కౌన్సిలర్‌గా గెలిచిన అడాల్ఫ్ హిట్లర్ .. పోలైన ఓట్లలో 85 శాతం ఆయనకే

ఈయన పూర్తి పేరు ఉనోనా అడాల్ఫ్ హిట్లర్

ఫొటో సోర్స్, Eagle FM Namibia

ఫొటో క్యాప్షన్, ఈయన పూర్తి పేరు ఉనోనా అడాల్ఫ్ హిట్లర్

నమీబియాలో ఓ చోట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అడాల్ఫ్ హిట్లర్ విజయం సాధించారు. అడాల్ఫ్ హిట్లర్ అంటే జర్మనీ నియంత కాదు. గెలిచినాయన పూర్తి పేరు ఉనోనా అడాల్ఫ్ హిట్లర్.

ఓంపుండ్జా నియోజకవర్గం నుంచి ఉనోనా అడాల్ఫ్ హిట్లర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.

జర్మనీ నియంత హిట్లర్‌కు, తనకు సారూప్యత పేర్ల వరకే పరిమితమని ఆయన అంటున్నారు.

‘‘నాది నాజీ భావజాలం కాదు. ప్రపంచాన్ని జయించాలన్న కాంక్షేదీ నాకు లేదు’’ అని ఉనోనా జర్మన్ దినపత్రిక బిల్డ్‌తో చెప్పారు.

నమీబియా కూడా ఒకప్పుడు జర్మనీ వలస పాలనలో ఉండేది. ఇక్కడ చాలా మంది జర్మన్ పేర్లు పెట్టుకుంటారు.

‘‘మా నాన్న నాకు ఆ పేరు పెట్టారు. హిట్లర్ ఏం చేశారన్నది ఆయనకు తెలియదనుకుంటా. చిన్నప్పుడు అంతా సాధారణంగానే ఉండేది. హిట్లర్ ఎవరు? ఆయన ఏం చేశారు? ఏం చేయాలనుకున్నారు? అన్న విషయాల గురించి పెరిగి పెద్దవుతున్న కొద్దీ తెలుసుకున్నా. ఆయనతో, ఆయన భావజాలంతో నాకే సంబంధమూ లేదు’’ అని ఉనోనా వివరించారు.

నమీబియాలోని అధికార పార్టీ స్వాపో తరఫున ఉనోనా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. పోలైన ఓట్లలో 85 శాతం ఆయనకే పడ్డాయి.

1884 నుంచి 1915 వరకూ నమీబియా జర్మనీ వలస పాలనలో ఉంది.

1904-08 మధ్య ఇక్కడ స్థానిక జాతుల ప్రజలు చేసిన తిరుగుబాటును అణిచివేసేందుకు జర్మన్ సామ్రాజ్యం వందల మందిని చంపింది.

ఈ ఏడాది మొదట్లో పరిహారంగా నమీబియాకు రూ.89 కోట్లు ఇచ్చేందుకు జర్మనీ ముందుకు వచ్చింది. దీన్ని నమీబియా తిరస్కరించింది. మరింత ఎక్కువ పరిహారం పొందేందుకు చర్చలు జరుపుతామని ప్రకటించింది.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నమీబియా దక్షిణాఫ్రికా నియంత్రణలోకి వచ్చింది. ఆ తర్వాత 1990ల్లో స్వాతంత్ర్యం పొందింది.

అయితే, ఇప్పటికీ నమీబియాలో చాలా నగరాలు జర్మన్ పేర్లతో ఉన్నాయి. జర్మన్ మాట్లాడేవాళ్లు కూడా ఈ దేశంలో ఉన్నారు.

నమీబియా స్వాతంత్ర్య ఉద్యమంలో స్వాపో పార్టీ కీలక పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ పార్టీనే ఇక్కడ అధికారంలో ఉంది.

కానీ, ఇటీవల మత్స్యకార రంగంలో వచ్చిన అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించాయి.

గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 30 నగరాల్లో అధికారం కోల్పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)