కరోనావైరస్: కొత్త వేరియంట్ వైరస్ ఎంత దూరం వ్యాపించింది?

కొత్త కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్‌లో మొదట గుర్తించిన కోవిడ్-19 కొత్త రకం వైరస్ కేసులను కెనడా, జపాన్‌తోపాటూ మరికొన్ని యూరోపియన్ దేశాలు కూడా ధ్రువీకరించాయి.

బ్రిటన్ నుంచి స్పెయిన్, స్విట్జర్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్ వచ్చిన వారిలో ఈ కొత్త రకం వైరస్ గుర్తించినట్లు రిపోర్టులు వస్తున్నాయి.

కెనడాలోని ఆంటారియోలో ఈ రకం వైరస్ సోకిన ఒక జంటకు సంబంధించిన ట్రావెల్ హిస్టరీ, హై రిస్క్ కాంటాక్టుల గురించి ఇంకా ఏ వివరాలూ తెలీలేదని అధికారులు చెప్పారు.

జపాన్ సోమవారం నుంచి నెలపాటు విదేశీయులు దేశంలోకి రాకుండా నిషేధం విధించనుంది.

బ్రిటన్ నుంచి వచ్చిన ఐదుగురికి ఈ వైరస్ సోకిన తర్వాత, జపాన్‌లో కొత్తగా మరో రెండు కేసులు బయటపడ్డాయి. వీరిలో ఒకరు విదేశీ ప్రయాణం చేయలేదని గుర్తించారు.

కొత్త రకం కరోనా వైరస్ వార్తలు గత వారం నుంచీ, ప్రపంచవ్యాప్తంగా రవాణా ఆంక్షలకు కారణమయ్యాయి.

ఇటు, ఈయూ అంతటా ఆదివారం నుంచి భారీ స్థాయిలో వ్యాక్సీనేషన్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, ఆలోపే చాలా ఐరోపా దేశాలు తమ ప్రజలకు కరోనా టీకా వేయడం ప్రారంభించేశాయి.

శనివారం టోక్యోలో జనం

ఫొటో సోర్స్, Reuters

ఈయూ కొత్తగా ఆమోదించిన పైజర్-బయోఎన్‌టెక్ టీకా పంపిణీ కోసం మరో రోజు వేచిచూడలేమని ఈశాన్య జర్మనీలోని వైద్య సిబ్బంది చెప్పారు. హల్బెర్‌స్టాడ్ట్‌లోని ఒక ఆస్పత్రిలో వృద్ధులకు కరోనా టీకా వేయడం ప్రారంభించారు.

డెల్-పెస్ట్ సెంట్రల్ హాస్పిటల్లోని ఒక డాక్టరుకు దేశంలో మొదటి కరోనా వ్యాక్సీన్ వేశామని హంగరీ ప్రభుత్వ వార్తా సంస్థ చెప్పింది.

కోవిడ్-19 వ్యాక్సీన్ వేయడం ప్రారంభించామని స్లొవేకియా అధికారులు కూడా చెప్పారు.

టీకాలు వేయడం ప్రారంభించినట్లు ట్విటర్‌లో ఒక వీడియో విడుదల చేసిన యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వోండెర్ లెయెన్ దానిని 'టచింగ్ మూమెంట్ ఆఫ్ యూనిటీ'గా వర్ణించారు.

బ్రిటన్‌లోని సమర్థమైన నిఘా వ్యవస్థ వల్లే కోవిడ్-19 వైరస్ కొత్త రకం గుర్తించగలిగామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ కొత్త రకం వైరస్ ఇంతకు ముందు కోవిడ్-19 వైరస్‌తో పోలిస్తే ఎక్కువగా వ్యాపించవచ్చు. కానీ, ఇది దానంత ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు.

కొత్త కరోనావైరస్

ఫొటో సోర్స్, PA Media

కొత్త వైరస్ ఎంత దూరం వ్యాపించింది

కెనడా, టొరంటో సమీపంలోని దుర్హాన్‌కు చెందిన ఒక జంటకు కొత్త రకం వైరస్ పాజిటివ్ రావడంతో, ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నారు.

జపాన్‌లో తాజాగా ఇద్దరికి కొత్త కోవిడ్ వైరస్ ధ్రువీకరించారు. వీరిలో ఒకరు డిసెంబర్ 16న లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల పైలెట్.

దేశంలోని ఒక 20 ఏళ్ల యువతికి కూడా ఇది వచ్చింది. కానీ, ఆమె కుటుంబంలో ఎవరూ విదేశీ ప్రయాణాలు చేయలేదని క్యోడో న్యూస్ చెప్పింది.

సోమవారం నుంచీ ఆంక్షలు విధిస్తుండడంతో విదేశాల నుంచి వచ్చే జపనీయులను, జపాన్‌లో నివసించే విదేశీయులను తిరిగి దేశంలోకి అనుమతించనున్నారు. కొందరు వ్యాపారవేత్తలను, ప్రదానంగా ఆసియా దేశాల నుంచి వచ్చే వారిని పరిమితంగా అనుమతిస్తారు.

స్పెయిన్‌, మాడ్రిడ్‌లో నాలుగు కొత్త రకం కరోనా కేసులు ధ్రువీకరించారు. వీరిలో ఎవరూ యూకే నుంచి వచ్చినవారు కాదు.

స్విట్జర్లాండ్‌లో మూడు కొత్త రకం కోవిడ్ కేసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు బ్రిటిష్ పౌరులు ఆ దేశంలోనే ఉన్నారు.

న్యూ ఇయర్, క్రిస్మస్ సందర్భంగా వచ్చే పర్యటకుల కోసం, ప్రపంచంలో స్విట్జర్లాండ్ ఒక్కటే, కరోనా సమయంలో కూడా తమ పర్యటక ప్రాంతాలు తెరిచి ఉంచింది. గత కొన్ని వారాలుగా బ్రిటన్ నుంచి వేలాది పర్యటకులు ఇక్కడకు వచ్చారు.

స్వీడన్‌ వచ్చిన ఒకరికి కొత్త రకం వైరస్ వచ్చిందని, కానీ, బ్రిటన్ నుంచి వచ్చినప్పటి నుంచి అతడు సెల్ఫ్- ఐసొలేషన్లో ఉన్నాడని ప్రభుత్వం చెప్పింది.

కరోనా కొత్త వైరస్

ఫొటో సోర్స్, Getty Images

కొత్త రకం వైరస్‌కు సంబంధించి తొలి కేసు నమోదైనట్లు ఫ్రాన్స్‌ కూడా ధ్రువీకరించింది.

డిసెంబర్ 19న లండన్ నుంచి వచ్చిన ఒక ఫ్రెంచ్‌ పౌరుడిలో ఇది గుర్తించామని చెప్పింది. అతడికి ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఐసొలేషన్లో ఉన్నాడని ప్రభుత్వం చెప్పింది.

బ్రిటన్‌లో కొత్త రకం కోవిడ్-19 వైరస్ బయటపడడంతో ఫ్రాన్స్ ఆ దేశంతో తమ సరిహద్దులను మూసివేసింది.

ఇంగ్లిష్ చానల్ దాటేందుకు వేచిచూస్తున్న వేలాది లారీ డ్రైవర్లు క్రిస్మస్ రోజున కెంట్‌లో తమ ట్రక్కుల్లోనే గడిపారు.

కానీ, ఈయూ పౌరులపై ఉన్న నిషేధాన్ని ఫ్రాన్స్ బుధవారం నుంచీ ఎత్తివేసింది. ప్రయాణానికి ముందు కరోనా పరీక్షల్లో నెగటివ్ వస్తేనే అనుమతిస్తామని చెప్పింది.

డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలో కూడా కొత్త రకం కేసులు ఇప్పటికే బయటపడ్డాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)