కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, కమలేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులతోపాటు వ్యాక్సీన్ల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.
120 కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో అందరికీ వ్యాక్సీన్ అవసరం అవుతుందా? అసలు ఈ వ్యాక్సీన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా? టీకాలు వేయడంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
అయితే, ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఓ ప్రటకన కొత్త చర్చకు దారితీసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఇటీవల విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. దేశం మొత్తానికి వ్యాక్సీన్ అవసరం అవుతుందని తాము ఎప్పుడూ చెప్పలేదని, కొన్ని వర్గాలకు మాత్రమే టీకా అవసరం అవుతుందని వివరించారు.
రాజేశ్ భూషణ్ వ్యాఖ్యలపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ వివరణ ఇచ్చారు. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల చైన్‌ను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా వ్యాక్సీన్ల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
''అప్పుడు అందరికీ అవసరం ఉండదు''
''కరోనావైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉండే కొన్ని వర్గాలకు టీకా ఇచ్చామంటే వైరస్‌కు కళ్లేం వేయొచ్చు. ఫలితంగా జనాభా మొత్తానికీ వ్యాక్సీన్ వేయాల్సిన అవసరం ఉండదు''అని బలరామ్ భార్గవ చెప్పారు.
అయితే, ప్రభుత్వ టీకా కార్యక్రమంలో కరోనావైరస్ టీకాను చేరుస్తారని, జనాభా మొత్తానికి ఈ టీకాను ఇస్తారనే వార్తలు మొదట్లో వచ్చాయి.
ప్రభుత్వ తాజా స్పందనలను చూస్తుంటే, దేశంలో ప్రజలందరికీ ప్రభుత్వం వ్యాక్సీన్ ఇవ్వబోదని స్పష్టం అవుతోంది.
అయినప్పటికీ, ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. కొంతమందికి వ్యాక్సీన్ ఇవ్వడం ద్వారా కోవిడ్-19ను ఎలా అడ్డుకోవచ్చు? ఈ విధానం ఎంత వరకు పనిచేస్తుంది? అసలు దీన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు?

ఫొటో సోర్స్, Reuters
టీకా వ్యూహాలు
ఈ అంశంపై ప్రజారోగ్య నిపుణుడు, డాక్టర్ చంద్రకాంత్ లహరియా మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. వ్యాక్సీన్ల అందుబాటు, దాన్ని ఎందుకు ఇస్తున్నాం? అనే కోణాల్లో ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన చెప్పారు.
''మొదట వ్యాక్సీన్ ఎందుకు ఇస్తున్నారో మనం ఆలోచించాలి. ముఖ్యంగా దేశంలో వ్యాక్సీన్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు.. మరణ రేటును తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. మరణముప్పు ఎక్కువగా ఉండేవారికి వ్యాక్సీన్లు ఇస్తారు. వృద్ధులు లేదా ఇతర అనారోగ్యాల బారిన పడేవారు, ఆరోగ్య సిబ్బందికి మొదట ప్రాధాన్యం ఇవ్వొచ్చు''అని లహరియా చెప్పారు. ''టిల్ వి విన్: ఇండియాస్ ఫైట్ ఎగైనెస్ట్ కోవిడ్-19 పాండమిక్'' పుస్తక రచయితల్లో లహరియా కూడా ఒకరు.
''ఒకవేళ వ్యాక్సీన్లు అందుబాటులో ఉండటంతోపాటు.. మరణ రేటు తక్కువగా, కేసులు ఎక్కువగా ఉన్నాయని అనుకోండి. అప్పుడు ఇన్ఫెక్షన్ల రేటును తగ్గించడంపై ప్రభుత్వం దృష్టిసారించొచ్చు. అలాంటి సమయాల్లో కొత్తగా ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉండేవారికి మొదటగా వ్యాక్సీన్ ఇస్తారు''అని లహరియా చెప్పారు.
ముప్పు ఎక్కువగా ఉండేవారికే తొలి ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ముప్పు ఎక్కువగా ఉండేవారిలో ఆరోగ్య సిబ్బంది, పోలీసులు ఉండొచ్చు. ఆరోగ్య సిబ్బంది అంటే వైద్యులు, నర్సులతోపాటు వార్డు బాయ్స్, పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్స్ డ్రైవర్లు.. ఇలా అందరూ వస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
వనరులు తక్కువగా..
వ్యాక్సీన్లను అందరికీ ఇవ్వడం అనేది చాలా పెద్ద సవాళ్లతో కూడుకున్న పని. ముఖ్యంగా వ్యాక్సీన్ల నిల్వ, పంపిణీకి చాలా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వ్యాక్సీన్ల పంపిణీ, టీకాలు వేయడంలో భారత్‌కు మంచి నైపుణ్యమున్న మాట వాస్తవమే. ప్రపంచంలో అత్యధికంగా వ్యాక్సీన్లు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.
పోలియో, మశూచి తదితర వ్యాధుల కట్టడికి టీకాలు ఇచ్చేందుకు భారత్‌లో పటిష్ఠమైన వ్యవస్థ అందుబాటులో ఉంది.
మరోవైపు వ్యాక్సీన్ అభివృద్ధి ఇంకా పూర్తికాలేదు. కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేవలం తక్కువ సమయంలోనే ఎక్కువమందికి వ్యాక్సీన్ ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇదివరకటి వ్యాక్సీన్ కార్యక్రమాలు దీనికి భిన్నంగా ఏళ్లపాటు కొనసాగేవి.
ప్రస్తుతం ఐదు వ్యాక్సీన్ల అభివృద్ధి తుది దశకు వచ్చాయి. వీటిలో రెండు దేశీయంగా అభివృద్ధి చేస్తున్న టీకాలు.
బ్రిటన్-స్వీడన్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సీన్లు మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ చెబుతున్నాయి. మరోవైపు అమెరికా సంస్థ ఫైజర్ వ్యాక్సీన్‌కు ఇప్పటికే బ్రిటన్ ఆమోదం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడం ఎలా?
ముప్పు ఎక్కువగా ఉండే వారికి వ్యాక్సీన్ మొదట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి మొదటి కారణం కొత్త ఇన్ఫెక్షన్లు అడ్డుకోవడమే కావొచ్చు.
కానీ, ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఈ అంశంపై దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సురంజిత్ ఛటర్జీ మాట్లాడారు. ఈ విధానం హెర్డ్ ఇమ్యూనిటీ తరహాలానే పనిచేస్తుందని చెప్పారు.
''జనాభాలో కొంత మందిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, కొత్త ఇన్ఫెక్షన్లు తగ్గడాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఒకసారి కరోనావైరస్ తగ్గిపోయిన తర్వాత.. మళ్లీ ఇన్ఫెక్షన్ సోకినా.. అతడి నుంచి కొత్త ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది''అని ఆయన వివరించారు.
''వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉండేవారు, వైరస్ వ్యాపింపజేసే ముప్పు ఎక్కువగా ఉండేవారికి మొదట వ్యాక్సీన్ ఇస్తే.. వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వారి నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా వైరస్ చైన్‌ను విచ్ఛిన్నం చేసినట్లు అవుతుంది''అని ఆయన చెప్పారు.
ఇదివరకు కూడా భారత్‌లో చాలా టీకా కార్యక్రమాలు కొనసాగాయి. కానీ ఇలాంటి విధానాలను ఎప్పుడూ అమలు చేయలేదు.

ఫొటో సోర్స్, Reuters
పరిస్థితులు భిన్నమైనవి..
ఇదివరకటి మహమ్మారులతో పోలిస్తే.. ప్రస్తుత పరిస్థితులు చాలా భిన్నమైనవని వైద్యులు చెబుతున్నారు. ఇదివరకటి వైరస్‌లతో పోలిస్తే.. కోవిడ్19 చాలా వేగంగా వ్యాపించింది. కొన్ని నెలల్లోనే చాలా దేశాలకు ఇది విస్తరించింది.
వైరస్ వేగంగా విస్తరించడం, లాక్‌డౌన్‌ల నడుమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు పతనం అయ్యాయి. మరోవైపు ఈ వైరస్‌కు వీలైనంత వేగంగా కళ్లెం వేయాలని రాజకీయ ఒత్తిళ్లూ ప్రభుత్వాలపై పెరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల నడుమ, ప్రాధాన్యాల వారీగా వ్యాక్సీన్లు ఇవ్వాలని ప్రభుత్వాలు భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దాదాపు అన్ని దేశాలూ ఇలాంటి విధానాలనే అనుసరిస్తాయని వివరిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
కేసులైతే తగ్గుతాయి..
ఈ విధానాల్లో వైరస్‌ను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యంకాకపోవచ్చని ఛటర్జీ చెప్పారు. అయితే కొత్త కేసులు మాత్రం తగ్గుతాయని అన్నారు. ఫలితంగా ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గుతుందని, ప్రజల్లో భయం కూడా కొంత వరకు తొలగుతుందని చెప్పారు.
''భారత్‌లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ ఇవ్వడమంటే చాలా కష్టం. అందుకే ప్రస్తుతమున్న వనరులను దృష్టిలో ఉంచుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ప్రాథమిక ఫలితాల ఆధారంగా సమగ్ర వ్యూహాలు సిద్ధం చేయాలి''అని ఆయన వివరించారు.
2021 వరకు ఈ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూ ఉండొచ్చని లహరియా అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆ తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఉంటుందని ఆయన అన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం భిన్నమైన వ్యూహాలను అనుసరించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








