'రాబిన్ హుడ్' పోలీసులు: తమ దీవిని ఆక్రమించిన నాజీలనే దోచుకున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, పాట్రిక్ క్లాహేన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఇంగ్లిష్ చానల్లో ఉన్న గర్నసీ దీవి జర్మన్ల ఆక్రమణలో ఉంది. అక్కడ పనిచేసే ఒక పోలీసు బృందాన్ని స్థానిక బ్రిటిష్ కోర్టులో హాజరు పరిచిన అధికారులు, తర్వాత వారిని యూరప్‌లో నాజీల ఆక్రమణలో ఉన్న, క్రూరంగా పనులు చేయించే ఒక శిబిరానికి తరలించారు.
ఆ పోలీసులు చేసిన నేరం ఒకటే. ఆకలితో ఉన్న తమ ప్రజల ఆకలి తీర్చడానికి, జర్మన్ల నుంచి ఆహార పదార్థాలు దోచుకోవడం.
ఆ పోలీసుల్లో కొందరే బతికారు. వారిలో కొందరు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తిరిగి స్వస్థలాలకు చేరుకోగలిగారు. మరికొందరు తీవ్రమైన వ్యాధులతో, జీవితాలనే మార్చేసిన గాయాలతో బాధపడ్డారు. ఇప్పుడు వారందరూ చనిపోయినా, ఇప్పటికీ వారిని నేరస్థులుగానే పరిగణిస్తున్నారు. వారి కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వడానికి కూడా నిరాకరించారు.

ఫొటో సోర్స్, ISLAND ARCHIVES
దీనిని తీరని అన్యాయంగా భావిస్తున్న వారి కుటుంబ సభ్యుల్లో కొంతమంది దశాబ్దాల తర్వాత కూడా తమ తండ్రులపై ఉన్న మచ్చను తొలగించడానికి ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో పోలీసుల పరిస్థితి ఆ దీవుల్లో పౌరుల కంటే దారుణంగా ఉందని ఇంగ్లిష్ చానల్ దీవుల ఐదేళ్ల ఆక్రమణపై పరిశోధనలు చేసిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ గిల్లీ కర్ చెప్పారు.
తన పరిశోధనలో గుర్తించిన వివరాలను ఆమె వెల్లడించారు.
జర్మన్ అధికారులు ఎక్కడ కనిపించినా, పోలీసులు వారికి సెల్యూట్ చేయాల్సొచ్చేది. అలా చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయేవారు.
దీంతో, కింగ్‌స్టన్ బేలీ, ఫ్రాంక్ టక్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు జర్మన్ అధికారుల కార్ల పెట్రోల్ టాంకుల్లో ఇసుక పోయడం, దీవి చుట్టూ 'వి ఫర్ విక్టరీ' అనే బోర్డులు రాసిపెట్టడం లాంటివి చేసేవారు. ఆక్రమిత దళాలకు వ్యతిరేకంగా మొట్టమొదట చర్యలకు దిగింది వీరే.

ఫొటో సోర్స్, PA MEDIA
తాము రహస్యంగా వినే బీబీసీ ప్రసారాల నుంచి ఈ పోలీసులు స్ఫూర్తి పొందారు. రేడియో ద్వారా ఆక్రమణదారులను ఎలా అణచివేయాలో తెలుసుకునేవారు.
"సాయుధ దళాల్లో పోరాడేందుకు వారికి అవకాశం రాకపోవడంతో ఈ రేడియో ప్రసారాలు వారిపై బాగా పనిచేశాయి. పోలీసులు కావడంతో చాలా మంది నిరాకరించిన అవకాశాలను వారు ధైర్యంగా అందుకున్నారు" అంటారు గిల్లీ కర్.
అది 1941-42 చలికాలం. గర్నసీ దీవిలోని ప్రజలకు ఆహారం కొరత ఏర్పడింది. అక్కడే ఉన్న జర్మన్లకు మాత్రం ఆహార పదార్థాల సరఫరాలు కొనసాగుతుండేవి.

దీంతో బెయిలీ, టక్ ఇద్దరూ రాత్రిళ్లు ఆక్రమణదారుల ఆహార నిల్వలను కొల్లగొట్టేవారు. ఆ డబ్బాలను తీసుకెళ్లి తమ ప్రజల కడుపునింపేవారు.
బెయిలీ 1942 ఫిబ్రవరిలో జరిగిన తమ రహస్య ఆపరేషన్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ "అది చేయి దాటిపోయింది. చెప్పాలంటే దీవిలోని మొత్తం పోలీసు బలగాలు దాన్లో భాగమయ్యాయి" అనిచెప్పారు.
మాటు వేసిన జర్మన్లకు బెయిలీ, టక్‌లను పట్టుకోడానికి ఎన్నో రోజులు పట్టలేదు. చివరికి 17 మంది పోలీసులను గమ్సేస్ రాయల్ కోర్టులో ప్రవేశపెట్టారు. వారిలో కొందరు దీవిలోని షాపుల్లో మద్యం బాటిళ్లు దొంగిలించారని ఆరోపించారు.
జర్మన్లు విచారణ సమయంలో పోలీసులను దారుణంగా హింసించారని కూడా చెబుతారు.
"నాకు ఆ సమయంలో మిగతా వారందరూ నేరం ఒప్పుకున్నట్లు సంతకాలు పెట్టిన పత్రాలు చూపించారు. నువ్వు చేయకపోతే కాల్చి చంపుతామని బెదిరించారు. దాంతో నేను కూడా వాటిపై సంతకం చేశాన"ని ఆర్చిబాల్డ్ టార్డిఫ్ ఒకసారి గుర్తుచేసుకున్నారు.
వారు అప్పుడు సంతకాలు పెట్టిన ఆ పత్రాలన్నీ జర్మన్లో టైప్ చేసి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Guernsey Archives
అరెస్టైన పోలీసులపై జర్మన్ ఆర్మీ కోర్టు, అప్పటికీ బ్రిటిష్ కోర్టుగానే ఉన్న గర్నసీ రాయల్ కోర్టుల్లో విచారణలు జరిగాయి. నాలుగున్నరేళ్లు కఠిన శారీరక శ్రమ చేయాలని వారికి శిక్ష వేశారు.
"ఆ పోలీసులందరూ ఇప్పుడు చనిపోయారు. వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ న్యాయంగా జరగలేదు. 1942లో నియంతృత్వ పాలనలో బ్రిటిష్ సివిల్ కోర్టు వారు చెప్పినట్లే వినేద"ని పోలీసులపై నేరారోపణలు తొలగించడానికి ప్రయత్నించిన చరిత్రకారుడు డాక్టర్ పాల్ శాండర్స్ చెప్పారు.
"మీరు నేరం చేశామని ఒప్పుకుంటే జర్మనీ అధారులు స్థానిక కోర్టుల్లో విచారణ జరిగేలా చూస్తారని, యుద్ధం తర్వాత ఆ నేరాల ప్రభావం పెద్దగా లేకుండా పోతుందని గర్నసీ అధికారులు పోలీసులకు చెప్పార"ని ఆయన తెలిపారు.
నేరం ఒప్పుకోగానే పోలీసులందర్నీ జైళ్లకు తరలించి, తర్వాత వారిని బలవంతంగా యూరప్‌లో ఉన్న కార్మికుల క్యాంపులకు తరలించారు. అక్కడ వారిలో చాలామంది క్రూరమైన హింసను రుచిచూశారు.

ఫొటో సోర్స్, Chris Webb HSS - Private Archive
టక్ అక్కడి గార్డుల క్రూరత్వం గురించి కూడా రాశారు. "వారు తనను కింద పడేసి తన్నేవారని, తుపాకీలను తిరగేసి కొట్టేవార"ని చెప్పారు.
వీరిలో, హెర్బర్ట్ స్మిత్ అనే పోలీసు జైల్లో ఉన్నప్పుడే చనిపోయారు.
అతడిని భయంకరమైన చలిలో బట్టలు, ఆహారం లేకుండా ఉంచారని, పార, గొడ్డలిని తిరగేసి కడుపులో కొట్టి గెస్టాపో జైలులో పడేయడంతో చనిపోయాడని టక్ చెప్పారు.
వీరిలో చార్లెస్ ఫ్రెండ్ అనే పోలీసును అమెరికా దళాలు విడిపించిన సమయంలో ఆయన 45 కేజీల బరువుతో, అసలు నడవలేని స్థితిలో ఉన్నారు.
ఆ భయంకర అనుభవాలతో తన జీవితాంతం బాధపడ్డ ఆయన 1986లో గుండెపోటుతో చనిపోయారు.

ఫొటో సోర్స్, Guernsey Archives
చార్లెస్ మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురయ్యారని, వాటి నుంచి ఎప్పటికీ కోలుకోలేకపోయారని ఆయన కొడుకు కీత్ చెప్పారు.
"జైలు నుంచి విడుదలయ్యాక అన్నీ చక్కదిద్దుతామని మాట ఇచ్చిన గర్నసీ అధికారులు, ఆ మాట నిలబెట్టుకోకుండా మోసం చేయడంతో మా నాన్న కుంగిపోయారు" అన్నారు.
తమపై నేరారోపణలు ఉండడంతో జైలు నుంచి విడుదలయ్యాక వారు తిరిగి పోలీసులు కాలేకపోయారు. చివరికి పెన్షన్లు కూడా అందుకోలేకపోయారు.
"అప్పటి పోలీసులు చేసింది నాకు, ఒక రాబిన్ హుడ్ చర్యలాగే అనిపిస్తుంది. వారు వ్యక్తిగత లాభం కోసం ఆ నేరాలు చేయలేదు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపడానికే అలా చేశారు. అప్పుడు పోలీసులుగా తమవారికోసం ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితుల్లో వారు ఉన్నారు" అంటారు కీత్.

ఫొటో సోర్స్, Frank Tuck family
వారిలో చాలామంది యుద్ధం తర్వాత ఎదురైన దుర్భర పరిస్థితుల నుంచి బయటపడడానికి, పరిహారం అందించాలని కూడా వెస్ట్ జర్మన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
1955లో కొందరు పోలీసులు తమపై ఉన్న నేరారోపణలకు వ్యతిరేకంగా అపీల్ చేసుకోడానికి ప్రయత్నించారు. కానీ కోర్టులు వారి గోడు పట్టించుకోలేదు. అంటే, వారంతా చనిపోయే సమయానికి నేరస్థులుగానే ఉన్నారు.
గర్నసీ సహా బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కేసులను విచారించే అత్యున్నత న్యాయస్థానం ప్రివీ కౌన్సిల్ జ్యుడిషియల్ కమిటీ ఈ పోలీసుల కేసును కూడా విచారించింది.
"1950లో కూడా గర్నసీలో నాజీల అక్రమణ ప్రభావం ఏమాత్రం లేకుండా బ్రిటిష్ పాలన, న్యాయం కొనసాగుతోందని ప్రజలను భ్రమల్లో ఉంచార"ని డాక్టర్ శాండర్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Guernsey Archives
వారిలో ముగ్గురు పోలీసులు 1955లో చేసిన అపీళ్లను మరోసారి పరిశీలించాలని 2018లో ప్రివీ కౌన్సిల్‌ను కోరారు. ఈ కేసును లాయర్ పాట్రిక్ ఓ కానర్ వాదించారు.
"ఇది చాలా కాలం నుంచీ జరుగుతున్న అన్యాయం. దీనికి కోర్టులే బాధ్యత వహించి, ఒక పరిష్కారం చూపాల"ని కోరారు. కానీ, ఈ ఏడాది మార్చిలో ఆ అపీలును కొట్టివేశారు.
"ఈ దరఖాస్తులో ఎన్నో చిక్కులు ఉన్నాయి. వారు నేరం అంగీకరించేలా తమను బలవంతం చేశారనేదానితోపాటూ, ఇంకా చాలావాటిపై 1955లో ప్రివీ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుండవచ్చు. కానీ అలా చేయలేదు" అని ప్రివీ కౌన్సిల్ తన తీర్పులో పేర్కొంది.
"వారి నేరారోపణలను తారుమారు చేయడానికి వేరే దారే లేకుండా పోయింది. దురదృష్టవశాత్తూ ఈ విచారణ గర్నసీ న్యాయ వ్యవస్థపై ఒక మచ్చగా మిగిలిపోతుంది" అంటారు ఓ కానర్.
చార్లెస్ ఫ్రెండ్ కొడుకు, కీత్ ఫ్రెండ్ మాత్రం దీనిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
"నాకు ఇది చాలా నిరుత్సాహంగా, అన్యాయంగా అనిపించింది. మా కుటుంబంపై ఆ మచ్చ ఇప్పటికీ, అలాగే ఉంది. వారందరూ సజీవంగా ఉన్నారా, లేదా అనేది ముఖ్యం కాదు. వారిపై మోపిన నేరాలు రికార్డుల్లో అలాగే నిలిచిపోయాయి" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 19 ఏళ్ల కిందట సర్జరీతో విడిపోయిన ఈ అవిభక్త కవలలు... ఇప్పుడు ఎలా ఉన్నారంటే...
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- BBC SPECIAL: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పిల్లలకు తల్లి ఒడి లాంటి బడి 'శాంతివన్'
- రైతు దినోత్సవం: కౌలు రైతుల కడగండ్లు తీరేదెన్నడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








