ఆంగ్ సాన్ సూచీకి ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకున్న ఆమ్నెస్టీ

ఫొటో సోర్స్, Getty Images
మియన్మార్ ప్రభుత్వ అధినేత ఆంగ్ సాన్ సూచీకి ఇచ్చిన ప్రతిష్టాత్మక పురస్కారం 'అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్'ను వెనక్కి తీసుకుంటున్నట్లు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది.
రాజకీయ నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన సూచీని 2009లో ఆమ్నెస్టీ సంస్థ ఈ పురస్కారంతో గౌరవించింది.
మియన్మార్‌లో రోహింజ్యా సంక్షోభం గురించి ఆమె మాట్లాడకపోవడం విస్మయం కలిగించిందని ఆమ్నెస్టీ తెలిపింది. అందుకే ఆమెకు ఇచ్చిన గౌరవ పురస్కారాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది.
మియన్మార్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా దాదాపు 7 లక్షల మంది రోహింజ్యాలు దేశ సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌కు వెళ్లారు.
"మీరు మానవ హక్కులను పరిరక్షిస్తారని, విశ్వాసానికి, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తారన్న నమ్మకం మాకు ఇకలేదు" అంటూ ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ కుమి నాయుడూ సూచీకి ఓ లేఖ రాశారు.
ఆమె వల్ల రోహింజ్యాల పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశలు పెద్దగా లేవని నాయుడూ అన్నారు.
ఒకప్పుడు సూచీని ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా ఆమ్నెస్టీ చూసింది. అదే సంస్థ ఇప్పుడు, సుదీర్ఘ కాలంపాటు గృహ నిర్బంధంలో ఉన్న సూచీ విడుదలై సరిగ్గా ఎనిమిదేళ్లు అవుతున్న రోజే ఆమెకు ఇచ్చిన పురస్కారాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఆమ్నెస్టీ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం 'అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్'. నెల్సన్ మండేలా తర్వాత ఈ బహుమతి అందుకున్న వ్యక్తి ఆంగ్ సాన్ సూచీనే.

ఫొటో సోర్స్, Getty Images
రోహింజ్యాలపై మియన్మార్ సైన్యం చేస్తున్న దాడులను అడ్డుకోవడంలో సూచీ విఫలమయ్యారని, రఖైన్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా ఆమె స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
రోహింజ్యాల మీద విస్తృత స్థాయిలో వ్యవస్థీకృతంగా జరిగిన ద్వేషపూరిత దాడులను 'జాతి నిర్మూలన చర్య' అనటాన్ని కొట్టిపారేయలేమని ఈ ఏడాది ఆరంభంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ జీడ్ రాద్ అల్ హుస్సేన్ వ్యాఖ్యానించారు.
‘‘మియన్మార్‌లో సైనిక చర్యల తీవ్రతను బట్టి చూస్తే.. ఈ నిర్ణయాలను ఉన్నత స్థాయిలో తీసుకుని ఉండొచ్చని స్పష్టమవుతోంది’’ అని ఆయన ఆరోపించారు.
అయితే, ఆ ఆరోపణలను తోసిపుచ్చిన సూచీ, సైనికుల చర్యలను మాత్రం ఖండించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
రోహింజ్యాల మీద జరుగుతున్న హింసాఖాండను ఖండించాలంటూ సూచీ మీద ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చాయి. ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు.
రోహింజ్యా ముస్లింల హత్య కేసును పరిశోధిస్తున్న ఇద్దరు రాయిటర్స్ వార్తా సంస్థ పాత్రికేయులను మియన్మార్ ప్రభుత్వం జైళ్లో పెట్టడాన్ని కూడా ఆమె సమర్థించారు.
ఇవి కూడా చదవండి:
- పాము కాటేశాక ఏమవుతుంది? శాస్త్రవేత్త స్వీయ మరణగాథ
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు. ఆ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలు తెలుసా
- గాంధీ కథ చెప్పిన రచయిత గుజరాత్లో ఎందుకు చదువు చెప్పలేకపోయారు?
- నూర్ ఇనాయత్ ఖాన్: బ్రిటన్ కీర్తించే గూఢచారి ఈ భారతీయ యువరాణి
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








