ప్రికాషియస్ ప్యుబర్టీ: ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావటానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?

చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, డాక్టర్ శైలజ చందు
    • హోదా, బీబీసీ కోసం

పూజ మూడో తరగతి చదువుతోంది. నాలుగు రోజుల క్రితమే ఏడో బర్త్ డే జరుపుకొంది.

స్కూల్లో ఆట స్థలం దగ్గరున్న చెట్ల పొదల దగ్గర నిల్చుని ఏడుస్తోంది.

ఆ రోజు ఉదయం మామూలుగానే స్కూలుకొచ్చింది. క్లాసులు ప్రారంభమవడానికి ఇంకా టైముండడంతో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది.

కాసేపు ఆడాక, ఆమెకు కడుపులో నొప్పిగా అనిపించి ఓ పక్కన బెంచీ మీద కూర్చుంది.

తను కూర్చుని లేచిన చోటు గమనిస్తే రక్తపు మరకలంటి ఉన్నాయి.

గాభరా పడి తన యూనిఫామ్ చూసుకుంటే అది కూడా ఖరాబయి ఉంది.

పెద్ద క్లాసుల పిల్లలు విషయం గమనించి, పూజ వాళ్ల అక్కని పిలిపించారు.

అదే స్కూల్లో వాళ్లక్క కూడా ఆరో క్లాసు చదువుతోంది.

అక్క ప్రవీణతో పోలిస్తే పూజ పొడుగనిపిస్తుంది. అంతేకాదు మిగిలిన క్లాసులో మిగిలిన పిల్లల్ని మించి పెరిగింది.

అక్కని చూడగానే చుట్టుకుపోయి ఏడ్చింది. "భయమేస్తోందక్కా, నాకేమీ దెబ్బ తగల్లేదు. కానీ చూడు" అంటూ దుస్తులకంటిన మరకల్ని చూపించింది.

ప్రవీణకు పదకొండో సంవత్సరం నడుస్తోంది. రజస్వల కాలేదు కానీ చెల్లిని చూడగానే విషయం చూచాయగా అర్థమైంది. శరీరం పెరుగుదల గురించి చెప్తూ క్లాసులో టీచర్ ఓసారి వివరించారు.

అమ్మకు ఫోన్ చేసి వస్తానని చెప్తూ చెల్లెల్ని విడిపించుకోబోయింది. "నువ్వెళ్లొద్దక్కా, భయమేస్తోంద"ని గుబులుతో మరింతగా ఏడుస్తోంది పూజ.

పెద్ద క్లాసుల ఆడపిల్లలు ఆమె చుట్టూ దడికట్టినట్టు నిలబడ్డారు. అటుగా వెళ్తున్న శారద టీచర్ వీళ్లున్న చోటికి వచ్చి ఏమైందని అడిగారు. విషయం చెప్పారు ఆడపిల్లలు.

వెంటనే ఆమె పూజను తనతోపాటే స్టాఫ్ రూమ్‌కు తీసుకెళ్లారు. స్టోర్ నుండి కొత్త యూనిఫామ్, శానిటరీ నాప్కిన్స్ తెప్పించి దుస్తులు మార్పించారు. పూజ తల్లికి ఫోన్ చేసి పిలిపించారు.

ప్రికాషియస్ ప్యుబర్టీ

ఫొటో సోర్స్, bbc/Getty Images

సాధారణంగా ఏ వయసులో యుక్త వయసు మార్పులు సంభవిస్తాయి?

యుక్త వయసులో వచ్చే శారీరకమైన మార్పులు 10 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమవుతాయి.

ఆ ప్రక్రియ 3, 4 సంవత్సరాల పాటు సాగుతుంది.

బాలికలలో శారీరకంగా వచ్చే మొదటి మార్పు ఛాతీ పెరుగుదల. వక్షోజాల పెరుగుదల తరువాత చేతుల కింద, జననాంగాల వద్ద రోమాలు పెరగడం. చివరిగా రజస్వల కావడం.

పాత తరాల వారితో పోలిస్తే ఈ యుక్త వయసు ప్రక్రియ ఇప్పటి పిల్లల్లో కొంత ముందుగానే మొదలవుతున్నట్టు తెలుస్తోంది.

ప్రికాషియస్ ప్యుబర్టీ

ఫొటో సోర్స్, bbc/Alamy

యుక్త వయసు ప్రక్రియ ఎలా జరుగుతుంది?

ఇది బాల్యం చివరి దశలో ప్రారంభమయే క్లిష్టమైన ప్రక్రియ.

యుక్తవయసు రావడానికి ముందు:

1. హైపోథలమస్, పిట్యూటరీ, అండాశయాలు పరిపక్వ స్థితికి చేరుకుంటాయి.

2. శరీరంలో లైంగికమైన మార్పులు కనిపిస్తాయి. (వక్షోజాల పెరుగుదల, చేతుల కింద, జననాంగాల పైన రోమాలు)

3. పొడుగు పెరుగుతారు.

4. చివరి దశలో రజస్వల కావడం. ఈ ప్రక్రియ కొందరిలో చిన్న వయసులోనే జరుగుతాయి.

యుక్తవయసులో వచ్చే మార్పులు, అంటే వక్షోజాల పెరుగుదల, చేతుల కింద, జననాంగాల పైన రోమాలు, రుతుస్రావం.. ఏడు సంవత్సరాలు మించని వయసు ఆడపిల్లలో జరిగితే దాన్ని ప్రికాషియస్ ప్యుబర్టీ (Precocious puberty) అంటారు.

ప్రికాషియస్ ప్యుబర్టీ

ఫొటో సోర్స్, bbc/Alamy

చిన్న వయసులోనే రుతుస్రావం ప్రారంభం కావడానికి కారణాలేమిటి?

మెదడులో కణుతులు, తలకు దెబ్బ తగలడం వల్ల, లేదా మెదడు వాపు వ్యాధి (మెదడుకు ఇన్ఫెక్షన్) వల్ల , సాధారణ వయసుకన్నా ముందుగానే రజస్వల అవుతారు.

ఎడ్రినల్ గ్రంథిలో కణుతులు, అండాశయాల్లో నీటి తిత్తుల వల్ల కూడా ఇలా వయసు కన్నా ముందుగా యుక్తవయసు మార్పులు కనిపిస్తాయి.

థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా ఈ మార్పులు ముందే కనిపిస్తాయి.

74 శాతం శాతం కేసుల్లో ఎటువంటి కారణమూ కనబడదు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ప్రికాషియస్ ప్యుబర్టీ పరిస్థితికి ఏ నిపుణుల వద్ద చికిత్స చేయించాలి?

పరిస్థితిని అంచనా వేసేందుకు ఎండోక్రైనాలజిస్ట్ వద్దకు పంపించాలి.

ఇందులోనూ చిన్న పిల్లలకు సంబంధించిన నిపుణులు (Paediatric endocrinologist) అందుబాటులో ఉంటే మంచిది.

పిల్లల్లో ఈ పరిస్థితి తలెత్తడానికి కారణాలు తెలుసుకోవాలంటే ముందు ఈ పెరుగుదలలో మార్పుల వరుస క్రమం గురించి వివరాలు సేకరించాలి. శరీరాన్ని సమగ్రంగా పరిశీలించాలి.

ఆమె బరువు, పొడుగుల వివరాలు తీసుకుని సాధారణ ప్రమాణాలతో పోల్చి చూడాలి.

బ్రెయిన్ పని తీరుని అంచనా వేసేందుకు అవసరమైన పరీక్షలు చేయాలి.

కంటి చూపు పరీక్షలు కూడా అవసరం. ఎందుకంటే పిట్యూటరీ గ్రంథిలో వచ్చే వ్యాధుల వల్ల కంటి చూపులో మార్పులు వస్తాయి.

ప్రికాషియస్ ప్యుబర్టీకి గల కారణాలు తెలుసుకోవడానికి ఏఏ పరీక్షలు అవసరం?

హార్మోన్లకు సంబంధించిన రక్త పరీక్షలు చేయించాలి. స్కానింగులో చూడవలసిన ముఖ్యమైన వివరాలేమిటంటే, గర్భాశయం, అండకోశాల పెరుగుదల, ఎడ్రినల్ గ్రంథుల వివరాలు.

అండాశయాల్లో నీటి తిత్తులున్నాయో లేదో కనుగొనడానికి పొట్టకు స్కానింగ్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదని నిర్ధారించడానికి బ్రెయిన్ స్కాన్ అవసరం.

ఎముకల పరిణితిని అంచనా వేసే స్కానింగులు కూడా చేయించాలి.

ప్రికాషియస్ ప్యుబర్టీ

ఫొటో సోర్స్, bbc/Getty Images

పూజ, క్లాసులో అందరికన్నా పొడుగ్గా పెరిగింది. శరీరంలో ముందుగానే వచ్చిన మార్పుల వల్ల తోటి పిల్లలకు అందరికీ ఆమె ఒక వింత అయింది.

ముఖం మీద మొటిమలు, శరీరంలో యవ్వనపు చిహ్నాలు! వాటిని దాచుకోవడానికి కుచించుకుపోయేది.

పెరిగిన ఛాతీ దాచుకోవడానికి వంగిపోయి నడిచేది. ఆకతాయి పిల్లలు ఆమె పట్ల చేసే వ్యాఖ్యలకు ఇంటికొచ్చి ఏడిచేది.

తోటి ఆడపిల్లలు సైతం ఆమెను తమతో కలుపుకోకుండా దూరంగా ఉంచేవారు.

రుతుక్రమం రోజుల్లో శానిటరీ నాప్కిన్లు వాడే నేర్పు తెలియక తికమకపడుతూ ఉండేది. ఆ సమయంలో వచ్చే నొప్పి తట్టుకోలేక అమ్మ దగ్గర ఏడుస్తుండేది. రోజూ ఏదో ఒక వంకతో స్కూలు మానేస్తోంది.

ప్రికాషియస్ ప్యుబర్టీ

ఫొటో సోర్స్, bbc/Alamy

ముందుగానే యుక్త వయసు రావడం వల్ల ఆ పిల్లలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?

ఒక దశలో అందరికన్నా పొడుగుగా కనిపించినా, ఎముకల పరిణితి త్వరగా జరిగిపోవడం వల్ల, ఆపైన ఎదుగుదల ఆగిపోతుంది.

సాధారణ యుక్త వయసు వచ్చే సరికి తోటిపిల్లలతో పోలిస్తే పొడుగు తక్కువగా కనిపిస్తారు.

ఈ పరిస్థితికి పరిష్కారం ఏమిటి? చికిత్స ఎలా చేయాలి? చికిత్స లక్ష్యాలేమిటంటే..

1. త్వరగా జరుగుతున్న లైంగిక పరిపక్వతను నిరోధించడం.

2. సాధారణ యుక్తవయసు వచ్చే వరకూ రుతుస్రావం నిలిపివేయడం.

3. ఎముకల పరిణితిని వాయిదా వేయడం ద్వారా, వారి ఎత్తుని మెరుగుపరచడం.

4. యుక్తవయసులో రావలసిన మార్పులు బాల్యావస్థలోనే జరగడం వల్ల ఆమెలో కలిగే మానసిక సంఘర్షణను అర్థం చేసుకోవడం.

చికిత్సలో హార్మోన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. గొనడోట్రోఫిన్ - రిలీజింగ్ హార్మోన్ అనలాగ్స్ (Gonadotrophin-releasing hormone analogues - GnRHa) ని వాడడం వల్ల పరిస్థితి అదుపులోకి వస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, istock

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఎంత కాలం వాడాలి?

సాధారణ యుక్త వయసు వచ్చేవరకూ, ఈ పరిస్థితిని వాయిదా వేయడమే ఈ చికిత్స ఉద్దేశం.

ఈ హార్మోన్లు 3 - 4 వారాలకొకమారు ఇవ్వ వలసి ఉంటుంది. డిపో ఇంజెక్షన్స్ అయితే ప్రతి మూడునెలకొకసారి ఇవ్వవచ్చు.

ఒక సంవత్సరానికి సరిపడా పనిచేసే హార్మోన్ ఇంప్లాంట్ అందుబాటులో ఉన్నాయి

ఈ హార్మోన్ల చికిత్స వల్ల కలిగే దుష్ప్రభావాలేమిటి?

వైద్య విధానంలో ఎటువంటి చికిత్సకైనా సైడ్ ఎఫెక్ట్స్ తప్పనిసరిగా ఉంటాయి.

ఈ హార్మోన్ చికిత్సవల్ల తలనొప్పి, శరీరంలో వేడి ఆవిర్లు రావడం (Hot flushes), మూడ్ స్వింగ్స్ కలగడం ముఖ్యమైన దుష్ప్రభావాలు.

ఇంజెక్షన్ చేసిన చోట దద్దుర్లు రావడం, పుండు పడడం కూడా సహజమే.

చిన్న పిల్లలు త్వరగా యుక్త వయసుకు వచ్చే ఈ ప్రికాషియస్ ప్యుబర్టీ వల్ల ఆ ప్రభావం ఆ అమ్మాయితో బాటు, ఆమె కుటుంబం పైన కూడా ఉంటుంది.

అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే, పాప శారీరకంగా పెరిగింది కానీ, మానసికంగా చిన్న పిల్ల.

ఈ పరిస్థితి ఆధారంగా బయటి వ్యక్తులు ఆమెతో చెడ్డగా ప్రవర్తించకుండా ఆమెను కాపాడుకోవాలి. ఆమెకు తగిన రక్షణనివ్వాలి.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. దీని నేపథ్యం, ఇందులోని పాత్రలు కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)