అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి

అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఫ్రాంక్ గార్డనర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

20 ఏళ్లుగా అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా, బ్రిటన్ సేనలు ఆ దేశాన్ని వీడుతున్నాయి. అక్కడ మిగిలిన 2500-3500 మంది అమెరికా సైనికులు సెప్టెంబర్ 11 నాటికి తిరిగి స్వదేశానికి చేరుకుంటారని ఈ నెలలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. బ్రిటన్ కూడా తమ 750 మంది సైనికులను వెనక్కు పిలిచింది.

ఈ తేదీ చాలా ముఖ్యమైనది.. అల్ ఖైదా అమెరికాపై 9/11 దాడులకు అఫ్గానిస్తాన్ నేలమీద నుంచే పథకం వేసింది. తర్వాత అమెరికా నేతృత్వంలో పక్కా ప్రణాళిక ప్రకారం తాలిబన్లను అధికారం నుంచి తప్పించారు. అల్ ఖైదాను తాత్కాలికంగా దేశం నుంచి వెళ్లగొట్టారు.

20 ఏళ్ల పాటు ఈ దేశ భద్రతలో సైన్యం చాలా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఎంతో వ్యయం చేశారు, ఎంతోమంది జీవితాలు కోల్పోయారు. ఇక్కడ అమెరికా సైన్యంలోని 2,300 మందికి పైగా సైనికులు చనిపోయారు.

20 వేల మందికి పైగా సైనికులు గాయపడ్డారు. బ్రిటన్‌కు చెందిన 450 మంది సైనికులతోపాటూ మిగతా దేశాలకు చెందిన ఎంతోమంది భద్రతా బలగాలకు చెందినవారు చనిపోయారు.

కానీ, దీనివల్ల అత్యంత తీవ్రంగా నష్టపోయింది మాత్రం అఫ్గానిస్తాన్ పౌరులే. అక్కడ 60 వేలకు పైగా భద్రతా సిబ్బంది, పోలీసులు చనిపోయారు. వీరికి రెట్టింపు సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఇక్కడ బలగాలను మోహరించడం వల్ల అమెరికాలో పన్ను చెల్లింపుదారులపై దాదాపు లక్ష కోట్ల డాలర్ల వరకు భారం పడింది.

దీనివల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా, దీనిని ఎలా పరిగణించాలి..

ఒక్క అడుగు వెనక్కు వేసి, పశ్చిమ బలగాలు అసలు అక్కడకు ఎందుకు వెళ్లాయి, ఏం సాధించాలని అనుకున్నాయి అనేది ఆలోచిద్దాం...

నైరోబీలో అమెరికా ఏంబసీపై దాడి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నైరోబీలో అమెరికా ఏంబసీపై దాడి తర్వాత

తీవ్రవాద గ్రూప్ అల్ ఖైదా తమ నేత ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో 1996 నుంచి 2001 వరకూ ఐదేళ్లపాటు అఫ్గానిస్తాన్‌లో వేళ్లూనుకోవడంలో విజయవంతం కాగలిగింది. అది ఆ దేశంలో తీవ్రవాద శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేసింది. అందులో కుక్కలపై విష వాయువులు ప్రయోగించడం లాంటి ఎన్నో చేసింది.

ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కనీసం 20 వేల మంది జిహాదీలను అల్ ఖైదాలో చేర్చుకుంది. వారందరికీ శిక్షణ ఇచ్చింది. వీరి ద్వారా 1998లో కెన్యా, టాంజానియాలో అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు చేసి 224 మంది మరణానికి కారణమైంది. వీరిలో చాలా మంద ఆఫ్రికా పౌరులే ఉన్నారు.

అల్ ఖైదా అఫ్గానిస్తాన్ కేంద్రంగా సులభంగా తీవ్రవాద కార్యకలాపాలు సాగించే శక్తి సంపాదించింది. ఎందుకంటే, అప్పటి తాలిబన్ ప్రభుత్వం వారికి అండగా నిలిచింది.

సోవియట్ రెడ్ ఆర్మీ తిరిగి అడుగుపెట్టి దేశంలో వినాశకరమైన అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత తాలిబన్లు 1996లో మొత్తం దేశాన్ని తమ అదుపులోకి తెచ్చుకోగలిగారు.

అమెరికా, తమ మిత్రదేశం సౌదీ అరేబియా సాయంతో అల్ ఖైదాను బయటకు వెళ్లగొట్టేలా తాలిబాన్లను ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ వాళ్లు దానికి ఒప్పుకోలేదు.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు

ఫొటో సోర్స్, Reuters

తాలిబన్లను అధికారంలోంచి తప్పించారు

9/11 దాడులకు బాధ్యులైనవారిని తమకు అప్పగించాలని 2001 సెప్టెంబర్‌లో అంతర్జాతీయ సమాజం తాలిబన్లను కోరింది. కానీ వాళ్లు అంగీకరించలేదు.

తర్వాత ఆ మరుసటి నెలలోనే, అఫ్గానిస్తాన్‌ సేనలు అమెరికా, బ్రిటిష్ సైన్యం మద్దతుతో కాబూల్ వైపు దూసుకెళ్లాయి.

తాలిబన్లను అధికారం నుంచి తప్పించిన అమెరికా, బ్రిటన్ సైన్యం, అల్ ఖైదాను పాకిస్తాన్ సరిహద్దుల్లోకి తరిమికొట్టగలిగాయి.

అప్పటి నుంచి అఫ్గానిస్తాన్ నేలపై నుంచి ఒక్క అంతర్జాతీయ తీవ్రవాద దాడి కూడా జరగలేదని ఇదే వారంలో సీనియర్ భద్రతా వర్గాలు బీబీసీతో చెప్పాయి.

అందుకే, అంతర్జాతీయ తీవ్రవాదం విషయానికి వస్తే, అఫ్గానిస్తాన్‌లో పశ్చిమ బలగాలు తమ లక్ష్యాన్ని అందుకోవడంలో విజయం సాధించినట్లే చెప్పాలి.

అమెరికా దళాలు

రెండు దశాబ్దాలు దాటినా శాంతి లేదు

దీనిని పశ్చిమ బలగాల విజయంలా చూడడమంటే అక్కడ ప్రాణాలు కోల్పోయిన అఫ్గాన్ సైనికులు, సామాన్యులను నిర్లక్ష్య చేసినట్టే అవుతుంది.

20 ఏళ్ల తర్వాత కూడా శాంతి లేదు.

యాక్షన్ ఆన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వయలెన్స్ అనే రీసెర్చ్ గ్రూప్ వివరాల ప్రకారం 2020లో పేలుడు పదార్థాలు, కాల్పుల వల్ల అఫ్గానిస్తాన్‌లో జరిగినంత ప్రాణనష్టం ప్రపంచంలో ఇంకే దేశంలోనూ జరగలేదు.

అల్ ఖైదా, ఇస్లామిక స్టేట్, మిగతా తీవ్రవాద సంస్థలు పూర్తిగా అంతం కాలేదు. పశ్చిమ బలగాలు వెళ్లిపోతాయనే వార్తతో ఈ సంస్థలన్నీ ఉత్సాహంగా ఉన్నాయి. మరింత బలంగా ఏకమయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి.

దోహా శాంతి చర్చలు

ఫొటో సోర్స్, AFP

దోహా శాంతి చర్చలు

2003లో అఫ్గానిస్తాన్‌లోని ఒక మారుమూల ఫైర్ బేస్‌లో నేను అమెరికా సైన్యం 10 మౌంటెన్ డివిజన్‌తో ఎంబెడెడ్ జర్నలిస్టుగా ఉన్నాను.

నాకు బాగా గుర్తుంది. మిత్రదళాల సైన్యం ఉనికి తర్వాత ఎలా ఉంటుందో అని బీబీసీ సీనియర్ సహచరుడు ఫిల్ గుడ్విన్ మనసులో ఒక సందేహం ఉండేది.

ఆయన "20 ఏళ్లలోనే దక్షిణాన ఎక్కువ ప్రాంతాల్లో తాలిబన్లు మళ్లీ వచ్చేస్తారు" అన్నారు.

మనం ప్రస్తుత సమయానికి వస్తే, దోహాలో శాంతి చర్చలు, అఫ్గాన్ నేల నుంచి బలగాల ఉపసంహరణ తర్వాత వాళ్లు మొత్తం దేశమంతా ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే, "అంతర్జాతీయ సమాజం అఫ్గానిస్తాన్‌లో ఒక సభ్య సమాజాన్ని నిర్మించింది, అది తాలిబన్లు ఎలాంటి చట్టబద్ధతను కోరుకున్నారో దానిని మార్చేసింది" అని ఆ దేశంలో చాలాసార్లు పర్యటించిన బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ సర్ నిక్ నిక్టర్ అన్నారు.

"దేశంలో 2001తో పోలిస్తే మెరుగైన స్థితి ఉంది. తాలిబన్లు ఇప్పుడు చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉన్నారు" అని కూడా అన్నారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, AFP

భవిష్యత్తు ఎలా ఉంటుంది

ఏషియా పసిఫిక్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ సజ్జన్ గోహెల్ అభిప్రాయం మాత్రం మరోలా ఉంది.

అఫ్గానిస్తాన్‌లో 1990వ దశకంలో ఉన్న పరిస్థితి మళ్లీ ఏర్పడవచ్చనేది అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఆ సమయంలో అక్కడ తీవ్రవాదం పెరుగుతోందని ఆయన చెప్పారు.

"తీవ్రవాద శిక్షణ కోసం పశ్చిమ దేశాల నుంచి అఫ్గానిస్తాన్ వచ్చే వారితో ఒక కొత్త వేవ్ మొదలవుతుంది. కానీ, పశ్చిమ దేశాలు దాన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతాయి. ఎందుకంటే, అవి అప్పటికే అఫ్గానిస్తాన్ వదిలి వెళ్లిపోయుంటాయి" అన్నారు.

"వాటిని అడ్డుకోవడం అసాధ్యం కావచ్చు. ఎందుకంటే, అది రెండింటిపై ఆధారపడి ఉంటుంది. తాలిబాన్లు తమ అదుపులో ఉన్న ప్రాంతంలో అల్ ఖైదా, ఐఎస్ లాంటి కార్యకలాపాలను అనుమతిస్తారా అనేది ఒకటైతే, అంతర్జాతీయ సమాజానికి సంబంధించి అక్కడ ఏ ఉనికీ లేనప్పుడు, అది వారిని ఎదుర్కోవడంలో విజయం సాధించగలదా? అనేది రెండోది" అంటారు గోహెల్.

అందుకే, అప్గానిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందనే దాని గురించి అప్పుడే చెప్పడం అంత సులభం కాదు.

9/11 తర్వాత

ఫొటో సోర్స్, Reuters

9/11 తర్వాత

అఫ్గానిస్తాన్ భవిష్యత్ భద్రత అగమ్యగోచరం. పశ్చిమ బలగాలు ఈ వేసవిలో ఆ దేశాన్ని వీడి వెళ్లడం సురక్షితం కాదు. 9/11 తర్వాత కొంతమంది ఆ సైన్యం రెండు దశాబ్దాలపాటు అక్కడే ఉంటుందని అంచనావేశారు.

నేను అమెరికా, బ్రిటన్ ఎమిరేట్స్ సైనికులతో కలిసి రిపోర్టింగ్ చేయడానికి చాలాసార్లు అఫ్గానిస్తాన్ వెళ్లాను. ఆ ప్రయాణాల్లో ఒక చాలా ప్రత్యేకమైన జ్ఞాపకం ఒకటి ఉంది.

అమెరికా సైన్యం, పాకిస్తాన్ సరిహద్దులకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో కాల్పులు జరిపినప్పుడు అది జరిగింది.

మేం ఆకాశంలో నిండిన నక్షత్రాల కింద ఒక మట్టి కోటలో మందుగుండు నింపిన పెట్టెలపై కూర్చుని ఉన్నాం. తాలిబన్లు ప్రయోగించే రాకెట్లు కాసేపట్లో అక్కడ పడబోతున్నాయనే విషయం మాకు తెలీదు.

న్యూయార్క్‌కు చెందిన ఒక 19 ఏళ్ల సైనికుడు తన స్నేహితులను ఎలా పోగొట్టుకున్నానో నాకు చెప్పాడు. నాకు టైం వస్తే, ఇదే నా టైమ్ అవుతుంది అన్నాడు.

అప్పుడే ఇంకొకరు గిటార్ తీసి రేడియోహెడ్ బ్యాండ్ క్రీప్ పాట వాయించడం మొదలుపెట్టారు. కానీ సైనికుడు మాటలతో ఆ పాట ఆగింది.

తను "అసలు నేనిక్కడేం చేస్తున్నాను. నేనిక్కడివాడిని కాను" అన్నారు. అప్పుడు నేను కూడా "కాదు, బహుశా, ఇక్కడివాళ్లం కాదు" అని ఆలోచించడం నాకు గుర్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)