ఫౌజీ గేమ్‌ పబ్జీని మరిపించగలదా? అక్షయ్‌ కుమార్ మద్దతిస్తున్న ఈ‌ ఆటలో స్పెషాలిటీ ఏంటి?

పబ్ జీ వర్సెస్ ఫౌజీ

ఫొటో సోర్స్, SM Viral Grabs

చైనాకు చెందిన పబ్జీ గేమ్‌పై నిషేధం విధించడంతో మార్కెట్‌లో దాని స్థానాన్ని భర్తీ చేసేలా ఒక భారతీయ సంస్థ నటుడు అక్షయ్‌ కుమార్‌తో కలిసి మొబైల్‌ గేమ్‌ను రూపొందించింది.

బెంగళూరుకు చెందిన nCore Games అనే సంస్థ ఈ మొబైల్ గేమ్‌ను సిద్ధం చేసింది. ఇది పబ్జీకి ప్రత్యామ్నాయంగా, ప్రత్యర్ధిగా భావిస్తున్నారు.

అక్టోబర్‌ చివరి నాటికి మార్కెట్లోకి రానున్న ఈ గేమ్‌కు 'ఫౌజీ' (FAU: G) అని ఆ కంపెనీ పేరు పెట్టింది. "ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్ గార్డ్స్‌ అనే పేరుకు సంక్షిప్త రూపమే ఈ FAU: G’’ అని సంస్థ సహ వ్యవస్థాపకు విశాల్ గోండాల్‌ రాయిటర్స్‌ వార్తా సంస్థతో అన్నారు.

గల్వాన్‌ వ్యాలీ పోరాటం ఆధారంగా ఈ ఆటను రూపొందించామని, కొన్ని నెలలుగా ఈ గేమ్‌ రూపకల్పన జరుగుతోందని, తొలి దశ ఆటను తాము పరిశీలించామని గోండాల్‌ తెలిపారు.

ఫౌజీ గేమ్ గల్వాన్ లోయ యుద్ధ సన్నివేశాలతో ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు

ఫొటో సోర్స్, Twitter/Akshay Kumar

ఫొటో క్యాప్షన్, ఫౌజీ గేమ్ గల్వాన్ లోయ యుద్ధ సన్నివేశాలతో ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు

గత జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య మొదటి ఘర్షణ జరిగింది. ఇందులో కనీసం 20మంది భారత సైనికులు మరణించారు. అప్పటి నుండి వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయిన నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చైనా యాప్‌లను భారత్‌ నిషేధించింది. బుధవారంనాడు పబ్జీ గేమ్‌ సహా మరో 118 చైనా మొబైల్ అప్లికేషన్లు, గేమ్‌లను నిషేధించింది.

వీడియో క్యాప్షన్, PUBG… ఈ ఆటకు ఎందుకంత క్రేజ్?

ప్లేయర్‌ అన్‌నోన్‌ బ్యాటిల్‌ గ్రౌండ్‌, సంక్షిప్తంగా PUBG అనే మొబైల్‌ గేమ్‌ భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. చాలామంది యువకులు పిచ్చిపట్టినట్లు ఈ ఆటను ఆడుతుంటారు. ఈ ఆటను నిషేధించడంపై చాలామంది యూజర్లు సోషల్‌ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు.

FAU:G ద్వారా భారతీయ కంపెనీ nCore Games సంస్థ ప్రజల్లో ఉన్న దేశభక్తిని సొమ్ము చేసుకోడానికి ప్రయత్నిస్తోందని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే "ఈ మొబైల్ గేమ్‌ ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 20శాతం భారతదేశం కోసం అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ఇస్తాం" అని సంస్థ సహ వ్యవస్థాపకుడు విశాల్‌ గోండాల్‌ ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ సంస్థకు సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్ మద్దతు ఇస్తున్నారు. ఫౌజీ (FAU: G) అంటే సైనికుడు అని అర్ధం. ఈ పేరును అక్షయ్‌ కుమార్‌ సూచించారని nCore Games సంస్థ వెల్లడించింది. అక్షయ్‌కుమార్ కూడా శుక్రవారం దీని గురించి ట్వీట్ చేశారు.

"ఈ యాక్షన్‌ గేమ్‌కు మద్దతు తెలపడానికి నేను గర్వపడుతున్నాను. ఫియర్‌లెస్‌ అండ్ యునైటెడ్ గార్డ్స్ FAU-G మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్న ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతిరూపం.ఇది కేవలం వినోదమే కాకుండా, మన సైనికుల త్యాగాలను గుర్తు చేస్తుంది. దీనిపై వచ్చిన ఆదాయంలో 20% సైనికుల సంక్షేమానికి సంస్థ కేటాయిస్తుంది’’ అని అక్షయ్‌ కుమార్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

గేమ్‌ను రిలీజ్‌ చేసిన కొద్దిరోజుల్లోనే 20 కోట్లమంది మొబైల్ యూజర్లు దీనిని డౌన్‌లోడ్‌ చేసుకుంటారని కంపెనీ అంచనా వేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)