కోవిడ్‌-19 వ్యాక్సీన్‌ తీసుకున్న తర్వాత కూడా మాస్క్‌ ధరించాలా? సామాజిక దూరం పాటించాలా?

కరోనా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లెటీషియా మోరీ
    • హోదా, బీబీసీ న్యూస్‌, సావోపాలో

కోవిడ్‌-19 కోసం రెండు ప్రభావవంతమైన వ్యాక్సీన్‌లు సిద్ధమయ్యాయి. అందులో ఒకటైన ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థ తయారీ వ్యాక్సీన్‌ను గత సోమవారం నుంచి బ్రిటన్‌లో ప్రజలకు ఇవ్వడం ప్రారంభించారు. ఇది మరికొన్ని రోజులలో మెక్సికో ఇంకా మరికొన్ని లాటిన్‌ అమెరికా దేశాలకు కూడా సరఫరా అవుతుంది.

కోవిడ్‌ వ్యాధి నిరోధక వ్యాక్సీన్‌ తీసుకున్న వెంటనే ఎవరైన మొదట ఏం చేస్తారు? గత ఏడాదికాలంగా ఎవరికీ చూపించకుండా మాస్కు మాటున దాచుకున్న ముఖానికి స్వేచ్ఛ కల్పించాలనుకుటారు. కానీ అది కుదరదు అంటున్నారు నిపుణులు. వ్యాక్సీన్‌ తీసుకున్న ప్రపంచానికి పాత రోజులు రావని సైంటిస్టులు చెబుతున్నారు.

“వ్యాక్సీన్‌ తీసుకున్న తర్వాత కొన్నాళ్లు సామాజిక దూరం పాటించాలి. రెండో డోస్‌ కోసం ఎదురు చూడాలి. టీకా పూర్తి స్థాయిలో పని చేయడం మొదలు కావాలంటే 15 రోజులు వేచి చూడాలి’’ అని బ్రెజిల్‌లోని క్వెస్టావ్‌ డి సిన్సియా ఇనిస్టిట్యూట్ అధినేత, జీవశాస్త్రవేత్త నటాలియా పాస్టర్నాక్‌ అన్నారు.

"జనాభాలో ఎక్కువమంది వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పొందే వరకు వేచి చూడటం అవసరం. అప్పుడే కోవిడ్‌ అంతమవుతుంది’’ అన్నారు నటాలియా.

వ్యాక్సీన్‌ తీసుకున్నా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే వరకు వేచి చూడాలంటున్నారు నిపుణులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వ్యాక్సీన్‌ తీసుకున్నా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే వరకు వేచి చూడాలంటున్నారు నిపుణులు

శరీరం స్పందించే సమయం

మిగతా వ్యాక్సీన్‌లలాగే ఈ వ్యాక్సీన్‌ పనిచేసే విధానం కూడా ఉంటుంది. శరీరంలోకి యాంటీజెన్‌ అనే ఒక కణాన్ని పంపుతారు. ఈ యాంటీజెన్‌ క్రియారహితం చేసిన వైరస్‌. చాలా బలహీనంగా ఉంటుంది. అయితే ఈ కణాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.

“ఈ యాంటీజెన్‌ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను కదిలిస్తుంది. దీంతో ఆ రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌ను గుర్తించడానికి, దానితో పోరాడటానికి కావాల్సిన యంత్రాంగాన్ని సిద్ధం చేస్తుంది’’ అని సావోపాలో యూనివర్సిటీలో అంటువ్యాధుల విభాగంలో ఫేకల్టీగా పని చేస్తున్న జార్జ్‌ కలీల్ అన్నారు.

మరోసారి ఇలాంటి వైరస్‌ వచ్చినప్పుడు శరీరం దానితో ఎలా పోరాడాలో గుర్తుంచుకుంటుంది. సమర్ధవంతంగా పోరాడుతుంది కూడా. ఈ ప్రతిస్పందననే అడాప్టివ్‌ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ అంటారు. “ఇది పూర్తిగా ప్రతి స్పందించడానికి కనీసం రెండు వారాల సమయం అవసరం” అన్నారు నటాలియా పాస్టర్నాక్‌.

టీకా శరీరంలోకి వెళ్లగానే ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ సిస్టం పని ప్రారంభిస్తుంది. యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేసి అవి వైరస్‌ను అంటుకుని ఉండేలా చూస్తుంది. ఈ యాంటీబాడీలు వైరస్‌ ఇతర కణాలకు సోకకుండా, ఎక్కువ వైరస్‌లు ఉత్పత్తి కాకుండా అడ్డుపడతాయని పాస్టర్నాక్‌ వివరించారు.

ప్రస్తుతం అన్నివర్గాల వారికీ వ్యాక్సీన్‌ ఇవ్వడం లేదు కాబట్టి కోవిడ్‌ నిబంధనలు కొనసాగించాల్సి ఉంటుంది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం అన్నివర్గాల వారికీ వ్యాక్సీన్‌ ఇవ్వడం లేదు కాబట్టి కోవిడ్‌ నిబంధనలు కొనసాగించాల్సి ఉంటుంది

అంటే రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తి శరీరంలోకి వ్యాధికారక క్రిములు ప్రవేశించిన క్షణం నుండి జీవకణాలు కలుషితం కాకుండా ఈ యాంటీబాడీలు నిరోధిస్తు ఉంటాయి.

ఇక రెండోరకం ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ను సెల్యూలార్‌ రెస్పాన్‌ అంటారు. ఇందులో ఉండే కణాలను టి-సెల్స్‌ అంటారు. ఇవి వైరస్‌లను అంటిపెట్టుకోవు. కానీ వాటిని గుర్తించిన వెంటనే అవి శరీరంపై దాడి చేయకుండా అడ్డుకుని చంపేస్తాయి’’ అని పాస్టర్నాక్‌ వివరించారు.

అంటే యాంటీబాడీస్‌ నుంచి ఏ వైరస్‌ అయినా తప్పించుకుని శరీరం మీద దాడి చేస్తున్నప్పుడు ఈ టి-సెల్స్‌ వాటిని గుర్తించి అంతం చేస్తాయి. అందుకే వీటిని హంటర్స్‌ అంటుంటారు.

అయితే యాంటీబాడీ రెస్పాన్స్‌కన్నా సెల్యూలార్‌ రెస్పాన్స్‌ కాస్త ఎక్కువ టైమ్‌ తీసుకుంటుంది. వ్యాక్సీన్‌ తీసుకున్న తర్వాత అది పూర్తిస్థాయిలో పని చేసేందుకు రెండు వారాల సమయం పట్టడానికి కారణం అదేనన్నారు జార్జ్‌ కలీల్‌.

అంటే టీకా తీసుకున్న తర్వాత దాన్నుంచి లభించే నిజమైన రక్షణ రెండు వారాల తర్వాతే ఉంటుందన్నమాట.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

రెండు డోసుల వ్యాక్సీన్‌ ఎందుకు?

కరోనా విషయంలో వ్యాక్సీన్‌ తీసుకున్న తర్వాత కొన్ని ప్రత్యేక రక్షణ చర్యలను తీసుకున్నారు. అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుగా ఇప్పుడు తయారవుతున్న వ్యాక్సీన్‌లన్నీ రెండు డోసుల్లో తీసుకునేలా నిర్ధారించారు.

ఇప్పటి వరకు ప్రభావవంతమైనవిగా నిర్ధారించిన నాలుగు వ్యాక్సీన్‌లు అంటే ఫైజర్‌, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్‌-వి లను రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంది.

దీంతోపాటు సినోవాక్‌ తయారు చేసిన కొరోనవాక్‌ కూడా రెండుసార్లు తీసుకోవాల్సి ఉంది.

"ఇంకా చెప్పాలంటే ఒక డోస్‌ తీసుకోవడం, నెల రోజులు వేచి ఉండటం, రెండో డోసు తీసుకోవడం, తర్వాత ఇంతకు ముందు పాటించిన కోవిడ్‌ నియమాలు అంటే సామాజిక దూరం, మాస్కులు ధరించడంలాంటివి మరో 15 రోజుల పాటు కొనసాగించాల్సి ఉంది” అన్నారు జార్జ్‌ కలీల్‌.

“మొదటి డోస్‌ను ప్రధాన బూస్టర్‌గా చెప్పుకోవచ్చు.ఇది రోగ నిరోధక వ్యవ్యస్థకు కిక్‌స్టార్ట్‌లాంటిది. రెండో డోస్‌ రోగ నిరోధక వ్యవస్థను సమర్ధవంతంగా పని చేయిస్తుంది’’ అని వివరించారు పాస్టర్నాక్‌

రెండు డోసుల మధ్య సమయం, రోగ నిరోధక వ్యవస్థ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ను ఉత్పత్తి చేయడానికి పట్టే సమయం, వ్యాక్సీన్‌ తీసుకున్నవారు పూర్తిస్థాయి రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తిగా మారడానికి కనీసం 45 రోజులు పడుతుంది.

అయితే ఆ తర్వాత కూడా కోవిడ్‌కు ముందున్న పరిస్థితుల్లోకి వెళ్లడానికి కొంత సమయం పడుతుంది. జనాభాలో ఎక్కువమంది టీకాలు తీసుకుని, వారు రోగ నిరోధక శక్తి ఉన్నవారుగా తయారు కావాలి. అప్పుడే పరిస్థితులు మామూలుగా మారే అవకాశం ఉంది. అందుకే వ్యాక్సీన్‌లు తీసుకున్నవారు కోవిడ్‌ నియమాలు కొనసాగించాలి.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టలేదా?

అది నిజం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే వ్యాక్సీన్‌ను విస్తృతంగా ఇచ్చినట్లయితే అది హెర్డ్‌ ఇమ్యూనిటీని పెంచి వ్యాధివ్యాప్తిని తగ్గిస్తుంది.

అయితే ఏ వ్యాధి వ్యాక్సీన్‌ కూడా 100% ప్రభావవంతమైనది కాదన్నది నిజం. ఇది కోవిడ్‌కు కూడా వర్తిస్తుంది. ఫైజర్‌ టీకా మూడో దశ పరీక్ష తర్వాత 95% ప్రభావవంతమైనదని గుర్తించారు.

అంటే వ్యాక్సిన్‌ వేసిన వ్యక్తి శరీరంలో రోగ నిరోధక ప్రతిస్పందన కలగకపోవడానికి ఇంకా 5% వరకు అవకాశం ఉందని దీని అర్ధం.

వ్యక్తుల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా వ్యాక్సీన్‌ ఎలా నిరోధిస్తుంది? దీనికి సమాధానంగా “ టీకా కారణంగా హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరుగుతుంది” అని వివరించారు జార్జ్‌ కలీల్‌.

"ఈ వ్యాక్సీన్‌ వ్యాధుల బారినపడేవారి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. అంటే వైరస్ ఇకపై వ్యాప్తి చెందదు. గతంలో మశూచిని కూడా ఇలాగే నిరోధించగలిగారు" అని డాక్టర్ కలీల్‌ గుర్తు చేశారు.

కోవిడ్

ఫొటో సోర్స్, EPA

వ్యాక్సీన్‌ తీసుకున్న వారు ఏం చేయాలి?

టీకాలు నూటికి నూరుపాళ్లు ప్రభావవంతంగా పని చేయవు కాబట్టే హెర్డ్‌ ఇమ్యూనిటీ ముఖ్యం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వ్యాక్సీన్‌ అన్నివర్గాల వారికీ అందుబాటులోకి రాదు. "వృద్ధులకు తప్ప మొదట్లో వ్యాక్సీన్‌ అన్ని వయసుల వారికి ఇవ్వరు. పిల్లలకు, గర్భిణులకు ఇవ్వడం లేదు. కాబట్టి హెర్డ్‌ ఇమ్యూనిటీ అనేది చాలా కీలకం’’ అన్నారు డాక్టర్‌ కలీల్‌.

ఇతర వ్యాధుల కారణంగా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని ఉన్న వారికి కూడా వ్యాక్సీన్‌లు ఇవ్వబోవడం లేదు. "ఎక్కువ జనాభాకు టీకా ఇచ్చినప్పుడు హెర్డ్‌ ఇమ్యూనిటీ వల్ల మిగతా వాళ్లకు రక్షణ ఏర్పడుతుంది’’ అని డాక్టర్‌ కలీల్‌ వివరించారు.

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే కనీసం 80 నుంచి 90% శాతంమందికి వ్యాక్సినేషన్‌ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.

అందువల్ల టీకా తీసుకున్నా, ఒకటిన్నర నెలలపాటు వేచి ఉండటం మంచిదని, అప్పుడే మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం విజయవంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పోరాటంలో వ్యాక్సీన్‌ అందరికీ చేరడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

వ్యాక్సీన్‌ తీసుకున్న వెంటనే మాస్కులు తీసేసి తిరగడం కుదరకపోవచ్చు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వ్యాక్సీన్‌ తీసుకున్న వెంటనే మాస్కులు తీసేసి తిరగడం కుదరకపోవచ్చు

మిలియన్ల డోసుల టీకా రాత్రికి రాత్రే తయారు చేయడం సాధ్యం కాదు. ఔషధ పంపిణీకి ప్రభుత్వాలతో ఒప్పందాలు, వెయిటింగ్‌ లిస్టు, నిల్వ ఇబ్బందులు ఈ ఆలస్యానికి అదనం.

"వ్యాక్సీన్‌ను తీసుకునే వారెవరైనా ముందు మహమ్మారి నివారణ చర్యలను పాటించడం ముఖ్యం. హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాలి" అన్నారు పాస్టర్నాక్‌.

ఇప్పటి వరకు తయారైన టీకాలు మనిషి శరీరంలో వైరస్‌ పునరుత్పత్తి కాకుండా, అనారోగ్యంపాలు కాకుండా జాగ్రత్త పడతాయని మాత్రమే తేలింది. వ్యాధివ్యాప్తిని ఆపుతాయిని ఇంకా గుర్తించ లేదు.

వీటన్నిటి సారాంశం ఏమిటంటే, మీరు రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ, ప్రపంచ జనాభాలో ఎక్కువమంది టీకా తీసుకునే వరకు, అలాగే శరీరంలో వైరస్‌ పూర్తిగా నశించే వరకు, హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేదాక కోవిడ్‌ జాగ్రత్తలు పాటించక తప్పదన్నారు డాక్టర్‌ కలీల్‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)