మియన్మార్ సైనిక కుట్ర: 'నిరసనకారులను షూట్ చేయమని చెప్పారు... మా వల్ల కాదన్నాం'

మియన్మార్‌లో ఏం జరుగుతోందో చెప్పిన తొలి ప్రత్యక్ష సాక్ష్యులు
ఫొటో క్యాప్షన్, మియన్మార్‌లో ఏం జరుగుతోందో చెప్పిన తొలి ప్రత్యక్ష సాక్ష్యులు
    • రచయిత, రజనీ వైద్యనాథన్
    • హోదా, బీబీసీ మిజోరాం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

మియన్మార్‌లో గత నెలలో సైనిక కుట్రతో ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని గద్దె దించిన తరువాత కొంతమంది పోలీసు అధికారులు తమ దేశం విడిచి భారతదేశంలోకి వచ్చారు. మిలటరీ ఆదేశాలను అమలు చేయడానికి నిరాకరించి తాము బార్డర్ దాటామని వారు బీబీసీతో చెప్పారు.

మియన్మార్ పౌరులను చంపమని లేదా హాని తలపెట్టమని తమపై ఒత్తిడి తెస్తారనే భయంతోనే పారిపోయి వచ్చామని డజనుకి పైగా అధికారులు మాతో చెప్పారు.

"నిరసనకారులను షూట్ చెయ్యమని నాకు ఆదేశాలు ఇచ్చారు. నేను ఆ పని చెయ్యలేనని వారికి చెప్పేశాను" అని 27 ఏళ్ల నాయింగ్ (భద్రత, గోప్యత కారణాల దృష్ట్యా పేరు మార్చాం) చెప్పారు.

నాయింగ్ గత తొమ్మిదేళ్లుగా మియన్మార్ పోలీసు శాఖలో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇండియాలోని మిజోరాం రాష్ట్రంలో తలదాచుకొంటున్నారు.

నాయింగ్‌లాగే వయసు 20లలో ఉన్న కొందరు పోలీసు అధికారులైన పురుషులు, స్త్రీలను కూడా మేం కలిశాం. మిలటరీ ఆదేశాలను ధిక్కరించి, స్వదేశంలో ఉద్యోగాలను వదులుకుని పారిపోయి వచ్చామని వారంతా చెప్పారు.

"సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న అమాయక ప్రజలను చంపమని లేదా వారికి హాని తలపెట్టమని నాపై ఒత్తిడి తెస్తారేమోనని భయపడ్డాను. ఎన్నికల్లో గెలిచి పాలన సాగిస్తున్న ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు తప్పని మేము భావిస్తున్నాం" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

ఆందోళనకారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్న మియన్మార్ సైనిక అధికారులు
ఫొటో క్యాప్షన్, ఆందోళనకారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్న మియన్మార్ సైనిక అధికారులు

మిలటరీ తిరుగుబాటు

మియన్మార్ మిలటరీ 'టాట్మడావ్' ఫ్రిబ్రవరి 1న ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకున్న దగ్గరనుంచీ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న వేలాదిమంది ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు.

యాభైమందికి పైగా ఆందోళనకారులను మట్టుబెట్టినట్లు మియన్మార్ భద్రతా అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మియన్మార్ పశ్చిమ ప్రాతానికి చెందిన నాయింగ్ పోలీస్ శాఖలో చిన్న ర్యాంకు అధికారి. ఫిబ్రవరి చివరి వారానికి ఆ ప్రాంతంలో నిరసనలు ఉధృతమయ్యాయని ఆయన తెలిపారు.

నిరసనకారులపై తుపాకులు ఎక్కుపెట్టమని తనకు రెండుసార్లు ఆదేశాలు వచ్చాయని, వాటిని తాను నిరాకరించాలని నాయింగ్ తెలిపారు. అనంతరం ఆయన పారిపోయి ఇండియా వచ్చేశారు.

"ఆ పని నేను చేయలేనని నా పై అధికారికి చెప్పాను. నేను ప్రజల పక్షాన నిలుస్తానని కూడా చెప్పాను. మిలటరీ చాలా ఆత్రంగా ఉంది. రోజు రోజుకూ వారి దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి" అని నాయింగ్ అన్నారు.

మేము మాట్లాడుతుండగా ఆయన తన ఫోన్ తెరిచి తన భార్యాపిల్లల ఫొటోలు చూపించారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు.. ఐదారు నెలల పసికందులు.

"నా కుటుంబాన్ని మళ్లీ కలుసుకోగలనో లేదోనని దిగులుగా ఉంది" అని నాయింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎత్తైన కొండలు, లోయల మధ్య మిజోరాం రాష్ట్రంలో మేము వారిని ఒక రహస్య ప్రదేశంలో కలుసుకున్నాను. మియన్మార్ అక్కడినుంచీ ఒక 16 కిలోమీటర్లు ఉంటుంది.

మియన్మార్‌లో ఏం జరుగుతుందో బయటపెట్టిన తొలి ప్రత్యక్ష సాక్షులు వీళ్లే.

మియన్మార్‌లో అనేకమంది పోలీసు అధికారులు సైనిక ఆదేశాలను పెడ చెవిన పెట్టి ప్రజలకు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. అలా చేరిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

మాతో మాట్లాడిన అధికారులు అందించిన వివరాలను స్వతంత్ర్యంగా ధృవీకరించడం బీబీసీకి సాధ్యపడలేదు.

అమెరికా, బ్రిటన్‌తో సహా అనేక దేశాలు మియన్మార్‌లో సైనిక అధికారుల దురాగతాలను ఖండించాయి. సంయమనం పాటించవలసినదిగా పిలుపునిచ్చాయి.

అయితే, తమపై వచ్చిన విమర్శలన్నింటినీ మిలటరీ కొట్టి పారేసింది. తమపై విధిస్తున్న ఆంక్షలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

మియన్మార్‌లో సైనిక తిరుగుబాటు తరువాత 100 మందికి పైగా అక్కడినుంచీ పారిపోయి మిజోరాం వచ్చేశారని స్థానిక అధికారులు చెబుతున్నారు.

మియన్మార్ పోలీసు అధికారులను బీబీసీ వారి దేశానికి 10 మైళ్ల దూరంలో కలిసింది
ఫొటో క్యాప్షన్, మియన్మార్ పోలీసు అధికారులను బీబీసీ వారి దేశానికి 10 మైళ్ల దూరంలో కలిసింది

'షూట్ చెయ్యమని ఆదేశాలిచ్చారు'

మిలటరీ తిరుగుబాటు చేసి, ప్రభుత్వాన్ని పడగొట్టిన రాత్రి ఇంటర్నెట్ పూర్తిగా స్తంభింపజేశారని, తన స్టేషన్‌కు సమీపంలో ఆర్మీ చెక్ పోస్ట్ పెట్టారని హతుత్ (పేరు మార్చాం) తెలిపారు.

"తరువాత కొన్ని గంటలకు మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకుందన్న సంగతి మాకు తెలిసింది" అని 22 ఏళ్ల హతుత్ వివరించారు.

తనతో పాటూ మరికొందరు పోలీస్ అధికారులు, మిలటరీతో కలిసి రహదారులపై గస్తీ తిరిగారని, ఇళ్లల్లో వంట పాత్రలు నేల మీద పడేసి చప్పుడు చేస్తూ శాంతియుతంగా నిరసనలకు మద్దతు తెలుపుతున్నవారిని అరెస్ట్ చేస్తామని సైనిక అధికారులు బెదిరించారని ఆయన చెప్పారు.

నిరసనకారులపై తుపాకీ ఎక్కుపెట్టమని తనకు కూడా ఆదేశాలు జారీ చేశారని, వాటిని తాను నిరాకరించానని హతుత్ తెలిపారు.

"ఐదుగురుకన్నా ఎక్కువమంది గుంపులుగా వస్తే షూట్ చెయ్యమని మిలటరీ అధికారులు మాకు ఆదేశాలిచ్చారు. అనేకచోట్ల నిరసనకారులను చితకబాదుతున్నారని నాకు తెలుసు. అవన్నీ వింటే నాకు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు. అమాయక ప్రజలు రక్తమోడుతుంటే, మిలటరీ ఆదేశాలను పాటిస్తూ మరిన్ని దురాగతాలకు పాల్పడేందుకు నా మనస్సాక్షి అంగీకరించదు" అని హతుత్ తెలిపారు.

తన పోలీసు స్టేషన్ నుంచీ పారిపోయి వచ్చినవాడిని తానొక్కడినేనని ఆమన చెప్పారు.

మోటర్ బైక్‌పై ఇండియా చేరుకున్నాని, బోర్డర్ చేరుకునేవరకూ తనకు చాలా భయమేసేస్తూ ఉందని చెప్పారు.

మాతో మాట్లాడినవారు.. ఇండియా, మియన్మార్ సరిహద్దుల్లో 250 మైళ్ల విస్తీర్ణంలో ఉన్న తియావూ నది దాటి ఇటువైపు చేరుకున్నారు.

రాబోయే రోజుల్లో మరింతమంది పోలీసులు పారిపోయి ఇండియా వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పారు.

ఇప్పటివరకూ 100 మందీ పైగా ఇండియా పారిపోయి వచ్చారు
ఫొటో క్యాప్షన్, ఇప్పటివరకూ 100 మందీ పైగా ఇండియా పారిపోయి వచ్చారు

'వృద్ధులైన నా తల్లిదండ్రులను వదిలేసి వచ్చాను'

గ్రేస్ (పేరు మార్చాం) ఒక మహిళా పోలీసు అధికారి. ఆమె కూడా అక్కడినుంచీ పారిపోయి ఇండియా వచ్చేశారు.

నిరసనకారులపై కర్రలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారని, ఒకసారి చిన్న పిల్లలు ఉన్న గుంపుపై టియర్ గ్యాస్ ప్రయోగించడం తాను ప్రత్యక్షంగా చూశానని గ్రేస్ చెప్పారు.

"ఆందోళనకారులను చెదరగొట్టి, తోటి ప్రజలను, స్నేహితులను అరెస్ట్ చెయ్యమని చెప్పారు. అది నా వల్ల కాలేదు. మాకు మా వృత్తి మీద చాలా గౌరవం, ఇష్టం ఉన్నాయి. కానీ ఇప్పుడు వ్యవస్థ మారిపోయింది. ఇకపై మా విధిని మేము కొనసాగించలేం" అని గ్రేస్ అన్నారు.

24 ఏళ్ల గ్రేస్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని అక్కడే విడిచిపెట్టి పారిపోయి వచ్చేశారు.

"నా తల్లిదండ్రులు పెద్దవాళ్లైపోయారు. వాళ్లు కూడా చాలా భయపడుతున్నారు. మాకు వేరే దారి లేదు. పారిపోయి ఇక్కడకు చేరుకోవడమొక్కటే మార్గం" అని గ్రేస్ అన్నారు.

మియన్మార్, భారత్ సరిహద్దు ప్రాంతం
ఫొటో క్యాప్షన్, మియన్మార్ నుంచి భారత్‌లోకి వచ్చే ఈ తియావూ నదిని దాటుకుని వస్తున్నారు

'వారిని అప్పగించండి'

ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగాలంటే ఇలా పారిపోయి వచ్చినవారిని అప్పగించమని మియన్మార్ సైనిక ప్రభుత్వం భారతదేశాన్ని కోరింది.

సరిహద్దులు దాటి వచ్చినవారికి తమ రాష్ట్రంలో తాత్కాలిక ఆశ్రయం కల్పించాలని, తరువాత ఏం చెయ్యాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథంగా తెలిపారు.

పోలీసు అధికారులు మాత్రమే కాకుండా, ఇండియా పారిపోయి వచ్చిన ఒక దుకాణదారుని కూడా మేము కలిశాం. నిరసన ప్రదర్శనల్లో చేరమని చెప్తూ ఆన్‌లైన్‌లో మద్దతుదారులను కూడగడుతున్నారని పోలీసులు ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు.

"నేనేదో నా స్వార్థం కోసం పారిపోయి రాలేదు. మా దేశంలో అందరూ ఆందోళన పడుతున్నారు. భద్రత కోసమే నేనిక్కడకు వచ్చాను. ఉద్యమానికి మద్దతుగా ఇక్కడ నుంచీ నేను చేయగలిగినదంతా చేస్తాను" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)