ఇస్లాం మీద మేక్రాన్ కామెంట్లపై అరబ్ దేశాల నిరసన - ఫ్రాన్స్ వస్తువుల నిషేధానికి పిలుపు

ఫొటో సోర్స్, AHMAD GHARABLI
మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను చూపించిన ఓ ఫ్రెంచ్ ఉపాధ్యాయుడి హత్య తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ చేసిన కామెంట్లు ఇస్లామిక్ దేశాలకు ఆగ్రహం తెప్పించాయి.
ఉపాధ్యాయుడి హత్యను ఇస్లామిక్ టెర్రరిస్టు దాడిగా మేక్రాన్ అభివర్ణించగా, ఈ ప్రకటనను ఇస్లామిక్ దేశాలు తప్పుబట్టాయి.
మేక్రాన్ ప్రకటనకు నిరసనగా ఫ్రాన్స్‌లో తయారైన వస్తువులను బహిష్కరించాని పలు ముస్లిం దేశాలు పిలుపు నిచ్చాయి. ఇప్పటికే కువైట్, జోర్డాన్, ఖతార్‌లలోని కొన్ని షాపుల నుంచి ఫ్రెంచ్ దేశానికి చెందిన వస్తువులను తొలగించారు.
లిబియా, సిరియా, గాజా ప్రాంతాలలో ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.
అయితే ముస్లింలలోని ఒక ‘అతివాద’ వర్గం వస్తు నిషేధంపై అనవసరమైన ప్రకటనలు చేస్తోందని ఫ్రాన్స్ విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.
మహమ్మద్ ప్రవక్త వివాదాస్పద కార్టూన్‌ల ప్రదర్శనను మేక్రాన్ సమర్ధించారు. ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతింటాయని భావ ప్రకటనా స్వేచ్ఛను వదులుకోలేమని మేక్రాన్ అన్నారు.
భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ఫ్రాన్స్ సమగ్రతను దెబ్బతీయడమేనని మేక్రాన్ వ్యాఖ్యానించారు.
అక్టోబర్ మొదటి వారంలో మహమ్మద్ ప్రవక్త వివాదాస్పద కార్టూన్లను విద్యార్ధులకు చూపిస్తున్నారన్న ఆరోపణపై ఆగ్రహించిన ఓ ముస్లిం యువకుడు ఒక ఫ్రెంచ్ టీచర్‌ను హత్య చేశాడు.
దీనిపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని అడ్డుకోడానికి కఠినమైన చట్టాన్ని ప్రకటించారు.
“ ఫ్రాన్స్‌లోని 60 లక్షలమంది ముస్లింలు ప్రధాన జీవన స్రవంతి నుంచి దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అసలు ఇస్లాం మతమే సంక్షోభంలో ఉంది’’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మేక్రాన్ చేసిన కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన మత విశ్వాసాలను గుర్తించడం లేదని, ఫ్రాన్స్‌లో లక్షలమంది ముస్లింల స్వేచ్ఛను హరిస్తున్నారని టర్కీ, పాకిస్తాన్ దేశాలు ఆరోపించాయి.
“మేక్రాన్‌కు బ్రెయిన్ వాష్ చేయాల్సిన అవసరం ఉంది’’ అని టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్దోవాన్ వ్యాఖ్యానించారు. అయితే ఎర్దొవాన్ చేసిన వ్యాఖ్యలపై ఫ్రాన్స్ తమ దేశంలో టర్కీ రాయబార కార్యాలయాన్ని వివరణ కోరింది.

ఫొటో సోర్స్, Reuters
ఫ్రాన్స్ వస్తువులను బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?
ఆదివారం జోర్డాన్, ఖతార్, కువైట్‌లలోని కొన్ని సూపర్ మార్కెట్ల నుంచి ఫ్రెంచ్ వస్తువులను తొలగించారు. ఫ్రాన్స్‌లో తయారైన హెయిర్ అండ్ బ్యూటీ ప్రోడక్టులు ఇక్కడి షాపుల నుంచి మాయమయ్యాయి.
కువైట్‌లోని ఒక పెద్ద రిటైల్ యూనియన్ ఫ్రెంచ్ వస్తువులను బహిష్కరణకు పిలుపునిచ్చింది.
మహమ్మద్ ప్రవక్తను పదే పదే అవమానించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, అందుకే ఈ పిలుపునిచ్చామని ఆ దేశంలోని వినియోగదారుల సహకార సంఘం ఒకటి వెల్లడించింది.
అయితే ఈ వస్తు బహిష్కరణ పిలుపుల వెనక ఒక ఇస్లామిక్ అతివాద సంస్థ ఉందని, ఇలాంటి ప్రకటనలను వెంటనే ఆపాలని ఫ్రెంచ్ విదేశాంగశాఖ ఒక ప్రకటనలో కోరింది.
సౌదీ అరేబియాలో అనేకమంది సోషల్ మీడియా యూజర్లు ఫ్రెంచ్ వస్తువుల బహిష్కరణకు పిలుపునిస్తున్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన ఒక సూపర్ మార్కెట్ చైన్ ‘క్యారీఫోర్’ను బహిష్కరించాలని పిలుపునిస్తూ సాగుతున్న ప్రచారం సోషల్ మీడియా ట్రెండింగ్‌లో రెండోస్థానంలో ఉంది.
ఇటు లిబియా, గాజా, నార్త్ సిరియా ప్రాంతాలలో ఫ్రాన్స్ వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలపై టర్కీ మద్దతున్న మిలిషియా సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

ఫొటో సోర్స్, OZAN KOSE
పాకిస్తాన్ ఏమంటోంది?
ఇస్లాంతో, ముస్లింలతో మేక్రాన్‌కున్న ఇబ్బంది ఏమిటని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు. “స్పష్టమైన అవగాహన లేకుండా మేక్రాన్ ఇస్లాంపై దాడి చేస్తున్నారు’’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
యూరప్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్లమంది ముస్లింల మనోభావాలపై మేక్రాన్ దాడి చేశారని ఇమ్రాన్‌ఖాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇస్లామోఫోబియాకు సంబంధించిన కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాని కోరుతూ ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కు ఇమ్రాన్ ఖాన్ ఒక లేఖ రాశారు.
“ఇస్లామోఫోబియాను ప్రకటించడం ద్వారా ఫేస్‌బుక్‌లో కొందరు అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్వేషాన్ని, ఉగ్రవాదాన్ని, హింసను వ్యాప్తి చేస్తుంది’’ అని ఇమ్రాన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
మేక్రాన్ చర్యలు ప్రపంచంలో వేర్పాటువాదాన్ని, హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇలాంటి సున్నితమైన వ్యవహారాలలో మేక్రాన్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఆదివారంనాడు పలు ట్వీట్లలో ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలు చేశారు.
"హింసకు పాల్పడిన ఉగ్రవాదులను కాకుండా, ముస్లింలను విమర్శించడం ద్వారా తెల్లజాతి అహంకారాన్ని, నాజీ తత్వాన్ని మేక్రాన్ ప్రదర్శించారు. ఇస్లామోఫోబియాను ప్రోత్సహించాలని ఆయన నిర్ణయచుకోవడం దురదృష్టకరం" అని ఇమ్రాన్ అన్నారు.
అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కూడా దీనిపై ట్వీట్ చేశారు.“ మేం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయం. అందరి మనోభావాలను మేం గౌరవిస్తాం. ద్వేషపూరిత ప్రసంగాలను ఏ విధంగానూ అంగీకరించం. మానవీయ విలువలను కాపాడానికి మేం నిబద్ధులమై ఉన్నాం’’ అని ఆయన తన ట్వీట్లలో వ్యాఖ్యానించారు.
అయితే ఈ ట్వీట్ల ద్వారా ఆయన నష్టనివారణ చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. ఆయన తన ట్వీట్లను ఇంగ్లీషు, అరబిక్ భాషల్లో కూడా చేశారు.
అంతకు ముందు ఆయన ఫ్రెంచ్ భాషలో కూడా ట్వీట్ చేశారు. “దౌర్జన్యానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మాకుంది. మేం దాన్ని కొనసాగిస్తాం’’ అని ఆయన అందులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నేను ఇస్లాం మతాన్ని వదిలేశా.. నా కుటుంబమే నన్ను చంపాలనుకుంటోంది’
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- అజర్బైజాన్ - అర్మేనియా యుద్ధంలో టర్కీ డ్రోన్ సూపర్ పవర్‌గా ఎలా మారింది?
- ఆంధ్రప్రదేశ్: ఆ జ్యోతిష్కుల గ్రామంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి?
- కరోనా వైరస్: ఇండియాలో వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ వృద్ధులకు పని చేయదా? వారికి ఎదురయ్యే సమస్యలేంటి?
- బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ పేరుతో శరీరాల్లో చిప్స్ అమర్చడానికి కుట్ర చేస్తున్నారా
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- డోనల్డ్ ట్రంప్ ఓడిపోతే పశ్చిమాసియాపై ప్రభావం ఎలా ఉంటుంది?
- ‘పోర్న్ వీడియోలు చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానం చేస్తూ ఆ ఆలోచనల నుంచి బయటపడ్డా
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








