కరోనావైరస్ - వర్క్ ఫ్రమ్ హోమ్: ఇంటిని, ఆఫీస్‌ను వేరు చేసే సరికొత్త ఐడియాలు

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జో క్లెయిన్‌మ్యాన్
    • హోదా, టెక్నికల్ రిపోర్టర్, బీబీసీ న్యూస్

కోవిడ్-19 వ్యాప్తి నడుమ లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు రావాలని ప్రోత్సహిస్తున్నా చాలామంది అందుకు సిద్ధంగా లేరు.

ఇంట్లోంచి పని చేస్తున్నప్పుడు ఇంటి వ్యవహారాలనూ, ఆఫీస్ పనులను వేరు వేరుగా ఉంచడం ముఖ్యమని చాలామంది అభిప్రాయపడుతున్నారని 'ద జాయ్ ఆఫ్ వర్క్' రచయిత బ్రూస్ డైస్లీ అంటున్నారు.

అందుకు తగ్గట్టుగానే ఉద్యోగులూ ఇంట్లోనే ఆఫీసు కోసం స్థలాన్ని కేటాయించి, దాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్దుకుంటున్నారు.

''ఇల్లు, ఆఫీస్ మధ్య వైవిధ్యం ఉండాలని.. ఒకే ఊళ్లో తల్లిదండ్రులు వేరేచోట ఉంటే అక్కడికెళ్లి పనిచేస్తున్నారు కొందరు. లేదా ఆఫీస్ పని కోసం ఇంట్లోనే ప్రత్యేకంగా గది కేటాయిస్తూ ఆఫీస్ వాతావరణానికి తగ్గట్టు తీర్చిదిద్దుకుంటున్నారు''అని డైస్లీ అన్నారు.

అలాంటి కొన్ని సృజనాత్మకమైన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీసులను చూద్దాం.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Kane Fulton

వ్యాయామం చేస్తూ ఈమెయిల్స్ చూసుకోవడం

ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌లో స్టార్టప్స్ నడుపుతున్న కేన్ ఫుల్టన్‌కు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ దృఢంగా ఉండటం ఇష్టం. అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఏర్పాటు చేసుకున్న గదిలో కుర్చీకి బదులు ఒక సైకిల్‌ను ఆయన పెట్టుకున్నారు. సైకిల్ తొక్కుతూ ఈమెయిల్స్ చూసుకోవడం, ఆఫీస్ పని చేసుకోవడంలాంటివన్నీ చేస్తున్నారు. ఈమధ్యనే అప్పుడప్పుడూ తన కార్యాలయానికి వెళ్లడం మొదలుపెట్టారు. ఇంట్లోంచి పనిచేస్తున్నప్పుడు మాత్రం సైకిల్ తొక్కుతూనే చేస్తున్నారు. అలా రోజుకి 40 కిమీ సైకిల్ నడుతున్నానని కేన్ ఫ్లూటన్ అంటున్నారు. పెడల్ శబ్దం వినిపించకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పని చేసుకుంటున్నారట.

"దీనివల్ల నా రోజువారీ వ్యాయామం సక్రమంగా సాగుతోంది. రోజూ పొద్దున్నే లేచి వాకింగ్‌కి వెళ్లలేకపోతున్నాననే బెంగ లేదని" ఫ్లూటన్ అంటున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Alexandru Voica

DIY - డీఐవై (డూ ఇట్ యువర్‌సెల్ఫ్)

ఎక్కువసేపు కదలకుండా కూర్చుని ఉండడం మంచిది కాదనే ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తూ నిల్చుని ఆఫీస్ పని చేసుకునే ఏర్పాటు చేసుకున్నారు కొందరు.

'డీఐవై' అంటే నిపుణుల సహాయం లేకుండా మనకి మనమే ఇంట్లో చిన్న చిన్నవస్తువులు తయారుచేసుకోవడం, మరమ్మత్తు చేసుకోవడం అన్నమాట. ఇలా డీఐవై ప్రోజెక్టులలో మిగిలిపోయిన సామాన్లనతో చిన్న చిన్న బల్లలు తయారుచేసుకుని, అవి ఒకదాని మీదొకటి పెట్టి నిలబడి ఆఫీస్ పని చేసుకోవడానికి తగ్గట్టు టేబుల్ ఏర్పాటు చేసుకున్నారు అలెక్జాండ్రూ వొయికా.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Ellis Hillman

ఇతను ఫేస్‌బుక్‌లో టెక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఫోటోలో అల్పంగా, ముట్టుకుంటే పడిపోయేట్టు కనిపిస్తోందికానీ అలా ఏం కాదు నా డెస్క్ దృఢమైనదే అంటున్నారు వొయికా. దాన్ని వెనక గోడకి తగిలించారట. స్థిరంగా పడిపోకుండా ఉంటుంది అని వొయికా వివరించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Cat Divers / MyPickle

ఎలిస్ హిల్‌మ్యాన్ ఇంత కష్టపడకుండా సులువుగా ఇస్త్రీ చేసుకునే బల్లని ఆఫీస్ డెస్క్‌గా మార్చేసుకున్నారు.

క్యాట్ డివర్స్ ఏం చేశారంటే ఇంట్లో ఉన్న అట్టపెట్టెలన్నిటినీ ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చి దానిపై ఒక మోనిటర్ పెట్టేశారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Martin

యూఏఈకి చెందిన టీవీ లైటింగ్ డెజైనర్ మార్టిన్ వీరందరికన్నా కొంచం భిన్నంగా అర్థచంద్రాకారంలో నాలుగు మానిటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకున్న మూడు పిల్లులు కూడా ఆ బల్లలెక్కి స్వేచ్ఛగా ఆడుకుంటున్నాయి.

చాలా ఎత్తులో జీవితం

గ్రీన్ పార్టీ కౌన్సిలర్‌గా చేస్తున్న స్టీవ్ మాస్టర్స్ అయితే ఒక పెద్ద చెట్టుపైన ఆఫీస్ గది ఏర్పాటు చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా పనిచేసే మాస్టర్స్ తన సిద్ధాంతాలకు అనుగుణంగా పచ్చని ఆకుల మధ్య స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆఫీస్ పని చేసుకుంటున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Getty Images

అతను మే నెల చివర్లో చెట్టు పైన ఈ గదిని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచీ అదే ఆయన నివాసమయిపోయింది.

చెట్టుపైన ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగా వస్తొందంటున్నారు మాస్టర్స్. కౌన్సిల్ ఇచ్చిన ల్యాప్‌టాప్ వాడుతూ, తన మొబైల్‌ నుంచి ఇంటర్నెట్ కనక్షన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ చార్జ్ చేసుకోవడానికి సోలార్ పవర్‌ని వాడుతున్నారు.

ఇప్పటివరకూ సోలార్ పవర్‌తో పని హాయిగా సాగిపోతోంది కానీ, శీతాకాలం వస్తే కష్టమవుతుందని ఆయన అంటున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, University of Sussex

ఇంట్లోంచే పరిశోధనలు

డా. అమృతా గాడ్గే, యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్‌లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల తన పరిశోధనలు ఆగిపోకూడదన్న ధ్యేయంతో తన ప్రయోగశాలలో లేజర్లను ఇంటి నుంచే నియంత్రించగలిగేలా కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు ద్వారా ఆమె బాస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్(బీఈసి)ని సృష్టించారు. దీన్నే ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అని కూడా అంటారు.

దీన్ని ఎలా తయారుచేశారంటే అణువులను చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద చల్లబరిస్తే అవి వాటి శక్తిని కోల్పోయి, దగ్గరగా అయి ఒక పెద్ద దృఢమైన సూపర్-అణువుగా పరివర్తనం చెందుతాయి.

ఇలాంటి ప్రయోగాలను ప్రయోశాగల నుంచి దూరంగా ఇప్పటివరకూ ఎవరూ నిర్వహించలేదని యూనివర్సిటీ తెలిపింది.

"మా పరిశోధనలు ఆగిపోకూడదనే పట్టుదలతోనే ఇంటి నుంచే ప్రయోగాలను నిర్వహించగలిగే కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాం" అని డా. అమృత అన్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Jen Bromley

కప్‌బోర్డ్‌లో పంట

వృక్ష శాస్త్ర పరిశోధకులు జెన్ బ్రోంలీ, వెర్టికల్ ఫ్యూచర్ అనే వ్యవసాయ సంబంధిత స్టార్టప్‌లో పనిచేస్తున్నారు.

లాక్‌డౌన్ మొదలైన దగ్గర నుంచీ ఇంట్లోనే ఉంటూ…పాత సామాన్లు పడి ఉన్న కప్‌బోర్డ్ ఒకటి శుభ్రం చేసి అందులో మొక్కలను పెంచడం ప్రారంభించారు. వెలుతురు కోసం లెడ్ లైట్లను అమర్చారు. ఇవన్నీ కూడా ఆహారంగా తీసుకోగలిగే మొక్కలే.

"వీటి పెరుగుదలను పరిశీలిస్తూ వృద్ధి రేట్ల డాటా అంతా సేకరించగలిగాను. ఆహారంగా వినియోగించగలిగే కొత్త కొత్త మొక్కలను ఎప్పటికప్పుడు మేము కనుక్కోగలమని ప్రతిపాదించేందుకు మా ఉత్పత్తి సైట్లలో వీటిని ఉపయోగిస్తాం" అని బ్రోంలీ తెలిపారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, SIVA VAIDHYANATHAN

ఇంట్లోనే స్టూడియో

యూనివర్సిటీ ఆఫ వర్జీనియా మీడియా స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శివ వైద్యనాథన్ ఇంట్లోనే ఒక స్టూడియో తయారు చేసుకున్నారు. ఇంట్లోనే ఉంటూ స్టూడియోనుంచీ విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా ఒక కొత్త పాడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించారు.

"నా స్టూడియోని సౌండ్‌ ప్రూఫ్‌గా తయారుచేసుకోలేకపోయినప్పటికీ నేనేదో పెద్ద డబ్బాలో కూర్చుని మాట్లాడుతున్నట్టు కాకుండా వినగలిగేలా ఉండేట్టు తయారుచేసుకున్నాను. ఒక గ్రీన్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసుకున్నాను" అని ప్రొఫెసర్ వైద్యనాథన్ తెలిపారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Rotacloud

పని వేళలకు యాప్

రోటాక్లౌడ్ సాఫ్ట్‌వేర్ బృందం ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నవారి కోసం ఒక కొత్త యాప్‌ని తయారుచేసారు. ఈ యాప్ ఉపయోగించి మేనేజర్లు పని గంటలు, పనివేళల పట్టికను సులువుగా తయారుచేసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా కూడా పని మొదలెట్టిన సమయం, అయిపోయిన సమయాన్ని నమోదు చెయ్యడానికి కూడా వాడొచ్చు.

అయితే, "మేము తయరుచేసిన యాప్‌ని ఇప్పుడు మేమే వాడుతున్నాం" అంటున్నారు డిజైనర్ సారా బుర్గెస్.

"రోజూ ఆఫీస్ పని అయిపోయాక ఈ యాప్ తెరిచి ఒక బటన్ నొక్కి ఆరోజుకి ఆఫీస్ పని ముగించినట్టు నమోదు చేయాగానే హాయిగా ఉంటోంది. ఆ ఒక బటన్ నొక్కడం అనేది మానసికంగా నాపై ప్రభావం చూపిస్తోంది. నా మెదడులో 'ఆఫీస్ అయిపోయింది, ఇక ఇది ఇల్లు' అనే భావన కలిగిస్తోంది. ఇంట్లో నాకు ఆఫీస్ కోసం ఒక ప్రత్యేకమైన గది కేటాయించేంత స్థలం లేదు. ఇంటి పనిని, ఆఫీస్ పనిని వేరు వేరుగా చూసేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోందని" సారా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)