కరోనావైరస్ వ్యాక్సీన్ వృద్ధులకు పని చేయదా? వారికి ఎదురయ్యే సమస్యలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విలియం పార్క్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్-19 వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కానీ వృద్ధులలో రోగ నిరోధక శక్తి వ్యవహారం ఈ వ్యాక్సీన్‌ను ఎలా ఇవ్వాలన్న ప్రణాళికలకు అడ్డుగా నిలుస్తోంది.
ఇప్పటికే మన చేతికి కోవిడ్-19 వ్యాక్సీన్ వచ్చేసినట్లు ఊహించుకుని దానికి ఎలా సరఫరా చేయాలి, ప్రాధాన్య క్రమం ఏంటన్న దానిపై ప్రపంచ దేశాల నేతలు ఒక అవగాహనకు రావాల్సి ఉంది. ముందుగా అత్యంత రిస్క్‌లో ఉండే నర్సులు, డాక్టర్లు, ఇతర హెల్త్ కేర్ వర్కర్లకు ఈ వ్యాక్సీన్‌ను అందించాల్సి ఉందన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.
అసలు విషయం ఏంటంటే..వయసు మళ్లిన వారు, వయోవృద్ధులలో ఈ టీకా ఎంత వరకు పని చేస్తుందన్నది పెద్ద పజిల్‌గా మారింది.
“వృద్ధుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాక్సీన్లు కొన్ని ఉన్నాయి. అయితే గత శతాబ్దంలో మాదిరి కాకుండా ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలకు వచ్చే వ్యాధులను దృష్టిలో పెట్టుకునే ఎక్కువ వ్యాక్సీన్‌లు తయారవుతున్నాయి’’ అన్నారు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ గెల్ఫ్‌లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న షయాన్ షరీఫ్.
70 ఏళ్ల పైబడ్డ వృద్ధులలో కనిపించే షింగెల్స్ వ్యాధికి రూపొందించిన వ్యాక్సీన్ ఒక్కటే దీనికి మినహాయింపు. దాని తర్వాత మధ్య వయసు వారిలో కనిపించే మెనింజైటిస్‌లాంటి వ్యాధులకు ఒకట్రెండు వ్యాక్సీన్లు తయారయ్యాయి. మిగతా వాటిలో చాలా వ్యాక్సీన్లు పిల్లల వ్యాధుల కోసం తయారు చేసినవే.
“చిన్న పిల్లలకు ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అన్నదానిపై మన దగ్గర బోలెడంత సమాచారం ఉంది. కానీ యువకులు, మధ్య వయస్కులు, పెద్దవాళ్లకు వచ్చే వ్యాధులకు వ్యాక్సీన్ తయారు చేయడం చాలా కష్టం’’ అన్నారు ప్రొఫెసర్ షరీఫ్.

ఫొటో సోర్స్, Getty Images
పెద్దవాళ్లకు వ్యాక్సీన్ కనిపెట్టడం కష్టమా?
పెద్ద వాళ్లకు వ్యాక్సిన్ తయారు చేయడం ఎందుకు కష్టమో తెలుసుకోవాలంటే ముందు వారిలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్(రోగ నిరోధక శక్తి) గురించి తెలుసుకోవాలి. చాలా వ్యాధులు యువకులకంటే పెద్దవారిపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి.
పెద్దవాళ్లలో అప్పటికే ఉన్న కొన్నివ్యాధుల కారణంగా కొత్తగా వచ్చేవ్యాధులు వారి రోగ నిరోధక శక్తి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. దీనినే రోగ నిరోధక వ్యవస్థ అశక్తత (Immunosenescence) అంటారు. ఈ పరిస్థితినే మరో మాటలో చెప్పాలంటే వయసు మళ్లిన వ్యాధి నిరోధక వ్యవస్థ అని కూడా అనొచ్చు.
శరీరంలో అన్ని వ్యవస్థలు, అవయవాల మాదిరిగానే రోగ నిరోధక వ్యవస్థ కూడా వృద్ధాప్యంలోకి మళ్లుతుంది. కొన్ని రోగ నిరోధక కణాలు పని చేయడం మానేస్తాయి. ఈ కణాలన్నీ ఒకదానికికొకటి సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి, ఎక్కడో కొన్ని కణాలు మొరాయిస్తే మిగతా వ్యవస్థ మొత్తం మీద దాని ప్రభావం పడుతుంది.
మనిషి శరీరంలోకి వ్యాధి కారక క్రిమి ప్రవేశించగానే, రోగ నిరోధక వ్యవస్థలోని తొలి విభాగం దానిపై దాడి చేయడం మొదలు పెడుతుంది. ముక్కు, ఊపిరితిత్తులులాంటి వాటికి వచ్చే శ్వాస సంబంధ వ్యాధుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తెల్ల రక్త కణాలు వ్యాధికారక క్రిములపై దాడి చేసి చంపేస్తాయి.
శరీరంలోని కీలకమైన వ్యాధి నిరోధక కణాలు వ్యాధికారక క్రిములను ముక్కలు ముక్కలుగా చేస్తాయి. వీటిని మరో రకం వ్యాధి నిరోధక కణాలకు అందిస్తాయి. వీటినే టి-సెల్స్ అంటారు. ఈ కణాలు రోగ నిరోధక వ్యవస్థకు మెమరీలాగా పని చేస్తాయి. అయితే ఈ టి-సెల్స్ నేరుగా వ్యాధికారక క్రిములను గుర్తించలేవు. యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అనే కణాల సహాయంతో ఇవి వ్యాధికారక క్రిములను గుర్తిస్తాయి. ఆ తర్వాత ఇవి రోగ నిరోధక వ్యవస్థలోని తదుపరి దశను యాక్టివేట్ చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
వయసు మళ్లిన రోగ నిరోధక వ్యవస్థకు ఏమవుతుంది?
ఇక ఈ టి-సెల్స్‌లో అనేక రకాలుంటాయి. కిల్లర్ టి-సెల్స్ లేదా సైటోటాక్సిన్ అనే సెల్స్ మన శరీరంలో ఉన్న కణాలపై దాడి చేసి వాటిపై ఉన్న వ్యాధికారక క్రిములను తరిమికొడతాయి. వాటి వ్యాప్తిని కట్టడి చేస్తాయి. ఇక బి-సెల్స్ అనే రోగ నిరోధక వ్యవస్థలోని కణాలకు హెల్పర్ టి-సెల్స్ అనే కణాలు సహాయం చేస్తాయి.
శరీరంలో ప్రవేశించిన రోగ కణాలను బి-సెల్స్ వెంటనే గుర్తిస్తాయి. కానీ దాడి చేయడానికి వాటికి టి-సెల్స్ సహాయం అవసరం. బి-సెల్స్ ప్రధానంగా యాంటీబాడీలను వృద్ధి చేస్తాయి. భారీ ఎత్తున యాంటీబాడీస్‌ను తయారు చేయగలిగినా వాటికి టి-సెల్స్ సహకారం తప్పని సరి.
రోగ కారక కణాలను అడ్డుకునే వ్యాధి నిరోధకాలకు ఉద్దీపింపజేయడం వ్యాక్సినేషన్‌లో జరిగే ప్రధానమైన ప్రక్రియ.కోవిడ్ -19 సోకిందో లేదో తెలుసుకునేందుకు యాంటీబాడీ టెస్టులు ఉపయోగిస్తున్నారన్న అంశంపై ఇటీవల విస్తృతంగా చర్చ జరిగింది. అయితే, యాంటీబాడీ టెస్టులతో అన్ని సందర్భాలలో కోవిడ్‌ను గుర్తించడం కష్టం. కొన్ని యాంటీబాడీస్ మనుగడ శరీరంలో చాలా కొద్దికాలమే ఉంటుంది.
వయసు మళ్లిన వారి శరీరంలో ఇలాంటి వ్యవస్థలన్నింటి మధ్య ఉండే సున్నితమైన సమన్వయం లేకుండా పోతుండటం వ్యాక్సినాలజిస్టులకు ఇబ్బందిగా మారుతోంది. అసలు వృద్ధుల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థలో ఏం జరుగుతుంది?
పెద్ద వయసు వచ్చాక రోగ నిరోధక వ్యవస్థలోని అనేక చర్యలు ఆగిపోతాయని, కొన్ని తమంత తాముగా పని చేసే స్థితిలో కూడా ఉండవని యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్‌బ్రక్‌లో ఇమ్యూనాలజీ అండ్ వ్యాక్సినాలజీ విభాగంలో అధ్యయనం చేస్తున్న బిర్గిట్ వీన్‌బెర్గర్ అన్నారు.
వృద్ధులలో యాంటీజెన్‌లు పని చేయడం మానేస్తే టి-సెల్స్ తగ్గిపోతాయి. దాని వల్ల బి-సెల్స్ కు అందాల్సిన సహాయం అందదు. ఫలితంగా యాంటీబాడీల ప్రతిక్రియ మొదలుకాదని వీన్‌బెర్గర్ వివరించారు. “ రోగ నిరోధక వ్యవస్థలోని అన్ని విభాగాలు కలిసి పని చేయడం చాలా ముఖ్యం’’ అన్నారు వీన్‌బెర్గర్.
ఒక మనిషి శరీరంలో టి-సెల్స్, బి-సెల్స్ పెద్ద సంఖ్యలో ఉంటాయని, అయితే కాలక్రమంలో అవి తగ్గుతూ వస్తుంటాయని షరీఫ్ తెలిపారు. . వ్యాధికారక క్రిములు దాడి చేసినప్పుడు వాటి ప్రతిక్రియ తక్కువగా ఉంటుందని ఆయన వివరించారు.
వ్యాధి నిరోధక వ్యవస్థ నిర్వీర్యం కావడం అందరిలో ఒకే రకంగా ఉండదు. కొందరు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మరికొందరికి పుట్టుకతోనే మంచి శారీరక దృఢత్వం ఉంటుంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ సామర్ధ్యం కూడా పెరుగుతుందట.
“కొన్ని కణాలు వయసు పెరుగుతున్న కొద్దీ మరింత బలంగా తయారవుతాయి. మనం ఎన్ని ఎక్కువ వ్యాధికారక క్రిముల బారిన పడితే శరీరంలో రోగ నిరోధక కణాలు అంత సమర్ధతను పొందగలుగుతాయి ’’ అన్నారు ప్రొఫెసర్ షరీఫ్. ‘’ఇప్పుడు సోకిన SARS-CoV-2 వైరస్‌ను మనుషులు ఇంతకు ముందెప్పుడూ ఎదుర్కోలేదు. అదే ఇప్పుడు పెద్ద సమస్య’’ అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి వ్యాక్సీన్‌లు ఏం చేస్తాయి?
వ్యాక్సీన్‌ను క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగించేటప్పుడు మొదటి దశలో దాని నుంచి భద్రత ఎంత అన్నది పరిశీలిస్తారు. ముందు కొద్దిమంది మీద ప్రయోగించి చూస్తారు. రెండో దశలో దాని సమర్ధత ఎంత అన్నది గమనిస్తారు. అనుకున్న స్థాయిలో ప్రతిక్రియ మొదలుపెట్టిందా లేదా అని చూస్తారు. ఇక మూడోదశలో వ్యాక్సీన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందన్నది అంచనా వేస్తారు. అంతా సవ్యంగా ఉందనిపిస్తే ఆ వ్యాక్సీన్ విడుదలకు అనుమతులు వస్తాయి.
వ్యాక్సీన్‌ల పని తీరులో తేడాలంటాయి. ఒక వర్గం, ప్రాంతం ప్రజల మీద అది సమర్ధవంతంగా పని చేయవచ్చు. మరికొందరి మీద పని చేయకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అనేక ప్రాంతాలలో కోవిడ్-19 వ్యాక్సీన్ తయారీ కోసం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. చాలా వ్యాక్సీన్‌లు అభివృద్ధి దశను దాటి అనుమతి వరకు వచ్చాయి.
రాబోయే రోజుల్లో అనేక వ్యాక్సీన్‌లు అందుబాటులోకి రావడం వల్ల వాటిలో ఏది మనకు పని చేస్తుందో గుర్తించి వాడుకోగలిగే అవకాశం ఉండటం మంచి పరిణామం అంటున్నారు వ్యాక్సినాలజీ నిపుణులు షరీఫ్, వీన్‌బెర్గర్‌లు. వీటిలో కొన్ని వృద్ధుల మీద పని చేయవచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు.
“నూటికి నూరుశాతం సమర్ధవంతంగా పని చేసే వ్యాక్సీన్ ఎక్కడా ఉండదు’’ అని స్పష్టం చేశారు షరీఫ్.
ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు తయారువుతున్న వ్యాక్సీన్‌లన్నీ వైరస్ నుంచి రక్షణ కలిగించవచ్చు. కానీ మన శరీరం నుంచి వైరస్‌ను పారదోలతాయని చెప్పలేం. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిలోని వ్యాధికారక వైరస్‌లు జీవించే ఉండొచ్చు. అవి అతని నుంచి మరొకరికి వ్యాప్తి చెందడానికి అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు వ్యాక్సీన్ వచ్చిన తర్వాత దానిని మొదట ఎవరికి ఇవ్వాలన్నది పెద్ద ప్రశ్న. అయితే బాధితులుగా మారే అవకాశం ఎక్కువగా ఉన్న వైద్య సిబ్బందికి దీనికి ఇవ్వడం మంచిదనే వాదన వినిపిస్తోది. ముందు పేషెంట్లకు కాకుండా డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి వ్యాక్సీన్ ఇవ్వాలంటున్నారు చాలామంది. అయితే వీరు వైరస్ నుంచి రక్షణ పొందినా, తమలో జీవించే ఉన్న వైరస్‌ను ఇతరలకు చేరడానికి కారకులవుతారు.
“వ్యాక్సీన్ కొంత వరకే వైరస్‌ను అడ్డుకుంటుంది. అది పూర్తిగా వ్యాప్తిని ఆపుతుందని చెప్పడానికి లేదు. దీనికి ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సీన్‌లే పెద్ద ఉదాహరణ’’ అన్నారు షరీఫ్.
వ్యాక్సీన్ ముందుగా ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యలెన్నో ఎదురవుతాయని అన్నారు వీన్‌బెర్గర్. మరణాలు ఎక్కువగా ఉన్న సమాజానికి ముందుగా ఇవ్వాలనడం సబబని, మిగిలినవారు కొన్నాళ్లపాటు ఆ వైరస్‌ను భరించాలని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, Science Photo Library
వైరస్‌ను వ్యాప్తి చేయడంలో వయసు పాత్ర ఏంటన్నది పెద్ద మిస్టరీ. “మొదట్లో పిల్లలకు అసలు వైరస్ సోకదు అనుకున్నారు. కానీ అది పూర్తిగా నిజంకాదని తేలింది. యూరప్‌లోని అనేక స్కూళ్లలో జరిపిన పరీక్షల్లో విద్యార్ధులకు వైరస్ ఉన్నట్లు బైటపడింది. మరి వాళ్లు తమను స్కూలు నుంచి ఇంటికి తీసుకెళ్లే తాతయ్య, నాయనమ్మలకు ఈ వైరస్‌ను అంటించరా?’’ అని ప్రశ్నించారు వీన్‌బెర్గర్.
వ్యాక్సీన్ ఎవరికి ముందు ఇవ్వాలి అన్న విషయంలో వైరస్ వ్యాప్తిపై అవగాహన చాలా ముఖ్యం అంటున్నారు వీన్‌బెర్గర్. “ వ్యాక్సీన్ తయారీలో అందరం పోటీపడుతున్నాం. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అన్నారామె.
“వృద్ధులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వరకు వెళ్లే అవసరం లేని, ఆసుపత్రిలో గడిపే సమయాన్ని వారాల నుంచి రోజులకు తగ్గించే వ్యాక్సీన్‌పై ఆశలు పెట్టుకున్నాం’’ అని తెలిపారు ప్రొఫెసర్ షరీఫ్.
కోవిడ్ కోసం ఇప్పటికే వందల కొద్ది డ్రగ్స్‌ను పరిశీలించారు. అందులో డెక్సామీథేసోన్ ఒక్కటే ఇప్పటి వరకు ప్రభావవంతంగా కనిపించింది. రోగులలో ఆక్సిజన్ లోపాన్ని తగ్గించే ఈ డ్రగ్‌ను వాడేందుకు జపాన్, యూకేలు అనుమతించాయి. ఇటీవల వైరస్ బారినపడ్డ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ డ్రగ్‌ను తీసుకున్నారు.
అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి ప్రస్తుతం ఐదు రకాల డ్రగ్స్‌ను వాడుతున్నారు. అందులో డెక్సామీథేసోన్ ఒకటి. వ్యాక్సీన్ వచ్చేలోగా ఈ ప్రత్యామ్నాయ ఔషధాల పరిశీలన కారణంగా వృద్ధులు కొంత వరకు ప్రయోజనం పొందవచ్చు. వ్యాక్సిన్ రావడానికి మరికొంతకాలం పడుతుంది కాబట్టి..ఈలోగా కొంత వరకు ఆశావహంగా ఉండటానికి ఈ ఔషధాలు అవకాశం కలిగిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ ఇంతలా పెరగడానికి ఎవరు కారణం.. గబ్బిలాలా? మనుషులా?
- కరోనావైరస్ వ్యాక్సీన్: వందేళ్ల నాటి ఈ టీకా మందు కోవిడ్-19 నుంచి కాపాడుతుందా?
- కరోనావైరస్: కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లపై '28 రోజుల వరకూ బతుకుతుంది'
- దళితులపై దాడులు: ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు? లోపం చట్టాలదా? వ్యక్తులదా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ పేరుతో శరీరాల్లో చిప్స్ అమర్చడానికి కుట్ర చేస్తున్నారా
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








