మియన్మార్ నిరసనలు: 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'

- రచయిత, వెట్టీ టాన్, ఈంట్ ఖాయ్ వూ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మియన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన కొనసాగుతోంది. సామూహిక నిరసనలను అణచివేయడానికి సైనికులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు.
ఫిబ్రవరి 1న మియన్మార్ ఆర్మీ తిరుగుబాటు చేసింది. గత ఎన్నికల్లో భారీ ఎత్తున మోసాలు జరిగాయంటూ అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న పౌర ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయాలంటూ అప్పటి నుంచి కొందరు నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి జరిగిన నిరసనల్లో 149 మంది ఆందోళనకారులు చనిపోయారు. అయితే, అసలు సంఖ్య దీనికంటే ఎక్కువే ఉండచ్చని భావిస్తున్నారు.
ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా, వీధుల్లోకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు కొందరు.
వాళ్లు తమ కథలను బీబీసీతో పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే..

ఫొటో సోర్స్, Getty Images
కూతురి భవిష్యత్తు కోసం పోరాడుతున్న మహిళ
నావ్.. జనరల్ స్ట్రైక్ కమిటీ ఆఫ్ నేషనాలిటీస్ లీడర్. ఏడాది వయసున్న తన కూతురి కోసమే ఈ నిరసనల్లో పాల్గొంటున్నానని ఈమె చెప్పారు. తన పాప భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని ఆమె కోరుకుంటున్నారు.
నేను కరెన్ (ఒక మైనారిటీ వర్గం) అనే గ్రూపు సభ్యురాలిని. అందుకే నిరసనలు నాకు కొత్త కాదు.
ఆంగ్ సాన్ సూచీని, అధ్యక్షుడు విన్ మింట్‌ను విడుదల చేయాలని, 2020 ఎన్నికల ఫలితాలను పరిశీలించాలని ఈరోజు నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
కానీ, మైనారిటీ జాతులకు, మరింత లోతైన డిమాండ్స్ ఉన్నాయి. మియన్మార్‌కు చెందిన అన్ని జాతుల వారితో ఒక ఫెడరల్ డెమోక్రటిక్ యూనియన్ ఏర్పాటు చేయాలనేది మా విజన్.
సైన్యం చాలా ఏళ్ల నుంచి 'విభజించు పాలించు' వ్యూహాన్ని అమలు చేస్తోంది. కానీ ఇప్పుడు అన్ని జాతులవారూ ఏకమయ్యారు.
నాకు ఏడాది వయసున్న ఒక చిన్న పాప ఉంది. నేను చేసే పనులకు తను బాధపడాలని అనుకోవడం లేదు. నా కూతురి కోసమే, నేను ఈ నిరసనల్లో పాల్గొంటున్నాను. నాలా తను కూడా ఒక నియంతృత్వంలో పెరగాలని నేను కోరుకోవడం లేదు. నిరసనల్లోకి రాకముందు నేను దీని గురించి నా భర్తతో కూడా చర్చించాను.
నేను అరెస్టైనా, లేక చనిపోయినా మన పాపను జాగ్రత్తగా చూసుకుంటూ, జీవితంలో ముందుకు సాగిపోవాలని ఆయనకు చెప్పాను.
ఈ విప్లవాన్ని మేమే పూర్తి చేస్తాం. దీనిని మా పిల్లలకు అప్పగించం.

పారిపోయే డాక్టర్లకు మెడికల్ ఆఫీసర్ సాయం
నందా*.. మైక్ పట్టణంలోని ఒక ఆస్పత్రిలో పనిచేస్తారు.
మియన్మార్‌లో జరుగుతున్న నిరసనల్లో వైద్య సిబ్బంది ముందువరుసలో నిలిచారు.
కానీ, మైక్ పట్టణంలో ఉన్న డాక్టర్లు మాత్రం తమను సైనికులు తీసుకెళ్తారేమోననే భయంతో దాక్కోవాల్సి వస్తోంది అని నందా చెప్పారు.
అది మార్చి 7 రాత్రి, కర్ఫ్యూ ఇంకా మొదలుకాలేదు.
నేను నల్లటి అద్దాలున్న కారు డ్రైవ్ చేస్తున్నా. నా కారులో ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన భార్య, ఒక ఫిజీషియన్, ఆయన కుటుంబం, ఇంకొంత మంది ఉన్నారు. నేను చీకట్లో వెళ్తున్నా. వాళ్ల బ్యాగ్స్ మా కార్లో ఉన్నాయి. వారిని ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో దింపడానికి వెళ్తున్నాను.
ఒక రోజు క్రితమే.. ప్రభుత్వ అధికారులు మైక్‌లోని ఆస్పత్రులకు ఫోన్ చేశారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న వైద్య నిపుణులు, మెడికల్ ఆఫీసర్లు, నర్సుల పేర్లు అడిగారు.
వాళ్లకు, మన పేర్లు ఎందుకు? అధికారులు మమ్మల్ని పిలిపించి, తర్వాత ఏం చేస్తారోనని మేమంతా భయపడిపోయాం.
ఆ ఆస్పత్రిలో ఉన్న వారందరూ ప్రభుత్వ వైద్యులే. సైనికులు పట్టుకుంటే, ఏం చేస్తారో అనే భయంతో వాళ్లంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని అనుకున్నారు. తప్పించుకోడానికి కొందరు డాక్టర్లు నన్ను సాయం అడిగారు.
కారు లోపల వాతావరణం అంతా నమ్మలేని విధంగా, మా మీదే మాకే అసహ్యంగా ఉంది.
"సైనికులు తమ ఇష్టమొచ్చినట్టు చేస్తుంటే, మనలాంటి డాక్టర్లు, ఒక నేరస్థుల్లా ఎందుకు దాక్కోవాల్సి వస్తోంది" అని ఫిజీషియన్ అన్నారు.
నాకు కడుపులో తిప్పినట్టు ఉంది. డాక్టర్ అయిన నేను, ఏ నేరం చేయకపోయినా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తుందని అసలు ఊహించలేదు.
రేపటి నుంచి మైక్‌లో ఉన్న వారికి జబ్బు చేస్తే వాళ్లకు చికిత్స చేయడానికి కొంతమంది స్పెషలిస్టులే అందుబాటులో ఉంటారు.
దారిన వెళ్లేవారిపై, నిరసనకారులపై సైనికులు దాడులు చేస్తే, పగిలిన పుర్రెలు, విరిగిన చేతులు, వేళ్లకు సర్జరీలు చేసి కట్లు కట్టేందుకు అక్కడ సర్జన్లు తగినంత మంది లేరు.
మైక్‌లో తల్లికాబోతున్న మహిళలకు సాయం చేయడానికి ఒక్క గైనకాలజిస్టు కూడా లేరు.
ప్రస్తుత సమయంలో అక్కడ వైద్య సిబ్బంది చాలా అవసరం. కానీ, ఇప్పుడు వాళ్లందరూ వెళ్లిపోయారు.

నిరసనల్లో కెమెరా వెనుక వ్యక్తి
మాంగ్*.. యాంగాన్‌లోని ఒక చిత్ర దర్శకుడు.
నిరసనలు మొదలైనప్పుడు, ఆ ఉద్యమం ఎలా ఆవిర్భవించిందో చూపించే ప్రయత్నం చేయాలని, ఆయన ప్రతి రోజూ వాటిని చిత్రీకరించాలని అనుకున్నారు.
నేను ఆ రోజును మర్చిపోలేను. అది ఫిబ్రవరి 28. నేను యాంగాన్‌లోని బరగయ వీధిలో నిరసనల్లో పాల్గొంటున్నాను. బారికేడ్ల వెనక నిలుచుకుని ఉన్నాను.
నిరసనలను, నా ఫోన్‌తో చిత్రీకరిస్తున్నా. వందలాది మంది నిరసనకారులు గట్టిగా నినాదాలు చేస్తున్నారు. బాటిళ్లు, క్యాన్లతో శబ్దాలు చేస్తున్నారు.
అప్పుడే, దాదాపు వంద మంది మావైపు వేగంగా దూసుకొచ్చారు. వాళ్లు పోలీసులో, సైనికులో నాకు తెలీలేదు.
ఎలాంటి హెచ్చరికా చేయకుండానే, వాళ్లు మాపై కాల్పులు జరిపారు. బాంబులు, బుల్లెట్లు, గ్యాస్ బాంబులు మాపైకి దూసుకొస్తున్నాయి.
అదంతా ఫోన్‌తో షూట్ చేయడానికి ప్రయత్నిస్తూనే, తప్పించుకోడానికి నేను ముందే వెతికి చూసుకున్న ఒక వీధిలోపలికి పరిగెత్తా. మాలో చాలామంది తప్పించుకోగలిగారు.
ఇప్పుడు నేను నిరసనల్లోకి వెళ్లినప్పుడల్లా, ఒక హెల్మెట్, వేడిని తట్టుకునే గ్లోవ్స్ కూడా తీసుకెళ్తుంటా. అవకాశం దొరికితే, మేం టియర్ గ్యాస్ షెల్స్‌ను తీసి, తిరిగి వాళ్లపైకే విసరడానికి ప్రయత్నిస్తాం. ఎక్కువగా, మేం గ్యాస్ షెల్స్‌ను డిఫ్యూజ్ చేస్తాం. వాటిపై తడిబట్ట కప్పి నీళ్లు పోస్తాం. నిరసనకారుల్లో చాలామంది నాసిరకం గ్యాస్ మాస్కులు వేసుకుని ఉంటారు. గ్యాస్ ప్రభావం నుంచి అవి వాళ్లను పూర్తిగా కాపాడలేవు. మేం, ముఖం మీద గ్యాస్‌ను కడిగేయడానికి 'కోక్'(డ్రింక్) చాలా బాగా పనిచేస్తుందని కూడా గుర్తించాం.
ఒక దర్శకుడుగా, నిరనసకారుడుగా ప్రతిరోజూ నిరసనలు చేయాలని, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయాలని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు, ఆ వీడియోలను చూసుకుంటే, శాంతియుత నిరసనల నుంచి, మా ప్రాణాలనే ప్రమాదంలో పెట్టేవరకూ.. ఈ ప్రతిఘటనలు ఎలా మారిపోయాయి అనేది కనిపిస్తూ ఉంటుంది.
ఒక సినిమాకంటే ఇది పచ్చి నిజం.

సైనిక దళాల మధ్య చిక్కుకుపోయిన మహిళ
ఫ్యో* ఒక పరిశోధకురాలు. యాంగాన్ నగరంలోని సాంచాంగ్ జిల్లాలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న 200 మందిలో ఆమె ఒకరు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సైనికులు తాము వెళ్లిపోకుండా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు వాళ్లకు తెలిసింది. దాదాపు 40మందిని అరెస్ట్ చేశారు.
ఆ రోజు మార్చి 8. మధ్యాహ్నం రెండు గంటలు అవుతోంది. భద్రతా దళాలు మేం ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. స్థానికులు కొందరు తమ ఇంటి తలుపులు తెరిచి నిరసనకారులను లోపలికి రమ్మని చేతులు ఊపుతుండడం మాకు కనిపించింది.
మేం ఒక ఇంట్లోకి వెళ్లాం. బయట సైనికులు ఉన్నారు. మేం బయటికి ఎప్పుడొస్తామా అని ఎదురుచూస్తున్నారు. అక్కడ మేం ఉన్న ఇంట్లో ఏడుగురు ఉన్నారు. వాళ్లలో ఆరుగురు మహిళలే.
ఆ ఇంట్లోని వాళ్లు చాలా మంచివాళ్లు. మాకు భోజనం కూడా పెట్టారు. సాయంత్రం ఆరున్నర సమయంలో బయటకు వెళ్దాం అనుకున్నాం. మాకు ఆందోళనగా ఉంది.
సైనికులు మమ్మల్ని వదిలివెళ్లరనే విషయం మాకు అర్థమైంది. ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్స్ వేయడం మొదలుపెట్టాం.
అక్కడ ఏ వీధిలోంచి సురక్షితంగా పారిపోవచ్చో, దాక్కోవడానికి ఇంకా ఏయే ప్రాంతాలు ఉన్నాయో ఆ ఇంట్లో ఉన్న వాళ్లు మాకు చెప్పారు.
మేం మా వస్తువులన్నీ ఆ ఇంట్లోనే వదిలేశాం. నేను స్థానికురాల్లా కనిపించడానికి, ఆ ఇంట్లోంచి బయటకు వెళ్లడానికి నా బట్టలు విప్పేసి, సరోంగ్ (నడుముకు కట్టుకునే సంప్రదాయ వస్త్రం) కట్టుకున్నా.
నా ఫోన్లో చాలా యాప్స్ అన్ ఇన్‌స్టాల్ చేశాను. కొన్ని డబ్బులు తీసుకున్నాను.
ఆ రోజు రాత్రంతా మేం మరో సురక్షితమైన ప్రాంతంలో ఉన్నాం. ఉదయానికి అక్కడెక్కడా సైనికులు కనిపించలేదు.
*ఇంటర్వ్యూ ఇచ్చిన వారి భద్రత కోసం పేర్లు మార్చాం.
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే... ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- లాక్డౌన్: జనతా కర్ఫ్యూకి ఏడాది.. దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








