‘కొత్త వాసన వచ్చినా, శబ్దం వినిపించినా వణికిపోతున్నాం’: విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితుల ఆవేదన

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
కొత్త వాసన ముక్కుకి తగిలినా... కాస్త పెద్ద శబ్దం చెవిన పడినా వణుకుతున్నారు అక్కడి జనం. ఎందుకైనా మంచిదని... వెంటనే వెళ్లిపోయేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచుకుంటున్నారు. ఇది విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పరిసరాల్లో నివసిస్తున్న గ్రామాల ప్రజల పరిస్థితి.
స్టైరీన్ గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిన ఆరు నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఆనాటి భయం నుంచి బయటపడలేదు. ప్రమాదం జరిగిన ఆరు నెలల తర్వాత ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పరిసర గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు బీబీసీ ఆయా ప్రాంతాల్లో పర్యటించింది.
నిజానికి పరిశ్రమల్లో ప్రమాదాలను కళ్ల జూడటం విశాఖ నగరానికి, విశాఖ వాసులకీ కొత్తేమీ కాదు. కానీ,ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది.
అంతా గాఢ నిద్రలో ఉండగా స్టైరీన్ గ్యాస్ లీక్ అవడాన్ని తొలుత అందరూ కరోనా నివారణ కోసం గాల్లోకి వదులుతున్న మందు అని అనుకున్నారు. కానీ,కొద్దిసేపటికే అది ప్రమాదమన్న విషయం వారికి అర్థమయ్యింది.
అయితే అక్కడి నుంచి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నించిన చాలా మంది గ్యాస్ ప్రభావానికి సృహ తప్పి ఎక్కడికక్కడే పడిపోయారు. అప్పట్లో ఆ దృశ్యాలు అందరినీ కలచివేశాయి.

'మా ఇళ్లు, పొలాలకు లెక్కలు కట్టి పంపేయండి'
"ప్రమాదం జరిగి ఆరునెలలైనా ఇంకా మమ్మల్ని ఆ భయం వీడలేదు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ ఏదో ఒక ఆనారోగ్య సమస్యతో బాధపడుతున్నాం. తల తిరగడం, కొద్ది దూరం నడిచేసరికి ఆయాసం రావడం, రాత్రి వేళల్లో చిన్న చిన్న శబ్దాలకే ఉలిక్కిపడటం... ఇలా అనేక సమస్యలతో ఇప్పటికీ పోరాడుతున్నాం. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలించాలని మేమంతా నాయకులను కోరుతున్నాం. కానీ, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అవి తేలితే కానీ కంపెనీకి సంబంధించి ఏ నిర్ణయాన్నీ తీసుకోలేమంటున్నారు. కంపెనీనైనా ఇక్కడ నుంచి తీసేయమనండి, లేదా మా ఇళ్లు, పొలాలకు లెక్క కట్టి మమ్మల్ని ఎక్కడికైనా పంపేయండి" అని వెంకటపురానికి చెందిన జయలక్ష్మీ బీబీసీతో అన్నారు.
ఈ ప్రమాదం తర్వాత ప్రభుత్వం నీరబ్ కుమార్ నేతృత్వంలో ఓ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. సుమారు రెండు నెలల విచారణ తర్వాత ఆ కమిటీ 319 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది.
"నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలించాలి లేదా గ్రీన్ కేటగిరీ పరిశ్రమలుగా మార్చాలి" అని ఆ నివేదిక సూచించింది. ఇప్పుడు స్థానికులు కోరుతున్నది కూడా అదే.

'పెట్రోల్ లాగే... స్టైరీన్ గ్యాస్ వాసనని ఇష్టపడతారు'
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన గ్రామాలు ఐదు. అవి... వెంకటాపురం, పద్మనాభపురం, కంపరపాలెం, నందమూరి నగర్, ఎస్సీ, బీసీ కాలనీలు. వీరందరి మీద స్టైరీన్ గ్యాస్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. స్టైరీన్ సాధారణంగా 5 పీపీఎం (parts per Million) స్థాయి వరకు ప్రమాదకరం కాదు. కానీ ప్రమాదం జరిగిన రోజున 300 నుంచి 500 పీపీఎం వరకూ ఈ రసాయనం విడుదలై ఉంటుందని రసాయనశాస్త్ర నిపుణులు చెప్పారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని ఆంధ్రా యూనివర్సీటీ మాజీ వీసీ, రసాయన శాస్త్ర ఆచార్యులు జి. నాగేశ్వరావు అన్నారు.
"స్టైరీన్ అనేది ఒక అరోమాటిక్ పదార్థం. మంచి వాసన ఇచ్చే కర్బన సమ్మేళనాల్ని అరోమాటిక్ అంటాం. మనలో చాలా మంది పెట్రోల్ వాసనని ఇష్టపడతారు. ఇదీ ఒక అరోమాటిక్ సమ్మేళన పదార్థమే. ఎల్జీ పాలిమర్స్‌లో పని చేసే ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల ప్రజలు స్టైరీన్ వాయువుని రోజూ పీలుస్తారు. కొంచెం,కొంచెంగా పీల్చడం... పైగా మంచి వాసన కలిగి ఉండటంతో ఇది ప్రమాదకరమైనదిగా అనిపించదు. అయితే ఇది దీర్ఘకాలంలో ఎన్నో రకాలైన జబ్బులకు కారణమవుతుంది. స్టైరీన్ శరీరంలోని ఇతర రసాయన పదార్థాలతో చర్య పొంది విష పూరితంగా మారుతుంది. ఇది శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎక్కువ మెతాదులో దీన్ని పీల్చితే గర్భస్థ శిశువులు చనిపోవడం లేదా జబ్బులతో పుట్టడం జరుగుతుంది" అని చెప్పారు.

'కడుపులో పడ్డ బిడ్డని చూసుకోలేకపోయాను'
"గ్యాస్ లీకైన సమయానికి నాకు నెలలు నిండాయి. ఆ ప్రభావానికి గర్భస్రావమైంది. బిడ్డని చూసుకుందామన్న నా కల నెరవేరలేదు. ఆ కష్టం నుంచి కోలుకోలేకపోయాను. ఇంత జరిగినా నా పేరు కనీసం బాధితుల జాబితాలో కూడా లేదు" అని ట్యూషన్ టీచర్ రూపా కుమారి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి జగన్ పలు రిలీఫ్ ప్యాకేజీలను ప్రకటించారు. మరణించిన వారికి కోటి రూపాయలు, వెంటీలేటర్ పెట్టాల్సివచ్చినవారికి 10 లక్షల రూపాయలు, ప్రాథమిక చికిత్స అవసరమైనవారికి 25 వేల రూపాయలు, గ్యాస్ ప్రభావానికి లోనైన గ్రామాల్లోని వారందరికి ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు.
అయితే మరణించిన వారికి తప్పితే, మిగతా వారిలో చాలా మందికి పరిహారం అందలేదన్నది బాధితుల మాట. కనీసం బాధితుల జాబితాలో తమ పేర్లు కూడా లేవని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
"స్టైరీన్ గ్యాస్‌ని పీల్చుకున్న వెంటనే పిల్లలిద్దరూ చేతికి దొరికిన వస్తువులను విసిరేస్తూ... పిచ్చివాళ్లలా ప్రవర్తించారు. కాసేపటికే నేను,నా భర్త కూడా స్పృహ కోల్పోయాం. గంట తర్వాత తేరుకున్న నా భర్త అతి కష్టం మీద మమ్మల్ని ఇక్కడ నుంచి బయటకు తీసుకుని వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. పిల్లల ఆరోగ్యంపై ఇప్పటికీ దాని ప్రభావం కనిపిస్తోంది. ఇంత జరిగినా ఒక్కపైసా కూడా మాకు పరిహారంగా అందలేదు. అధికారులను అడిగితే ఆశలు వదిలేసుకోండి అని అంటున్నారు. డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. కంపెనీని మాత్రం ఇక్కడి నుంచి తీసేస్తే బాగుంటుంది" అని వెంకటపురానికి చెందిన నూకరత్నం బీబీసీతో చెప్పారు.
ప్రమాదం జరిగిన రోజున చనిపోయిన 12 మందిలో ఎంబీబీఎస్ తొలి సంవత్సరం చదువుతున్న చంద్రమౌళి ఒకరు. మృతులందరి కుటుంబాలకు ఇచ్చినట్లుగానే కోటి రూపాయలు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం...కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగం కోసం ఎన్నిసార్లు అధికారులను కలిసినా స్పందించడం లేదని చంద్రమౌళి తల్లి పద్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.

'మా ఒంట్లో స్టైరీన్ ఉందో, లేదో చెప్పండి'
ట్యాంకుల్లో ద్రవ రూపంలో నిల్వ ఉండే స్టైరీన్ అనే కర్బన సమ్మేళనం... 20 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద క్రమంగా ఆవిరిగా మారుతుంది. ప్రమాదం జరిగిన రోజున స్టైరీన్ ట్యాంకుల వద్ద 172 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైదని హైపవర్ కమిటీ నివేదికలో పేర్కొంది. ఆ ఉష్ణోగ్రత వద్ద స్టైరీన్... వాయువు రూపంలో 3 కిలోమీటర్ల పరిధిలో వ్యాప్తి చెంది... గ్రామాలపై ప్రభావం చూపింది. దీంతో చాలామంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
"మా ఆరోగ్య సమస్యలకు కారణం స్టైరీన్ అని చెప్పి నివేదిక ఇచ్చే ల్యాబ్ ఒక్కటీ లేదు. దీంతో మా శరీరంలో ఎంత శాతం స్టైరీన్ ఉంది? అది ఏ స్థాయిలో ఉంది? ఎలాంటి ప్రమాదాల్ని తెస్తుందో? తెలుసుకునే అవకాశం లేదు. ఎందరు వైద్యుల దగ్గరకు వెళ్లినా సాధారణ వైద్యమే చేస్తున్నారు. స్టైరీన్ ప్రభావానికి ఎటువంటి వైద్యం అందించాలో ఎవరికీ తెలియడం లేదు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది" అని బాధితుల్లో ఒకరైన కమలాకర్ చెప్పారు.
గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తోపాటు... ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రమాదం జరిగిన రోజున ప్రకటించారు. అయితే ప్రమాదం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ఆసుపత్రి నిర్మాణమూ మొదలుకాలేదు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలనే వైఎస్సార్ హెల్త్ క్లీనిక్‌గా మార్చారు. అందులో ఒక డాక్టరు, ఏఎన్ఎంని మాత్రం ఏర్పాటు చేశారు.
''అక్కడ ఏ రోగమొచ్చిన ఒకే మందు ఇస్తున్నారు. హెల్త్ కార్డు పుస్తకాలు ఊరంతా ఇచ్చారు. అవి జగన్ బొమ్మున్న తెల్లకాగితాల పుస్తకాలు మాత్రమే. అందులో ఏ వివరాలూ లేవు'' అంటూ బాధిత గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

'మా ఊరి పాలు కొనడం లేదు'
ప్రమాదం జరిగిన తర్వాత విషపూరితమైన స్టైరీన్ గ్యాస్ ప్రభావం కొన్ని రోజుల పాటు ఉంటుందని అధికారులు ప్రకటించారు. అందుకే గ్యాస్ ప్రభావం తగ్గేవరకు బాధిత గ్రామాల్లోని పాలు,కూరగాయలు వంటివి ఎవరూ కొనవద్దని... అది ప్రమాదకరమని ప్రచారం చేశారు.
ఆరు నెలలు గడిచినప్పటికీ జనంలో ఇంకా ఆ భయం పోలేదు. దాంతో చుట్టుపక్కల గ్రామాల్లోని 1500 ఎకరాల్లో కాయగూరలు పండించే రైతులు,పాల వ్యాపారులు వ్యాపారం లేక ఇబ్బందులుపడుతున్నారు.
"ఇప్పటికీ మా ఊళ్లో మా దగ్గర పాలు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అంతా డైరీ పాలు లేదా పక్క ఊళ్ల నుంచి తెప్పించుకుంటున్నారు. లాభం లేదని నేను లక్ష రూపాయలు పెట్టి కొత్త ఆవుని కొన్నాను. ఒకేలాగ ఉండటంతో ఏది కొత్తదో, ఏది పాతదో తెలియక జనాలు నమ్మడం లేదు. కొందరు ధైర్యం చేసి పాలు కొంటున్నారు. మిగిలినవి ఇంట్లో పెరుగుకు, ఇతర అవసరాలకి వాడుకుంటున్నాను" అని పాల వ్యాపారి అప్పలరాజు బీబీసీతో చెప్పారు.
1961లో ప్రారంభమైన పాలిమర్స్ కంపెనీ...వివిధ చేతులు మారుతూ ఇప్పుడు కొరియాకు చెందిన ఎల్టీ కంపెనీకి చేరింది. ఎల్జీ పాలిమర్స్ పేరుతో విశాఖలో నడుస్తున్న ఈ కంపెనీలో మొత్తం 400 మంది ఉద్యోగుల వరకూ ఉంటారు. వీరిలో 50 నుంచి 65 శాతం వరకూ చుట్టుపక్కల గ్రామస్థులే. వీరందరూ స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్‌గా పని చేస్తుంటారు.
ప్లాస్టిక్, దానికి సంబంధించిన వస్తువుల తయారీకి ముడి సరుకైన పాలిమర్,ఎక్స్పాండెబుల్ పాలిస్టైరీన్‌లను కొన్ని దశాబ్దాలుగా ఈ కంపెనీ తయారు చేస్తోంది. వీటి తయారీలో ఉపయోగపడే స్టైరీన్ కర్బన్ సమ్మేళనమే పాలిమర్స్ ప్రమాదానికి కారణమైంది.
ఈ స్టైరీన్ కొద్దిగా కొద్దిగా శరీరంలో చేరుతూ మనకి తెలియకుండా భయంకరమైన జబ్బులకు కారణమవుతుందని వైద్యులు అంటున్నారు.
"స్టైరీన్ దీర్ఘకాలంలో మనిషి శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం చూపుతుంది. కొద్ది మోతాదులో ఇది శరీరంలో ప్రవేశిస్తే పెద్దగా నష్టం ఉండదు. కానీ ఒకేసారి ఎక్కువ మోతాదులో లేదా క్రమక్రమంగా స్టైరీన్ శరీరంలో చేరినా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీ, నరాలపై దీని ప్రభావం ఎక్కువ. క్యాన్సర్‌కి కూడా ఇది కారణమవుతుంది. మహిళలకు రుతుక్రమం,గర్భధారణకు సంబంధించి సమ్యలను తీసుకొస్తుంది" అని ప్రముఖ వైద్యులు పద్మశ్రీ కుటికుప్పల సూర్యారావు బీబీసీతో అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
హక్కుల కోసం న్యాయ పోరాటం
ప్రమాదం జరిగిన తర్వాత బాధిత గ్రామాల ప్రజలు కంపెనీని అక్కడ నుంచి తరలించాలని అనేక పోరాటాలు చేశారు. ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ కోర్టులను ఆశ్రయిచింది.
గ్యాస్ లీకేజీ ఘటనపై అక్టోబర్ 29న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రమాద ఘటనని ఎన్జీటీ (జాతీయ హరిత ట్రిబ్యునల్) సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్జీటీలో కమిటీ నివేదికపై అభ్యంతరాలను సమర్పించాలని ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీం కోర్టు ఆదేశించింది. 10 రోజుల్లో నివేదికపై అభ్యంతరాలను సమర్పించాలని కోరింది.
మరో వైపు బాధితుల తరుపున ఏర్పాటైన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితుల సంక్షేమ సంఘం న్యాయపోరాటం చేస్తోంది.
"ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితుల సంక్షేమ సంఘం పేరుతో ఐక్య వేదికను ప్రారంభించాం. ఇక్కడ కంపెనీ ఉండటం మా ప్రాణాలకు ముప్పు. అందుకే దీన్ని తొలగించమంటున్నాం. అలాగే బాధితులందరికి ప్రమాద పరిహారం అందలేదు. బాధిత గ్రామాల ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే మా ఆర్థిక, ఆరోగ్య హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం" అని ఐక్యవేదిక ప్రతినిధి కిరణ్ కుమార్ చెప్పారు.

'పరీక్షలు చేస్తున్నాం... కానీ ఫలితాలు చెప్పలేం'
ప్రమాదం జరిగిన తర్వాతి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారకాలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయన్నదానిపై కాలుష్య నియంత్రణ మండలి తరుచూ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దానికి తగినట్లుగానే బాధిత గ్రామాల్లోని గాలి నాణ్యత, గాలిలోని ఇతర వాయువులు అవరసమైన స్థాయిలోనే ఉన్నాయా లేదా? నీటి కాలుష్యం ఎలా ఉంది? అన్నది తెలుసుకునేందుకు ఇలాంటి పరీక్షలు చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం అక్కడ కాలుష్యం ఏ స్థాయిలో ఉందన్న బీబీసీ ప్రశ్నకు విశాఖ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సమాధానం చెప్పేందుకు నిరాకరించాయి. హైవపర్ కమిటీయే దీనిపై స్పందించాలని అధికారులు తెలిపారు.
దీంతో హైపవర్ కమిటీ అధ్యక్షుడు నీబర్ కుమార్ ప్రసాద్‌ను బీబీసీ సంప్రదించగా... ఈ విషయంపై స్పందించలేనని ఆయన సమాధానం చెప్పారు.
అలాగే, ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధిత గ్రామాల్లో ఆసుపత్రి నిర్మాణం,కొందరికి పరిహారం అందకపోవడం,ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల లాంటి అంశాలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి దృష్టికి బీబీసీ తీసుకుని వెళ్లింది.
జిల్లా అధికారులతో మాట్లాడి అన్ని వివరాలు తీసుకుని బాధితులందరికి న్యాయం జరిగేటట్లు చేస్తానని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. టై అయితే ఏం జరుగుతుంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- విశాఖ తీరానికి కొట్టుకువచ్చిన ఈ ఓడ తిరిగి సముద్రంలోకి వెళ్తుందా? ఇక్కడే రెస్టారెంట్‌గా మారుతుందా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- సౌదీ ‘కఫాలా’ వ్యవస్థకు మార్పులు... వలస కార్మికులకు నిజంగా మేలేనా?
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








