శరద్ పవార్: సోనియా గాంధీ స్థానంలోకి వస్తారా... ఎన్‌సీపీ ఏమంటోంది?

శరద్ పవార్, సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద పవార్‌ను సోనియా గాంధీ స్థానంలో యూపీఏ అధ్యక్షులుగా నియమిస్తారనే వార్త కొద్ది రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

పవార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, మెల్లిగా పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలంటూ కొన్ని వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయని, దానివల్లే పవార్ యూపీఏ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చించని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

గురువారం నాడు ఒక టీవీ ఛానల్ ఈ వార్తపై ఒక కథనం ప్రచురించింది. ఆ తరువాత మిగతా మీడియా కూడా దీని గురించి చర్చ మొదలెట్టింది. దాంతో ఎన్‌సీపీ జోక్యం చేసుకుని ఈ వార్తలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసింది.

పార్టీ ముఖ్య ప్రతినిధి మహేష్ తాప్సే విలేఖరులతో మాట్లాడుతూ...ఈ అశంపై యూపీఏ పార్టీ ప్రతినిధులతో ఎలాంటి చర్చా జరగలేదని స్పష్టం చేసారు.

"రైతులు చేస్తున్న ఆందోళనలనుంచీ దృష్టి మళ్లించడానికి కొంతమంది స్వార్థపరులు మీడియాలో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని" తాప్సే తెలిపారు.

మన్మోహన్, సోనియా గాంధీ

ఫొటో సోర్స్, The India Today Group

'రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే'

అయితే, మహారాష్ట్రలో ఎన్‌సీపీ మిత్ర పక్షం శివసేన "రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే" అని వ్యాఖ్యానించింది.

"రాజకీయాల్లో అనిశ్చితి అలుముకుందని, ముందు ముందు ఏం జరగబోతోందో ఎవరికీ తెలీదని" శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

"పవార్ సాబ్ యూపీఏ చైర్మన్ అయితే, అది మాకు ఆనందదాయకమే. కానీ, ఆయనే స్వయంగా ఈ వార్తను ఖండించారు. అయితే, దేశాన్ని ముందుకు నడిపే సామర్థ్యం శరద్ పవార్‌కు ఉంది" అని రౌత్ తెలిపారు.

మహారాష్ట్రలోని ఒక సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఈ అంశం గురించి పార్టీలో చర్చించారని, అయితే, "ఎవరికీ దీని గురించి ఎలాంటి సమాచారం లేదని" తెలిపినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

రైతుల ఆందోళనల విషయమై శరద్ పవార్ ఇటీవల వార్తల్లో నిలిచారు.

డిసెంబర్ 9వ తేదీన ప్రతిపక్ష పార్టీ ప్రతినిధుల బృందం, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసింది. ఈ బృందానికి శరద్ పవార్ నాయకత్వం వహించారు.

ఐదుగురు సభ్యుల బృందంలో శరద్ పవార్‌తో పాటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎంకే నేత టీకేఎస్ ఎళంగోవన్ ఉన్నారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

యూపీఏ కూటమి

2004లో కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్..యూపీఏ ఏర్పడింది.

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాగా, సోనియా గాంధీ ఈ కూటమికి అధ్యక్షత వహించారు. సోనియా గాంధీ 2017లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలనుంచీ తప్పుకున్నప్పటికీ యూపీఏ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించారు. అయితే, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూడడంతో పార్టీ పగ్గాలు మళ్లీ సోనియా గాంధీకి అప్పగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)