కోవిడ్‌ టీకా: పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా? కోవాక్స్‌ దీన్ని అడ్డుకోగలదా?

పేదదేశాలకన్నా ధనిక దేశాలే ఎక్కువగా టీకాను పొందుతున్నాయని ఆరోపణలున్నాయి

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, పేదదేశాలకన్నా ధనిక దేశాలే ఎక్కువగా టీకాను పొందుతున్నాయని ఆరోపణలున్నాయి

కోవిడ్‌-19కు అతివేగంగా వ్యాక్సీన్‌ కనుక్కోవడం శాస్త్ర విజ్జాన పురోగతిలో ఒక అద్భుతంగా నిలిచింది. కానీ పేద దేశాలను పక్కనునెట్టి ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయన్న భయాలు కూడా ఉన్నాయి.

కోవాక్స్‌ పేరుతో అంతర్జాతీయ స్కీమ్‌ ఒకటి వ్యాక్సీన్‌ను పేద, ధనిక దేశాలకు సమంగా అందేలా కృషి చేస్తోంది.

కోవాక్స్‌ అంటే ఏంటి?

2020 ఏప్రిల్‌లో ఈ కోవాక్స్‌ స్కీమ్‌ను ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే ఈ స్కీమ్‌, కోవిడ్‌ వ్యాక్సీన్‌ను ప్రపంచ దేశాలన్నింటికీ సమంగా సరఫరా చేసేందుకు ఏర్పాటైంది.

180 దేశాలకు అవసరమైన వ్యాక్సీన్‌ తయారీ, కొనుగోళ్లు, రవాణాలాంటి వ్యవహారాలను కోవాక్స్‌ పర్యవేక్షిస్తుంది. వ్యాక్సీన్‌ సరఫరాలో పేద ధనిక దేశాల మధ్య తేడాలు ఉన్నాయని ఐక్య రాజ్య సమితి అధ్యక్షుడు టెడ్రోస్‌ అధ్నాం గెబ్రియోసిస్‌ ఇప్పటికే వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు 49 ధనిక దేశాలలోని సుమారు 3.9 కోట్లమందికి వ్యాక్సీన్‌ అందిందని, కానీ కేవలం 25 పేద దేశాలలోనే ప్రజలకు వ్యాక్సీన్‌ను ఇస్తున్నారని ఆయన అన్నారు.

అన్ని దేశాలకు సమంగా టీకా అందించేందుకు కోవాక్స్‌ స్కీమ్‌ ఏర్పాటైంది.

ఫొటో సోర్స్, SOPA Images

ఫొటో క్యాప్షన్, అన్ని దేశాలకు సమంగా టీకా అందించేందుకు కోవాక్స్‌ స్కీమ్‌ ఏర్పాటైంది

ఇప్పటి వరకు ఎందరికి వ్యాక్సీన్‌ సరఫరా చేశారు?

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సంస్థ వ్యాక్సీన్‌ను సరఫరా చేయడం ప్రారంభించనుంది. పేద, మధ్య తరగతి దేశాలు ఈ వ్యాక్సీన్‌లో ఎక్కువ వాటాను పొందగలుగుతాయి.

ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను అందించగలమని కోవాక్స్‌ నమ్మకంతో ఉంది. ఇందులో 92 దేశాలకు చెందిన 130 కోట్లమంది ప్రజలకు ఈ వ్యాక్సీన్‌ను అందించనున్నారు. ఇది ప్రపంచ జనాభాలో దాదాపు 20శాతం.

అయితే కోవాక్స్‌ కూడా వేగంగా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రపంచ దేశాలకు వ్యాక్సీన్‌ను సరఫరా చేయడంలో కోవాక్స్‌ చాలా నెమ్మదిగా పని చేస్తోందని ఆస్ట్రియాకు చెందిన డాక్టర్‌ క్లెమెన్స్‌ మార్టిన్‌ విమర్శించారు. ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ బోర్డులో సభ్యుడు కూడా.

మహమ్మారిని కోవాక్స్‌ పారదోలగలదా?

కోవాక్స్‌ తన లక్ష్యాన్ని చేరుకున్నా, కోవిడ్‌ను పూర్తిగా పారదోలేందుకు సరిపడా ఇమ్యూనిటీ రాదని, కనీసం 70%మందిలో ఇమ్యూనిటీని సాధించగలిగితేనే ఈ మహమ్మరి పోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

ప్రపంచ జనాభా ప్రస్తుతం 780 కోట్లమంది ఉన్నట్లు అంచనా. ఏటా 200 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను సరఫరా చేసినా 70%మందికి వ్యాక్సీన్‌ చేరేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది.

అయితే ఊరట కలిగించే విషయం ఏంటంటే, 200 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతుంది.

70%శాతంమంది ఇమ్యూనిటీ వస్తేనే ప్రపంచం నుంచి కరోనా అంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 70%శాతంమంది ఇమ్యూనిటీ వస్తేనే ప్రపంచం నుంచి కరోనా అంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు

ఏ దేశం ఎంత నిధి ఇచ్చింది?

ఇప్పటి వరకు 734 మిలియన్‌ డాలర్ల సొమ్మును బ్రిటన్ ప్రభుత్వం నిధిగా ఇచ్చింది. అమెరికా, రష్యాలు కోవాక్స్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కొత్త అధ్యక్షుడు వచ్చాక తాము దీనిపై సంతకాలు చేస్తామని అమెరికా గతంలో తెలిపింది.

అయితే అమెరికాతోపాటు, కోవాక్స్‌ గ్రూప్‌లోని ధనిక దేశాలు కొన్ని వ్యాక్సీన్‌ను తమ వద్ద పెద్ద మొత్తంలో పోగు చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.

జనవరి రెండోవారం నాటికి ధనిక దేశాల చిన్న గ్రూపు దగ్గరే సుమారు 60% వ్యాక్సీన్‌ నిల్వ ఉన్నట్లు డ్యూక్‌ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్‌ హెల్త్ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 16% మాత్రమే.

మిగిలిన ప్రపంచ దేశాలకు కూడా కరోనా నుంచి బైటపడేందుకు ఉన్న ఏకైక మార్గం కోవాక్స్‌ సరఫరా చేయబోయే టీకాయే.

ఇప్పటి వరకు కోవాక్స్‌ 2.4 బిలియన్‌ డాలర్లను మాత్రమే సేకరించగలిగిందని, కానీ 2021 చివరి నాటికి ప్రపంచానికంతటికీ ఈ వ్యాక్సీన్‌ను అందించాలంటే 4.6 బిలియన్‌ డాలర్లు అవసరమని అంచనా

జనవరి 25వ తేదీ నాటికి ప్రతి వంద మందిలో ఎంత మంది ప్రజలకు ఏఏ దేశాలు వ్యాక్సీన్‌ను ఇచ్చాయో చూపుతున్న మ్యాప్
ఫొటో క్యాప్షన్, జనవరి 25వ తేదీ నాటికి ప్రతి వంద మందిలో ఎంత మంది ప్రజలకు ఆయా దేశాలు వ్యాక్సీన్‌ను ఇచ్చాయో చూపుతున్న మ్యాప్

కోవాక్స్‌ ఏయే వ్యాక్సీన్‌లు కొంటోంది?

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకాతోపాటు ఇంకా అనుమతి పొందని కొన్ని వ్యాక్సీన్‌ల కోసం కోవాక్స్‌ ఒప్పందాలు ఖరారు చేసుకుంది. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌తో 400 కోట్ల డోసులకు సరిపడా వ్యాక్సీన్‌కు సంబంధించి కోవాక్స్‌ గత వారమే ఒప్పందం చేసుకుంది.

ఈ వ్యాక్సీన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి రాగా, త్వరలో సరఫరా మొదలు కాబోతోంది.

కోవాక్స్‌ ప్రాధాన్యత ఏంటి?

ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షమందికి పైగా ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి చాలా దేశాలను ఆర్ధికంగా కుదేలు చేసింది. కోట్ల జీవితాలు దెబ్బతిన్నాయి. ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు ఈ వ్యాక్సీన్‌ నుంచి రక్షణ పొందనిదే ఈ వైరస్‌ భూమి నుంచి అంతం కాదు.

కరోనా సమస్యకు వ్యాక్సీన్‌లే పరిష్కారమని, సిద్ధమైన టీకాలను ప్రపంచ ప్రజలందరికీ సమానంగా పంచడం ద్వారా మహమ్మారిపై ఉమ్మడిగా పోరాడగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)