నివర్ తుపాను తాకిడితో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం

నివర్ తుపాను తమిళనాడులో తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యధికంగా కనిపించింది. చలిగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో పల్లపు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసాయి.
ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరి, ప్రత్తి, వేరు శనగ పంటలు ఎక్కువ నష్టపోయాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది.
జాతీయ రహదారి మీద కూడా వరద నీరు చేరింది. నెల్లూరు-చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమల ఆలయ ప్రాంగంణంలోకి కూడా వరద నీరు చేరింది. ఘాట్ రోడ్లో పలు చోట్ల రాళ్లు పడ్డాయి. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రభుత్వ సహాయక చర్యలు ప్రారంభించింది. వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత పంట నష్టం అంచనా వేస్తామని చెబుతోంది.

తీరం దాటిన తర్వాత ఏపీకి తాకిడి
తుపాను తీరం దాటిన తర్వాత ఏపీ లో ఎక్కువ ప్రభావం కనిపించింది. నివర్ శుక్రవారం ఉదయానికి దాదాపుగా బలహీనపడి అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది.
అయితే, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో గంటకు 55-75కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షపాతం నమోదుకావడంతో తీరని నష్టం జరిగింది. ఏపీలోని 293 మండలాల్లో గురువారం 10 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. వీటిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అన్ని మండలాలూ ఉన్నాయి. కడప జిల్లా రైల్వేకోడూరులో అత్యధికంగా 280, నెల్లూరు జిల్లా కోట మండలంలో 247, వెంకటగిరిలో 235, బాలాయపల్లిలో 230, డక్కిలిలో 214 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

చిత్తూరులో తీవ్ర ప్రభావం
తుపాను కారణంగా చిత్తూరు జిల్లా అంతటా ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో భారీ వర్షపాతం నమోదయ్యింది. దాంతో తిరుమల ఆలయ ప్రాంగంణం కూడా వరదమయం అయ్యింది. పాపవినాశనం, ఘాట్‌రోడ్లతోపాటు, తిరుమలలోని పలు ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి.
బాలాజీనగర్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎడతెరపిలేని వర్షం, ఈదురుగాలులతో తిరుపతిలో జనజీవనం స్తంభించింది. చెట్లు రోడ్డుపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కపిలతీర్థం ప్రాంతంలో కొండల నుంచి భారీగా నీరు జారుతున్న దృశ్యం నమోదయ్యింది.
రేణిగుంట సమీపంలో వాగులో ముగ్గరు రైతులు చిక్కుకోగా వారిలో ఇద్దరిని సహాయ బృందాలు కాపాడగలిగాయి. ప్రసాద్ అనే రైతు మాత్రం గల్లంతయ్యారు. తిరుపతి నగరంలో కూడా పలు పల్లపు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. చిత్తూరు జిల్లాలో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు, చెరువులూ దాదాపుగా నిండిపోయాయి. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 30 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

కడప నగరంలో మోకాలి లోతు నీరు
భారీ వర్షాలతో కడప గోకుల్ సెంటర్ లో జలమయమయ్యింది. మోకాలి లోతులో నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలతో పాటు బుగ్గ వంక పరీవాహక ప్రాంతంలో పూర్తిగా జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను పోలీసు అధికారులు, సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలించారు.
పునరావాస కేంద్రంలో తలదాచుకున్నవారికి దాతల సహకారంతో అల్పాహారం అందించారు. రైల్వేకోడూరు పట్టణంలోని లోతట్టు కాలనీలు నీట మునిగి చెరువులను తలపించాయి. 300 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పుల్లంగేరు నదిలో వరద ఉధృతికి చక్రామలమడుగు, పొలిచెరువులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో కడప-తిరుపతి జాతీయ రహదారి నీటమునిగింది. రాయచోటి మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. సుండుపల్లెలోని పింఛా ప్రాజెక్టు, కడప శివారు బుగ్గవంక ప్రాజెక్టు నిండడంతో గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు.


గూడురు వద్ద జాతీయ రహదారి జలమయం
నెల్లూరు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కుండపోత వర్షం కొనసాగుతోంది. పలు కాలనీలు నీట మునిగాయి. జిల్లావ్యాప్తంగా 115 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటిలోకి 3,363 మందికి తరలించారు. ఈదురు గాలులకు పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. నెల్లూరు, గూడూరు, నాయుడుపేట డివిజన్లలో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గూడూరులో పంబలేరు వాగు జాతీయ రహదారిపై ప్రవహించడంతో ఆ మార్గంలో ద్విచక్ర వాహనాలు, కార్లను పోలీసులు అనుమతించలేదు. లింగసముద్రం వద్ద రాపూరు-వెంకటగిరి మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారిపై వంతెన కుప్పకూలింది. నెల్లూరు నగరంలో చెట్టు కూలి విద్యుత్ తీగలపై పడింది. ఆ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లి చిక్కుకున్న 29 మంది మత్స్యకారులు గురువారం క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. సోమశిల ప్రాజెక్టు నిండిపోగా సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు. పెన్నా నదిలో కూడా వరద ప్రవాహం పెరిగింది.

గూడూరు జాతీయ రహదారిపై వరద నీరు
గూడూరు పట్టణ పరిధిలోని అదిశంకర కళాశాల వద్ద జాతీయ రహదారిపై వాగులు పొంగి రోడ్డుపై ఉదృతం గా నీరు ప్రవహిస్తూ ఉండటంతో చెన్నై నెల్లూరు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పంబేలేరు వాగు చల్ల కాలువలు కూడా పొంగుతున్న నేపథ్యంలో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి,
గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి,సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ గూడూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు, గూడూరు ఎమ్మెల్యే ఏకంగా అధికారులు తో కలిసి రోడ్లపై కూలిన చెట్లను తొలగించే కార్యక్రమాలు చేపట్టారు,

ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ వర్షాల తాకిడి
ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సింగరాయకొండలో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దాంతో వేల ఎకరాల్లో పొలాలు జలమయ్యమయ్యాయి. గుంటూరు పశ్చిమ ప్రాంతంలోనూ, కృష్ణా, గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది పోర్టులో నిలిచిన బియ్యం ఎగుమతులు
భారీ వర్షాలతో అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవం వాయిదా వేశారు. ఉప్పాడలో అలలు రోడ్డుపైకి ఎగసిపడుతున్నాయి. సూరాడపేటలో వెంకటేశ్వరస్వామి ఆలయం పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది. తుఫాను ముప్పుతో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. సముద్రంలో ఇప్పటికే మూడు నౌకలు బియ్యం లోడింగ్ కోసం సిద్ధంగా ఉండగా, వాటి వద్దకు బియ్యం లోడుతో వెళ్లే 89 బార్జిలు పోర్టులో ఆగిపోయాయి.
29న అల్పపీడనం.. మరో తుఫాను ముప్పు
కాగా, ఈనెల 29న ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా, తుఫాన్‌గా మారి వచ్చే నెల 2-3 తేదీల్లో దక్షిణ/మధ్య తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యమంత్రి సమీక్ష
నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి గురువారం సమీక్షించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రాణ నష్టం నివారించాలని సూచించారు. పంట నష్టం అంచనాలను వీలయినంత త్వరగా తయారుచేయాలన్నారు.
శుక్రవారం జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో కూడా దీనిపై చర్చ జరిగింది. నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలను అధికారులు క్యాబినెట్‌కు వివరించారు.
ముఖ్యంగా, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు అవసరమైన మేరకు సహాయక బృందాలను రంగంలోకి దింపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- తెలంగాణలో నియంత్రిత సాగుపై రైతులు ఏమంటున్నారు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- BBC SPECIAL: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పిల్లలకు తల్లి ఒడి లాంటి బడి 'శాంతివన్'
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








