హైదరాబాద్: ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’.. ఒంటరి మహిళలే టార్గెట్... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు

సీరియల్ కిల్లర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆరోజు డిసెంబరు 30... రాత్రి బాగా చీకటి పడింది. హైదరాబాద్ యూసఫ్ గూడలోని కల్లు కాంపౌండ్ దగ్గర తాగే వాళ్లు తాగుతున్నారు. వాగే వాళ్లు వాగుతున్నారు. ఎవరి గోలలో వాళ్లున్నారు.

అదే కాంపౌండ్ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆమెకు ఓ యాభై ఏళ్లు ఉంటాయి. అతనికి సుమారు నలభై ఐదు. అతను మెల్లిగా ఆమె దగ్గరకు వెళ్లి మాట కలిపాడు. చాలా కబుర్లు చెప్పాడు. ఇద్దరూ కలసి కాంపౌండ్ బయటకు వచ్చారు. అతనూ, ఆమె కలసి ఎవరూ చూడని చోటు కోసం సిటీ శివార్లలోకి వెళ్లారు.

యూసఫ్ గూడ నుంచి ఘటకేసర్ దగ్గర్లోని అంకుశాపూర్ వరకూ చేరుకున్నారు. అలాంటి చోటు దొరికింది. అక్కడ ఇంకొంచెం మందు తాగారు. తరువాత ఎందుకో ఇద్దరి మధ్యా వాదన వచ్చింది. గొడవ పెద్దది అయింది. వెంటనే అతడు ఆమెను బండరాయితో మోది చంపేశాడు. పారిపోయాడు.

దానికి సరిగ్గా 20 రోజుల ముందు, డిసెంబరు 10వ తేదీ సాయంత్రం. బాలానగర్ కల్లు కాంపౌండ్. అతను అలానే ఒంటరిగా వెళ్లాడు. అక్కడ మరో ఒంటరి మహిళ కనిపించింది. ఆమెకు 35-45 ఏళ్లు ఉండవచ్చు. ఇద్దరూ కలసి మందు తాగారు. ఎన్నో మాటలు చెప్పాడు. తనతో వస్తే ఎంతో ఇస్తానని ఆశ చూపాడు.

ఆమె నమ్మింది. అతనూ, ఆమె కలిసి ఎవరూ చూడని చోటు కోసం సిటీ దాటి వెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లా ములుగు పరిధిలోని సింగాయపల్లి గ్రామం వరకూ వెళ్లారు. మళ్లీ అక్కడ మందు తాగారు. తరువాత ఆమెకు చీరతోనే ఉరి బిగించి చంపేశాడు. పారిపోయాడు.

ఇది అతను చేసిన రెండవ మర్డర్ కాదు.. పద్దెనిమిదవ మర్డర్.

సీరియల్ కిల్లర్ రాములు

ఫొటో సోర్స్, Hyderabad Police

అవును..

అతనితో కాలు బయట పెట్టాక, తిరిగి వెనక్కు వచ్చిన మహిళ లేదు.

అతని పేరు ఎం రాములు. చివరగా చంపిన యూసఫ్ గూడ మహిళతో కలిపి అతను చంపింది 18 మంది ఒంటరి మహిళలను. అందరినీ ఒకటే పద్ధతిలో చంపాడు రాములు.

రాములు చేసే హత్యలన్నీ హైదరాబాద్ శివార్లలోనే ఉంటాయి.

2003లో తూప్రాన్ పోలీస్ స్టేషన్, 2004లో రాయదుర్గం పోలీస్ స్టేషన్, 2005లో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్, 2007లో రాయదుర్గం స్టేషన్, 2008లో దుండిగల్ స్టేషన్, 2008లో నర్సాపూర్ స్టేషన్, 2009లో కూకట్‌పల్లిలో రెండు హత్యలు, 2009లో నార్సింగి… తొమ్మిది మర్డర్లు చేశాక, చివరకు పోలీసులకు దొరికేశాడు.

2009లో నార్సింగి, కూకట్ పల్లిలో చేసిన మర్డర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఛేదించారు. దాదాపు నెల రోజులు కష్టపడి పట్టుకున్నారు. పకడ్బందీగా కేసు పెట్టారు.

అప్పటి వరకూ అతను హత్య చేసిన మిగతా కేసులు తేలలేదు కానీ, 2009లో కూకట్ పల్లి, నార్సింగిలో చేసిన హత్యలకు గానూ 2011 ఫిబ్రవరిలో రంగారెడ్డి కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష, 500 జరిమానా పడింది.

కానీ యావజ్జీవితం జైల్లో ఉండక్కర్లేకుండా ఒక ప్లాన్ వేశాడు రాములు.

జైల్లో మానసిక రోగిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పిచ్చెక్కిందని నమ్మించాడు. దీంతో 2011 డిసెంబరు 1న ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ సరిగ్గా నెల ఉన్నాడు. అదే ఏడాది డిసెంబరు 30వ తేదీ రాత్రి ఆసుపత్రి నుంచి జంప్.

తనతో పాటూ మానసిక వ్యాధులకు చికిత్స పొందుతోన్న మరో ఐదుగురు ఖైదీలతో కలసి రాములు పరారయ్యాడు. ఎస్ ఆర్ నగర్ స్టేషన్లో ఖైదీ పరారీ కేసు నమోదు అయింది.

జైలు నుంచి పారిపోయిన తరువాత కూడా ఆడవాళ్లను హత్య చేయడం కొనసాగించాడు రాములు.

2012, 2013లలో బోయినపల్లిలో రెండు, 2012లో చందానగర్‌లో రెండు, 2012లో దుండిగల్‌లో ఒకటి - మళ్లీ ఐదుగురు మహిళలను చంపేశాడు. పోలీసులు మళ్లీ వీటిపై శ్రద్ధ పెట్టారు.

2013 మేలో బోయినపల్లి పోలీసులు రాములును అరెస్టు చేశారు. ఈసారి అతడు ఐదేళ్లు జైల్లో ఉన్నాడు.

రాములుకు లా మీద మంచి పట్టు ఉందో లేక, బలమైన లాయర్ దొరికాడో కానీ, 2018లో తన శిక్ష తగ్గింపు కోసం హైకోర్టుకు వెళ్లాడు. 2018 అక్టోబరులో హైకోర్టు నుంచి రాములుకు అనుకూల తీర్పు వచ్చింది. బయటకు వచ్చాడు.

మళ్లీ మామూలే. ఈ సారి ఇద్దరు మహిళలు.

2019లో షామీర్‌పేటలో ఒకరు, పఠాన్ చెరువులో మరొకరు. ఇక్కడకు మొత్తం 16 మంది మహిళలు అతని చేతిలో మరణించారు.

మళ్లీ పోలీసులకు దొరికేశాడు. లోపలేశారు. తిరిగి 2020 జూలైలో జైలు నుంచి విడుదల అయ్యాడు.

సీరియల్ కిల్లర్ రాములు

ఫొటో సోర్స్, Hyderabad Police

మళ్లీ హత్యలు మొదలు

2020 జూలైలో అతను విడుదల అయిన తరువాత చనిపోయిన వారే డిసెంబరులో బాలానగర్, యూసఫ్ గూడ కల్లు కాంపౌడ్ల దగ్గరి మహిళలు.

డిసెంబరు 30 రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆ 50 ఏళ్ల మహిళ కోసం భర్త వెతుకుతూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. జూబ్లీ హిల్స్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. వీరు ఈ మహిళ కోసం వెతుకుతున్నారు.

నాలుగు రోజుల తరువాత ఘటకేసర్ పోలీసులకు గుర్తు తెలియని శవం దొరికింది. ఆ పోలీసులు ఆ శరీరం ఎవరిదా అని పరిశోధిస్తున్నారు.

చివరకు హైదరాబాద్, రాచకొండ పోలీసులు పరస్పరం మాట్లాడుకున్నారు. కల్లు కాంపౌండ్ దగ్గర కెమెరాల్లో ఆ మహిళ ఎవరితోనో మాట్లాడటం కనిపించింది. యూసఫ్ గూడ కల్లు కాంపౌండ్ నుంచి అంకుశాపూర్ రైల్వే గేట్ వరకూ ఉన్న వందల కెమెరాలు ఫుటేజ్ పరిశీలించారు. 12 మంది పోలీసులు కష్టపడ్డారు. రెండు కమిషనరేట్ల సిబ్బందీ భాగమయ్యారు.

ఈ బృందాలకు నాయకత్వం వహిస్తోన్న ఒక అధికారి, గతంలో 2009లో అదే రాములుకు శిక్ష పడిన కేసును కూడా విచారించారు. సీసీ టీవీ ఫుటేజీ లోంచి వచ్చిన ఫోటోలను చూసిన అతనికి అనుమానం వచ్చింది. మనిషి చూడ్డానికి అలాగే ఉన్నాడు. నేరం జరిగిన విధానం అలానే ఉంది. దీంతో పాత కేసు రికార్డులు తవ్వి తీశారు.

కన్ఫమ్.. అతను రాములే అని గుర్తించారు.

జనవరి 26న పోలీసులకు దొరికాడు.

సీరియల్ కిల్లర్ రాములు

ఫొటో సోర్స్, Hyderabad Police

ఎలా చేస్తాడు?

రాములు లక్ష్యం ఒంటరి మహిళలు. ముఖ్యంగా మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు దగ్గర కనిపించే ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు. వారికి ఎన్నో చెప్తాడు. డబ్బు ఆశ చూపిస్తాడు. తరువాత వాళ్లను ఎవరూ లేని చోటుకు, దూరంగా తీసుకెళ్తాడు.

అక్కడ లైంగిక కోరిక తీర్చుకుంటాడు. ఆ తరువాత చంపేస్తాడు. మెజార్టీ కేసుల్లో వాళ్లు కట్టుకున్న చీరలతోనే ఉరి బిగించి చంపేస్తాడు. కొన్ని సందర్భాల్లో బండరాళ్లు మోది చంపుతాడు. ఆ తరువాత వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసుకుని పారిపోతాడు.

రాములు బాధితులు అంతా దాదాపు పేద, దిగువ మధ్యతరగతి మహిళలే. వారి ఒంటిపై బంగారం పెద్దగా ఉండదు. మహా ఉంటే ఒకట్రెండు గ్రాములు. వెండి ఆభరణాలే ఎక్కువ. వాటినే ఒలుచుకుని తీసుకుపోతాడు.

రాములుది సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఒక గ్రామం. రాళ్లు కొట్టే పని చేస్తాడు. అతనికి 21 ఏళ్లకే పెళ్లయింది. కొన్నాళ్లకు భార్య వదిలేసింది. మరొకామెను చేసుకున్నాడని చెబుతారు. ఇప్పుడు అయితే అతనితో ఎవరూ లేరు.

తాజా రెండు మర్డర్లూ కాకుండా, మరో 21 కేసుల్లో రాములు నిందితుడిగా ఉన్నాడు. వాటిలో 16 మర్డర్లు, 4 దొంగతనం కేసులు (షామీర్‌పేట, మేడ్చల్, రాయదుర్గం, బొల్లారం స్టేషన్ల పరిధిలో), ఒకటి పోలీస్ కస్టడీ నుంచి పరారీ కేసు. వాటిల్లో రెండు కేసుల్లో యావజ్జీవ శిక్ష పడింది. ఆ 16కు, తాజా ఇద్దరి హత్యలూ కలిపితే ఇప్పటి వరకూ పోలీసులకు తెలిసీ రాములు చంపింది 18 మంది మహిళలను.

ప్రస్తుతం అతడిని ఘటకేసర్ పోలీసులు విచారిస్తున్నారు. త్వరలో చార్జిషీటు వేసి కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తరువాత కోర్టు విచారించి, అతను నేరం చేశాడని నిర్ధారణ అయితే శిక్షిస్తుంది.

(కథనానికి హైదరాబాద్ నగర పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)