ఫ్రాన్స్: చాందసవాద ఇస్లాంను మార్చేందుకు మేక్రాన్ ఏం చర్యలు తీసుకుంటున్నారు?

ఫొటో సోర్స్, LUDOVIC MARIN
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చాందసవాద ఇస్లాంను మార్చేందుకు ‘‘చార్టెర్ ఆఫ్ రిపబ్లికన్ వాల్యూస్’’కు మద్దతు ఇవ్వాలని ముస్లిం వర్గాల ప్రతినిధులను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ కోరుతున్నారు.
నవంబరు 18న ఫ్రెంచ్ కౌన్సిల్ ఆఫ్ ద ముస్లిం ఫెయిత్ (సీఎఫ్‌సీఎం)కు చెందిన ఎనిమిది మంది నాయకులను మేక్రాన్ కలిశారు. చార్టర్‌కు అంగీకారం తెలిపేందుకు 15 రోజుల గడువు ఇవ్వాలని వారు కోరినట్లు ఆయన తెలిపారు.
‘‘ఫ్రాన్స్‌లో ఇస్లాం అనేది ఒక మతం మాత్రమే. అందుకే దీని నుంచి రాజకీయాలను వేరు చేయాలి. ఫ్రాన్స్‌లోని ముస్లిం వ్యవహారాల్లో విదేశాల జోక్యం ఉండకూడదు’’ లాంటి నిబంధనలు ఈ చార్టర్‌లో ఉన్నాయని మేక్రాన్ వివరించారు.
గత నెలలో వరుసగా మూడు చోట్ల దాడులు జరిగిన నేపథ్యంలో మేక్రాన్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
మహమ్మద్ ప్రవక్తపై వేసిన కార్టూన్లను తరగతి గదిలో చూపించిన 47 ఏళ్ల టీచర్‌పై జరిగిన దాడి కూడా వీటిలో ఉంది.

ఫొటో సోర్స్, Reuters
మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ల విషయంలో ఇక్కడ పెద్ద వివాదమే చెలరేగింది. తాజాగా ఆ కార్టూన్లను చూపించిన టీచర్‌ను హత్యచేసిన నిందితుణ్ని 18 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు.
చార్టర్‌కు త్వరలోనే అంగీకారం తెలుపుతామని మేక్రాన్‌కు సీఎఫ్‌సీఎం హామీ ఇచ్చింది.
ఫ్రాన్స్‌లో సీఎఫ్‌సీఎం మాత్రమే మతపరమైన ప్రభుత్వ సంస్థ. 2003లో మాజీ అధ్యక్షుడు నికోలాస్ సర్కోజీ హోం మంత్రిగా ఉన్న సమయంలో దీన్ని ఏర్పాటు చేశారు. అన్ని ముస్లిం వర్గాలకు చెందిన ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
ఫ్రాన్స్ జనాభాలో ముస్లింలు 10 శాతం వరకు ఉంటారు. యూరప్‌లో అత్యధిక ముస్లింలున్న దేశం ఫ్రాన్సే.
చాలా మంది ముస్లింలు ఫ్రాన్స్ వలస కాలనీలైన మొరాకో, ట్యునీషియా, అల్జీరియా నుంచి ఇక్కడికి వచ్చారు. అయితే, వీరి సంతానంలో చాలా మంది మాత్రం ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగారు.

ఫొటో సోర్స్, MARC PIASECKI
వివాదాస్పద బిల్లు...
చార్టర్‌పై అంగీకారంతోపాటు అతివాద ఇస్లాంపై మరికొన్ని చర్యలను మేక్రాన్ ప్రతిపాదించారు. వాటిలో వివాదాస్పద బిల్లు కూడా ఒకటుంది.
చాలా మంది నిపుణులుతో గంటలపాటు సంప్రదింపులు జరిపిన అనంతరం ఒక బిల్లును ఆయన ప్రతిపాదించారు. దీన్ని చాలా మంది వివాదాస్పద బిల్లుగా చెబుతున్నారు. దీనిలోని నిబంధనలు..
మతపరమైన అంశాలను చూపించి ప్రభుత్వ అధికారులను బెదిరించే వారికి కఠినమైన శిక్షలు విధించాలి. పిల్లలను ఇంటిలో ఉంచి చదువు చెప్పడం పూర్తిగా నిషిద్ధం.
ప్రతి విద్యార్థికి ఒక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి. దీని ఆధారంగా విద్యార్థి స్కూలుకు వెళ్తున్నాడో లేదో గమనించొచ్చు. ఈ చట్టాలను అతిక్రమించే తల్లిదండ్రులకు ఆరు నెలల వరకు జైలు శిక్షతోపాటు భారీ జరిమానాలూ విధించాలి.
ఎదుటి వ్యక్తులకు హాని చేయాలనే ఉద్దేశంతో వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడం కూడా నిషిద్ధమే.
అక్టోబరు 2న కూడా ఇలాంటి ప్రతిపాదనలనే చేశారు. ఇస్లాం ఇక్కడ సంక్షోభంలో ఉందని ఆయన చెప్పారు.
అయితే, ఆయన వ్యాఖ్యలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని చాలా మంది అతివాద ముస్లింలు చెబుతున్నారు. చాలా దేశాలు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. కొన్ని దేశాలైతే ఫ్రాన్స్ నుంచి వస్తువులను దిగుమతి చేసుకోకుండా నిషేధం విధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రాన్స్‌లో ఇస్లాం
గత కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో ఇస్లాం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇక్కడ అధికారిక మతం అంటూ ఏమీలేదు. ఎందుకంటే ఇది లౌకిక దేశం.
ఇక్కడి సెక్యులరిజం వామపక్షవాదులతోపాటు అతివాదులు అనుసరించేందుకు వీలుగా ఉంటుంది. అయితే, ఇక్కడి ప్రభుత్వమే దీనితో ఇక్కట్లు పడుతోంది.
గత రెండేళ్లుగా ఫ్రాన్స్‌లోని ఇస్లాంను గాడిన పెట్టేందుకు మేక్రాన్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అంటే ఇస్లామిక్ కార్యకలాపాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ఇదివరకటి అధ్యక్షులు విఫలం అవుతూ వచ్చారు.
తన సొంత కల్పిత ప్రపంచంలోకి ఫ్రెంచ్ ఇస్లాంను మేక్రాన్ తీసుకురావాలని అనుకుంటున్నారని, ఆయన ద్వంద్వ విధానాలను అనుసరిస్తున్నారని అమెరికాలోని శాన్‌డీగో వర్సిటీకి చెందిన ఇస్లామిక్ చరిత్రలో నిపుణుడు, ప్రొఫెసర్ అహ్మెత్ కురు వ్యాఖ్యానించారు.
‘‘ముస్లిం సంస్థ సీఎఫ్‌సీఎం నుంచి మేక్రాన్ ఆశిస్తున్న చర్యలన్నీ సెక్యులర్ స్టేట్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి’’అని ఆయన అన్నారు.
‘‘ఫ్రాన్స్‌లోని క్యాథలిక్ చర్చి అధికారాలను వికేంద్రీకరించడం ద్వారా సెక్యులరిజం అమలులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతం సీఎఫ్‌సీఎంకు అప్పటి చర్చి హోదాను మేక్రాన్ ఇస్తున్నారు. అన్ని మసీదులు సీఎఫ్‌సీఎం నిర్ణయాలను అనుసరించాలని చెబుతున్నారు. అంటే ద్వంద్వ విధానాలను అనుసరించడమే’’అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సీఎఫ్‌సీఎంపై విమర్శలు
ఫ్రాన్స్‌లో ఇస్లాం వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదని ‘‘ద బాటిల్ ఫర్ ఎ ఫ్రెంచ్ ఇస్లాం’’ ఆర్టికల్‌లో ఫ్రెంచ్ రచయిత కరీనా పిసార్ రాసుకొచ్చారు.
‘‘మత సంబంధిత కార్యక్రమాలు, మతపరమైన అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. కానీ గత 30ఏళ్లుగా ఇక్కడి ప్రభుత్వాలు ఇస్లాంకు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి’’అని కరీనా చెప్పారు.
‘‘ఇప్ప్డు సీఎఫ్‌సీఎంను తీసుకోండి. దీన్ని 2003లో ఏర్పాటుచేశారు. అది కూడా ప్రభుత్వ సాయంతో.. సాధారణ ముస్లింలకు ఇది ఏమిటో కూడా తెలియదు’’
‘‘మూడింట రెండొంతుల మంది ముస్లింలకు అసలు ఈ సంస్థ ఏమిటో కూడా తెలియదు’’అంటూ 2016లో చేపట్టిన ఒక అధ్యయనాన్ని ఈ సందర్శంగా ఆమె ఉదహరించారు.
‘‘సీఎఫ్‌సీఎం విషయాల్లో విదేశాల జోక్యం కంటే.. ముస్లింల అందరికీ ఇది ప్రాతినిధ్యం వహించడంలేదనే అతిపెద్ద విమర్శ’’అంటూ ఫ్రాన్స్‌లో సామాజిక ఉద్యమకర్త మర్వాన్ మహమూద్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశాల జోక్యం ఆగాలి
చార్టర్‌లో విదేశాల జోక్యాన్ని పూర్తిగా నిలిపివేయాలని మేక్రాన్ ప్రస్తావించారు.
ఫ్రాన్స్‌లోని ఇమామ్‌లు సాధారణంగా మొరాకో, ట్యునీషియా, అల్జీరియాల నుంచి వస్తుంటారు. పారిస్‌లోని జామా మసీదును అల్జీరియాలోని ఇమామ్ సూచనలపై నిర్వహిస్తుంటారు. 2015 నుంచి ఇక్కడ జరుగుతున్న దాడులకు ఫ్రాన్స్‌లో పుట్టినవారే కారణమని వార్తలు కూడా వస్తున్నాయి.
‘‘దేశంలోని ముస్లిం సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న విదేశీ సంస్థలు ఏవో గుర్తించాల్సిన అవసరముంది’’అని స్విట్జర్లాండ్‌లో జెనీవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోపొలిటికల్ స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్. అలెగ్జాండర్ లాంబెర్ట్ చెప్పారు.
‘‘ఇది ఫ్రెంచ్ ప్రభుత్వానికి చాలా కష్టమైన పని. ఎందుకంటే విదేశాల జోక్యం అంశాలపై విచారణ చేపడితే.. ముస్లిం సంస్థలకు బదులు పశ్చిమ దేశాల నేతల జోక్యం వెలుగులోకి వస్తుంది’’
‘‘మేక్రాన్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదు. ఆయన రాథ్స్‌చైల్డ్ బ్యాంకర్. అది ఒక కార్పొరేట్ సామ్రాజ్యం’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఫ్రెంచ్ విలువలకు అనుగుణంగా ఫ్రెంచ్ ఇస్లాంను మార్చాలని చాలా మంది ముస్లింలు కూడా భావిస్తున్నారు. అయితే వారు అనుసరించే విధినాలు మేక్రాన్ చెప్పేదానికంటే చాలా భిన్నమైనవి.
‘‘మా తరం చాలా ఉదారంగా ఉంది. మా స్నేహితుల్లో చాలా మంది శ్వేతజాతీయులే. మమ్మల్ని విడిగా పెడుతున్నట్లు మాకు ఎప్పుడూ అనిపించలేదు. కానీ ప్రభుత్వం మా మతం గురించి ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తోంది. అది చాలా పెద్ద సమస్య ’’అని దక్షిణ ఫ్రాన్స్ నగరం మెర్సెలీలో ఐటీ నిపుణుడు, మొరాకో సంతతికి చెందిన యూనస్ అల్ అజీజ్ వివరించారు.
‘‘మీడియా ఫ్రెండ్లీ ఇస్లాంను మేం కోరుకుంటున్నాం. చర్చలను ఇస్లాం ఎప్పుడూ స్వాగతిస్తుంది’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, AHMAD GHARABLI
ఇస్లాం, రాజకీయాలు
మేక్రాన్ తాజా వ్యాఖ్యలు, చర్యలు వెనుక, 2022 అధ్యక్ష ఎన్నికల వ్యూహాలు కూడా ఉన్నాయని ప్రొఫెసర్ అహ్మెత్ కురు వ్యాఖ్యానించారు.
‘‘ఏప్రిల్ 2022లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల వరకు ఆయన ఇస్లాంపై చర్చలను కొనసాగిస్తారు. తద్వారా ఓట్లు రాబట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు’’.
అయితే, ఇది చాలా పెద్ద తప్పని ప్రొఫెసర్ అహ్మెత్ అన్నారు.
‘‘తాజా చర్యలు, వ్యాఖ్యలతో ఫ్రాన్స్‌లోని ముస్లింలు ఒక వర్గంగా విడిపోతారు. కొందరు అతివాదులతోనూ చేతులు కలపొచ్చు. రెండోది ఫ్రెంచ్ సెక్యులరిజంకు వ్యతరేకంగా విధానాలను అవలంబిస్తున్నారు. ఫ్రెంచ్ సెక్యులర్ విధానాల్లో.. ప్రభుత్వం మతాలకు దూరంగా ఉంటుంది. కానీ మేక్రాన్ మాత్రం.. మెరుగైన ఇస్లాం తీసుకొద్దాం అంటున్నారు. ఇది ఫ్రాన్స్ సెక్యులర్ విధానాలకే విరుద్ధం’’అని ఆయన వివరించారు.
ముస్లింలపై ప్రభుత్వం బలవంతంగా ఎలాంటి చర్యలనూ రుద్దకూడదని యూనస్ అభిప్రాయపడ్డారు.
‘‘అలాంటి విధానాలు ఎప్పుడూ విజయవంతం కావు. పైగా వాటి నుంచి ప్రతికూల ఫలితాలు వస్తాయి. అందుకే ఇస్లాంను బయట వ్యక్తులు, సంస్థల జోక్యం నుంచి కాపాడాలి. అదే సమయంలో మార్పులకూ స్వాగతం పలకాలి’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








