దళితులను మురుగు నీటిలో ముంచిన ఘటనపై ఆక్రోశం
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇద్దరు దళిత యువకులను ఓ వ్యక్తి కొడుతూ, బలవంతంగా మురుగు గుంటలోకి దింపుతున్న వీడియో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వ్యక్తి కర్రతో వారిని కొడుతూ, దుర్భాషలాడుతూ మురుగు గుంటలోకి దింపుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అందులో మునిగి తనను క్షమించాలని వేడుకోవాలని ఆయన వారిని బెదిరిస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఈ ఘటననంతా ఆయన తన ఫోన్‌తో వీడియో కూడా తీసినట్టుగా కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది.
ఆ వీడియోలో దళితులపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వ్యక్తి బీజేపీ నేత భరత్ రెడ్డి అని మీడియా కథనాలు చెబుతున్నాయి. బాధితుల పేర్లు రాజేశ్వర్, లక్ష్మణ్ అని తెలిసింది.

ఫొటో సోర్స్, Whatsaap
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఈ సంఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
వైరల్‌గా మారిన ఈ వీడియో ఆధారంగా ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి) జాతీయ కార్యదర్శి మానికొళ్ల గంగాధర్ మాదిగ నవీపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీనిపై ఆయన బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ, "అభంగపట్నం గ్రామానికి చెందిన దళిత యువకులు రాజేశ్వర్, లక్ష్మణ్‌లను దూషిస్తూ స్థానిక బీజేపీ నేత భరత్ రెడ్డి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అక్టోబర్‌లో జరిగింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, facebook
"ఊరు పక్కన ఎర్ర చెరువు నుంచి భరత్ రెడ్డి అనుచరులు మొరం తీసుకెళ్తున్నారు. దానిని ఈ దళిత యువకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో భరత్ రెడ్డి ఆగ్రహంతో వారిపై దాడికి దిగారు. నోటి కొచ్చినట్లు దూషిస్తూ వాళ్లను కొట్టడమే కాకుండా వాళ్లను బలవంతంగా మురుగు నీటిలో ముంచి, క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటననంతా తన ఫోన్‌తో వీడియో కూడా తీశారు. ఆయన వెనుక 20 మంది వరకు ఉన్నారు. వారు కూడా వీడియో తీశారు కానీ, ఒక్కరు కూడా అడ్డుకోలేదు" అని గంగాధర్ తెలిపారు.
తమ కార్యకర్తలు భరత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారనీ, దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తోరోకో నిర్వహించారనీ గంగాధర్ బీబీసీతో చెప్పారు.
"బాధితులకు న్యాయం జరగాలి. దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Whataap/gangadhar
బాధితులను తాము గత రాత్రే కలిసి ఘటనపై ఆరాతీశామని, ఉదయం ఫిర్యాదు చేసే సమయానికి వారు కనిపించడం లేదని కూడా ఆయన బీబీసీకి తెలిపారు. వారి ఆచూకీ కనుక్కోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.
కాగా, దళిత యువకులను కొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక బీజేపీ నేత భరత్ రెడ్డిని బీబీసీ ఫోన్‌లో సంప్రదించగా, ఆయన దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. "వీడియోపై ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయను, పూర్తి వివరాలు త్వరలోనే బయటపెడ్తా" అని చెప్పారు.
"ఈ వీడియోలో కనిపిస్తున్నది మీరు కాదంటారా" అని ఆయనను అడిగినప్పుడు ఆయన కాదని అనలేదు. "దీనిపై ఇప్పుడు ఏమీ వ్యాఖ్యానించను" అని ఆయనన్నారు.
రాజేశ్వర్, లక్ష్మణ్‌లకు ఫోన్ చేయడానికి బీబీసీ ప్రయత్నించినప్పటికీ వారు స్పందించలేదు.

ఫొటో సోర్స్, Naresh/whatsapp
దళిత యువకులపై భరత్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎమ్మార్పీఎస్ నేత గంగాధర్ ఫిర్యాదు చేశారని నవీపేట సబ్-ఇన్స్‌పెక్టర్ నరేశ్ బీబీసీకి ఫోన్‌లో తెలిపారు.
"ఘటనపై బాధితులు, వారి బంధువులు ఫిర్యాదు చేయలేదు, వారి ఆచూకీ కూడా మాకు తెలియదు. అయితే, వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఎమ్మార్పీఎస్ నేత గంగాధర్ ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు భరత్ రెడ్డిపై సెక్షన్ 506 (బెదిరింపులకు పాల్పడటం), అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశాం. అయితే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నాం" అని ఆయన తెలిపారు.
దళితులపై దాడులకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో తెలంగాణలో ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ విషయంపై మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్ఎఫ్) రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు జీవన్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా ఫ్యూడల్ దృక్పథంలో మార్పు రావడం లేదని అన్నారు.
"ఫ్యూడల్ అహంకారం రాజకీయ నాయకుల్లో, పాలకుల్లో బాగా ఉంది. దళితులపై ఏం చేసినా చెల్లిపోతుందని వారు భావిస్తున్నారు. దళితులను కాపాడాల్సిన చట్టాలు సరిగా అమలు కావడం లేదు. మొత్తంగా సమాజంలో ప్రజాస్వామ్య భావనలు పెంపొందనంత వరకు ఇలాంటి ఘటనలు ఆగవు" అని ఆయన అన్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









