దుబ్బాక ఉప ఎన్నిక: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

- రచయిత, బళ్ల సతీశ్, నవీన్ కుమార్ కందేరి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక ముగిసింది. 2018లో టిఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కరోనాతో మరణించడంతో ఈ ఎన్నిక జరిగింది.
టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన రావు, కాంగ్రెస్ నుంచి చెఱకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి సహా 23 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు.
రాజకీయ కారణాలతో రాని ఉప ఎన్నికల్లో హడావుడి తక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి దుబ్బాక ఎన్నికలు తెలంగాణలో బాగా వేడి పుట్టించింది.

ముఖ్యంగా బీజేపీ నాయకులకు సంబంధించినదిగా చెబుతూ పోలీసులు పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. చాలా సందర్భాల్లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. టీఆర్ఎస్-బీజేపీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లూ నడిచాయి.
మరో వైపు కరోనా సమయంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆ రకంగానూ దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.
నియోజకవర్గంలో దుబ్బాక పట్టణం, ఏడు మండలాలు, 146 గ్రామాల్లో కలపి మొత్తం లక్షా 98 వేల 756 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగు జరుగగా, మొత్తం 81.4 శాతం ఓట్లు నమోదయ్యాయి.

ఎన్నికల సిబ్బంది, పోలీసులు కలపి దాదాపు 5 వేలు మంది పనిచేశారు. 14 ఫ్లయింగ్ స్క్వాడ్లు, మరో 10 బృందాలు కూడా పనిచేశాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత చిట్టాపూర్లో, బీజేపీ అభ్యర్థి రఘునందనరావు బొప్పాపూర్లో, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస రెడ్డి తుక్కాపూర్లో ఓటు వేశారు.
తాను టీఆర్ఎస్‌లో చేరానంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థి చెఱకు శ్రీనివాసరెడ్డి తొగుట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కరోనా ఏర్పాట్లు
కరోనా జాగ్రత్తల్లో భాగంగా ఓటు వేయడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ శానిటైజర్ ఇచ్చారు. ఒక చేతికి గ్లౌజు ఇచ్చారు. ఉష్ణోగ్రత చెక్ చేసి లోపలికి పంపించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గరా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, లేదా అంగన్ వాడీ వర్కర్లను నియమించారు. సిబ్బందికి ఫేస్ షీల్డులు ఇచ్చారు.
సాధారణంగా ప్రభుత్వ సిబ్బంది ఓటు వేయడానికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. కానీ ఈసారి కరోనా పాజిటివ్ రోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. దీంతో నిన్న సాయంత్రం వరకూ మొత్తం 1588 మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకున్నారు. కరోనా పాజిటివ్ వారి దగ్గర నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారు.

కరోనా పాజిటివ్ రోగులు, కరోనా లక్షణాలు ఉన్నవారు ఓటు వేయడానికి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకూ సమయం కేటాయించారు.
వారికోసం పీపీఈ కిట్లు కూడా సిద్ధం చేశారు. దుబ్బాకలోని 40వ నంబరు కేంద్రంలో ముగ్గురు పాజిటివ్ రోగులు ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. వీరు పీపీఈ కిట్లు వేసుకుని ప్రభుత్వ అంబులెన్సులో ఓటు వేయడానికి వచ్చారు.
అయితే వృద్ధులూ, వికలాంగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇస్తామని అధికారులు చెప్పినా, కొందరికే ఆ సౌకర్యం అందించారు. చాలా మంది వృద్ధులు నడవలేని పరిస్థితుల్లో వచ్చి ఓటు వేశారు. అయితే వారికి వీల్ చైర్ సౌకర్యం మాత్రం అందించారు.

భారీ భద్రత మధ్య పోలింగ్
ఎన్నికల ప్రచారంలో ఘటనల దృష్ట్యా పోలింగ్ రోజు ఏ గొడవా జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటూ కేంద్ర బలగాలను మోహరించారు. ఉదయం పూట మహిళలూ, వృద్ధులూ ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేశారు.
రాయపోల్ మండలం ఆరేపల్లిలో కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. వారు కూడా పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ దుబ్బాకలో పోలింగ్ సరళి పరిశీలించారు. ఉదయం 9 గంటల వరకూ 16 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 56 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకూ 71 శాతం ఓటింగు నమోదయింది.

ఓటు వేసి కన్నీరు పెట్టారు
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన బస్సుల్లో తీసుకువచ్చిన అధికారులు, వారితో ఓటు వేయించారు.
లక్ష్మాపూర్ మునిగిపోవడంతో వారికి గజ్వేల్ పరిధిలోని సంగాపూర్ దగ్గర తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. కానీ వారి ఓట్లు మాత్రం దుబ్బాక పరిధిలోనే ఉన్నాయి.
దీంతో వారిని ఎన్నికల సంఘం ప్రత్యేక బస్సుల్లో తరలించింది. ఆరు బస్సుల్లో వచ్చిన ఓటర్లు కిష్టాపూర్ దగ్గర ఏర్పాటు చేసిన పోలింగు బూత్‌లో ఓటు వేశారు.
వారిలో కొందరు తమ గ్రామం పేరుతో వేస్తున్న చివరి ఓటు ఇదేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కొందరు.
తాత్కాలిక వసతు ఏర్పాటు చేసిన ప్రాంతంలో కూలి పనులు కూడా దొరకడం లేదని చెప్పారు. తమకు ప్యాకేజీ అందలేదని పలువురు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- "మేం దళితులం కాబట్టి.. మా శవాలకు కూడా దిక్కులేదు.. ఇతరులెవరికీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో"
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులేమిటి? ఏయే చార్జ్షీట్లలో ఏముంది?
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- దక్షిణాది ప్రజల ఇష్టమైన టిఫిన్ దోశకు పుట్టినిల్లు ఏది కర్ణాటకా.. తమిళనాడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








