"ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో తిరగను, అభివృద్ధి చేయను"- ఎమ్మెల్యే రాజా సింగ్

ఫొటో సోర్స్, SUDHEER KALANGI
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ న్యూస్ తెలుగు ప్రతినిధి
"నా నియోజకవర్గం పరిధిలో 15 సినిమా థియేటర్లున్నాయి. వాటిల్లో ఎక్కడా పద్మావతి ఆడకుండా చూస్తాను. చరిత్రను వక్రీకరించిన ఈ సినిమా ఆడకుండా చూడడం నా బాధ్యత" అని అంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే, టి. రాజా సింగ్.
హైదరాబాద్‌లోని గోషామహల్ నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ పై ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు.
మాస్ ప్రేక్షకులను మెప్పించడం కోసం, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చరిత్రను వక్రీకరించి మసాలా జోడించారని ఆయన విమర్శించారు.
లోథ్ రాజపుత్ర కులానికి చెందిన 39 ఏళ్ల రాజా సింగ్ "సినిమాలు యువతపై ప్రభావం చూపిస్తాయి. అమితాబ్ బచ్చన్ 'షరాబీ' సినిమా వచ్చినప్పుడు తాగుడు ఒక ట్రెండ్ అయిపోయింది. సంజయ్ దత్ 'ఖల్ నాయక్' విడుదల అయినప్పుడు పొడుగు జుట్టు ట్రెండ్ అయింది. ఇప్పుడు దండయాత్ర చేసిన ఓ ముస్లిం ఖిల్జీ, ఒక రాజపుత్ర రాణితో రొమాన్స్ చేసిన దృశ్యాలు యువతపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి?" అని ప్రశ్నించారు.

"వారంలో నాలుగు రోజులు కోర్టులకు"
రాజా సింగ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారేమీ కాదు. ఆయనపై దాదాపు 70 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో చాలా వరకూ అల్లర్లు, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి సంబంధించినవే. తనపై అన్ని కేసులు ఉన్నాయన్న విషయాన్ని చెప్పుకునేందుకూ ఆయన వెనకాడరు.
"నా మీద చాలా కేసులన్నాయి. వారంలో నాలుగు రోజులు కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది"- రాజా సింగ్

ఫొటో సోర్స్, Getty Images
12 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్‌తో తన ప్రయాణం ప్రారంభించిన రాజా సింగ్, హిందూ వాహినిలో చేరారు.
"అక్కడ నేను అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. ఆవుల సంరక్షణ కోసం బడి కూడా మానేసేవాడిని. ఆవులను చంపడాన్ని నేను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాను. నా చర్యల వల్ల చాలా సమస్యలు వచ్చేవి. చాలామంది సలహా మేరకు రాజకీయాల్లోకి వచ్చాను" అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు రాజా సింగ్.
కుటుంబ భారం పంచుకోవడానికి చదువు మానేసి తండ్రితో పాటూ పనికెళ్లిన రాజా సింగ్, చరిత్రపై తన అధ్యయనాన్ని గూగుల్ సులభతరం చేసిందంటారు.
"మనకు కావాల్సింది వెతికి చదవడం చాలా సులువైపోయింది. ఎందుకంటే, ప్రతీదీ గూగుల్‌లో ఉంటుంది" అని ఆయన అంటున్నారు. రాణి పద్మావతి గురించి కూడా ఆయన ఆన్‌లైన్‌లోనే వ్యాసాలు చదువుతున్నారు.
వ్యాఖ్యలన్నీ వ్యక్తిగతమే
హైదరాబాద్ ధూల్ పేటలోని తన ఆఫీసులో రాజా సింగ్ చెప్పే మాటలను ఇంగ్లీషులోకి అనువదించి, ట్వీట్ చేసే యువ బృందం ఉంది.
ఆయన ఆఫీసులోకి వెళ్లగానే అందరికీ బాగా కనిపించేలా ఒక ఫోటో ఉంటుంది. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాక్రేతో కలిసి దిగిన రాజా సింగ్ ఫోటో అది. దాని కింద శ్రీరామ్ హిందూ సేన అని రాసి ఉంటుంది.

తన వ్యాఖ్యలన్నీ వ్యక్తిగతమే అని చెప్పే రాజా సింగ్, తన సిద్ధాంతాలు బీజేపీ లక్ష్యాలకు వ్యతిరేకం కాదంటారు.
"పార్టీ విధానంతో సంబంధం లేకుండా నేను సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాను. ఉదాహరణకు శ్రీరామ నవమి సందర్భంలో సభలకు వేలాది హిందూ యువకులు వస్తారు. వారు భజనలు వినడానికి రారు. నేను పార్టీ విధానాల నుంచి పక్కకు జరిగి ఆవేశపూరిత ప్రకటనలు ఇవ్వాలి. అందుకే నేను రామమందిరం కట్టడం కోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధమే అనేది" అని వివరించారు రాజా సింగ్.
మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టినందుకు రాజా సింగ్‌పై 13 కేసులు పెట్టారు మజ్లిస్ బచావో తహ్రీక్ నాయకుడు అమ్జద్ ఉల్లా ఖాన్.
"ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో తిరగను, అభివృద్ధి చేయను"
రాజా సింగ్ మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే తప్ప తన నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టరనే విమర్శా ఉంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకుంటారు కూడా. ప్రభుత్వం కూడా అతనిపై ఏ చర్యా తీసుకున్న దాఖలాలు లేవు.
రాజా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గంలో అన్ని మతాలతో పాటూ ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేయక్కర్లేదని ఆయన భావిస్తారు.
"ఆవును, చంపేవారి ఓట్లు నాకు అవసరం లేదని 2014 ఎన్నికల సమయంలో చెప్పాను. దాని ఫలితంగా హిందూ సోదరుల దీవెనలతో గెలిచాను. ఎక్కడైతే హిందువులు ఎక్కువ ఉంటారో, అక్కడే నేను అభివృద్ది చేస్తా. నా నియోజకవర్గంలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో తిరగను, వాటిని అభివృద్ధి చేయను.." అన్నారు రాజా సింగ్.

ఫొటో సోర్స్, Getty Images
"ఈ ఏడాది బక్రీద్‌కు ఒక్క ఆవూ చనిపోలేదు"
తన 'దూకుడు చర్యల' వల్లే ఈ ఏడాది బక్రీద్‌కి ఒక్క ఆవునూ చంపలేదని గర్వంగా చెబుతున్నారు రాజా సింగ్.
"ఏటా బక్రీద్‌కి ఆవులను చంపుతారు. ఈ ఏడాది మాత్రం ఒక్క ఆవునూ చంపలేదు. దూకుడు లేకపోతే ఇది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా?"- రాజా సింగ్
రామాలయం నిర్మాణం, గోవధను నిషేధం... ఈ రెండే తన వ్యక్తిగత ఎజెండా అని చెబుతారు రాజా సింగ్.
రాజా సింగ్ వ్యాఖ్యలపై స్పందించడానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అందుబాటులో లేరు. తమ పార్టీ విధానంలో లేని ప్రకటనలు ఇవ్వొద్దని పార్టీ రాజా సింగ్‌కు సూచించిందని హైదరాబాద్ నగర బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు.
"పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయవద్దని మేం గతంలోనే రాజా సింగ్‌కి చెప్పాం. ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలించి అవి పార్టీ వ్యతిరేకంగా ఉండకుండా చూస్తాం. మోదీ ఎజెండా అభివృద్ధి. అభివృద్ధి మతంపై ఆధారపడి ఉండదు" అని రామచందర్ రావు అన్నారు.
ఈ ఏడాది జూలైలో రాజా సింగ్‌పై విచారణ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ప్రజల మధ్య వైరాన్ని పెంచే ఐపీసీ సెక్షన్ 153ఎ కింద ఈ విచారణ సాగుతుంది. కొందరు మంత్రులను, ప్రతిపక్ష నేతలను దీనిపై స్పందన కోరగా కూడా ఎటువంటి వ్యాఖ్యా చేయడానికి నిరాకరించారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








