నికితా తోమర్ హత్య: ‘‘మా అమ్మాయి చనిపోయింది... కానీ, మతం మాత్రం మార్చుకోలేదు’’

నికితా తోమర్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, చింకీ సిన్హా
    • హోదా, బీబీసీ హిందీ కోసం

‘‘నిందితుణ్ని ఉరి తీయండి.. లేదా ఎన్‌కౌంటర్ చేయండి.’’ నికితా తోమర్ హత్యకు గురైన మూడు రోజుల తర్వాత ఆమె ఇంటి బయట బలంగా వినిపిస్తున్న డిమాండ్ ఇది.

‘‘వెళ్లి ఆ దుర్మార్గుణ్ని షూట్ చేయండి.. లవ్ జిహాద్ ముర్దాబాద్’’అంటూ ఫరీదాబాద్‌లోని నెహ్రూ కాలేజీలో చదువుతున్న కంచన్ డాగర్ వ్యాఖ్యానించారు. ఆమె అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యురాలు.

కంచన్‌తోపాటు మరికొందరు విద్యార్థులు గురువారం హరియాణాలోని బల్లబ్‌గఢ్ అగర్వాల్ కాలేజీ ముందు బైఠాయించారు. వారంతా ఇవే నినాదాలు చేశారు.

ఇదే కాలేజీ బయట 21ఏళ్ల నికిత హత్యకు గురయ్యారు. పోలీసులు నిందితుణ్ని అరెస్టుచేశారు.

అయితే, కాలేజీ వెలుపల బైఠాయించిన విద్యార్థులు పోలీసుల్ని లేదా న్యాయ వ్యవస్థను విశ్వసించడం లేదు.

నిందితుణ్ని ఎన్‌కౌంటర్ చేస్తేనే బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు.

‘‘ఆమెను కాల్చింది ఒక ముస్లిం. నికిత ఒక హిందువు. ఆమె ఇస్లాంలోకి మతం మార్చుకోవాలని ఆ ముస్లిం కుటుంబం చాలా ఒత్తిడి తీసుకొచ్చింది. భారత్‌లో ఇలాంటి లవ్ జిహాద్ కేసులు చాలానే ఉన్నాయి. అమ్మాయి ఒప్పుకోకపోతే చంపేస్తున్నారు. ఆమె ఒప్పుకున్నా.. తర్వాత కొన్ని రోజులకు ఆమె శరీరం సూట్‌కేస్‌లో కనిపిస్తుంది. ఇలాంటి కేసులను మేం చాలా చూశాం. చట్టాలు కేవలం మా కోసమేనా? వారికేం లేవా?’’అని కంచన్ ప్రశ్నించారు.

ఇక్కడ వారు అంటే కాంగ్రెస్, ముస్లింలు.

మరోవైపు కంచన్ పక్కనే ఉన్న గాయత్రి రాఠోడ్ మరో అడుగు ముందుకు వేసి వ్యాఖ్యలు చేశారు. ‘‘అతణ్ని పది రోజుల్లోగా ఉరి తీయాలి. లేదంటే ప్రభుత్వంపైనా ఇదే విధంగా పోరాడతాం. అది అక్రమమైనా సరే’’అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

సోమవారం మధ్యాహ్నం అగర్వాల్ కాలేజీ వెలుపల నికితా తోమర్ హత్యకు గురయ్యారు. ఆమెను తుపాకీతో కాల్చిన యువకుడి పేరు తౌసీఫ్. వీరిద్దరికీ పరిచయముంది. ఫరీదాబాద్‌లోని రావల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు.

ఆ రోజు నికితను ఇంటికి తీసుకొచ్చేందుకు ఆమె తల్లి కాలేజీకి వెళ్తుండగా మధ్యలోనే ఫోన్ వచ్చింది. నికితను ఎవరో కాల్చేశారని ఆమెకు ఫోన్‌లో చెప్పారు.

నికితను తౌసిఫ్ కాల్చిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు పరిసరాల్లోని డీఏవీ స్కూల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

అయితే, ఈ కేసు వల్ల తమ వర్గం ఉనికికి మరో వర్గం ముప్పుగా మారుతోందని కొందరు చెబుతున్నారు. ఈ ఆలోచనా విధానానికి కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ నాయకులూ మద్దతు పలుకుతున్నారు.

హదియా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హదియా

లవ్ జిహాద్‌కు నిర్వచనం లేదు

‘‘లవ్ జిహాద్’’అనే పదానికి ఏ భారత చట్టంలోనూ నిర్వచనం లేదు. ఇలాంటి ప్రచారంతో ఘటనలు జరుగుతున్నట్లు ఏ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎప్పుడూ ప్రస్తావించలేదు.

ఈ అంశంపై గత ఫిబ్రవరిలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొన్ని అతివాద సంస్థలు చేస్తున్న ‘‘లవ్ జిహాద్’’ ప్రకటనలకు కాస్త దూరం జరిగింది. అయితే, ముస్లిం యువకులు, హిందూ యువతుల మధ్య సంబంధాలను ‘‘లవ్ జిహాద్’’గా కొన్ని సంస్థలు చెబుతున్నాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. దేశ పౌరులు ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని అనుసరించొచ్చు. ఆ మత విధానాలను పాటించొచ్చు. అయితే, వేరొకరి నైతికత, సామాజిక సామరస్యతకు భంగం కలగకుండా చూసుకోవాలి.

రెండు భిన్న మతాలకు చెందిన వ్యక్తుల పెళ్లిళ్లకు సంబంధించిన వివాదాల కేసులను ఇదివరకు కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సహా కొన్ని దర్యాప్తు సంస్థలు విచారించాయి. వాటిలో కేరళకు చెందిన హదియా కేసు ఒకటి. 2018లో దీనిపై చాలా చర్చ జరిగింది.

25 ఏళ్ల హదియా తన భర్తతో స్వేచ్ఛగా జీవించొచ్చని సుప్రీం కోర్టు కూడా చెప్పింది.

ముస్లిం యువకుడితో హదియా వివాహం చెల్లదంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది.

అయితే, లవ్ జిహాద్ విషయంలో ప్రభుత్వం, కోర్టులు ఏమి చెబుతున్నా కర్ణిసేన అధ్యక్షుడు సూరజ్ పాల్ అమూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన నికితా ఇంటిని సందర్శించారు. ఈ ఘటనను ఆయన ఒక అవకాశంగా మలచుకుంటున్నారు.

ఆయనతోపాటు ఉత్తర్ ప్రదేశ్, హరియాణాకు చెందిన పలువురు కర్ణిసేన నాయకులు నికిత ఇంటికి వచ్చారు. ‘‘ముస్లింలు అందరినీ పాకిస్తాన్‌కు పంపించేయాలి’’అంటూ వారు నినాదాలు చేస్తున్నారు.

అంతేకాదు, తాము ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేస్తామని, దేశంలోని ‘‘లవ్ జిహాద్’’ కేసులన్నీ ఈ సిట్ విచారణ చేపడుతుందని సూరజ్‌పాల్ ప్రకటించారు.

‘‘అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ముస్లిం అబ్బాయిలు పేర్లు మార్చుకొని అమాయకపు హిందూ అమ్మాయిల్ని బలితీసుకుంటున్నారు. ఇలాంటి వాటిని మేం సహించం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

నికిత తండ్రి

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, నికిత తండ్రి

తాజా కేసు అదే కోణంలో..

నికిత కేసు విషయానికి వస్తే, 2018లోనే ఆమెను తౌసిఫ్ కిడ్నాప్ చేశాడని నికిత కుటుంబం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అయితే, నికితను ఇబ్బంది పెట్టనని తౌసిఫ్ చెప్పడంతో రెండు కుటుంబాల మధ్య ఒప్పందం కుదిరింది. తౌసిఫ్ మాత్రం తన పనులను ఆపలేదు.

నికితను ఇంకా వేధిస్తూనే ఉన్నాడు. దీంతో నికిత కాలేజీకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఆమె తల్లి వెంట ఉండేది.

కొన్ని రోజుల తర్వాత తౌసిఫ్ వెంటపడటం లేదని నిశ్చయించుకున్న తర్వాత నికితకు తోడుగా తల్లి వెళ్లడం మానేశారు.

తౌసిఫ్‌పై పెట్టిన కేసును కూడా వెనక్కి తీసుకున్నారు. ఈ కేసు వల్ల తమకు అపఖ్యాతి కలుగుతుందని, పెళ్లి సమయంలో సమస్యలు వస్తాయని భావించడమూ దీనికి ఒక కారణం.

ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్‌రస్ అత్యాచారం కేసు విషయంలోనూ తమ కుమార్తెపై అత్యాచారం జరగలేదని బాధితురాలి కుటుంబం చెబుతూ వచ్చింది. ఎందుకంటే తమ కుమార్తెకు చెడ్డపేరు వస్తుందని వారు భావించారు.

నికితా తోమర్

ఫొటో సోర్స్, Chinki Sinha/BBC

హత్య తర్వాత..

నికితది మధ్య తరగతి కుటుంబం. వీరు హరియాణాలోని సోనా రోడ్డును అనుకుని ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో కింద అంతస్తులో ఉంటున్నారు. వీరి ఇంటిలో రెండు గదులున్నాయి.

వచ్చేవారు కూర్చోవడానికి ఇంటి బయట ఒక టెంటును ఏర్పాటుచేశారు. భిన్న పార్టీలు, సంస్థలకు చెందిన ప్రతినిధులు నికిత ఇంటికి వస్తున్నారు. ‘‘తను నమ్మిన మతం కోసం ప్రాణం ఇచ్చిన యువతి’’గా ఆమెను కీర్తిస్తున్నారు. కొందరు ఆమెను వీర వనితగా పేర్కొంటున్నారు.

నికిత ఇంటికి సమీపంలో ఉండే 50 ఏళ్ల స్వదేశీ.. బీబీసీతో మాట్లాడారు.

‘‘నికిత నాకు బాగా తెలుసు. తను చాలా మంచి అమ్మాయి. ఆమెకు న్యాయం జరగాలి. ఆమెను హత్యచేసిన చోటే నిందితుణ్ని చంపాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది’’అని ఆమె వ్యాఖ్యానించారు.

నికిత మృతికి సంతాపం తెలిపేందుకు దిల్లీ నుంచి మహేంద్ర ఠాకుర్ వచ్చారు. నికిత తమ వర్గం అమ్మాయేనని ఆయన వివరించారు.

‘‘చట్టాలు అతడికి శిక్ష విధించకపోతే.. మేం శిక్షిస్తాం. ఠాకుర్లలో ఎవరో ఒకరు అతణ్ని చంపేస్తారు. ఇది కచ్చితంగా జరుగుతుంది. మేం రాజ్‌పుత్‌లం. నిందితుణ్ని వదిలిపెట్టం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

నికితా తోమర్

ఫొటో సోర్స్, Chinki Sinha/BBC

పగ తీర్చుకుంటాం..

నికిత ఇంటిలో ఒక టీవీ రిపోర్టర్ కనిపించాడు. మొదటగా అతడు నికిత తల్లి విజయవతి జుట్టును సరిచేసి.. ఇంటర్వ్యూకు సిద్ధం చేశాడు.

నికిత తల్లి పక్కనే కూర్చున్న ఆమె తండ్రితో ఇంటర్వ్యూ మొదలుపెట్టాడు. లవ్ జిహాద్‌పై చాలా సేపు ఈ ఇంటర్వ్యూ నడిచింది.

మహిళలు తమ గౌరవం కాపాడుకునేందుకు, లవ్ జిహాద్‌పై పోరాడేందుకు సమయం ఆసన్నమైందని రిపోర్టర్ చెప్పారు.

ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకొనేందుకు ఈ గది ఇప్పుడు కేంద్ర బిందువైంది. ఇంటి బయట పరిస్థితులు మరింత కల్లోలంగా మారాయి.

ముస్లింలను నిషేధించాలంటూ కొందరు నినాదాలు చేస్తున్నారు. ముస్లింలకు గుణపాఠం చెప్పాలని, వారిని పాకిస్తాన్‌కు పంపించేయాలని కూడా కొందరు అంటున్నారు.

ఈ నినాదాలకు కొంత దూరంలోనే పోలీసులు నిలబడి ఉన్నారు. హిందూ అమ్మాయి హత్యపై పగ తీర్చుకొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ కొందరు గట్టిగా అరుస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం అలా చూస్తూనే ఊరుకున్నారు.

నికితా తోమర్

ఫొటో సోర్స్, Chinki Sinha/BBC

చాలా ధైర్యవంతురాలు..

ఇంట్లో నికిత తల్లి విజయవతి ఏడుస్తూ కనిపించారు. తన కుమార్తె చాలా ధైర్యవంతురాలని ఆమె మళ్లీ మళ్లీ చెబుతూ ఏడుస్తున్నారు. ‘‘తుపాకి గురిపెట్టి కారులోకి ఎక్కమంటే.. వేరే ఎవరైనా అయ్యుంటే వెంటనే కారు ఎక్కేసేవారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘మా అమ్మాయి హిందూ మతం కోసం ప్రాణాలు అర్పించింది. ఒక వేళ మా అమ్మాయి కారులోకి ఎక్కుంటే.. అది పిరికిపందల చర్యగా మేం అనుకునేవాళ్లం. అలా చేయలేదు. మా అమ్మాయి చాలా ధైర్యవంతురాలు.. ఆ పేరు మాకు జీవితాంతం ఉంటుంది’’అని విజయవతి సోదరి గీతా దేవి వ్యాఖ్యానించారు.

తన కుమార్తె నౌకాదళ అధికారిణి కావాలని అనుకుందని, 15 రోజుల క్రితం పరీక్ష కూడా రాసిందని విజయవతి చెప్పారు. కచ్చితంగా తను నేవీకి ఎంపిక అవుతానని నమ్మకంతో ఉండేదని వివరించారు.

‘‘ఒక అధికారిగా మారి.. దేశానికి సేవ చేయాలని తను అనుకుంది. తను స్కూలుకు వెళ్లడానికి కూడా చాలా ఇష్టపడేది’’అని గీత వ్యాఖ్యానించారు.

అనిల్ విజ్

ఫొటో సోర్స్, Keshav Singh/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, అనిల్ విజ్

లవ్ జిహాద్ కోణంలో..

2018లో తౌసిఫ్‌పై నికిత కుటుంబం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించిందని, దానిపై కూడా విచారణ జరపాల్సిన అవసరముందని హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ చెప్పారు.

లవ్ జిహాద్ కోణంలోనూ ఈ కేసును విచారణ చేపట్టాల్సిన అవసరముందని అనిల్ వ్యాఖ్యానించారు.

2018లో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నికిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చి కేసును వెనక్కి తీసుకొనేలా చేసిందని ఆయన ఆరోపించారు.

2018లో ఆ కేసును నికిత తండ్రి మూల్‌చంద్ తోమర్ నమోదు చేశారు. తన 18ఏళ్ల కుమార్తెను అగర్వాల్ కాలేజీ బయట కిడ్నాప్ చేశారని ఆయన చెప్పారు.

ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా తౌసిఫ్ పేరు పేర్కొన్నారు. ‘‘అభిషేక్ అనే వ్యక్తి నుంచి నికిత తల్లికి ఫోన్ వచ్చింది. నికితను కిడ్నాప్ చేశారని చెప్పమని అభిషేక్‌కు తౌసిఫ్ చెప్పాడు’’అని దానిలో వివరించారు.

ప్రస్తుతం నికిత ఇంటికి వచ్చేవారంతా.. మత మార్పిడికి లొంగకుండా ఆమె ఎంతో ధైర్యం ప్రదర్శించారని కొనియాడుతూ నివాళులు అర్పిస్తున్నారు.

అయితే, ఒక యువకుడి నుంచి ఏళ్లుగా ఆమె ఎదుర్కొన్న వేధింపుల కోణంలో ఎవరూ మాట్లాడటం లేదు.

నికితా తోమర్

ఫొటో సోర్స్, Chinki Sinha/BBC

గంటకు ఒకరు వేధింపులకు బాధితులుగా..

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం.. 2018లో ప్రతి 55 నిమిషాలకు దేశంలో ఒక అమ్మాయి వేధింపులను ఎదుర్కొంది.

ఈ ఏడాది మొత్తంగా 9,438 వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఇది 2014తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ.

మొత్తం కేసుల్లో నిందితులకు శిక్ష పడిన కేసులు 29.6 శాతం మాత్రమే.

రెండు రోజుల క్రితం కూడా...

ఘటన జరగడానికి రెండు రోజుల ముందు కూడా నికితను కలవడానికి తౌసిఫ్ కాలేజీకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

నికిత తల్లిదండ్రులు నమోదు చేయించిన ఎఫ్‌ఐఆర్‌లోనూ నికితను తౌసిఫ్ వేధిస్తున్నాడని పేర్కొన్నారు.

మరోవైపు నేరాన్ని తానే చేసినట్లు పోలీసుల దగ్గర తౌసిఫ్ అంగీకరించాడు. తను నికితను ప్రేమించానని, తన ఫోన్‌ను నికిత ఎత్తడం మానేయడంతో తనకు గుణపాఠం చెప్పాలని భావించినట్లు అతడు తెలిపాడు.

మరోవైపు నికిత ఇస్లాంలోకి మారాలంటూ తౌసిఫ్, అతడి కుటుంబం ఒత్తిడి తెచ్చారంటూ వచ్చిన ఆరోపణలపైనా విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నికిత తండ్రి మూల్‌చంద్ ఈ ఆరోపణలను మళ్లీ మళ్లీ చేస్తున్నారు.

ఎఫ్‌ఐఆర్ కాపీని బీబీసీ సంపాదించింది. అయితే, దానిలో మత మార్పిడి గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు.

‘‘మతం మారేందుకు నికిత ఒప్పుకోలేదు. తౌసిఫ్ చాలాసార్లు బెదిరించాడు. ఆమె హిందూ బాలిక. ఇస్లాంలోకి మారేందుకు ఆమె సిద్ధ పడలేదు’’అని గీత వ్యాఖ్యానించారు.

నికిత తల్లి కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తమకు న్యాయం జరగాలని, తౌసిఫ్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

నికిత తోమర్

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP via Getty Images

రాజకీయ నేపథ్యమున్న కుటుంబం

తౌసిఫ్‌ది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. అతడి తాత చౌధరి కబీర్ అహ్మద్ హరియాణా కాంగ్రెస్ టికెట్‌పై 1975, 1982 ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే, నిందితులకు హరియాణా కాంగ్రెస్ సాయం చేస్తుందన్న ఆరోపణలను పార్టీకి చెందిన ఒక నాయకుడు తోసిపుచ్చారు.

మరోవైపు హరియాణా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి సెల్జా కూడా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. ఈ ఘటనతో కాంగ్రెస్‌కు సంబంధమేంటని విలేకరులతో ఆమె అన్నారు.

నికితా తోమర్

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP via Getty Images

‘‘చేసినందుకు శిక్ష అనుభవిస్తాడు’’

మరోవైపు తౌసిఫ్ చిన్నాన్న జావెద్ అహ్మద్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు.

‘‘నేను ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మేం చెప్పేది ఎవరు నమ్ముతారు? మేం ముస్లింలం. వారిద్దరు కలిసే చదువుకున్నారు. వారు ఫోన్ నంబర్లు ఎందుకు ఇచ్చి పుచ్చుకున్నారు. ఎందుకు ఫోన్లలో మాట్లాడుకున్నారు? ఘటన జరగడం చాలా బాధాకరం. బాధితురాలి తల్లిదండ్రుల గురించి మేం కూడా బాధపడుతున్నాం. పోలీసులు ఫోన్‌ చేసిన వెంటనే మేం తౌసిఫ్‌ను అప్పగించాం’’అని జావెద్ వ్యాఖ్యానించారు.

‘‘తౌసిఫ్ మంచోడు. సిగరెట్లు, మందు తాగడు. ఇంతకుమించి నేనేమీ చెప్పాలని అనుకోవట్లేదు. చేసిన తప్పుకు అతడు శిక్ష అనుభవిస్తాడు’’అని చెప్పారు.

అయితే, ఘటనలో లవ్ జిహాద్ పాత్రను ఆయన తోసిపుచ్చారు. దీన్ని హిందూ-ముస్లింల మధ్య వివాదంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు.

‘‘లవ్ జిహాద్ అంటే ఏమిటి? మీరు నాకు చెప్పండి. చాలా మంది హిందూ అబ్బాయిలు.. ముస్లిం అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు. చాలా మంది మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు? అసలు ఎందుకు అలా పెళ్లి చేసుకోకూడదు?’’అని ఆయన అన్నారు.

నికిత ఇంటి నుంచి బయటకు వస్తుండగానే ఆమె ఫోటోకు దండ వేసి కనిపించింది. ఆమె చదువును ఎంతో ఇష్టపడేది. తల్లికి వంటచేసి పెట్టేది. అందరి అమ్మాయిల్లానే బొమ్మలతో ఆడుకొనేది.

వెయ్యి కలలు కనే సాధారణ బాలిక ఆమె. చాలా మంది అమ్మాయిల్లానే ఆమె కూడా వేధింపులను ఎదుర్కొంది. అయితే ఆ వేధింపులే నేడు ఆమెను బలితీసుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)