అఫ్గానిస్తాన్‌లో బలగాలను సెప్టెంబరు 11నాటికి ఉపసంహరించుకుంటామన్న అమెరికా - Newsreel

అఫ్గాన్‌లో అమెరికా బలగాలు

అఫ్గానిస్తాన్‌లో తమ దేశ బలగాలు సెప్టెంబరు 11నాటికి పూర్తిగా ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ త్వరలో ప్రకటన చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మే నాటికి బలగాలను వెనక్కి తీసుకుంటామని తాలిబాన్లతో గత ఏడాది ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఈ గడువును తాజాగా అమెరికా పొడిగిస్తోంది.

2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌లపై ఉగ్రవాద దాడులు జరిగి అప్పటికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతాయి.

మే 1నాటికి బలగాలను ఉపసంహరించుకోవడం కష్టమని ఇప్పటికే బైడెన్ స్పష్టంచేశారు.

మరోవైపు శాంతి స్థాపనకు తాము ఇచ్చిన మాటలు, వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో అతివాద ఇస్లామిక్ తాలిబాన్లు విఫలం అవుతున్నారని అమెరికా, నాటో అధికారులు ఎప్పటికప్పుడే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఉపసంహరణ సమయంలో అమెరికా బలగాలపై దాడులు చేస్తే, కఠిన పరిణామాలను తాలిబాన్లు ఎదుర్కోవాల్సి వస్తుందని రిపోర్టర్లతో అమెరికా అధికారులు చెప్పారు.

త్వరత్వరగా ఉపసంహరించుకుంటే అమెరికా బలగాలకే ముప్పని బైడెన్ భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ అంశంపై బుధవారం బైడెన్ ఒక ప్రటకన చేసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)