అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం ముస్లింలకు మేలు చేస్తోందా... కీడు చేస్తోందా?

ఒవైసీ

ఫొటో సోర్స్, Hindustan Times

    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రస్తుతం భారతీయ ముస్లింలకు జాతీయ స్థాయిలో నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకు ఇంతియాజ్ జలీల్ సూటి సమాధానం ఇస్తున్నారు. భారతీయ ముస్లింలందరికీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం-ఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీనే ఏకైక నాయకుడని ఆయన చెబుతున్నారు.

మహారాష్ట్ర నుంచి ఏఐఎంఐఎం నుంచి ఎన్నికైన ఏకైనా ఎంపీ ఇంతియాజ్. ‘‘వేరొక ముస్లిం నాయకుడు ఎవరైనా ఉంటే.. ఆయన పేరు చెప్పండి’’అని తన సమాధానాన్ని వ్యతిరేకించేవారిని ఇమితియాజ్ అడుగుతున్నారు.

‘‘ఒవైసీ అంత ప్రజాదరణ కలిగిన ముస్లిం నాయకుడు ఎవరైనా ఉన్నారా? ముస్లింల కోసం అంత నిబద్ధతతో పార్లమెంటులో ప్రసంగించే నాయకుడు ఎవరైనా ఉంటే ఆయన పేరు చెప్పండి. ఎందుకంటే మీకు ఇలాంటి మరొక నాయకుడు దొరకడు’’అని ఆయన చెబుతున్నారు.

ఒవైసీని ఆయన ఎలా ప్రశంసిస్తున్నారో.. తన పార్టీనీ ఆయన అంతే కొనియాడుతున్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించడంతో.. ఎంఐఎం జాతీయ స్థాయి పార్టీగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒవైసీని ముస్లింలందరికీ నాయకుడిగా విశ్లేషిస్తున్నారు.

ముస్లింలు

ఫొటో సోర్స్, REUTERS/Muhammad Hamed

1927లో మొదలైంది..

ఎంఐఎం 1927లో ఏర్పడింది. మొదట్లో ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. 1984 నుంచి హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని వరుసగా పార్టీ గెలుస్తూ వస్తోంది.

2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలిచింది. దీంతో ఒక చిన్న నగర పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి పార్టీగా ఎంఐఎం మారింది.

బిహార్ అసెంబ్లీలో ఐదు స్థానాల్లో విజయం సాధించడంతో.. తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత మూడో రాష్ట్రంలో పార్టీ ఖాతా తెరిచినట్లు అయింది. అంతేకాదు ఇప్పుడు తెలంగాణ తర్వాత పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నది బిహార్‌లోనే.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ తమ అదృష్టం పరీక్షించుకోవాలని ఎంఐఎం భావిస్తోంది. మరో ఆరు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ బిహార్‌లో కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు.

మరోవైపు 2022లో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఎంఐఎం చెబుతోంది. 2017లో ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీచేసినా.. విజయం దక్కలేదు.

ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడంతోపాటు ఒవైసీపై ప్రజల నమ్మకం క్రమంగా పెరుగుతోందని ఇంతియాజ్ చెబుతున్నారు.

‘‘ఒవైసీ చాలా సూటిగా, కొంచెం ఆవేశంతో మాట్లాడతారని ప్రజలు భావిస్తారు. కానీ ఆయన మాట్లాడేది నిజం. ఆయన ప్రసంగాలు, మాటలు కొందరికి నచ్చకపోవచ్చు. బహుశా ఆయన గట్టిగా మాట్లాడటం వల్లే అలా అనుకోవచ్చు. కానీ, ఆయన ఎప్పుడూ నిజమే మాట్లాడతారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ముస్లింలు

ఫొటో సోర్స్, Hindustan Times

ముస్లింలకు సాయం చేస్తుందా?

ముస్లింలకు ఒవైసీ పార్టీ మేలు చేస్తుందా? లేకపోతే వారి సమస్యలను ఇంకా ఎక్కువ చేస్తుందా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.

ఎంఐఎంకు గట్టి మద్దతునిచ్చే నాయకుల్లో హైదరాబాద్‌కు చెందిన జైద్ అన్సార్ ఒకరు. ‘‘ముస్లింలను రాజకీయల నుంచి, అధికారం నుంచి వేరు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేం అనాథలు అయిపోయినట్లు అనిపిస్తోంది. మా కోసం మాట్లాడేవారు ఎవరూ లేరు. మా ఓట్లు పొంది గెలుస్తున్న పార్టీలు మా కోసం ఏమీ మాట్లాడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒవైసీ మాకు గొంతుకనిచ్చారు. మావైపు మాట్లాడి మా శక్తిని పెంచారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు తమ పార్టీ కేవలం ముస్లింల పార్టీ మాత్రమే కాదని ఇంతియాజ్ అంటున్నారు. తమ పార్టీ చాలా మంది దళితులు, హిందువులకు టికెట్లు ఇచ్చిందని ఆయన చెబుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆయన ఉదహరిస్తున్నారు.

అయితే, రాజకీయల్లో తగ్గిపోతున్న ముస్లింల ప్రాతినిధ్యాన్ని తమ పార్టీ భర్తీ చేస్తోందని ఆయన నొక్కి చెబుతున్నారు.

‘‘ఎంఐఎం ముస్లింల పార్టీ అని మేం ఎప్పుడూ చెప్పలేదు. నిజమే, ముస్లింలకు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే, వాటి గురించి ఎవరూ మాట్లాడటంలేదు. ప్రస్తుత జాతీయ పార్టీలు మా సమస్యలపై పోరాడి ఉంటే.. మా పార్టీకి ఈ స్థాయిలో ప్రజాదరణ వచ్చుండేది కాదు కదా’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ముస్లింలు

ఫొటో సోర్స్, NurPhoto

ముస్లిం యువతలో ఆదరణ

ముస్లింల యువతలో ఎంఐఎంకు మంచి ఆదరణ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ముంబయిలోని ఓ కంపెనీలో మేనేజర్‌గా దీబా అరీజ్ పనిచేస్తున్నారు. ఆమె ఇల్లు మారాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే, ముస్లిం కావడం వల్ల తనకు ఇల్లు అంత తేలిగ్గా దొరకడంలేదని ఆమె చెబుతున్నారు. ఆమె భాగస్వామి ఎంఐఎంకు గట్టి మద్దతుదారుడు. అయితే ఆమెకు మాత్రం ఒవైసీ లేదా జాకిర్ నాయక్.. ఇద్దరూ నచ్చరు.

‘‘ఒవైసీకి వచ్చే ప్రజాదరణ చూస్తుంటే నాకు భయం వేస్తుంటుంది. నా భాగస్వామి, ఆయన మిత్రులతో ఈ విషయంలో నేను చాలాసార్లు గొడవ పడ్డాను. మాది సెక్యులర్ ముస్లిం కుటుంబం. మతం పేరుతో వివక్ష చూపినప్పుడు, ఇల్లు అద్దెకు ఇవ్వనప్పుడు నేను ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా? అనిపించేది. నా భాగస్వామి, అతడి ఎంఐఎం స్నేహితులు సరిగ్గానే చెబుతున్నారా అనిపించేది’’అని ఆమె వ్యాఖ్యానించారు.

దీబాకు ఇప్పటికీ ఇల్లు అద్దెకు దొరకడం లేదు. ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతున్నప్పటికీ ఒవైసీ రాజకీయాలను తాను వ్యతిరేకిస్తానని, సమాజానికి వాటితో చాలా చేటు జరుగుతుందని ఆమె చెబుతున్నారు.

ఫహాద్ అహ్మద్ ముంబయిలో ఉంటారు. ఆయన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో విద్యార్థి. ఆయనకు రాజకీయాలంటే చాలా ఆసక్తి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన బిహార్‌లోనే ఉన్నారు.

ఒవైసీకి తను మద్దుతు ఇవ్వనని, అదే సమయంలో వ్యతిరేకించననీ ఆయన చెబుతున్నారు. ‘‘ముస్లింల సమస్యలను సెక్యులర్ పార్టీలు పట్టించుకోవనే భావన ముస్లిం యువతలో ఉంది. ముఖ్యంగా సెక్యులర్ పార్టీలు పట్టించుకోని అంశాలను ఒవైసీ లేవనెత్తుతున్నారు. ఒకవేళ సెక్యులర్ పార్టీలు.. యువత, ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఇస్తే.. ఒవైసీకి ఇంత ప్రజాదరణ రాదు. అదే సమయంలో ఒవైసీ ప్రజాదరణ కూడా తగ్గుతుంది’’అని ఆయన అంటున్నారు.

దూదేకులు, ముస్లింలు

ఇది మతపరమైన పార్టీనా?

ముస్లిం సమస్యలను పార్లమెంటులో ఒవైసీ ప్రస్తావించడం వాస్తవమే. బాబ్రీ వివాదం, లవ్ జిహాద్ కేసులు, పౌరసత్వ సవరణ చట్టం, పౌర నమోదు పట్టిక ఇలా అన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు.

ఆయన స్వరం పార్లమెంటులో చాలాసార్లు ధ్వనించింది. ఆయన చాలా మంది కంటే పార్లమెంటులో మెరుగ్గా మాట్లాడతారు.

ముస్లింలలో ఆయన పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందన్న మాట కూడా వాస్తవమే. అయితే, అదే సమయంలో కొంతమంది ముస్లింలు దీనిపై ఆందోళన కూడా చెందుతున్నారు.

ఇండియన్ ముస్లిం ఫర్ ప్రోగెస్ అండ్ రిఫార్మ్‌లో షీబా అస్లాం ఫామీ సభ్యురాలు. ఎంఐఎం చాలా ప్రమాదకరమైన పార్టీ అని ఆమె చెబుతున్నారు. ‘‘1947 విభజన సమయంలో ప్రభావితం కానీ ప్రాంతాల్లోనూ మతం పేరు చెబితే ఓట్లు పడతాయని మేం అనుకోలేదు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘విభజన ఈ ప్రాంతాల్లో జరగలేదు. ఇక్కడ ఆ విద్వేషాలు చూడలేదు. శరణార్థులు కూడా రాలేదు. అలాంటి ప్రాంతాలనూ ఇప్పుడు ప్రభావితం చేస్తున్నారు’’.

‘‘భారత్‌లోని ముస్లింలకు సెక్యులర్ వ్యవస్థ కావాలి. మత సంబంధిత వ్యవస్థ కాదు. అప్పుడే ముస్లింలు సురక్షితంగా ఉంటారు’’అని ఆమె అభిప్రాయపడ్డారు.

‘‘బీజేపీ తమ విపక్షంలోనూ వారు మెచ్చినవారే ఉండాలని కోరుకుంటోంది. అందుకే వారు ఒవైసీ బలపడేందుకు అవకాశం ఇస్తున్నారు. ఇది బీజేపీ కోరుకునే విపక్షం’’అని ఆమె చెప్పారు.

ప్రస్తుతం పరిస్థితులు దేశ విభజన మునుపటికి వెళ్లే ముప్పందని ఆమె హెచ్చరిస్తున్నారు. దేశ సమగ్రత కంటే హిందూత్వకే బీజేపీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఆమె అన్నారు.

యోగేంద్ర యాదవ్

ఫొటో సోర్స్, NurPhoto

ఫొటో క్యాప్షన్, యోగేంద్ర యాదవ్

మరోవైపు ఒవైసీకి ప్రజల్లో ప్రజాదరణ పెరగడాన్ని సెక్యులర్ రాజీయాల పరాజయంగా చూడాలని రాజకీయ విశ్లేషకులు, స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ చెబుతున్నారు.

‘‘విభజన తర్వాత, ముస్లిం పార్టీకి ముస్లింలు ఎప్పుడూ ఓటు వేయలేదు. రాజకీయాల్లో తమ ప్రాతినిధ్యం కోసం ఎప్పుడూ వారు ముస్లిం పార్టీలవైపు చూడలేదు. అందరికీ మంచి చేసే సెక్యులర్ పార్టీలే తమకూ మంచి చేస్తాయని వారు భావించేవారు’’అని ఒకసారి ఆయన చెప్పారు.

‘‘ప్రజాస్వామ్యంలో అది చాలా మంచిది. అయితే ముస్లింలను ఒడిసిపట్టుకోవడంలో ఇక్కడి సెక్యులర్ పార్టీలు విఫలం అవుతున్నాయి. ఇలాంటి పార్టీల వల్ల ముస్లింలు విసుగెత్తిపోతున్నారు’’

అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం, ముస్లింలు, ఓటర్లు, బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, AIMIM

ఇదేమీ తొలి పార్టీ కాదు

ముస్లింలే కేంద్రంగా ఏర్పాటైన తొలి పార్టీ ఎంఐఎం కాదు. కేరళలోని ముస్లిం లీగ్, అసోంలోని ఏఐయూడీఎఫ్ కూడా ఇలాంటి పార్టీలే. అయితే ఇవి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పార్టీలు.

కానీ ఎంఐఎం మాత్రం హైదరాబాద్‌తో మొదలుపెట్టి ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేస్తోంది. ఈ పార్టీ ప్రజాదరణ పెరుగుతున్నప్పటికీ, విపక్షాలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఎంఐఎంను ‘‘సోడా నీటిలో బుడగ’’లా బిహార్ కాంగ్రెస్ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ అభివర్ణించారు. అది ఎంత వేగంగా పైకి వస్తుందో, అంతే వేగంగా కిందకు పోతుందని అన్నారు.

ఎంఐఎం అనేది బీజేపీ బీ-టీమ్ అంటూ ఉత్తర్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అఖిలేశ్ ప్రతాప్ సింగ్ వ్యాఖ్యానించారు. దాదాపు అన్ని పార్టీలూ ఎంఐఎంను ఇలానే చూస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం, ముస్లింలు, ఓటర్లు, బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, BBC WORLD SERVICE

బీజేపీ, ఎంఐఎం ఒకటేనా?

ఇటు బీజేపీ, అటు ఎంఐఎం రెండూ మతపరమైన పార్టీలని బిహార్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తారిఖ్ అన్వర్ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలను మనం వ్యతిరేకించాలని, దేశ ఐక్యతకు వీటితో ముప్పుందని ఆయన వివరించారు.

‘‘ఎంఐఎం లేదా ఒవైసీ విషయానికి వస్తే.. ఎలాంటి మతపరమైన పార్టీ అయినా దేశానికి చేటు చేసేదే. ఇది హిందూ మతం అవ్వచ్చు. లేదా ముస్లిం అవ్వచ్చు. వీటి వల్ల దేశం చాలా ప్రభావితం అవుతుంది. ఏఐఎంఐఎంలో ముస్లిం ఇత్తేహాదుల్ అంటే ముస్లింలు ఏకం కావడం. దీని వల్ల హిందూ అతివాదులు లాభం పొందుతారు. ఇలాంటి పార్టీల వల్ల హిందూ అతివాదులకు లాభం జరుగుతుంది. ఫలితంగా దేశం మొత్తం నష్టపోతుంది. మరోవైపు ఒవైసీ కావాలనే, బీజేపీని కాకుండా, కాంగ్రెస్‌ను ఇతర సెక్యులర్ రాజకీయ పార్టీలను విమర్శిస్తున్నారు" అని ఆయన అంటున్నారు.

‘‘ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్.. చేసే ఒక్క వ్యాఖ్యను సాకుగా చూపించి తొగాడియా లేదా ఉమా భారతి చేసే 100 వ్యాఖ్యలను మంచివే అంటారు’’అని షీబా వ్యాఖ్యానించారు.

అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం, ముస్లింలు, ఓటర్లు, బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, @LadeedaFarzana

మరోవైపు ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్నచోటే ఒవైసీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీని వ్యతిరేకించే వారు చెబుతున్నారు.

‘‘ముస్లింల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని ఒవైసీ ఓట్లు అడుతున్నారు. ఫలితంగా ఓట్లు విభజనకు గురవుతున్నాయి. ఈ క్రమంలో సెక్యులర్ పార్టీలు ఓడిపోతున్నాయి. బీజేపీ లాంటి పార్టీలు లబ్ధి పొందుతున్నాయి’’అని తారిఖ్ అన్వర్ చెప్పారు.

‘’బిహార్ ఎన్నికల్లో 15 చోట్ల ఒవైసీ పార్టీ ఓట్లు చీల్చింది. ఇక్కడ మేం గెలుచుకుంటే, మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుండేది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, తమ పార్టీ వల్ల బీజేపీ లాభపడుతుందనే వాదనను ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ అలీ ఖండిస్తున్నారు. తాము మతం పేరు చెప్పి ఓట్లు అడుతున్నారన్న వాదననూ ఆయన తోసిపుచ్చుతున్నారు.

‘‘ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మేం పోటీచేయకపోతే.. అక్కడ ఆర్‌ఎస్‌ఎస్ లేదా బజరంగ్ దళ్, శివ సేన పోటీచేసి గెలుస్తాయా?’’మీరే చెప్పండి అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

25 శాతం మంది ముస్లింలుండే పశ్చిమ బెంగాల్‌పై ప్రస్తుతం ఎంఐఎం గురిపెడుతోంది. ‘‘మేం పోరాడతాం. అన్ని చోట్లా ప్రాతినిధ్యం దక్కించుకుంటాం’’అని ఇంతియాజ్ అన్నారు.

ఇక్కడ పాగా వేయాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎంఐఎం పోటీ అనేది బీజేపీకి ఇది శుభవార్తే.

అయితే, కాంగ్రెస్ దీన్ని ఎలా చూస్తోంది?. ఎంఐఎంను అడ్డుకునేందుకు తాము సన్నద్ధం అవుతున్నామని కాంగ్రెస్ నాయకుడు అఖిలేశ్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)