద్యమంలో ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతుంది.

అమెరికా సంప్రదాయవాదం రూపురేఖలను మార్చుతూ రీగనిజం ఎలా ప్రభావం చూపిందో ట్రంపిజం కూడా అలాంటి ప్రభావమే చూపవచ్చు.

ఇప్పుడు వైదొలగబోతున్న అధ్యక్షుడు.. ఇదే తరహాలో బలమైన విభజనకారిగా కొనసాగుతారు. 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయవచ్చు కూడా.

విభజితమైన ఈ సంయుక్త రాష్ట్రాలు అకస్మాత్తుగా సమైక్యమైపోలేదు. ట్రంప్ విషయంలో ఎంతో మంది అమెరికన్లకు విభిన్న భావోద్వేగాలు ఉన్నాయి: ఆయన పట్ల అంతులేని భక్తి మొదలుకుని పచ్చి ద్వేషం వరకూ.

అమెరికా చరిత్రలో అత్యంత సంప్రదాయవిరుద్ధమైన అధ్యక్షుడి కథ ఇంకా ముగిసిపోలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)