అజర్‌బైజాన్ - అర్మేనియా యుద్ధంలో టర్కీ డ్రోన్ సూపర్ పవర్‌గా ఎలా మారింది?

ఎర్డోగన్

ఫొటో సోర్స్, SEAN GALLUP

నగార్నో-కరాబక్‌లో అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉపయోగించిన టర్కీ డ్రోన్ యుద్ధ విమానాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. టర్కీ నుంచి డ్రోన్ విమానాలను కొనుగోలు చెయ్యడం వల్ల ఈ యుద్ధంలో అజర్‌బైజాన్ లాభపడిందని విశ్లేషకులు అంటున్నారు.

నగార్నో-కరాబక్‌ యుద్ధానికి ముందే, డ్రోన్ యుద్ధ విమానాల తయారీ కారణంగా అంతర్జాతీయ రక్షణ పరిశ్రమలో టర్కీ అగ్రస్థానానికి చేరుకుందని విశ్లేషకులు అంటున్నారు. ఇజ్రాయల్, అమెరికాలతో సంబంధాలు పెట్టుకోకుండా టర్కీ సొంతంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలను తయారుచేస్తోంది.

"టర్కీ అనేక రకాల డ్రోన్ విమానాలను తయారుచేస్తోంది" అని అమెరికా మానవరహిత వైమానిక రంగ నిపుణుడు డేనియల్ గెటింగర్ బీబీసీ టర్కీకి తెలిపారు.

టర్కీ 1940లోనే సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌లో విమాన తయారీదారుగా స్థానం పొందినప్పటికీ చాలాకాలం వరకూ ఆ దిశలో ముందంజ వెయ్యలేకపోయింది. ప్రస్తుతం డ్రోన్ విమానాలను తయారుచెయ్యడం ద్వారా తన స్థానాన్ని బలపరుచుకుంటోందని హెబర్‌తుర్క్ జర్నలిస్ట్, ఏవియేషన్ నిపుణుడు గుంతె సిమ్సెక్ తెలిపారు.

మానవరహిత విమానాలు (యూఏవీ) తయారుచెయ్యడంలో ఇజ్రాయెల్, అమెరికా ముందజలో ఉన్నాయని, 1970-80లలోనే ఈ రెండు దేశాలూ డ్రోన్ విమానాలను తయారుచెయ్యడం మొదలుపెట్టాయని మిషెల్ ఏరోస్పేస్ రిసెర్చ్‌కు చెందిన డేనియల్ గెటింగర్ తెలిపారు.

ఈ రంగంలో టర్కీ కొత్తగా అడుగుపెట్టి ముందుకు దూసుకుపోతోంది. చైన్, ఫ్రాన్స్ కూడా భారీగా డ్రోన్ విమానాలను తయారుచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 95 దేశాలు డ్రోన్ విమానాలను తయారుచేసే ప్రయత్నాలు చేస్తున్నాయని, కనీసం 60 దేశాలు 267 రకాల డ్రోన్ సైనిక విమానాలను ఉపయోగిస్తున్నాయని గెటింగర్ తెలిపారు.

టర్కీ డ్రోన్

ఫొటో సోర్స్, Getty Images

డ్రోన్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న చైనా

డ్రోన్ డిజైన్, సాఫ్ట్‌వేర్‌ పరంగా టర్కీ ప్రపంచంలో మొదటి ఐదు స్థానాల్లో ఉందని గుంతె సిమ్సెక్ తెలిపారు.

బ్రిటిష్ ప్రభుత్వేతర సంస్థ 'డ్రోన్ వార్స్' రిపోర్ట్ ప్రకారం.. డ్రోన్ ఉత్పత్తి రంగంలో ముందడుగేస్తున్న కొత్త తరం దేశాల్లో టర్కీ ఒకటి. దీనితోపాటుగా చైనా, ఇరాన్, పాకిస్తాన్ కూడా ముందంజలో ఉన్నాయి.

స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం గత సంవత్సరం చైనా డ్రోన్ ఎగుమతులు 1430 శాతం పెరిగాయి. డ్రోన్ ఎగుమతులలో చైనా అగ్రస్థానంలో ఉంది.

వైమానిక, రక్షణ రంగాల్లో పరిశోధనలు చేసే 'టీల్ గ్రూప్' నివేదిక ప్రకారం 2019లో డ్రోన్ వ్యాపారం 7.3 బిలియన్ డాలర్లకు (సుమారు 54 వేల కోట్లు) పెరిగింది. రాబోయే పదేళ్లల్లో ఈ సంఖ్య 98.9 బిలియన్ డాలర్లకు (సుమారు 73 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా.

వీడియో క్యాప్షన్, అర్మేనియా- అజ‌ర్‌బైజాన్ యుద్ధం ఎందుకు జరుగుతోంది?

టర్కీలో డ్రోన్ల తయారీ

వేర్పాటువాద సంస్థ పీకేకేకు వ్యతిరేకంగా టర్కీ మిలటరీ డ్రోన్ విమానాలను పెద్ద ఎత్తున ఉపయోగించడం మొదలుపెట్టింది. అందుకోసమే టర్కీలో డ్రోన్ విమానాల ఉత్పత్తి భారీగా పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు.

కుర్దులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పోరాడుతున్న పీకేకేను, టర్కీ ఉగ్రవాద సంస్థగా భావిస్తోంది.

2000 సంవత్సరం నుంచీ టర్కీ, ఇజ్రాయెల్‌ నుంచీ డ్రోన్ విమానాలను కొనుగోలు చేస్తోంది. అయితే, హెరోన్ రకం యూఏవీలతో అనేక సమస్యలు ఎదుర్కొంది. కొన్నిసార్లు అవి కూలిపోవడమో, సాంకేతిక కారణాల వల్ల ఎగరలేకపోవడమో జరిగేది. ఈ కారణంగా కొన్ని హెరోన్ డ్రోన్ విమానాలను ఇజ్రాయెల్‌కు తిరిగి పంపించేయాల్సి వచ్చింది.

మరోవైపు టర్కీకి ప్రిడేటర్, రీపర్ డ్రోన్ల అమ్మకాన్ని అమెరికా నిషేధించింది.

ఈ పరిస్థితుల్లో టర్కీకి సొంతంగా డ్రోన్ విమానాలను తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టర్కీకి చెందిన బయ్‌కర్ కంపెనీ తయారుచేసే 'బయ్‌రక్తార్ టీబీ2' ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన డ్రోన్ విమానాల్లో ఒకటి. ఇది క్షిపణులను మోసుకెళ్లగలిగే అతి చిన్న డ్రోన్ విమానం. దీనిని గగనతల పర్యవేక్షణ, గూఢచర్యం కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇది కచ్చితమైన లక్ష్యాలను గురిపెట్టగలుగుతుంది.

చైనా డ్రోన్

ఫొటో సోర్స్, Getty Images

ఏ యే దేశాల దగ్గర టర్కీ డ్రోన్ విమానాలున్నాయి?

అజర్‌బైజాన్ ఈ ఏడాది టర్కీ నుంచి డ్రోన్ విమానాలను కొనుగోలు చేసినట్లు రెండు దేశాల మీడియాల్లోనూ వార్తలు వచ్చాయి. ఇంకా సెర్బియా, ఖతార్, ట్యూనీషియా, లిబియాలు కూడా టర్కీ నుంచి డ్రోన్ విమానాలను కొనుగోలు చేశాయి.

నగార్నో-కరాబక్ యుద్ధంలో బయ్‌రక్తార్ టీబీ2 విమానాలను విజయవంతంగా ఉపయోగించడంతో వాటికి డిమాండ్ పెరిగింది. "ఈ డ్రోన్‌లకు మార్కెట్ బాగా పెరిగింది" అని గుంతె సిమ్సక్ తెలిపారు.

అజర్‌బైజాన్ దేశాధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ ఫ్రాన్స్24 వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. టర్కీ నుంచి డ్రోన్ విమానాల కొనుగోలు విషయమై అడిగిన ప్రశ్నలకు జవాబివ్వడానికి నిరాకరించారు. "మాకు కావలసినన్ని విమానాలు మావద్ద ఉన్నాయి" అని ఆయన తెలిపారు.

యుద్ధంలో డ్రోన్ విమానాల ప్రభావం గురించి మాట్లాడుతూ "కచ్చితంగా ఇవి కొత్తతరానికి చెందిన ఉన్నతమైన ఆయుధాలు" అని వ్యాఖ్యానించారు.

"టర్కీ యుద్ధ విమానాలను ఉపయోగించి అర్మేనియాకు చెందిన 7 వేల కోట్ల సైనిక పరికరాలను నాశనం చెయ్యగలిగాం" అని ఆయన తెలిపారు.

సిరియా మీద జరిపిన స్ప్రింగ్ షీల్డ్ ఆపరేషన్‌లో కూడా టర్కీ డ్రోన్ విమానాలను ఉపయోగించింది.

డ్రోన్ కంట్రోల్ సెంటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రోన్ కంట్రోల్ సెంటర్

టర్కిష్ డ్రోన్ విమానాలను ఉపయోగించి లిబియా ప్రభుత్వం.. తిరుగుబాటుదారుడు ఖలీఫా హఫ్తార్ బలగాలను కట్టడి చెయ్యగలిగింది.

2019 సంవత్సరంలో టర్కీ 20 వేల కోట్ల రూపాయల విలువగల డ్రోన్ విమానాలను విక్రయించింది. ఈ ఏడాది టర్కీ డ్రోన్ అమ్మకాలు 34% పెరిగాయి. 2023 నాటికి టర్కీ డ్రోన్ వ్యాపారం 73 వేల కోట్ల రూపాయలకు పెరుగుతుందని నిపుణుల అంచనా.

స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2014-18 మధ్య టర్కీ డ్రోన్ అమ్మకాలు 170% పెరగగా, 2015-19 మధ్య ఆయుధ దిగుమతులు 48% తగ్గాయి.

టర్కీ, ఆయుధాల అమ్మకంతో పాటు, ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని భావిస్తోందని డేనియల్ గెటింగర్ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా డ్రోన్ ఉత్పత్తుల్లో ఇతర దేశాలకు సహకరిస్తోందని గెటింగర్ తెలిపారు.

పూర్తిగా స్థానికంగా తయారుకావడమే టర్కీ డ్రోన్‌ల ప్రత్యేకత. తాము తయారుచేసే విమానాలు పూర్తిగా స్థానిక, దేశీయ ఉత్పత్తుల మీద ఆధారపడి ఉన్నాయని బయ్‌కర్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

డ్రోన్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. టర్కీ.. సెన్సర్, టార్గెట్ పరికరాలను జర్మనీ, కెనడాల నుంచి దిగుమతి చేసుకుంటోందని గెటింగర్ తెలిపారు.

డ్రోన్ తయారీలో ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడి ఉండడం టర్కీకు లాభదాయకం కాదని విశ్లేషకులు అంటున్నారు.

2019లో బ్రిటిష్ వార్తాపత్రిక 'ది గార్డియన్‌'లో వచ్చిన ఒక కథనంలో.. బయ్‌రక్తార్ టీబీ2 హార్నెట్ రకంలో బ్రిటిష్ కంపెనీ ఈడీఓ ఎంబీఎం తయారుచేసే మిసైల్ లాంచర్లను ఉపయోగిస్తోందని పేర్కొంది.

అయితే, ఈ ఆరోపణలను బయ్‌కర్ కంపెనీ ఖండించింది.

టర్కీ సుమారు 11 కోట్ల రూపాయల విలువగల సైనిక పరికరాలను జర్మనీ నుంచి కొనుగోలు చేసిందనీ, వీటిని డ్రోన్ల తయారీలో ఉపయోగించవచ్చనీ కొన్ని రిపోర్టులు తెలిపాయి.

అజర్‌బైజాన్ - అర్మేనియా యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఇది వివాదాస్పదమైన విషయమనీ, డ్రోన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ల తయారీలో టర్కీ గణనీయమైన పురోగతి సాధించిందని గుంతె సిమ్సెక్ అభిప్రాయపడ్డారు.

తమ డ్రోన్ విమానాలను సొంతంగా తయారుచేసుకునే, ఎగుమతి చేయగలిగే స్థితిలో టర్కీ ఉందని డ్రోన్ వార్స్‌కు చెందిన శామ్యూల్ బ్రౌన్స్‌వర్డ్ అభిప్రాయపడ్డారు.

టర్కీ తన సరిహద్దుల్లో డ్రోన్ విమానాలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తోందని బ్రౌన్స్‌వర్డ్ తెలిపారు.

అయితే, టర్కీ స్థానికంగా డ్రోన్ విమానాలను ఉపయోగిస్తూ సాధారణ పౌరులను లక్ష్యాలుగా చేసుకుంటోందని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఉత్తర సిరియాలో కూడా టర్కీ డ్రోన్ విమానాలను ఉపయోగించిందని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

'డ్రోన్ విమానాల లక్ష్యం ఒక్కటే - మరణం' అని ఈ సంఘాలు విమర్శిస్తున్నాయి.

"డ్రోన్ విమానాల లక్ష్యం మరణం ఒక్కటే. ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే" అని బ్రౌన్స్‌వర్డ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)