రంగనాయకమ్మ అరెస్ట్ వివాదం: ఆమె ఫేస్‌బుక్‌ పోస్టులో ఏముంది? ఏం కేసు పెట్టారు?

రంగనాయకమ్మ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రంగనాయకమ్మకు నోటీసులు అందజేస్తున్న అధికారులు
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శనాత్మక వ్యాఖ్యలు, పోస్టులపట్ల ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తీవ్రంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం మీద ఆరోపణలను చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలకు దిగుతోంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాలకు చెందిన పలువురు కార్యకర్తలు, సోషల్‌ మీడియా యూజర్లు, వాలంటీర్లపై కేసులు నమోదు చేసింది. దాదాపు 20 మందికి పైగా అరెస్టు చేసి జైలుకు పంపించింది.

తాజాగా గుంటూరుకి చెందిన పూంతోట రంగనాయకమ్మ అనే మహిళని కూడా ఇవే ఆరోపణలపై అరెస్ట్ చేసినట్టు ఏపీసీఐడీ ప్రకటించింది. ఆమె సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి అనేక ఆధారాలు సేకరించిన తర్వాత సీఆర్పీసీ సెక్షన్ 41-ఎ కింద అరెస్టు నోటీసు ఇచ్చినట్లు ఏపీసీఐడీ చెబుతోంది.

అయితే ఇది అప్రజాస్వామిక చర్యని, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడమేనని ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

రంగనాయకమ్మ ఎవరు?

గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన పూంతోట రంగనాయకమ్మ ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై నిత్యం తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌లో వ్యక్తం చేస్తుంటారు. గుంటూరు నగరంలో ప్రముఖ హోటల్‌ శంకర్ విలాస్‌కు ఆమె డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి, మాజీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు తాను వీరాభిమానినన్న విషయాన్ని ఆమె ఎక్కడా దాచుకోరు. ఫేస్‌బుక్‌ ప్రొఫైల్ లో ''మళ్లీ నువ్వే రావాలి'' అనే నినాదంతో చంద్రబాబును కవర్ ఫోటోగా పెట్టుకున్నారు.

రంగనాయకమ్మపై అభియోగాలేంటి ?

విశాఖపట్నంలో మే 7వ తేదీన జరిగిన ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటనపై తనకు నచ్చిన ఓ పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేశారు.

ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందనను ఆమె తప్పుబట్టారు. 20 పాయింట్ల రూపంలో ప్రభుత్వ తీరుపై అనుమానాలను వ్యక్తం చేసిన మల్లాది రఘునాథ్ అనే వ్యక్తి రాసిన ఓ పోస్టును షేర్‌ చేసినట్లు చెప్పారు రంగనాయకమ్మ.

ప్రస్తుతం ఈ కేసులో మల్లాది రఘునాథ్‌ను ఎ-2 నిందితుడిగా పేర్కొన్న సీఐడీ, అతని కోసం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఎంతో సున్నితమైన ఎల్జీ పాలిమర్స్ విషయంలో ప్రభుత్వం మీద రంగనాయకమ్మ దుష్ప్రచారం చేసినట్టు సీఐడీ చెబుతోంది. ప్రజలలో భయాందోళనలు కలిగించే రీతిలో ఈ పోస్ట్ ఉందన్నది అభియోగం.

అసత్యపు ఆరోపణలతో ప్రజల్లో ప్రభుత్వంపట్ల తప్పుడు అభిప్రాయం కలిగించారని, వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పోస్టులు రాశారని, ప్రాథమిక దర్యాప్తులో ఈ నేరం రుజువయిందని ఏపీసీఐడీ చెబుతోంది.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, YUI MOK

నిందితులపై వివిధ సెక్షన్‌ల కింద కేసులు, రుజువైతే భారీ శిక్ష

ప్రాథమిక ఆధారాలు లభించడంతో క్రైమ్‌ నెం. 24/2020తో కేసు నమోదు చేశారు. ఆమెపై నమోదు చేసిన కేసులో వివిధ సెక్షన్లు ఇలా ఉన్నాయి.

సెక్షన్‌ 505(2) : ఏదైనా నిరాధార సమాచారం ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడం

సెక్షన్‌ 153(ఎ) : మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, సామరస్యాన్ని దెబ్బతీయడం

సెక్షన్‌ 188 : ప్రభుత్వ ఉత్తర్వులు పాటించకపోవడం

సెక్షన్‌ 120(బి) : నేరపూరితమైన కుట్ర * రెడ్‌ విత్‌ ఐపీసీ సెక్షన్‌ 34: కొందరు వ్యక్తులతో కలిసి ఉద్దేశపూర్వక నేరానికి పాల్పడటం.

వీటితోపాటు ఐటీ యాక్ట్ 2008 సెక్షన్ 67 కింద కేసు నమోదయ్యింది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే మొదటిసారి నేరానికి 3సంవత్సరాల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా ఉంటుంది. నేరం పునరావృతం అయితే జైలుశిక్ష 5ఏళ్లు, రూ. 10లక్షలు జరిమానా ఉంటుందని ఏపీసీఐడీ తన ప్రకటనలో పేర్కొంది.

ఇంతకీ రంగనాయకమ్మ పోస్టులో ఏముంది?

కేసులో నిందితురాలు రంగనాయకమ్మ ఈనెల 12న ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్‌ను పెట్టినట్లు సీఐడీ చెబుతోంది. దానిలో 20 పాయింట్ల రూపంలో ప్రమాదం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని, కంపెనీని సీజ్ చేయలేదని, లిక్విడ్ ఎస్సెట్‌గా ఉన్న స్టైరీన్‌ గ్యాస్‌ను తెలివిగా తరలించారని ఆమె తన ఆరోపణల్లో పేర్కొన్నారు. పోలీస్ బాస్ పర్యటన పేరుతో లోపల ఉద్యోగుల హాజరును కూడా మార్చేశారని ఆమె పోస్టులో ఉంది.

వేలిముద్రల కోసం వచ్చే క్లూస్‌టీమ్‌కి ఆధారాలు లేకుండా చేశారని అందులో ఆరోపించారు. ఇలా ఆధారాలు ధ్వంసం చేస్తే ఐక్యరాజ్యసమితిగానీ, సుప్రీంకోర్టుగానీ, హైకోర్టుగానీ నిజాలు నిగ్గు తేల్చగలవా అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే ఏ రాజ్యంగబద్ధ సంస్థలు, కోర్టులు ఏమీ చేయలేవని అన్నారు. ప్రమాద ఘటన తర్వాత పోలీస్ అధికారి అరెస్టులు మా పనికాదనడం దేనికి సూచిక అని ఆమె ప్రశ్నించారు. ఇక ఆ ఐదు గ్రామాల ప్రజలు ఆశ వదిలేసుకోవడమే మంచిదంటూ వ్యాఖ్యానించారు. చివరలో సేకరణ రఘునాథ్ మల్లాది అని పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ ఇప్పుడు రంగనాయకమ్మని చిక్కుల్లోకి నెట్టినట్టు కనిపిస్తోంది. రంగనాయకి అనే పేరుతో ఈ 66 ఏళ్ల సీనియర్ సిటిజన్ నడుపుతున్న ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఉన్న పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఏపీసీఐడీ అధికారులు, ఆమె ఫోన్‌ను కూడా సీజ్ చేశారు.

అరెస్ట్‌కి సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 41-ఎ కింద స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం గుంటూరులో ఆమె నోటీసులు అందుకున్నారు.

రంగనాయకమ్మ

ఫొటో సోర్స్, UGC

నేను చేసింది నేరం అనుకోవడం లేదు: రంగనాయకమ్మ

ఫేస్‌బుక్‌లో తాను కేవలం కాపీ, పేస్ట్ మాత్రమే చేశానని, ఇది నేరంగా తాను భావించడం లేదంటున్నారు నిందితురాలు పూంతోట రంగనాయకమ్మ. అరెస్ట్ నోటీసులు జారీ అయిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

"ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టానని నోటీసులు ఇచ్చారు. కానీ అది చట్ట వ్యతిరేకం అవుతుందని నాకు తెలియదు. జస్ట్ అందరూ మాట్లాడుకునేవే అవి. ఒకాయన నేషనల్ మీడియాలో కూడా వచ్చినవన్నీ కలిపి పొద్దున్నే ఓ పోస్ట్ పెట్టారు. ఆయనతో నాకు వ్యక్తిగతంగా పరిచయం కూడా లేదు. కానీ చదువుకోవడానికి బాగుందని కాపీ పేస్ట్ చేశాను. అంతమంది చనిపోయారనే బాధ తప్ప నాకేమీ లేదు'' అన్నారామె.

''ఎవరినో నిందిస్తే నాకేమీ రాదు. నేను నిజంగా నేరం చేశానా లేదా అన్నది వాళ్లు అర్థం చేసుకుంటే చాలు. అంతకుమించి ఏమీ అవసరం లేదు. నేనేమీ నేరం చేయలేదు. నేను చేసింది నేరం అని అనుకోవడం లేదు కూడా.." అని మీడియాతో వ్యాఖ్యానించారు రంగనాయకమ్మ.

రంగనాయకమ్మతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే ఆమె ఒత్తిడిలో ఉన్నారని, ప్రస్తుతం మాట్లాడలేరని ఆమె కుమారుడు శంకర్ తెలిపారు. "ఒక రాజకీయ పార్టీకి మద్ధతు ఇవ్వడం నేరం కాదు కదా. అయినా మేము ఎవరికీ మద్దతుదారులం కాదు'' అన్నారు శంకర్‌.

''సోషల్ మీడియాలో ఉపయోగకరమైన అంశాలను ఆమె పోస్టు చేస్తుంటారంతే. టైమ్‌పాస్‌ కోసం ఉపయోగించుకునే సోషల్ మీడియా పోస్ట్ ఇంత వరకూ వస్తుందని అనుకోలేదు'' అని శంకర్‌ అన్నారు.

''ఆమె చంద్రబాబు పాలనా తీరుని అభినందిస్తూ ఉంటారు. అదే సమయంలో ఎవరినీ కించపరచరు. ఈ నోటీసుల విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందని అనుకుంటున్నాము" అని అభిప్రాయపడ్డారు రంగనాయకమ్మ కుమారుడు శంకర్‌.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షం ఏమంటోంది?

సోషల్‌మీడియాలో పోస్టులపై అందులోనూ ఓ వృద్ధురాలిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరు ఇదా అని ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం తీవ్రంగా తప్పుబట్టింది. ''సోషల్‌ మీడియాలో వై.ఎస్‌.జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఓ 66 ఏళ్ల వృద్ధురాలికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. అధికారం చేతికొచ్చేసరికి జగన్‌ విమర్శలను తట్టుకోలేకపోతున్నారు. మీ అహంకారం పతనమయ్యే కాలం వస్తుంది'' అంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు ట్విటర్‌లో విమర్శించారు.

"సీఐడి పోలీసులకున్న హోదాను ఈ ముఖ్యమంత్రి మార్చేశారు. ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో తన అనుమానాలను రంగనాయకమ్మ పోస్టు చేశారు. చేతనైతే ఆవిడ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంతేతప్ప ఈ కక్ష సాధింపులేంటి?'' అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ బీబీసీతో అన్నారు.

''66 ఏళ్ల వయసున్న రంగనాయకమ్మకు నోటీసులు ఇవ్వడమేంటి? ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రశ్నించడంలో తప్పేముంది. ప్రభుత్వం జాగ్రత్త పడేలా ప్రశ్నలు వేసిన రంగనాయకమ్మకు ఐదేళ్లు, పదేళ్లు జైలు శిక్ష వేస్తామని నోటీసులు ఇస్తారా? ఇలా పోలీసులను పంపి వేధింపులకు గురి చేస్తే తట్టుకునే శక్తి మహిళలకు ఉంటుందా?" అని అనురాధ ప్రశ్నించారు. కేసుల విషయంలో అండగా ఉంటామంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు రంగనాయకమ్మకు సంఘీభావం తెలిపారు.

అధికార పార్టీ వాదనేంటి?

టీడీపీ నేతల తీరును అధికార వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం తప్పుబడుతోంది. సామజిక మాధ్యమాలలో పోస్టుల పేరుతో తమ పార్టీ నేతలను వేధించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా ప్రతినిధి ఇప్పాల రవీంద్ర అన్నారు.

"టీడీపీ ప్రభుత్వంలో కేవలం ప్రశ్నించినందుకు చేయని నేరాలకు మమ్మల్ని జైలులో పెట్టారు. తెలుగుదేశం పార్టీ సర్కారు హయాంలో ప్రభుత్వ వైఫల్యాలు ఆధారాలతో ప్రశ్నించినందుకు ఎస్సీ, ఎస్టీ సెక్షన్స్ కింద అక్రమ కేసులు పెట్టి వేధించారు'' అని రవీంద్ర బీబీసీతో అన్నారు.

''66 ఏళ్ల వయసు వారు నేరాలకు పాల్పడితే నోటీసులు ఇవ్వకూడదా? ప్రభుత్వం మీద కావాలనే కుట్రపూరితంగా దుష్ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా చెల్లుతుందనే తీరు సరికాదు" అని రవీంద్ర అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, EMMA RUSSELL

పోస్టుల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే: ఏపీ సీఐడీ

భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో నిరాధార సమాచారాన్ని జనంలోకి పంపడం నేరమేనని ఏపీసీఐడీ చీఫ్‌ పీవీ సునీల్ కుమార్ అంటున్నారు. "గతంలో చాలాసార్లు చెప్పాము. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరు హద్దులు మీరినా అది వారికి శ్రేయస్కరం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం సరికాదు'' అని సునీల్‌కుమార్ బీబీసీతో అన్నారు‌.

''చట్టవ్యతిరేకమైన పోస్టులు అస్సలు పెట్టకూడదు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా, శాంతిభద్రతల సమస్యగా మారేలా ఎలాంటి పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు. ఇప్పటికే ఇలాంటి కేసులు ఉన్నాయి. అరెస్టులు కూడా జరిగాయి. అందరూ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి" అని సునీల్‌ కుమార్ చెపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)