పద్మావతి సినిమా విడుదల వాయిదా

పద్మావతి

ఫొటో సోర్స్, Getty Images

వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న పద్మావతి చిత్రం గత కొన్నిరోజులుగా వివాదంలో నలిగిపోతోంది. తాజాగా మూవీ విడుదలను వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించారు. మామూలుగా అయితే డిసెంబర్ ఒకటిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

పద్మావతి చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. రాజ్‌పుత్ మహారాణి పద్మావతి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజ్‌పుత్‌ కుటుంబాల గౌరవం, సంప్రదాయాలు ఇనుమడించేలా పద్మావతి చిత్రం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

పద్మావతి

ఫొటో సోర్స్, Twitter/deepika padukone

ఇటీవల సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వెనక్కి తిప్పిపంపింది. దరఖాస్తులో కొన్ని ఖాళీలను సరిగా పూరించ లేదనే సాంకేతిక కారణాలతో వెనక్కి పంపింది. సమగ్ర వివరాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించింది.

సినిమా విడుదల ఆలస్యం కావడానికి ఇదొక కారణంగా అంచనా వేస్తున్నారు. తాము బాధ్యతాయుతమైన పౌరులమని, దేశ చట్టాలను గౌరవిస్తామని చిత్ర నిర్మాతలు ఒక ప్రకటనలో చెప్పారు. సెన్సార్‌ ప్రక్రియను పాటిస్తామని వివరించారు.

అయితే, పద్మావతి విడుదల కొత్త తేదీని చిత్ర యూనిట్ ప్రకటించలేదు. త్వరలోనే తేదీని తెలియజేస్తామని మాత్రం తెలిపారు.

పద్మావతి వివాదం

ఫొటో సోర్స్, Getty Images

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

చరిత్రను వక్రీకరించి మహారాణి పద్మావతి చిత్రాన్ని తెరకెక్కించారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. దాంతో సంజయ్ లీలా భన్సాలీ ఓ వీడియోను మీడియాకు విడుదల చేసి వివాదంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మహారాణి పద్మావతి కథ తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆమె పోరాటం, త్యాగానికి ఈ చిత్రం అద్దం పడుతుందని సంజయ్ లీలా భన్సాలీ చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)