మయన్మార్‌కు భారత్ జలాంతర్గామి ఎందుకిచ్చింది? దీనిని రహస్యంగా ఎందుకుంచారు?

జలాంతర్గామి

ఫొటో సోర్స్, STR/AFP via Getty Images

    • రచయిత, జుగల్ ఆర్. పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఒక జలాంతర్గామి సమాధిలా నిశ్చలంగా ఉండగలదు".

వైస్ అడ్మిరల్ జీఎం హీరానందానీ(రిటైర్డ్) ఈ మాటను తన 'ట్రాన్సిషన్ టు గార్డియన్‌షిప్: ద ఇండియన్ నేవీ 1991-2000' పుస్తకంలో రాశారు. రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని అధికారికంగా ప్రచురించింది.

ఆ మాట, భారత్-మయన్మార్‌కు ఒక జలాంతర్గామిని అధికారికంగా అప్పగించినా, దాని గురించి ఇప్పుడు పెద్దగా చర్చ ఎందుకు జరగడలం లేదో చెబుతుంది.

భారత్ మయన్మార్‌కు ఒక జలాంతర్గామి బహుమతిగా ఇచ్చిందనే వార్తలపై అక్టోబర్ 15న బీబీసీ భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ అనురాగ్ శ్రీవాస్తవ్‌ నుంచి స్పందన కోరింది.

"మయన్మార్ నావికా దళానికి భారత్ ఒక కిలో క్లాస్ జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధువీర్ ఇస్తుంది. మాకు తెలిసినంత వరకూ ఇది మయన్మార్ నావికా దళంలో మొదటి జలాంతర్గామి అవుతుంది" అని ఆయన చెప్పారు.

"దీనిని SAGAR(సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) ప్రకారం ఆ దేశానికి ఇచ్చారు. పొరుగుదేశాలన్నింటి సామర్థ్యాన్ని, స్వయం సమృద్ధిని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం" అన్నారు.

ప్రభుత్వం ఇది మాత్రమే చెప్పింది. దీనికి సంబంధించి ఎలాంటి మీడియా ప్రకటనా విడుదల చేయలేదు. భారత్ హెలీకాప్టర్లు మిగతా ఆయుధాలు, పడవలు, యుద్ధ విమానాలను దిగుమతి చేసుకుంటుంది. కానీ జలాంతర్గామి అందించడం అనేది మరో విషయం అని నిపుణులు చెబుతున్నారు.

అంతే కాదు, ఒక దేశం దగ్గర ఎక్కువగా ఉన్న వాటినే ఎగుమతి చేస్తుంటారు. కానీ సముద్ర జలాల అడుగున భారత నావికా దళం గురించి అలా చెప్పవచ్చా..

జలాంతర్గామి

ఫొటో సోర్స్, PUNIT PARANJPE/AFP via Getty Images

ఐఎన్ఎస్ సింధువీర్

ఐఎన్ఎస్ సింధువీర్ జలాంతర్గామిని 1988 జూన్ 11న అప్పటి సోవియట్ యూనియన్ భారత్‌కు ఇచ్చింది. తర్వాత ఇది భారత నావికా దళంలో చేరింది.

రష్యా దీనిని 877 ఈకేఎం క్లాస్ (నాటో కోడ్ నేమ్-కిలో క్లాస్) అని చెబుతుంది. ఈ జలాంతర్గామి అణుశక్తికి బదులు డీజిల్, విద్యుత్‌తో నడుస్తుంది. ఇది నీటి అడుగున 300 మీటర్ల లోతు వరకూ వెళ్లగలదు. బయటి నుంచి ఏ సాయం లేకపోయినా 45 రోజులు నీటి అడుగునే పని చేయగలదు. దీనిని నడిపేందుకు 53 మంది సిబ్బంది అవసరం అవుతారు.

ఈకేఎం జలాంతర్గాములకు ఉన్న సామర్థ్యాన్ని బట్టి నేవీ అధికారులు వాటిని 'సముద్రంలో బ్లాక్ హోల్స్'గా వర్ణిస్తారని నాకు చెప్పారు.

నిజానికి, నావికా దళం అధికారిక చరిత్రలో ఈ సమాచారం ఉంది.

ఈ జలాంతర్గాముల కోసం కమాండర్ కేఆర్ అజరేకర్ (తర్వాత కెప్టెన్ అయ్యారు) రష్యాలో శిక్షణ తీసుకున్నారు. భారత మొదటి ఈకేఎం జలాంతర్గామి సింధుఘోష్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు.

"హైడ్రో-డైనమిక్ రూపంలో నీటి అడుగున పనిచేయడంలో దీని కన్ఫిగరేషన్ అత్యుత్తమం. ఈకేఎం నీటి అడుగున అద్భుతంగా పనిచేయగలదు. అంతే కాదు, సముద్రంలో శత్రువులను వేటాడ్డానికి దీనిలో సోనార్‌లు చాలా ఉపయోగపడతాయి" అని చెప్పారు.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత్.. రష్యా నుంచి ఇలాంటివే 10 జలాంతర్గాములు కొనుగోలు చేసింది.

జలాంతర్గాములను నావికాదళంలో చేర్చే ఒక కొత్త కార్యక్రమం కూడా ఆలస్యం అవుతోంది. అంటే, నీటి అడుగున పనిచేయడంలో పూర్తి సామర్థ్యం అందుకోడానికి మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాం.

జలాంతర్గామి

ఫొటో సోర్స్, PUNIT PARANJPE/AFP via Getty Images

భారత్ నుంచి మయన్మార్‌కు చేరింది

భారత్ మయన్మార్‌కు జలాంతర్గామిని ఇచ్చిన విషయం గురించి నేను ఈ అంశాల్లో నిపుణులైన ఇద్దరు అధికారులతో మాట్లాడాను.

ఐఎన్ఎస్ సింధువీర్‌ను మయన్మార్‌కు బహుమతిగా ఇచ్చారనడం తప్పని వారిలో ఒకరు చెప్పారు. ఈ విషయం అత్యంత రహస్యంగా ఉంచారన్నారు.

"ఇది నియమిత కాలం వరకూ లీజుకు ఇచ్చారని నేను మీకు చెప్పగలను. కానీ, ఇది ఆదాయం కోసం చేసింది కాదు" అన్నారు.

భారత్, మయన్మార్‌ మధ్య ఏం జరుగుతోందో అర్థం చేసుకోడానికి మనం ఆ రెండు దేశాలను మాత్రమే చూడకూడదు.

నేను చాలా మంది అధికారులతో మాట్లాడాను. బంగ్లాదేశ్‌తో జరిగింది పునరావృతం కాకూడదని భారత్ భావిస్తోందని వారిలో ఒకరు చెప్పారు.

"2016-17లో బంగ్లాదేశ్ చైనా జలాంతర్గాములు కొనుగోలు చేసినపుడు, ఆ జలాంతర్గాముల ద్వారా చైనా సిబ్బంది కూడా బంగాళాఖాతంలోకి ప్రవేశించడానికి మార్గం దొరికింది" అన్నారు.

"అయితే, ఆ జలాంతర్గాములను ఉపయోగించడంలో బంగ్లాదేశ్‌కు అంత అనుభవం లేదు. అందుకే, నీటి అడుగున తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్న మయన్మార్ నావికా దళంతో మేం దీనిపై చర్చలు జరిపాం. వారి సిబ్బందికి మేం శిక్షణ ప్రారంభించాం. ఇప్పటికీ వారికి సహకారం అందిస్తున్నాం" అన్నారు.

భారత్, మయన్మార్

ఫొటో సోర్స్, Hindustan Times

కానీ రహస్యం ఎందుకు, కారణం ఏంటి

రెండు దేశాల్లో ఏదీ దీనిపై మిగతా వారి దృష్టి పడాలని అనుకోవడం లేదు. కానీ, ఇది ప్రారంభం మాత్రమే. మయన్మార్‌కు చైనాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని వారు చెప్పారు.

ఇండియన్ మారీటైమ్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు, రిటైర్డ్ కమాండర్ అనిల్ జయ్ సింగ్ తన మూడు దశాబ్దాల అనుభవంలో నాలుగు జలాంతర్గాములకు నేతృత్వం వహించారు.

"ఒక జలాంతర్గామిని మరో దేశానికి లీజుకు ఇవ్వడం అరుదుగా జరుగుతుంది. అయితే, విస్తృతంగా చూస్తే బంగాళాఖాతాన్ని మనం చైనా చేతులకు అప్పగించలేం. అందుకే, పొరుగు దేశాల నావికాదళాలను కలిపే దిశగా ఇది ఒక ముందడుగ"ని ఆయన అన్నారు.

"చైనా తన జలాంతర్గాములను హిందూ మహాసముద్రంలో మోహరించే సమయం ఎంతో దూరంలో లేదు. పాకిస్తాన్‌కు చైనా నుంచి 8 జలాంతర్గాములు అందుతున్నాయి. అది మనకు(పశ్చిమ తీరంలో) చాలా ఆందోళనకరమైన విషయం" అన్నారు.

భారత్, మయన్మార్

ఫొటో సోర్స్, Hindustan Times

భారత్ నావికా దళం సామర్థ్యం ఎంత

ఐఎన్ఎస్ సింధువీర్‌ను పక్కన పెడితే, ప్రస్తుతం భారత్ దగ్గర మొత్తం 8 ఈకేఎం జలాంతర్గాములు ఉన్నాయి. వీటిలో నాలుగు జర్మన్ తయారీ హెచ్‌డీడబ్ల్యు జలాంతర్గాములు, మరో రెండు ఫ్రాన్స్ డిజైన్ స్కార్పీన్ జలాంతర్గాములు.

సంఖ్యాపరంగా చూస్తే భారత్ దగ్గర ఇప్పటికీ 2013 ఆగస్టు నాటికి ఉన్న జలాంతర్గాములే ఉన్నాయి. అప్పట్లో ముంబయి నావికా దళం డాక్ యార్డులో ఉన్న ఈకేఎం జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురక్షక్‌లో పేలుడు జరిగింది. అందులో ఉన్న వారందరూ చనిపోయారు.

2022 నాటికి మరో నాలుగు స్కార్పీన్ జలాంతర్గాములు నావికాదళంలోకి చేరుతాయని నావికా దళ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం నావికా దళంలో ఉన్న జర్మన్ హెచ్‌డీడబ్ల్యు జలాంతర్గాములు 26 నుంచి 34 ఏళ్ల పాతవి. ఈకేఎం క్లాస్ 20 నుంచి 34 ఏళ్ల మధ్య ఉంటుంది. మొదట్లో, సగటున 28 ఏళ్లు ఉపయోగించిన తర్వాత జలాంతర్గాములను విధుల నుంచి తప్పించేవారు.

"జలాంతర్గాములను పొందడం చాలా ఆలస్యం అవుతోంది. మన ముందున్న మార్గం స్పష్టంగా లేదు. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంద"ని బ్రిటన్‌లోని భారత హై కమిషన్‌లో నావల్ అడ్వైజర్‌గా కూడా పనిచేసిన సింగ్ అన్నారు.

"జలాంతర్గాముల ఖరీదు చాలా ఎక్కువ. నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ కూడా రక్షణ బడ్జెట్‌లో నావికాదళం వాటాను 2012లో 18 శాతం నుంచి 2019-20లో 13 శాతానికి తగ్గించారని డిసెంబర్‌లో చెప్పారు. అప్పట్లో కరోనా కూడా లేదు" అన్నారు.

వీడియో క్యాప్షన్, 44 మందితో గల్లంతైన అర్జెంటీనా సబ్‌మెరైన్

ప్రాంతీయ శత్రుత్వం

మయన్మార్‌కు సహకరించాలని భారత్ పక్కా ప్రణాళిక ప్రకారమే నిర్ణయం తీసుకుంది.

బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ భారత్‌కు ఇంతకు ముందు భాగస్వామిగా ఉండేవి. భారత నావికాదళం 2013లో మయన్మార్‌తో నావికాదళ అభ్యాసాలు ప్రారంభించింది. బీబీసీ మానిటరింగ్ రిపోర్ట్ ప్రకారం 2019 జులై 16న రష్యాలో పర్యటించిన మయన్మార్ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్, రష్యా ఆర్మీ డిప్యూటీ చీఫ్ మధ్య ఒక అధునాతన జలాంతర్గామి కొనుగోలుపై చర్చలు జరిగాయని మయన్మార్ న్యూస్ వెబ్ సైట్ ఇరవ్వాడీ చెప్పింది.

భారత్ చర్యలపై థాయ్‌లాండ్ ఎలా స్పందించిందో 2019 డిసెంబర్ 11న మయన్మార్ టైమ్స్ కథనం ప్రచురించింది.

"రాయల్ థాయ్ నావికా దళం తమ ఎదుట ఉన్న కొత్త పరిస్థితిని ఎదుర్కోడానికి సన్నాహాలు ప్రారంభించింది. మయన్మార్ అండమాన్‌ సముద్రంలో భద్రతా మిషన్ల కోసం తమ జలాంతర్గాములను పంపించబోతోందనే విషయం తెలీడంతో థాయ్‌లాండ్ చైనా నుంచి మూడు జలాంతర్గాములు కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది" అని అందులో రాశారు.

సముద్రం ఎలక్ట్రోమాగ్నటిక్ పద్ధతిలో జలాంతర్గాములకు ఒక కవచం అందిస్తుందని వైస్ అడ్మిరల్ హీరానందానీ తన పుస్తకంలో చెప్పారు.

జలాంతర్గామికి అతిపెద్ద సవాలు సముద్రం నుంచే ఎదురవుతుంది. జలాంతర్గామి నుంచి బయటికి వచ్చే శబ్దం సముద్రంలో సహజంగా వచ్చే శబ్దం కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే, అది నీటి అడుగున దాగి ఉండగలదు" అని చెప్పారు.

మరోవైపు, సముద్రం అడుగున శాంతి పూర్వక భాగస్వామ్యం పెంపొందించుకునే విషయానికి వస్తే అది ఈ ప్రాంతంలో భారత్, మయన్మార్‌ల మధ్య మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)