థియేటర్లలో విడుదలతో పాటే సినిమాల స్ట్రీమింగ్... వార్నర్ బ్రదర్స్ నిర్ణయంతో హాలీవుడ్‌లో చిచ్చు

ఏకకాలంలో డిజిటల్ రిలీజ్ లపై సినిమా థియేటర్ల యాజమాన్యాలు అభ్యంతరం చెబుతున్నాయి

ఫొటో సోర్స్, WARNER BROS

ఫొటో క్యాప్షన్, ఏకకాలంలో డిజిటల్ రిలీజ్‌పై సినిమా థియేటర్ల యాజమాన్యాలు అభ్యంతరం చెబుతున్నాయి

ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం థియేటర్లలోనే కాకుండా స్ట్రీమింగ్ లోనూ సినిమాలు విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ తీసుకున్న నిర్ణయం హాలీవుడ్ స్టూడియోలు, సినిమా థియేటర్ యాజమాన్యాల మధ్య చిచ్చుపెట్టింది.

త్వరలో విడుదల కాబోయే సైంటిఫిక్ మూవీ ‘డ్యూనే’, ‘ది మ్యాట్రిక్స్’ సీక్వెల్ సినిమాలను థియేటర్లతోపాటు హెచ్‌బీఓ మ్యాక్స్‌లో కూడా విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ నిర్ణయించింది.

అమెరికాలో కొత్త సినిమాలు సర్వసాధారణంగా థియేటర్లలో విడుదలవుతాయి. కానీ కరోనా కారణంగా చాలా సినిమా థియేటర్లు మూతపడటంతో విడుదల ఆగి హాలీవుడ్ స్టూడియోలకు ఖర్చులు పెరిగాయి.

అందుకే 2021లో విడుదలయ్యే తన అన్ని సినిమాలను హెచ్‌బీఓ మ్యాక్స్‌లో విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ నిర్ణయించింది. హెచ్‌బీఓ మ్యాక్స్‌ వార్నర్ బ్రదర్స్ మాతృ సంస్థ ఏటీ అండ్ టీకి చెందిన స్ట్రీమింగ్ కంపెనీ.

అమెరికాలో థియేటర్లలో విడుదలైన వెంటనే ఇవి హెచ్‌బీఓ మ్యాక్స్‌లో కూడా విడుదలవుతాయి. అయితే బ్రిటన్‌లో మాత్రం అవి నెల రోజుల తర్వాత అందుబాటులోకి వస్తాయి.

'మాట్రిక్స్ 4' లో నియో పాత్రలో కీను రీవ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 'మాట్రిక్స్ 4' లో నియో పాత్రలో కీను రీవ్స్

రెడీ టు రిలీజ్

‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’, ‘మోర్టల్ కంబాట్’, ‘ది సూసైడ్ స్క్వాడ్’ లాంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ‘వండర్ ఉమన్ 1984’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లతోపాటు హెచ్‌బీఓ మ్యాక్స్‌లో కూడా విడుదలవుతాయని వార్నర్ బ్రదర్స్ ఇంతకు ముందే ప్రకటించింది.

‘‘కరోనా మహమ్మారి కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సి వచ్చింది’’ అని వార్నర్ మీడియా స్టూడియోస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నా సర్నాఫ్ అన్నారు.

‘‘కొత్త సినిమాల విడుదల అనేది అమెరికాలో సినిమా థియేటర్లకు శ్వాసలాంటిదన్న విషయం మాకు తెలుసు. కానీ ప్రస్తుతం సినిమా థియేటర్లు చాలా వరకు మూతపడి ఉన్నాయి. వచ్చే సంవత్సరం ప్రేక్షకుల సంఖ్య కూడా తగ్గించాల్సి ఉంది. ఈ పరిస్థిత్లుల్లో ఇలాంటివి తప్పదు’’ అని సర్నాఫ్ వ్యాఖ్యానించారు.

కరోనా కాలంలో ఇలాంటి నిర్ణయాలు తప్పవని వార్నర్ బ్రదర్స్ సంస్థ అంటోంది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కరోనా కాలంలో ఇలాంటి నిర్ణయాలు తప్పవని వార్నర్ బ్రదర్స్ సంస్థ అంటోంది

ఇంతకు ముందే వివాదం

థియేటర్లతోపాటు స్ట్రీమింగ్ లో కూడా ఒకేసారి సినిమాలు విడుదల చేయాలన్న యూనివర్సల్ ఫిల్మ్స్ నిర్ణయంపై అమెరికాలో అతిపెద్ది సినిమా థియేటర్ల సంస్థ ఏఎంసీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతోపాటు ఆ సంస్థ సినిమాలను తీసుకోబోమంటూ నిషేధం ప్రకటించింది.

ఆ తర్వాత ఆ రెండు సంస్థలు ఒక అంగీకారానికి వచ్చి థియేటర్లలో విడుదలైన 17రోజుల తర్వాత డిజిటల్ లో రిలీజ్ పై ఒప్పందానికి వచ్చాయి.

‘‘ ఇది సినిమా థియేటర్లకు వెళ్లలేని వారి కోసం మేం వేసిన ఏడాది ప్రణాళిక మాత్రమే’’ అన్నారు సర్నాఫ్.

2021లో మంచి మంచి సినిమాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, వాటిని ప్రేక్షకులకు దూరం చేయడం తమకు ఇష్టం లేదని సర్నాఫ్ వ్యాఖ్యానించారు. ‘‘మా ప్రణాళిక అందరికీ ప్రయోజనం కలిగించేది’’ అన్నారామె.

వీడియో క్యాప్షన్, క‌రోనావైర‌స్: భ‌విష్య‌త్తులో వినోద రంగం ఎలా ఉండ‌బోతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)