GHMCలో హంగ్: హైదరాబాద్ ఎన్నికలు చెపుతున్నదేమిటి? - ఎడిటర్స్ కామెంట్

ఫొటో సోర్స్, facebook.com/KTRTRS
- రచయిత, జీఎస్ రామ్మోహన్
- హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు
గ్రేటర్ పీఠాన్ని అధికార తెలంగాణ రాష్ర్ట సమితి ఎలాగోలా నిలుపుకోవచ్చేమో కానీ బీజేపీ నుంచి అయితే అనూహ్యమైన పోటీ ఎదుర్కొంది. అటూ ఇటూ తలపడిన ప్రధాన పార్టీలు రెండూ ఫలితాల తర్వాత సంబరాలు చేసుకునే దృశ్యం ప్రస్తుత తెలంగాణ రాజకీయాలకు అద్దం పడుతోంది.
కాకపోతే, టీఆర్ఎస్ కార్యకర్తలు లాంఛనంగా సంబరాలు చేసుకుంటున్నా అంత సంతోషం వారి నాయకుల్లో కనిపించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి రాష్ర్ట అధికార పార్టీకి ఇక రోజువారీ సవాళ్లు తప్పదనే విషయం స్పష్టమైంది.
దుబ్బాక ఉప ఎన్నిక ఆ సంకేతం పంపిస్తే, జీహెచ్ఎంసీ ఎన్నికలు దాన్ని మరింత ధాటిగా, ఘాటుగా చాటి చెప్పాయి. కాంగ్రెస్ తెర వెనక్కు వెళ్లిపోయింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి నాయకులు బీజేపీకి క్యూకడతారని, ఆల్రెడీ కొందరు మంత్రులు మాజీ మంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఆరెస్సెస్ సీనియర్ నాయకులు రాకా సుధాకరరావు బీబీసీకి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ దృశ్యం చూడబోతారని కూడా ఆయన అన్నారు.
ఇది బీజేపీలో పెరిగిన కొత్త విశ్వాసాన్ని చాటి చెపుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జరిగిన తీరు బయటివారినే కాదు, హైదరాబాదీయులను కూడా ఆశ్చర్యపరిచింది. మున్సిపల్ ఎన్నికలకు ఇంత హడావిడి చరిత్రలో ఎరుగనిది. కేంద్రహోం మంత్రి అమిత్ షా, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సహా పలువురు బీజేపీ స్టాల్ వార్ట్స్ ప్రచారానికి దిగడంతో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జాతీయవార్తలుగా మారాయి.
ఇంతకీ ఈ ఫలితాలు మనకిస్తున్న సందేశమేమిటి? హైదరాబాద్ పరిధిని దాటి చూస్తే దీనికున్న రాజకీయ ప్రాధాన్యమేంటి?

ఫొటో సోర్స్, facebook/uttamkumarreddy
కాంగ్రెస్ నీరసం, బీజేపీ ఉత్థానం
తెలంగాణలో ప్రాక్టికల్గా తానే విపక్షమని బీజేపీ నిరూపించదల్చుకుంది. బలమైన ఇమేజ్ ఉన్న నాయకుడుగానీ, సమష్టిగా పనిచేసే స్వభావం గానీ కాంగ్రెస్‌లో లేకపోవడం అనేది బీజేపీకి కలిసొచ్చిన అంశం. అలాగే ఐటి కారిడార్లో బీజేపీ గెలుపు తీరు చూస్తే ఇతర ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి ట్రాన్స్‌ఫర్ అయిందని అర్థమవుతుంది. అటు ఆంధ్రావారు స్థిరపడిన శివారు ప్రాంతాలు మాత్రం ఎక్కువగా టీఆర్ఎస్‌కు ఓటు వేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వారు టీఆర్ఎస్ తో ఉంటారని, అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ వైపు వస్తారని బీజేపీ నాయకులు ధీమాగా చెపుతున్నారు.
దూకుడు మాటలకు చేతలకు పర్యాయపదంగా ఉన్న టీఆర్ఎస్ నాయకత్వాన్ని అంతకంటే దూకుడుతో ఎదుర్కొనే వ్యూహంతో బీజేపీ ముందుకెళుతున్నది. పార్లమెంట్ ఎన్నికలు కొంత ఉత్సాహమిస్తే, దుబ్బాక ఉప ఎన్నిక మరింత బూస్ట్ ఇచ్చింది. దుబ్బాక ఇచ్చిన నైతిక స్థైర్యమే ఇపుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు టానిక్‌గా పనిచేసింది.
హైదరాబాద్ సమీప చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వచ్చిన వరదలు, వాటిని ఎదుర్కోవడంలో, నష్టపరిహారం ఇవ్వడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరులో లోపాలు, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన అంశాలు బీజేపీకి ఉపయోగపడ్డాయి. బీజేపీ ఓట్ల శాతాన్ని గమనిస్తే టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్నవారి ఓట్లు చీలిపోకుండా తమకు అనుకూలంగా పోలరైజ్ చేసుకోవడంతో సక్సెస్ అయినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది.
ముఖ్యంగా తిరుగులేని అధికారం వల్ల కేసీఆర్ కుటుంబం అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నదని, ప్రత్యామ్నాయం అవసరమని భావించేవారు గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. వాళ్లలో కూడా వామపక్ష, సెక్యులర్ భావాలు బలంగా ఉన్న వారు టీఆర్ఎస్ వైపు నిలిచారు. టీఆర్ఎస్‌పై అసంతృప్తి ఉన్న వారిలో మిగిలిన వారు పెద్ద సంఖ్యలో బీజేపీ వైపు మొగ్గారని అర్థమవుతోంది. భావజాలాలను దాటి పోలరైజేషన్ జరిగింది.
కారణాలు అనేకం, కానీ, రిజల్ట్ ఒకటి. ఒక్కముక్కలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది బీజేపీ.

ఫొటో సోర్స్, facebook.com/KTRTRS
గతానికి ఇప్పటికి పోలిక సరైందేనా!
గత ఎన్నికలతో పోల్చి అప్పుడు నాలుగు డివిజన్లు మాత్రమే గెలిచిన బీజేపీ నలభై దాటిందని అనేవారు ఆ ఎన్నికలు ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికలని గుర్తుంచుకోవాలి. అపుడు తెలంగాణను సాధించిన పార్టీగా గుర్తింపు పొందిన టిఆర్ఎస్ హవాకు అడ్డే లేదు. అది స్వీప్ చేయగలిగింది. ఎంఐఎం సీట్లను పక్కనబెడితే మిగిలిన చోట్ల అదే ఊపు. అదొక ఉద్వేగ సందర్భం. మామూలుగా అయితే బీజేపీకి హైదరాబాద్‌లో తొలి నుంచి అంతో ఇంతో క్యాడర్ ఉన్నది. పట్టున్నది. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ప్రస్తుత హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఇంకా పలువురు ఎంపీలు నగరం నుంచే ఎన్నికైన విషయం గుర్తుంచుకోవాలి. కాకపోతే కొత్త సన్నివేశంలో ఆ పార్టీ కొత్త వ్యూహంతో, కొత్త నాయకత్వంతో ముందుకెళుతున్నది.
దుబ్బాక ఎఫెక్ట్- ఏమిటి దాని ప్రాధాన్యం
తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడిన తర్వాత ప్రతి ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ గెలుపొందుతూ వస్తున్నది. దానికి బ్రేక్ వేసింది బీజేపీ. ఇటీవల హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు వెయ్యి పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో అసెంబ్లీలో ఉన్న ఒక్కసీటుకు మరో సీటును జత చేసుకుంది బీజేపీ. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టిఆర్ఎస్‌కు సన్నిహితంగా వ్యవహరించే ఎంఐఎంకు ఏడుగురున్నారు.
దుబ్బాకలో గెల్చిన రఘనందన్ రావు ఒకనాటి కేసీఆర్ అనుచరుడని, అదే కులానికి చెందిన నాయకుడన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. పార్టీతో పాటు సామాజిక సమీకరణాలు కూడా ఇక్కడ పనిచేశాయి. అవన్నీ ఎన్నున్నా ఈ ఎన్నికకు సింబాలిక్ ప్రాధాన్యం అయితే చాలా ఉంది. దుబ్బాక చుట్టూ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ర్ట ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, అయన కుటుంబసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటివి. అట్లా ‘మీ కోటలోనే మిమ్మల్ని ఓడించాం’ అనే సందేశం అక్కడ బీజేపీ ఇవ్వగలిగింది. ఇది రాష్ర్టంలోని బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. వారి కేంద్ర నాయకత్వంలో ఆశలు బలపడేలా చేసింది. ఆ వెనువెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడం వారికి కలిసొచ్చింది.

ఫొటో సోర్స్, facebook/BJP4Telangana
బీజేపీ యువ నాయకత్వం
బీజేపీకి గతంలో నేతృత్వం వహించిన నాయకులకు ఇప్పటి నాయకులకు చాలా తేడా ఉంది. ఇతర పార్టీల నాయకులను, మంత్రులను వాడు వీడు అని పిలిచే సంస్కృతి కానీ, ఇంత లోలెవల్ తిట్ల భాష గానీ గతంలో లేదు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే తీవ్రమైన దూకుడు, ఇంతకుముందు నాయకుల కంటే తీవ్రమైన పోలరైజ్డ్ నినాదాలు అవసరమని ప్రస్తుత నాయకత్వం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అనుభవలేమి, భాషలో తొట్రుపాటు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి.
తాము మేయర్ పీఠం గెలిస్తే ట్రాఫిక్ ఉల్లంఘనల చలాన్లు ప్రభుత్వమే కడుతుందన్న బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడి హామీ అంతటా విమర్శలపాలయ్యింది. అయితే అలాంటి లోటుపాట్లున్నా వీధిన పడి వారు మాట్లాడే తీరు, పోట్లాడే తీరు వారి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఆకట్టుకుందని ఇటీవలి పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది.
బెంగాల్ తర్వాత ఆపరేషన్ తెలంగాణ
బీజేపీ కొంత కాలంగా బెంగాల్ మీద కేంద్రీకరించి పనిచేస్తోంది. రాబోయే ఎన్నికల్లో అధికార తృణమూల్ ను ఢీకొట్ట గలిగిన పార్టీగా ఇప్పటికే వార్తల్లో నలుగుతోంది. బెంగాల్ తర్వాత తెలంగాణ మీద దృష్టి కేంద్రీకరించొచ్చని కొంత కాలంగా అంచనాలున్నాయి. అవి కేవలం అంచనాలు కాదని నిరూపించింది బీజేపీ నాయకత్వం.
తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనబోయే ప్రత్యర్ధి కాంగ్రెస్ కాదు, బీజేపీ అనే సంకేతాన్ని పంపించదల్చుకున్నది. దక్షిణాదిన కర్నాటకకు పరిమితం కాకుండా విస్తరించడానికి పెనుగులాడుతున్న బీజేపీ ఇపుడు ఇంతకుమున్నెన్నడూ లేనంత బలంగా తెలంగాణ మీద దృష్టి కేంద్రీకరించబోతోంది. ఒక కేంద్ర మంత్రి పూర్తిగా హైదరాబాద్‌లోనే మకాం వేసి పార్టీని పరిపుష్టం చేసే పని మీద ఉండే అవకాశం ఉందని పరివార్ ఇన్ సైడర్స్ చెపుతున్నారు.

ఫొటో సోర్స్, KCR/Facebook
కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల మాటేంటి?
కేసీఆర్ ఇటీవల జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తునట్టు ప్రకటించారు. డిసెంబర్ రెండో వారంలో పలు పార్టీల నాయకులను హైదరాబాద్ సమావేశానికి ఆహ్వానించినట్టు ప్రకటించారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ఆయన అటువంటి ప్రయత్నం చేసి ఉన్నారు. కోలకతా వెళ్లి మమతాబెనర్జీని, చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసి వచ్చారు. కేంద్రంలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకుండా చిన్న పార్టీలు కీలకమయ్యే స్థితి వస్తుందని అప్పట్లో టీఆర్ఎస్ అంచనా వేసింది. అప్పుడు కొంతమంది టీఆర్ఎస్ నేతలతో మాట్లాడినపుడు అది స్పష్టమైంది. ఆ స్థితే వస్తే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావించారు. బేరసారాల్లో బలమైన స్థానంలో ఉండడం కోసం ఆంధ్రా సీఎం జగన్ మోహన్ రెడ్డితో అప్పట్లో అత్యంత సఖ్యత కనబరిచారు.
కానీ, అంచనాలను మించి బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో ఆ ప్రయత్నాలు అటకెక్కాయి. ఇప్పట్నించి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. దేవెగౌడ ప్రధాని అయినప్పటి నుంచి ప్రాంతీయ పార్టీల నేతల్లో అలాంటి ఆశలు బలపడుతూ వస్తున్నాయి. పరిస్థితులు కలిసి వస్తే తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి, రాష్ర్ట పగ్గాలను తన కుమారుడు కేటీఆర్‌కు అప్పగించాలని ఆయన కోరుకుంటున్నట్టు సమాచారం ఉంది. అయితే బీజేపీ ఇపుడు రాజధాని హైదరాబాద్‌లో ఇంత బలమైన సవాల్ విసరడం ద్వారా కేంద్రం సంగతేమో ముందు రాష్ర్టంలో అధికారాన్ని కాపాడుకోండి చూద్దాం అన్నట్లు సవాల్ విసిరింది. నిన్నమొన్నటి దాకా అన్ని పార్టీల నేతలను చివరకు లెజిస్లేచర్ పార్టీలను కూడా నయానో భయానొ తమ పార్టీలో విలీనం చేసుకుంటూ నల్లేరు మీద నడకలాగా సాగుతున్న తెలంగాణ రాష్ర్ట సమితి ప్రయాణం ఇకముందు అంత సౌకర్యంగా ఉండదనే సంకేతమైతే గోడమీద రాతలాగా బలంగా తెలుస్తూనే ఉంది.
ఒరిస్సా మోడల్ పై టీఆర్ఎస్ ఆశలు
మరోవైపు బీజేపీ ప్రభావాన్ని కొన్ని పాకెట్లకే పరిమితం చేయగలిగితే ఒరిస్సాలో బిజూ జనతాదళ్ లాగా అధికారాన్ని పదిలంగా కాపాడుకోవచ్చని టీఆర్ఎస్ ఆశించొచ్చు. రాష్ర్టంలో అన్ని చోట్లా ఎంతో కొంత క్యాడర్ ఉన్న కాంగ్రెస్‌ను పూర్తిగా తీసిపారేయలేమని, వారు కనుక కాస్త పుంజుకోగలిగితే బీజేపీ వైపు విపక్ష ఓటు పోలరైజ్ కాకుండా చీలిపోతుందని రాజకీయ విశ్లేషకుడు జింకా నాగరాజు చెప్పారు. ఒరిస్సాలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో పోరాడుతూ కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీతో సఖ్యత నెరిపే ఒరిస్సా మోడల్ టీఆర్ఎస్ ముందుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఎంత ఉత్సాహం మీదున్నా సంక్షేమ పథకాలతో రాష్ర్టంలో మూల మూలలకు చొచ్చుకుపోయిన టీఆర్ఎస్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. కేంద్రం నుంచి హేమాహేమీలంతా దిగినా నగరంలో అధిక సీట్లు సాధించిన పార్టీని తీసేయడానికి వీల్లేదు. కాకపోతే భేదాభిప్రాయాన్ని కానీ, నిరసనను కానీ బహిరంగంగా తెలపలేక లోలోపల నసుగతూ ఉన్న నాయకులను ఎలా మేనేజ్ చేస్తారు, కుటుంబ పాలన ముద్రనుంచి ఆ పార్టీ ఎంత వరకు బయటపడగలదు, పాలనలో లొసుగులను ఎలా పరిష్కరించుకోగలదు అనేదాని మీద కూడా చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ హయాంలో తిరుగులేనట్టు కనపించిన కాంగ్రెస్ కొద్ది కాలంలోనే ఎలా మారిపోయిందే చూస్తూనేఉన్నాం.
ఇవి కూడా చదవండి:
- కౌన్సిలర్‌గా గెలిచిన అడాల్ఫ్ హిట్లర్ .. పోలైన ఓట్లలో 85 శాతం ఆయనకే
- హైదరాబాద్‌కు మరో పేరు ఉందా? భాగ్యనగర్, చించలం.. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
- భారతీయ పల్లెటూరి టీచర్‌కు అంతర్జాతీయ అవార్డు.. 7.4 కోట్ల ప్రైజ్ మనీలో సగం దానం
- ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు చైనా పెను ముప్పు: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్
- థియేటర్లతోపాటు డిజిటల్‌లోనూ సినిమాల విడుదల.. వార్నర్ బ్రదర్స్ నిర్ణయంతో హాలీవుడ్లో చిచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









