ఫ్రాన్స్‌ లౌకికవాదానికి - ఇస్లాం మతానికి మధ్య ఘర్షణ ఎందుకు వచ్చింది?

ఫ్రాన్స్ లౌకికవాదం

ఫొటో సోర్స్, Kiran Ridley/Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘లైసిటి’ అన్న పదం గురించి ఇప్పుడు ఫ్రాన్స్‌లా తీవ్ర చర్చ జరుగుతోంది. లైసిటీ అంటే లౌకికవాదం.

ఇస్లాం మతం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రోన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కూడా ఈ అంశమే నేపథ్యం.

ఇస్లాం మతస్థులు ప్రవక్తగా భావించే మహమ్మద్‌ కార్టూన్లను స్కూల్‌లో ప్రదర్శించారన్న కారణంతో ఇటీవల ఫ్రాన్స్‌లో ఓ టీచర్‌ను ఓ ముస్లిం యువకుడు తలనరికి చంపాడు.

ఈ విషయంలో టీచర్‌ తీరును మాక్రోన్ బలంగా సమర్థించారు. ఆయన మృతికి నివాళులు అర్పించారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడేందుకు ఫ్రాన్స్ కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు.

ఇక ఇస్లాం మతం సంక్షోభంలో ఉందని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలే ఈ విషయాన్ని సూచిస్తున్నాయని మాక్రోన్ వ్యాఖ్యానించారు.

ఫ్రాన్స్ పాటించే విలువలకు తగ్గట్లుగా ఇస్లాంను మార్చే విషయం గురించి కూడా ఆయన మాట్లాడారు.

ఇస్లాం గురించి మాక్రోన్ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత చాలా ముస్లిం దేశాల నేతలు ఆయనపై విమర్శలకు దిగారు. ఫ్రాన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్లు కూడా కొన్ని ముస్లిం దేశాల్లో వస్తున్నాయి.

ఫ్రాన్స్‌లో టీచర్ హత్య అక్టోబర్ 16న జరిగింది. హంతకుడు 18 ఏళ్ల ముస్లిం యువకుడు.

ఈ హత్యకు వ్యతిరేకంగా, భావ ప్రకటన స్వచ్ఛకు మద్దతుగా ఫ్రాన్స్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. లౌకికవాదం గురించి చర్చలు కూడా జరిగాయి.

ఫ్రాన్స్ లౌకికవాదం

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫ్రాన్స్‌ ప్రభుత్వం అనుసరించే లౌకికవాదం ప్రకారం... అక్కడ ప్రభుత్వం ఏ మతాన్నీ ప్రోత్సహించదు. ఏ మతంపై వివక్ష కూడా చూపదు. అయితే, ప్రభుత్వ వ్యవహారాల్లో గానీ, పౌరుల హక్కుల విషయంలోగానీ మతం జోక్యం ఉండకూడదు.

ఫ్రెంచ్ విప్లవ సమయంలో ఈ లౌకిక భావజాలం మొదలైంది. దీన్ని పరిరక్షిచేందుకు 1905లో ఓ చట్టం చేశారు.

ఈ చట్టంలో మతం, ప్రభుత్వం వేర్వేరుగా ఉండాలని నిర్దేశించారు. వ్యవస్థీకృత మతాల ప్రభావం నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు స్వతంత్రంగా ఉండాలని సూచించారు.

యూరప్‌లోని ఇతర దేశాల తరహాలో ఇదివరకు ఫ్రాన్స్‌లోనూ పాలన వ్యవహారాల్లో రోమన్ క్యాథలిక్ చర్చి ఆధిపత్యం చాలా ఏళ్లపాటు కొనసాగింది.

20వ శతాబ్దంలో లౌకికవాదం విప్లవాత్మకమైన భావజాలంగా అవతరించింది.

దీన్నిజనాలకు చేరువ చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 'అబ్జర్వేటర్ డే లైసిటి' అనే సంస్థను నెలకొల్పింది.

ఫ్రాన్స్ లౌకికవాదం

ఫొటో సోర్స్, Kiran Ridley/Getty Images

పౌరులు తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించేందుకు ఫ్రాన్స్ లౌకికవాదం అనుమతిస్తుంది.

అయితే, ఇవి కూడా చట్టాల పరిధిలోనే జరగాలి. మతవిశ్వాసాల ఆధారంగా పౌరులపై వివక్ష ఉండదు. చట్టం ముందూ అందరూ సమానులే.

''దేవుడిని నమ్మేవారు, నమ్మనివారు ఎవరైనా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. తమకు ఇష్టమైన మతానికి మారొచ్చు. మతం లేకుండా ఉండొచ్చు. మతాచారాలను పాటించుకునే స్వేచ్ఛ, పాటించకుండా ఉండే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఏవైనా మతాచారాలను, గ్రంథాలను, ఇతర అంశాలను గౌరవించాలని ఎవరినీ బలవంతపెట్టకూడదు'' అని 'అబ్జర్వేటర్ డే లైసిటి' తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

లౌకికవాద భావజాలాన్ని ఫ్రాన్స్‌లో లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ నేతలందరూ స్వీకరించారు. ఇది ఫ్రాన్స్‌కు జాతీయ గుర్తింపులా మారింది.

2050కల్లా ఫ్రాన్స్‌లో వివిధ మతాలకు చెందినవారికన్నా లౌకికవాద భావజాలాన్ని నమ్మేవారే ఎక్కువ ఉంటారని ప్యూ రీసెర్చ్ ఇదివరకు అంచనా వేసింది.

లౌకికవాద విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ఓసారి అన్నారు.

లౌకికవాద భావజాలంతోనే 2004లో స్కూళ్లలో హిజాబ్ (బుర్ఖా) ధరించడాన్ని ఫ్రాన్స్ నిషేధించింది. ఆరేళ్ల తర్వాత బహిరంగ ప్రదేశాల్లో ముఖంపై ముసుగు ధరించడాన్ని నిషేధించింది.

ఇంతకన్నా తీవ్ర చర్యలు తీసుకోవాలని ఫ్రాన్స్‌లో డిమాండ్లు వస్తున్నాయి. త్వరలోనే అవి నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

'ఇస్లామిక్ ఛాందసవాదాన్ని' ఎదుర్కొనేందుకు ఫ్రాన్స్ లౌకికవాద విలువలను మరింత బలపరిచే చట్టం తెస్తామని అక్టోబర్ 2న మాక్రోన్ ప్రకటించారు.

ఈ సందర్భంగానే ఆయన ఇస్లామ్ సంక్షోభంలో ఉందని వ్యాఖ్యలు చేశారు.

ఫ్రాన్స్ లౌకికవాదం

ఫొటో సోర్స్, OZAN KOSE

లౌకికవాదాన్ని బలపర్చాలన్న డిమాండ్లు ఎందుకు?

ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల్లో ఇస్లామిక్ ఛాందసవాదం పెరుగుతోందని, లౌకికవాదాన్ని మరింత బలపరిచేందుకు ఫ్రాన్స్ ప్రయత్నాలు చేస్తుండటానికి ఇదే కారణమని ఫ్రాన్స్‌లో ఉంటున్న ఐటీ నిపుణుడు యూసుఫ్ అల్ అజీజ్ అభిప్రాయపడ్డారు.

''మాద్రిద్, లండన్‌ల్లో తీవ్రవాద దాడులు జరిగాయి. డచ్ సినీ దర్శకుడు తియో వైన్ గాంగ్ హత్య జరిగింది. మహమ్మద్ కార్టూన్ల విషయంలోనూ హింస చోటు చేసుకుంది. వీటన్నింటినీ ఫ్రాన్స్ లౌకికవాదంపై జరుగుతున్న దాడులుగా చూడొచ్చు. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్, బుర్ఖాలను నిషేధించారు. ఫ్రాన్స్‌లోని ముస్లింలు వీటిని తమ మతంపై ఆంక్షలుగా చూస్తున్నారు. దీంతో వ్యవహారం మరింత ముదురుతోంది'' అని ఆయన అన్నారు.

‘‘లౌకకవాదం పేరుతో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఫ్రాన్స్‌లోని ముస్లింలు భావిస్తున్నారు. ఫ్రాన్స్‌లో క్రైస్తవుల తర్వాత అధిక సంఖ్యాకులు ముస్లింలే. దేశ జనాభాలో మేం పది శాతం ఉన్నాం. దాదాపు మేమంతా మత విశ్వాసం ఉన్నవాళ్లమే. నేను ఉదారవాదిని (లిబరల్). కానీ, మతవిశ్వాసాలను కూడా పాటిస్తాను. దేశంలోని మిగతా 90 శాతం జనాభాలో మతాన్ని పాటించనవారే ఎక్కువ. దీంతో మతం గురించి ఏ చట్టం వచ్చినా, అది తమకు వ్యతిరేకమని ముస్లింలు భావిస్తుంటారు'' అని యూసుఫ్ అభిప్రాయపడ్డారు.

యూసుఫ్ ఫ్రాన్స్‌లో పుట్టారు. ఆయన పూర్వీకులు మాత్రం మొరాకోకు చెందినవారు. యూసుఫ్ తెల్ల జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

''ఫ్రాన్స్ ప్రధాన జనజీవన స్రవంతిలో నేను ఓ ముఖ్య భాగం. కానీ, నన్ను ఈ సమాజం ఓ అరబ్ వ్యక్తిలానే చూస్తుంది'' అని యూసుఫ్ అన్నారు.

ఫ్రాన్స్ లౌకికవాదం

ఫొటో సోర్స్, AHMAD GHARABLI

ఫ్రాన్స్ మోడల్ పనిచేయడం లేదా?

ఫ్రాన్స్‌లో ఇస్లామిక్ ఛాందసవాదంతోపాటు ఇస్లామోఫోబియా (ఇస్లాం వ్యతిరేక భావజాలం) కూడా పెరుగుతోందని అక్కడ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న మార్టిన్ జిబలెట్ అన్నారు.

ఇస్లామిక్ ఛాందసవాదాన్ని నిరోధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇస్లామోఫోబియాను అరికట్టేందుకు మాత్రం చట్టాలేవీ చేయడం లేదని ఆయన అన్నారు.

ఇటు లౌకికవాదుల్లోనూ ఛాంధసవాదులు ఉన్నారని ఫ్రాన్స్ మాజీ మంత్రి బునువా అపారూ వ్యాఖ్యానించారు. లైసిటీని లౌకిక నిరంకుశత్వం అని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

భిన్న జాతులు, సంస్కృతులు ఉన్న సమాజంలో సహనశీల విధానమే పనిచేస్తుందని బునువా అన్నారు.

అయితే, ఫ్రాన్స్ సంస్కృతి, సమాజంలో లౌకికవాదం వేళ్లూనుకుపోయి ఉంది. అందులో మార్పులు రావడం చాలా కష్టం. లైసిటీ ఫ్రాన్స్ మౌలిక సిద్ధాంతాల్లో ఒకటని దేశ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రోన్ అన్నారు.

ఇటు మరీన్ లే పెన్ నేతృత్వంలో దేశంలోని రైట్ వింగ్ పార్టీ నేషనల్ ఫ్రంట్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. ఈ పార్టీ తమను తాము లైసిటీ పరిరక్షకులుగా చూపించుకుంటోంది.

మరో ఏడాదిన్నరలో ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలు రానున్నాయి.

ఈ నేపథ్యంలో మాక్రోన్ ఇస్లాం గురించి చేసిన వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)