పాకిస్తాన్‌: హిందూ ఆలయం విషయంలో ఇమ్రాన్ ఖాన్ ఎందుకు వెనుకాడుతున్నారు

పాకిస్తాన్ హిందువులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శుమైలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లోని సైద్‌పుర్‌లో ఇప్పటికే ఉన్న ఓ హిందు దేవాలయాన్ని, అక్కడి ధర్మశాలను తెరవొచ్చని ఆ దేశంలోని ఇస్లామిక్ ఐడియాలజీ కౌన్సిల్ తమ ప్రభుత్వానికి సూచించింది.

ఇస్లామాబాద్‌లో కొత్తగా ఓ కృష్ణ మందిరం నిర్మాణానికి 20 వేల చదరపు అడుగుల స్థలం ఇచ్చే విషయమై మత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ కౌన్సిల్‌ను అభిప్రాయం అడిగింది. అయితే, పాకిస్తాన్‌లోని మత ఛాందస నాయకులు, ముస్లిం మత సంస్థలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.

అయితే, రాజ్యాంగ ప్రకారం అన్ని మతాలవారికి తమ తమ మత ఆచారాలు, సంప్రదాయాలను పాటించేందుకు స్థలాన్ని పొందే హక్కు ఉందని కౌన్సిల్ వ్యాఖ్యానించింది.

ఇస్లామాబాద్‌లో ఉన్న హిందూ జనాభాను పరిగణనలోకి తీసుకుంటూ, సైద్‌పుర్ గ్రామంలో ఇప్పటికే ఉన్న పాత మందిరాన్ని తెరవాల్సిన అవసరం ఉందని కౌన్సిల్ అభిప్రాయపడింది.

ప్రభుత్వ నియంత్రణలో లేని మత స్థలాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే పద్ధతి దేశంలో లేదని, కృష్ణ మందిర నిర్మాణానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వడాన్ని సమర్థించలేమని కౌన్సిల్ స్పష్టం చేసింది.

అన్ని మతాల వారికి తమ తమ ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు జరుపుకొనే హక్కు కూడా ఉంటుందని, హిందువులకు ఇస్లామాబాద్ సమీపంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకునే హక్కు కూడా ఉందని కౌన్సిల్ వ్యాఖ్యానించింది.

వివాహాలు, సమావేశాల కోసం హిందువులు కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడంపైనా ఎలాంటి అభ్యంతరాలూ లేవని కౌన్సిల్ పేర్కొంది.

మైనార్టీలకు వసతులు కల్పించేందుకు ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుకు అధికారాలు ఇవ్వాలని, మైనార్టీల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కూడా కౌన్సిల్ అభిప్రాయపడింది.

ఇస్లాం వ్యవహారాలపై ప్రభుత్వానికి ఇస్లామిక్ ఐడియాలజీ కౌన్సిల్ సలహాలు, సూచనలు చేస్తూ ఉంటుంది. అయితే, వీటిని పాటించాలా, లేదా అన్నదానిపై ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం.

హిందువుల స్పందన

కౌన్సిల్ సూచనలను పాకిస్తాన్ హిందూ పంచాయత్ సంస్థ స్వాగతిస్తోందని పాకిస్తాన్ ఫెడరల్ పార్లమెంటరీ సెక్రటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ లాల్ చంద్ మల్హీ బీబీసీతో చెప్పారు.

ఇస్లామాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా హిందువులు కమ్యూనిటీ సెంటర్లు నిర్మించుకోవచ్చని కౌన్సిల్ చెప్పిందని ఆయన అన్నారు.

''ఇస్లామాబాద్‌లోని హెచ్-9 సెక్టార్‌లో శ్మశాన వాటిక, కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ హిందూ పంచాయత్ భావిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఇక్కడ భూమి కేటాయించింది. మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా ముందుకు సాగుతాం'' అని లాల్ చంద్ చెప్పారు.

లాల్ చంద్ (మధ్యలో వ్యక్తి)
ఫొటో క్యాప్షన్, లాల్ చంద్ (మధ్యలో వ్యక్తి)

ఇస్లామాబాద్‌లో మొదటిసారిగా హిందూ ఆలయ నిర్మాణానికి కొన్నాళ్ల క్రితం స్థలాన్ని కేటాయించింది ఇస్లామాబాద్ నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ.

ఆ స్థలాన్ని 2017లోనే కేటాయించినా, పాలన సంబంధమైన సమస్యల కారణంగా ఆలయ నిర్మాణం ఆలస్యమైంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ స్థలాన్ని హిందూ సంఘానికి పూర్తిగా అప్పగించింది.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆలయం మొదటి విడత నిర్మాణానికి పది కోట్ల రూపాయల (ప్రస్తుత భారతీయ కరెన్సీ ప్రకారం రూ.4.5కోట్లు సుమారు) నిధులను కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో లాల్ చందే ఇదివరకు భూమి పూజ నిర్వహించారు.

సైద్‌పుర్‌లోని హిందూ ఆలయం
ఫొటో క్యాప్షన్, సైద్‌పుర్‌లోని హిందూ ఆలయం

ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా ఫత్వా, పిటిషన్

లాహోర్‌లోని జామియా అష్రఫియా అనే మదర్సా.. ఈ ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది.

ఇస్లామిక్ దేశాల్లో మైనార్టీల మత స్థలాలు తెరిచి ఉంచడం, వాటికి మరమ్మతులు చేయడంపై అభ్యంతరాలు లేవని.. కొత్త మందిరాలు, ప్రార్థనా స్థలాల నిర్మాణాలను మాత్రం అనుమతించకూడదని ఆ ఫత్వా పేర్కొంది. కొన్ని చారిత్రక గ్రంథాలను, ఇతర ఉదాహరణలను ఇందులో ప్రస్తావించింది.

మహమ్మద్ జకరియా అనే స్థానిక న్యాయవాది కూడా ఈ ఆలయ నిర్మాణాన్ని తక్షణం నిలిపేయాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రీతమ్ దాస్
ఫొటో క్యాప్షన్, ప్రీతమ్ దాస్

పాకిస్తాన్‌లో దాదాపు 80 లక్షల మంది హిందువులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది దక్షిణ సిందు ప్రాంతంలోని అమర్‌కోట్, థారపార్కర్, మీర్‌పుర్ ఖాస్ జిల్లాల్లో ఉంటున్నారు. ఇస్లామాబాద్‌లో దాదాపు మూడు వేల మంది హిందువులు ఉన్నారు.

ఇస్లామాబాద్‌లోని సైద్‌పుర్‌లో ఉన్న గుడి చిన్న నిర్మాణమే. ఈ గ్రామాన్ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించిన తర్వాత దీన్ని తెరిచారు. అయితే, ఇస్లామాబాద్‌లో ఉన్న హిందువుల సంఖ్యకు సరిపోయే స్థాయిలో ఇది లేదు.

''మా ఆచార సంప్రదాయాలు పాటించడం కష్టమవుతోంది. శ్మశాన వాటిక లేదు. అంతిమ సంస్కారాలు నిర్వహణ కోసం వేరే నగరాలకు శవాలను తీసుకువెళ్లాల్సి వస్తోంది. మాకు కమ్యూనిటీ సెంటర్లు లేవు. దీపావళి, హోళీ లాంటివి చేసుకులేకపోతున్నాం. చాలా కాలంగా ఈ వసతుల కోసం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మా మాట విన్నందుకు ఆనందంగా ఉంది'' అని ఇస్లామాబాద్ హిందూ పంచాయత్ మాజీ అధ్యక్షుడు ప్రీతమ్ దాస్ అన్నారు.

రాజకీయంగానూ వ్యతిరేకత

ఇస్లామాబాద్‌లో కొత్త ఆలయ నిర్మాణ ప్రతిపాదనను పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ చౌధరి పర్వాజ్ ఇలాహీ కూడా వ్యతిరేకించారు.

‘‘పాకిస్తాన్ ఇస్లాం పేరు మీద ఏర్పడింది. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో కొత్త ఆలయం నిర్మించడం ఇస్లాంకు వ్యతిరేకం. మహమ్మద్ ప్రవక్త ఏర్పాటు చేసిన మదీనా రాజ్యాన్ని అగౌరవపరచడం కూడా. మక్కాపై విజయం సాధించాక మహమ్మద్ కాబాలో ఉన్న 360 విగ్రహాలను ధ్వంసం చేశారు. మైనార్టీల హక్కుల గురించి మేం కూడా మాట్లాడతాం. కానీ, ఉన్న ఆలయాలను మాత్రమే బాగు చేసుకోవాలి'' అని ఇలాహీ అన్నారు.

పాకిస్తాన్‌లో ముస్లింలతో పాటు ఇతర మతస్థులు కూడా సమానమైన పౌరులేనని ఇదివరకు పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఇక హిందూ ఆలయ నిర్మాణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై అందరి దృష్టీ ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)