మియన్మార్: ఆందోళనకారులపై మళ్లీ కాల్పులు.. 10 మందికి పైగా మృతి

ఫొటో సోర్స్, Reuters
మియన్మార్‌లో ప్రదర్శనకారులు, భద్రతాదళాల మధ్య జరిగిన తాజా సంఘర్షణలో 10 మందికిపైగా మరణించారు.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మరింత మంది మరణించినట్లు మీడియాలో వస్తున్నప్పటికీ ఇంకా నిర్ధరణ కాలేదు.
మండాలే, మొన్యావా తదితర నగరాల్లో ప్రదర్శనకారులపై భద్రతాదళాలు కాల్పులు జరిపాయి.
మృతుల్లో కొందరు టీనేజర్లూ ఉన్నట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
రెండు రోజుల కోర్టుకు హాజరైన సూచీ
మియన్మార్‌లో నెల రోజుల కిందట సైనిక కుట్ర అనంతరం నిర్బంధానికి గురైన పౌర నేత ఆంగ్ సాన్ సూచీ మార్చి 1న వీడియో లింకు ద్వారా కోర్టుకు హాజరయ్యారు.
సైనిక నిర్బంధం తర్వాత ఆమె కనిపించటం ఇదే తొలిసారి. వీడియోలో ఆమె ''ఆరోగ్యంగా'' ఉన్నట్లు కనిపించారని, తన న్యాయవాదుల బృందాన్ని చూడాలని కోరారని వారు చెప్పారు.
ఫిబ్రవరి 1న సైనిక కుట్ర జరిగిన నాటి నుంచి సూచీని రహస్య ప్రాంతంలో నిర్బంధించి ఉంచారు.
ఇదిలావుంటే.. సైనిక కుట్రకు వ్యతిరేకంగా ఆదివారం నాడు జరిగిన నిరసన ప్రదర్శనల మీద సైనిక, పోలీసు బలగాలు జరిపిన కాల్పుల్లో 18 మంది చనిపోగా.. సోమవారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని, నిర్బంధించిన ఆంగ్ సాన్ సూచీని, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నేతలను విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
నవంబరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఎల్‌డీ భారీ విజయం సాధించగా.. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపిస్తోంది. అందువల్లనే తాను అధికారం స్వాధీనం చేసుకున్నానని చెప్తోంది.
అయితే తన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలనూ చూపలేదు. ఎన్నికల కమిషన్‌ను మార్చేసిన సైన్యం.. ఏడాది లోగా తాజా ఎన్నికలను నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.

ఫొటో సోర్స్, EPA
సూచీ ఎక్కడున్నారు?
ఫిబ్రవరి ఒకటో తేదీన సైనిక కుట్ర మొదలైనప్పుడు ఆంగ్ సాన్ సూచీని గృహనిర్బంధంలో ఉంచారు. అప్పటి నుంచీ ఆమె ఎవరికీ కనిపించలేదు. సోమవారం దేశ రాజధాని నేపీటా కోర్టులో వీడియో లింకు ద్వారా విచారణకు హాజరయ్యారు.
చట్టవ్యతిరేకంగా వాకీ టాకీలు దిగుమతి చేసుకున్నారని, మియన్మార్ ప్రకృతి విపత్తు చట్టాన్ని ఉల్లంఘించారని ఆమెపై తొలుత అభియోగాలు నమోదు చేశారు. అయితే సోమవారం నాడు మరిన్ని అభియోగాలను చేర్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కోవిడ్-19 ఆంక్షలను ఉల్లంఘించారని, భయాందోళనలకు కారణమయ్యారని తాజా ఆరోపణలు.
మొదటి రెండు అభియోగాల్లో దోషిగా నిర్ధారణ అయితే మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశముంది. తాజాగా చేర్చిన అభియోగాల్లోనూ దోషిగా నిర్ధారణ అయితే విధించగల శిక్ష ఏమిటనే అంశంపై స్పష్టత లేదు.
కేసు విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేశారు.
సైన్యం పదవీచ్యుతుడ్ని చేసిన దేశాధ్యక్షుడు, సూచీ కీలక భాగస్వామి అయిన విన్ మింట్ మీద కూడా ప్రజలను రెచ్చగొట్టారనే అభియోగాలు నమోదు చేసినట్లు మియన్మార్ నౌ సోమవారం ఒక కథనంలో తెలిపింది.
ఆంగ్ సాన్ సూచీని నిర్బంధించినప్పటి నుంచీ మియన్మార్‌లో ఆమె ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. కానీ.. అంతర్జాతీయంగా మాత్రం.. దేశంలో మైనారిటీలైన రోహింజ్యా జాతి నిర్మూలన తనకు పట్టనట్లు ఉన్నారన్న ఆరోపణలతో దెబ్బతిన్న ఆమె ప్రతిష్ట మెరుగుపడలేదు.

ఫొటో సోర్స్, EPA/LYNN BO BO
నిరసనకారులపై తూటాలతో విరుచుకుపడ్డ పోలీసులు.. 18 మందికిపైగా మృతి
మియన్మార్‌లో నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 18 మందికి పైగా మరణించారని ఐరాస మానవ హక్కుల కార్యాలయం వెల్లడించింది.
సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు తూటాలతో విరుచుకుపడ్డారని తెలిపింది.
యాంగూన్, దావె, మండాలె సహా వివిధ పట్టణాలలో నిరసనకారులపై కాల్పులు జరగ్గా కొందరు ప్రాణాలు కోల్పోయారు.
మియన్మార్‌లో ఫిబ్రవరి 1న సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి నిరసనలు జరుగుతున్నాయి.
ఆంగ్ సాన్ సూచీ సహా అనేక మంది నాయకులను నిర్బంధంలో ఉంచారు.

ఫొటో సోర్స్, Reuters
పోలీసులు లాఠీ చార్జి చేయడం, కాల్పులు జరపడంతో నిరసనకారులు చెల్లాచెదురై పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.
రక్తాలోడుతూ ప్రజలు కనిపించారు.
పౌరుల నుంచి నిరసనలు ఆగకపోవడంతో సైనిక నాయకులు అణచివేతకు ఆదేశాలివ్వడంతో ఆదివారం పోలీసులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.

ఫొటో సోర్స్, BBC burmese
‘కాల్పుల శబ్దం వినిపించగానే అటు పరుగెత్తాను’
యాంగూన్‌లోని హెల్డన్ రోడ్‌పైకి తాను వచ్చేటప్పటికి ఒక అంబులెన్స్ తన పక్క నుంచి వెళ్తోందని.. తుపాకీతో కాల్చిన శబ్దం తాను విన్నానని సంఘటన స్థలంలో ఉన్న బీబీసీ వీడియో జర్నలిస్ట్ చెప్పారు.
వెంటనే తాను కాల్పుల శబ్దం వినిపించినవైపు వెళ్లగా అప్పటికే వలంటీర్లు తూటా దెబ్బకు ఒరిగిన వ్యక్తిని అంబులెన్సులోకి ఎక్కించారని ఆయన చెప్పారు.
రోడ్డు మీద రక్తం, పేలిన తూటా ఉన్నాయని చెప్పారు.
అక్కడికి కొద్దిసేపట్లోనే పెద్దసంఖ్యలో ప్రజలు రక్షణ కవచాలు ధరించి అక్కడికి చేరుకున్నారని.. వారంతా పోలీసు దాడిని ప్రతిఘటించడానికి వచ్చారని అన్నారు.
అక్కడ జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని, అయినా ప్రజలు ఏమాత్రం వెనక్కు తగ్గలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
సైనిక తిరుగుబాటు తర్వాత ఆర్మీ జనరల్ మిన్ ఆంగ్ హ్లయింగ్ మియన్మార్‌లో అత్యంత బలమైన వ్యక్తిగా మారారు.
2020 నవంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ ఏకపక్ష విజయం సాధించింది.
కానీ, తర్వాత తత్మడా, సైన్యం మద్దతుదారుల పార్టీ యూఎస్‌డీపీ పదే పదే ఎన్నికల ఫలితాలను వివాదాస్పదం చేశాయి. ఎన్నికల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆ పార్టీ చెప్పింది. కానీ, ఎన్నికల కమిషన్ ఆ ఆరోపణలను ఖండించింది.
ఫిబ్రవరి 1న కొత్త ప్రభుత్వాన్ని అధికారికంగా అంగీకరించాల్సి ఉంది. కానీ ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య వివాదాలు కొనసాగుతుండంతో సైనిక తిరుగుబాటు కూడా జరగవచ్చని ఊహిస్తూ వచ్చారు.
1962, 1988లో జరిగిన తిరుగుబాటును ఉదాహరణగా చెప్పిన హ్లయింగ్ "రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, దానిని అంతం చేయాల్సిందే" అని జనవరి 27న హెచ్చరించారు.
అయితే, జనవరి 30 నాటికి హ్లయింగ్ కార్యాలయం ఆయన ప్రకటనపై వెనక్కితగ్గింది. సైనికాధికారుల ప్రకటనను మీడియా వక్రీకరించిందని ఆరోపించింది.
అయితే, ఫిబ్రవరి 1న ఉదయం తత్మడా స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూచీ, అధ్యక్షుడు విన్ మ్యింట్ సహా చాలామంది నేతలను అదుపులోకి తీసుకుంది. ఏడాది పాటు అత్యవసర స్థితిని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Reuters
తర్వాత మియన్మార్ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్న హ్లయింగ్, ఎన్నికల్లో కుంభకోణం జరిగిందనే ఆరోపణలకు ప్రాధాన్యం ఇచ్చారు.
హ్లయింగ్ నాయకత్వంలో జరిగిన నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కుంభకోణంలో ఆరోపణలపై కౌన్సిల్ దర్యాప్తు చేస్తుందని, కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








