టైటానిక్ నుంచి టెలీగ్రాఫ్‌ను వెలికితీయటానికి అమెరికా కోర్టు అనుమతి: ఏ రహస్యాలు వెలుగుచూస్తాయి?

శతాబ్దం కింద సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక అవశేషాల నుంచి మార్కోని టెలీగ్రాఫ్‌ను వెలికి తీసేందుకు ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీకి అమెరికన్ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ ప్రయత్నంలో ఆ నౌక శిథిలాలు మాత్రం చెదిరిపోకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.
టైటానిక్ నౌక 1912లో మునిగిపోయింది. ఈ నౌక శిథిలాలను వెలికితీసే హక్కుల్ని 1980లో ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీ పొందింది.
రోజు రోజుకీ నౌక మరింతగా శిథిలమైపోతున్న నేపథ్యంలో అందులోని మార్కోనీ టెలీగ్రాఫ్ యంత్రాన్ని వెలికి తియ్యాలని ఆర్ఎమ్ఎస్ టైటానిక్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఆ ప్రయత్నాలను ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్మియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) సహా అనేక సంస్థలు, వ్యక్తులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
అయితే తాజాగా.. టైటానిక్ అవశేషాలు వీలైనంత వరకు దెబ్బతినకుండా జాగ్రత్తపడుతూ నాటి టెలీగ్రాఫ్ వెలికి తియ్యవచ్చంటూ అమెరికా ఫెడరల్ కోర్టు ఆర్ఎంఎస్ కంపెనీకి అనుమతి ఇచ్చినట్లు ‘ద న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తెలిపింది.
ఈ వేసవిలో నౌక శిథిలాల నుంచి టెలీగ్రాఫ్‌ను వెలికి తీసేందుకు అనుమతివ్వాలని ఆర్ఎమ్ఎస్ టైటానిక్ కంపెనీ సోమవారం నాడు కోర్టుకు మరోసారి విజ్ఞప్తి చేసింది.
దీంతో.. నార్ ఫోల్క్ లోని జిల్లా కోర్టు జడ్జి రెబక్కా బీచ్ స్మిత్.. కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వు 2000లో మార్పులు చెయ్యాలని ఆదేశించారు. ఆ నిబంధనలను సడలించడంతో టైటానిక్ నౌక శిథిలాల్లోని టెలీగ్రాఫ్ యంత్రాన్ని వెలికి తీయటానికి అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
టైటానిక్ మునిగిపోయిన రహస్యాలు తెలుస్తాయా?
ఆ రేడియో ట్రాన్స్‌మిటర్ ద్వారా నాటి దారుణ ఘటనకు సంబంధించి రహస్యాలు, అందకుండా పోయిన రేడియో సంభాషణలు బయట పడే అవకాశం ఉందని ఆర్ఎంఎస్ టైటానిక్ చెప్తోంది.
అటు న్యాయమూర్తి స్మిత్ కూడా తన తీర్పులో అటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.
“నౌక మునిగిపోతున్న సమయంలో నాటి ప్రమాదం గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఉపయోగించిన ఆ మార్కోని టెలీగ్రాఫ్ చారిత్రకంగా, సాంస్కృతికంగా, శాస్త్రీయంగా ఎంతో విలువైన వస్తువు. అందుకే నౌకను వీలైనంత వరకు విచ్ఛిన్నం చేయకుండా టెలీగ్రాఫ్ ఉన్న గదికి చేరుకునేందుకు సదరు కంపెనీకి అనుమతి ఇస్తున్నాను” అంటూ తన ఆదేశాల్లో పేర్కొన్నారు న్యాయమూర్తి.
తాము కూడా వీలైనంత వరకు నౌక అవశేషాలు దెబ్బతినకుండా ప్రయత్నిస్తామని, ఇప్పటికీ ఆ టెలీగ్రాఫ్ గది తెరచే ఉందని సూర్య కాంతిలోనే దాన్ని చేరుకోవచ్చని కంపెనీ లాయర్ డేవిడ్ కాన్‌కెనాన్ మంగళవారం తెలిపారు.

‘‘టైటానిక్ శిథిలాలను కదిలించొద్దు’’
మరోవైపు కోర్టు నిర్ణయాన్ని ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్మియరిక్ అడ్మినిస్ట్రేషన్ సహా అనేక ఇతర సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. మునిగిన నౌకను అలాగే వదిలేయాని కోరుతున్నాయి.
ఇప్పుడు మార్కోని టెలీగ్రాఫ్‌ను బయటకు తీసేందుకు పెట్టే ఖర్చుతో పోల్చితే ఆ వస్తువు పెద్ద విలువైనది కాదని, దాని వల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం కూడా లేదని NOAA ఏప్రిల్ నెలలో కోర్టుకు విన్నవించింది.
అటు ఐర్లాండ్ అధికారులు కూడా టెలీగ్రాఫ్‌ను వెలికి తీసే ప్రయత్నాలపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
మునిగిపోయిన నౌక ఉన్న ప్రాంతానికి అంత సులభం కాదని కొందరు నిపుణులు అంటున్నారు. “అక్కడ నమ్మశక్యం కాని చరిత్ర నిక్షిప్తమై ఉంది. అంతే కాదు వందల మంది అందులో జలసమాధి అయిపోయారు. వారిని మనం గౌరవించాల్సి ఉంది” అని సముద్ర అన్వేషణ నిపుణుడు రెయాన్ కింగ్ పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ జలాంతర్గామి ముంచేసిన U.S.S. Eagle PE-56 నౌక జాడను కనుగొన్న బృందంలో ఆయన సభ్యుడు.
మరోవైపు తాము కూడా టైటానిక్ అవశేషాలను దెబ్బతీయకుండానే టెలిగ్రాఫ్‌ను వెలికి తియ్యాలని భావిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది.
‘‘నౌక అవశేషాలను దెబ్బతియ్యకూడదంటే మేం అక్కడకు వెళ్లకపోవడమే మంచిది. డ్యామేజ్‌ను వీలైనంతగా తగ్గించేందుకు మా దగ్గర తగిన ప్రణాళికలు ఉన్నాయి. మేం ఏదో క్షేత్ర పర్యటనకు వెళ్లడం లేదు. ఇప్పుడు నౌక అవశేషాల దగ్గరకు వెళ్లడం అంటే ఏకంగా మరో గ్రహానికి వెళ్తున్నట్టే’’ అని ఆర్ఎంఎస్ కంపెనీ కన్సల్టెంట్, ఓషనోగ్రాఫర్ డేవిడ్ గాలొ అన్నారు.
టైటానిక్ నౌక అట్లాటింక్ సముద్రంలో 1912లో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో సుమారు 1,500 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది బతికి బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్కు తుపాను కూడా తోడైతే సామాజిక దూరం పాటించడం ఎలా?
- సూపర్ సైక్లోన్ ఆంఫన్: ప్రపంచంలో అత్యంత ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
- కరోనావైరస్ కేసుల డబ్లింగ్ రేటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంత... కోవిడ్ వ్యాప్తి పెరుగుతోందా, తగ్గుతోందా?
- కరోనావైరస్: ఫేస్‌మాస్కుల ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది...
- నేపాల్: 'లిపులేఖ్, లింపియాధురా కాలాపానీ' తమవే అంటూ కొత్త మ్యాప్‌ను ఆమోదించిన క్యాబినెట్
- అఫ్గాన్ ప్రసూతి వార్డుపై దాడి: తల్లులను కోల్పోయిన శిశువులకు పాలిచ్చి కాపాడిన మహిళ
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో ఖాళీ అయిన మహా నగరాల రోడ్లు మళ్లీ కిక్కిరిసిపోతున్నాయ్
- కరోనా వైరస్ ప్రపంచీకరణకు ముగింపు పలుకుతుందా.. దేశాలన్నీ స్వదేశీ బాట పడతాయా
- కరోనావైరస్: వుహాన్‌లో ప్రజలందరికీ 10 రోజుల్లో పరీక్షలు చేయడం చైనాకు సాధ్యమేనా?
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








