భారతీయ పల్లెటూరి టీచర్‌కు అంతర్జాతీయ అవార్డు.. 7.4 కోట్ల ప్రైజ్ మనీలో సగం దానం

పన్నెండు వేలమందితో పోటీ పడి రంజిత్ ఈ అవార్డును గెలుచుకున్నారు.
ఫొటో క్యాప్షన్, పన్నెండు వేలమందితో పోటీ పడి రంజిత్ ఈ అవార్డును గెలుచుకున్నారు.
    • రచయిత, సీన్ కాఫ్లాన్
    • హోదా, బీబీసీ న్యూస్ ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్

భారతదేశంలోని ఓ పల్లెటూరుకు చెందిన టీచర్ ఒకరు గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ అనే ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. అమ్మాయిలకు విద్య అందించడంలో ఆయన చూపిన చొరవకు ఈ అవార్డు దక్కింది.

రంజిత్ సింగ్ దిశాలే మహారాష్ట్రలోని కరువు పీడిత ప్రాంతంలో ఉన్న పరితేవాడి అనే గ్రామంలోని జిల్లా పరిషద్ ప్రైమరీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు.

వరల్డ్ మోస్ట్ ఎక్సెప్షనల్ టీచర్ అవార్డ్ కోసం జరుగుతున్న పోటీకి ఆయన దరఖాస్తు చేశారు. అందులో పాల్గొన్న 12 వేలమంది టీచర్ల మీద విజయం సాధించి ఆయన ఈ అవార్డు సొంతం చేసుకున్నారు.

అయితే రంజిత్ సింగ్ దిశాలే తనకు దక్కిన 10 లక్షల డాలర్ల (సుమారు రూ.7 కోట్ల 40 లక్షలు) లో సగం సొమ్మును తనతోపాటు పోటీలో పాల్గొన్న వారిలో టాప్ 10 పోటీదారులకు ఇచ్చేశారు.

ఇంగ్లండ్‌కు చెందిన జెమీ ఫ్రాస్ట్‌కు కోవిడ్ హీరో స్పెషల్ ప్రైజ్ దక్కింది. ఆయన ఫ్రీ మ్యాథ్స్ వెబ్ సైట్ నడుపుతున్నారు. విజేతలకు ఆన్ లైన్ లో జరిగిన కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు.

సంక్షోభ ప్రాంతాలలోని విద్యార్ధులకు రంజిత్ చదువు చెప్పారు.
ఫొటో క్యాప్షన్, సంక్షోభ ప్రాంతాలలోని విద్యార్ధులకు రంజిత్ చదువు చెప్పారు.

‘విద్య ప్రతి ఒక్కరి జన్మహక్కు’

‘‘ఈ కష్టకాలంలో కూడా చాలామంది టీచర్లు పిల్లల జన్మహక్కు అయిన విద్యను అందించేందుకు చాలా కష్టపడుతున్నారు’’ అన్నారు 32 ఏళ్ల దిశాలే.

‘‘ఒకరికి ఏదైనా ఇవ్వడం, నా దగ్గర ఉన్నది ఇతరులకు పంచడం నాకు అలవాటు’’ అన్నారాయన. అందుకే తనకు వచ్చిన ప్రైజ్ మనీలో సగం డబ్బును టాప్ 10 పోటీదార్లకు పంచానని అన్నారు.

బాలికలకు చదువు నేర్పించడం, పరీక్షల్లో వారికి మంచి ఫలితాలు వచ్చేలా చూడటం, తద్వారా బాల్య వివాహాలను నిరోధించడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.

ఆయన కేవలం తన స్కూల్లోనే కాకుండా 83 దేశాలకు చెందిన విద్యార్ధులకు సైన్స్ క్లాసులు బోధించారు. ముఖ్యంగా సంక్షోభ పీడిత ప్రాంతాలలోని విద్యార్ధుల కోసం ఆయన ప్రత్యేకంగా క్లాసులు తీసుకున్నారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమయంలో కొందరు టీచర్లు తీసుకున్న చొరవ, చేసిన కృషి సమస్యను తగ్గించగలిగింది’’ అన్నారు యునెస్కో అసిస్టెంట్ డైరక్టర్ స్టెఫానియా గియాన్నిని. ఈ పోటీకి యునెస్కో కూడా భాగస్వామిగా వ్యవహరించింది.

‘‘మీ ప్రైజ్ మనీని మిగిలిన పోటీదార్లకు పంచడం ద్వారా ఒకరికి ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు’’ అంటూ రంజిత్ సింగ్ దిశాలే నిర్ణయాన్ని పోటీ నిర్వాహకులలో ఒకరైన సన్నీవర్కే కొనియాడారు.

లాక్ డౌన్ కాలంలో జెమీ ఫ్రాస్ట్ క్లాసులు చాలామంది విద్యార్ధులకు ఉపయోగపడ్డాయి.
ఫొటో క్యాప్షన్, లాక్ డౌన్ కాలంలో జెమీ ఫ్రాస్ట్ క్లాసులు చాలామంది విద్యార్ధులకు ఉపయోగపడ్డాయి.

కోవిడ్ హీరో

రంజిత్ సింగ్ నిర్ణయంతో ఈ పోటీలో టాప్ టెన్ లో నిలిచిన ఒక్కొక్కరికీ 40,000 యూరోలకు (సుమారు రూ. 35 లక్షలు) పైగా సొమ్ము అందింది.

వీరిలో ఇటలీ, బ్రెజిల్, వియాత్నాం, మలేసియా, నైజీరియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, అమెరికా, బ్రిటన్ కు చెందిన పోటీదార్లు ఉన్నారు.

రంజిత్ సింగ్ దిశాలే ప్రైజ్ మనీని పంచుకున్న వారిలో బ్రిటన్ కు చెందిన టిఫిన్ స్కూల్ లో పని చేస్తున్న జెమీ ఫ్రాస్ట్ కూడా ఒకరు. ఆయన డాక్టర్ ఫ్రాస్ట్ మ్యాథ్స్ పేరుతో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ కాలంలో ఇంటి దగ్గర నుంచి చదువు నేర్చుకునే వారికి ఇది బాగా ఉపయోగపడింది.

జెమీ ఫ్రాస్ట్ కు కోవిడ్ హీరో స్పెషల్ అవార్డు కూడా దక్కింది. ఈ అవార్డు కింద ఆయనకు సుమారు 34000 యూరోలు (సుమారు రూ. 30 లక్షలు) ప్రైజ్ మనీగా వచ్చింది.

కరోనా మహమ్మారి విద్యారంగంలో అసమానతలను పెంచిందని జెమీ ఫ్రాస్ట్ వ్యాఖ్యానించారు. ‘‘ నాకు దొరికిన సమయంలో వీలైనంత వరకు పిల్లలకు చదువు చెప్పడానికి ప్రయత్నించాను. నా ఆన్ లైన్ క్లాసుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలామంది పిల్లలకు లాభం కలిగింది’’ అన్నారు ఫ్రాస్ట్.

ఫ్రాస్ట్ సేవలను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా మెచ్చుకున్నారు. ‘‘ మనం ఇప్పుడు ఎంతో కష్టకాలంలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మీరు చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయం’’ అన్నారు ప్రధాని బోరిస్ జాన్సన్.

వచ్చే ఏడాది ఈ అవార్డులలో విద్యార్ధులను కూడా చేర్చనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)