భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ స్థాయిలో అసత్య ప్రచారం... ఈయూ డిసిన్ఫోల్యాబ్ ఆరోపణలను ఖండించిన విదేశాంగ శాఖ

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అబిద్ హుస్సేన్, శ్రుతి మేనన్
- హోదా, బీబీసీ ఉర్దూ, బీబీసీ రియాలిటీ చెక్
అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రయోజనాలను చేకూర్చడమే లక్ష్యంగా భారీగా తప్పుదోవ పట్టించే ప్రచారాలు జరిగాయని తాజా పరిశోధనలో తేలింది. ఓ మరణించిన ప్రొఫెసర్ గుర్తింపును, పనిచేయని సంస్థలను దీని కోసం ఉపయోగించుకున్నట్లు వెల్లడైంది. 15ఏళ్లపాటు ఈ అవాస్తవ ప్రచారాలు సాగాయని, వీటితో 750కుపైగా ఫేక్ మీడియా సంస్థలకు సంబంధాలు ఉన్నాయని బయటపడింది.
‘‘ఈ అసత్య ప్రచారాల కోసం ఓ ప్రొఫెసర్ పేరును అడ్డుపెట్టుకున్నారు. కానీ, ఆ ప్రొఫెసర్ 92 ఏళ్ల వయసులో 2006లోనే మరణించారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి రూపకల్పన చేసినవారిలో ఆయన కూడా ఒకరు’’అని ఈయూ డిస్‌ఇన్ఫోల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలెగ్జాండ్రే అల్ఫిలిప్ చెప్పారు. ఇప్పటివరకు తాము వెలుగులోకి తీసుకొచ్చిన అసత్య ప్రచారాల్లో ఇదే అతిపెద్దదని ఆయన వివరించారు.
ముఖ్యంగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్ఠను మసకబార్చడం, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ), యూరోపియన్ పార్లమెంటుల నిర్ణయాలను ప్రభావితం చేయడమే లక్ష్యంగా ఈ అసత్య ప్రచారం సాగింది.
'ఆ అవసరం మాకు లేదు' -స్పందించిన భారత్
పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఒక భారతీయ నెట్‌వర్క్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందంటూ 'ఈయూ డిస్‌ఇన్ఫోల్యాబ్' చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది.
బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యంగా భారతదేశం ఏనాడు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తికి ప్రయత్నం చేయదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటివి పొరుగుదేశానికే అలవాటని విదేశాంగశాఖ అన్నది.

ఫొటో సోర్స్, Getty Images
శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిది అనురాగ్ శ్రీవాస్తవ ఈ విషయంలో భారతదేశ వైఖరిని వెల్లడించారు. పాకిస్తాన్ పేరెత్తకుండానే ఆ దేశమే ఇలాంటి తప్పుడు సమాచారాలు ప్రచారం చేస్తుందని శ్రీవాస్తవ ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"ఒసామా బిన్ లాడెన్ సహా అంతర్జాతీయంగా అనేకమంది ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినవారు, సెప్టెంబర్ 26 ముంబై దాడుల నిందితులను రక్షించడానికి ప్రయత్నించినవారే ఇలాంటి సమాచారాన్ని ప్రచారం చేస్తారు'' అని శ్రీవాస్తవ అన్నారు.
"భారతదేశం బాధ్యతాయుతమైన దేశం. తప్పుడు ప్రచారాలకు ఎప్పుడూ పాల్పడదు. మీకు అలాంటి తప్పుడు సమాచారం కావాలంటే మన పొరుగు దేశం దగ్గర చాలా నకిలీ, తప్పుడు వార్తలు ఉంటాయి'' అన్నారు శ్రీవాస్తవ.
ఈయూ డిస్‌ఇన్ఫోల్యాబ్ ఏమంటోంది...
ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన సమాచారాన్ని గత ఏడాదే ఈయూ డిస్‌ఇన్ఫోల్యాబ్ బయటపెట్టింది. అయితే ఇది ముందుగా ఊహించినదానికంటే చాలా పెద్దదని ఇప్పుడు వెల్లడించింది.
తాజాగా బయటపెట్టిన నివేదికకు ఇండియన్ క్రానికల్స్‌గా నామకరణం చేశారు. ఎస్‌జీ గ్రూప్ కార్యకలాపాలు 116కుపైగానే దేశాల్లో ఉన్నాయని దీనిలో పేర్కొన్నారు. ఐరోపా పార్లమెంటు, ఐక్యరాజ్యసమతి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, గతేడాది తాము బయటపెట్టిన తర్వాత ఎంతవరకు ఎస్‌జీ గ్రూప్‌పై దృష్టిసారించారు? అని ఈయూ, ఐరాస సిబ్బందికి నివేదికలో ప్రశ్నలు సంధించారు.
‘‘గత 15 ఏళ్లుగా ఈ నెట్‌వర్క్ క్రియాశీలంగా పనిచేస్తోంది. గతేడాది మేం బయటపెట్టిన తర్వాత కూడా ఇది సమన్వయంతో ముందుకు వెళ్తోంది. ఇలాంటి ప్రచారాలను పక్కాగా నడిపించాలంటే మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం’’అని అల్ఫిలిప్ చెప్పారు.
అయితే, భారత గూఢచర్య సంస్థలకు ఇండియన్ క్రానికల్స్‌తో సంబంధముందని ఎలాంటి దర్యాప్తులు జరపకుండా చెప్పకూడదని పరిశోధకులు హెచ్చరించారు.
‘‘నేను చూసిన అసత్య ప్రచారాలు అన్నింటికంటే ఇది చాలా పెద్దది. కానీ, దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడే అంచనా వేయడం కష్టం’’అని డిస్‌ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ నిపుణుడు బెన్ నిమ్మో చెప్పారు.
‘‘భారీగా ప్రచారం చేపడుతున్నంత మాత్రాన.. వీటితో ప్రభుత్వానికి సంబంధముందని చెప్పకూడదు’’అని అసత్య ప్రచారాలపై పనిచేస్తున్న గ్రాఫికా సంస్థ పరిశోధనల విభాగం డైరెక్టర్ అయిన నిమ్మో వివరించారు. ఇలాంటి భారీ ప్రచారాలను ప్రైవేటు సంస్థలు కూడా నడిపించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
ఈ విషయంపై స్పందించాలని భారత ప్రభుత్వాన్ని బీబీసీ కోరింది. అయితే, ఈ వార్త ప్రచురితం అయ్యేనాటికి ఎలాంటి స్పందనా రాలేదు.
పనిచేయని ఎన్‌జీవోలతో...
శ్రీవాస్తవ గ్రూప్(ఎస్‌జీ)కు ఐరాస గుర్తింపు ఉన్న పది స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీవో)లతో నేరుగా సంబంధాలున్నట్లు తాజాగా గుర్తించారు. ఈ సంస్థలన్నీ అంతర్జాతీయంగా భారత్‌కు అనుకూలంగా, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టేవే.
‘‘జెనీవాలో ఈ మేధోమథన సంస్థలు, ఎన్‌జీవోలు భారత్‌కు అనుకూలంగా మంతనాలు చేపట్టేవి. ప్రదర్శనలు నిర్వహించేవి. ప్రెస్ కాన్ఫెరెన్స్‌లు కూడా పెట్టేవి. ఐరాస గుర్తింపు పొందిన సంస్థల తరఫున ఐరాస వేదికలపై ఇవి స్పందించేవి’’అని నివేదికలో పేర్కొన్నారు.
యూఎన్‌హెచ్‌ఆర్‌సీను స్థాపించిన కొన్ని నెలలకే అంటే 2005లోనే ఎస్‌జీ కార్యకలాపాలను మొదలుపెట్టింది.
ఈ నెట్‌వర్క్‌లో కమిషన్ టు స్టడీ ఆ ఆర్గనైజేషన్ ఆఫ్ పీస్ (సీఎస్‌వోపీ)గా పిలిచే ఓ స్వచ్ఛంద సంస్థ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తాజాగా గుర్తించారు. దీన్ని 1930లలోనే స్థాపించారు. 1975లో దీనికి ఐరాస గుర్తింపు కూడా వచ్చింది. అయితే 1970 తర్వాత దీని కార్యకలాపాలు నిలిచిపోయాయి.
సీఎస్‌వోపీ మాజీ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ లూయీస్ బీ సాన్ పేరును చెబుతున్నట్లు పరిశోధనలో తేలింది. 20వ శతాబ్దపు ప్రముఖ అంతర్జాతీయ న్యాయ నిపుణుల్లో లూయీస్ కూడా ఒకరు. 39ఏళ్లపాటు హార్వర్డ్‌లో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశారు.
2007లో యూఎన్‌హెచ్ఆర్‌సీ సమావేశాల్లో సీఎస్‌వోపీ తరఫున లూయీస్ పాల్గొన్నారని, 2011లో వాషింగ్టన్ డీసీలో జరిగిన సభకు హాజరయ్యారని ప్రచారాల్లో పేర్కొన్నారు. కానీ నిజానికి 2006లోనే ప్రొఫెసర్ లూయీ మరణించారు.

ఫొటో సోర్స్, Harvard Law School
ఏఎన్ఐ వార్తలు...
మరోవైపు భారత్ లేదా పాకిస్తాన్‌తో సంబంధం లేనట్లు కనిపిస్తున్న కొన్ని ఎన్‌జీవోలు, సంస్థలకు యూఎన్‌హెచ్‌ఆర్‌సీ వేదికలపై మాట్లాడే అవకాశం దక్కేలా ఈ నెట్‌వర్క్ పనిచేసినట్లు పరిశోధనలో తేలింది. చివరగా ఈ సంస్థలు పాక్‌ను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పించినట్లు వెల్లడైంది.
మార్చి 2019లో యూఎన్‌హెచ్‌ఆర్‌సీ 40వ సమావేశాలు జరిగాయి. వీటిలో ఎస్‌జీ గ్రూప్‌తో సంబంధమున్న యునైటెడ్ స్కూల్స్ ఇంటర్నేషనల్ (యూఎస్‌ఐ)కి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో అమ్‌స్టెర్‌డామ్‌కు చెందిన యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ సౌత్ ఆసియన్ స్టడీస్ (ఈఎఫ్‌ఎస్ఏఎస్)కు చెందిన యోనా బరకోవా మాట్లాడారు. పాక్ అరాచకాలకు పాల్పడుతోందని బరకోవా చెప్పారు.
ఎస్‌జీ గ్రూప్‌కు సంబంధించి భారత్ అనుకూల వార్తలు ఎక్కువగా ఏఎన్‌ఐలోనే వస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఏఎన్‌ఐను 1971లో ఏర్పాటుచేశారు. భారత్‌లో ఏఎన్ఐకు వందకుపైనే బ్యూరోలు ఉన్నాయి. ఏఎన్‌ఐ అందించే సమాచారంపై చాలా మీడియా సంస్థలు ఆధారపడి పనిచేస్తుంటాయి.
ఎస్‌జీతో సంబంధమున్న ఈయూ క్రానికల్స్‌లో వచ్చే పాక్ వ్యతిరేక, కొన్నిసార్లు చైనా వ్యతిరేక, వార్తలను 13 సార్లు ఏఎన్ఐ ప్రచురించినట్లు ఈయూ డిస్‌ఇన్ఫోల్యాబ్ తెలిపింది. ఈయూ క్రానికల్స్‌ను ఈ ఏడాది మేలోనే ఏర్పాటుచేశారు. ఇదివరకు ఇది ఈపీగా ఉండేది. ఈ సంస్థ అసత్య ప్రచారాలను ఈయూ డిస్‌ఇన్ఫోల్యాబ్ వెలుగులోకి తీసుకురావడంతో దీని పేరు మార్చారు.

ఫొటో సోర్స్, AFP
అంతా ఫేక్...
‘‘ఈ నెట్‌వర్క్ వెనకున్న వ్యక్తులు చాలా మంది పేర్లను వాడుకొన్నారు. ఈయూ అబ్జర్వర్ లాంటి ప్రధాన మీడియా నెట్‌వర్క్ తరహాలో మాయ చేశారు. ఐరోపా పార్లమెంటు లెటర్‌హెడ్లను కూడా ఉపయోగించారు. నకిలీ ఫోన్ నంబర్లతో వెబ్‌సైట్లను రూపొందించారు. ఐరాసకు కూడా నకిలీ చిరునామాలు సమర్పించారు. అంతేకాదు తమ మేధోమథన సంస్థలు తయారుచేసే పుస్తకాల ప్రచురణకు ప్రత్యేక సంస్థలను కూడా ఏర్పాటుచేశారు’’అని ఈయూ డిస్‌ఇన్ఫోల్యాబ్ తెలిపింది.
‘‘ఒకరి తర్వాత ఒకరు పబ్లిష్ చేస్తూ అంచెలంచెల ఫేక్ మీడియాను సిద్ధంచేశారు. మహిళలు, మైనారిటీల హక్కుల కోసం నిజంగా పోరాడాలని భావించే నాయకుల వ్యాఖ్యలను తమకు ప్రయోజనాలు చేపట్టేలా వాడుకున్నారు. అంతేకాదు అతివాద నాయకులకూ వేదిక కల్పించారు’’.
‘‘ఈ ఆపరేషన్ అంతా సవ్యమైనదేనని చెప్పుకోవడానికి వార్తా సంస్థ ఏఎన్‌ఐను వాడుకున్నారు. మిగతా వార్తా సంస్థల కంటే ఏఎన్ఐనే వారు ఎక్కువ నమ్ముకున్నారు’’అని అల్ఫిలిప్ చెప్పారు. భారత్‌లోని చాలా మీడియా సంస్థలు ఏఎన్‌ఐ వార్తలను తీసుకుంటాయి.
‘‘ఈ నెట్‌వర్క్ సమాచారాన్ని 500కుపైగా ఫేక్ మీడియా వెబ్‌సైట్లలో ప్రచురిస్తున్నారు. 95 దేశాల్లో ఈ వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయి’’అని పరిశోధకులు తెలిపారు.
శ్రీవాస్తవ గ్రూప్‌తో సంబంధమున్న సంస్థలు ఐరోపాలో చేపట్టే నిరసనలపై ఏఎన్ఐతోపాటు ఎస్‌జీ గ్రూప్‌కు చెందిన చాలా ఫేక్ మీడియా వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించేవి.

ఫొటో సోర్స్, PIB
ఐరాస, ఈయూపై దృష్టి
అసత్య ప్రచారాల కోసం ఈ నెట్‌వర్క్ రెండంచెల వ్యూహాన్ని అమలుచేసినట్లు పరిశోధనలో తేలింది.
జెనీవాలో నెట్‌వర్క్‌కు చెందని మేధోమథన సంస్థలు, ఎన్‌జీవోలు నిరసనలు చేపట్టేవి. ప్రదర్శనలు చేసేవి. యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో తమ గళం వినిపించేవి.
మరోవైపు బ్రసెల్స్‌లో యూరోపియన్ పార్లమెంటు ఎంపీలపై దృష్టిపెట్టేవారు. అంతర్జాతీయ పర్యటనలకు వచ్చే వారిని ఈయూ క్రానికల్స్ లాంటి ఫేక్ మీడియా సంస్థలకు కథనాలు రాసేలా ప్రోత్సహించేవి. చివరగా ఈ కథనాలను ఏఎన్ఐలోనూ వచ్చేలా చూసేవారు.
కొందరు యూరోపియన్ పార్లమెంటు ఎంపీలు తరచుగా ఈయూ క్రానికల్‌కు వార్తలురాసేవారు. వారిలో ఫ్రాన్స్‌కు చెందిన థియెరీ మరియానీ ఒకరు. ఈయన రెండు కథనాలు రాశారు. గత ఏడాది భారత్ పరిపాలనలో ఉన్న కశ్మీర్‌లో పర్యటించిన నాయకుల్లో ఈయన కూడా ఒకరు.
‘‘ఈయూ క్రానికల్ వెనుక భారత ప్రభుత్వం ఉంటే నన్నేం చేయమంటారు?’’అని ఆయన బీబీసీతో వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లోని అతివాద నేషనల్ ర్యాలీ పార్టీలో ఆయన సభ్యుడు.
‘‘నాకు ఏం అనిపిస్తే అది రాశాను. నాకు భారత్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో సంబంధాలున్నాయి. నేను నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతాను’’అని ఆయన చెప్పారు.
నివేదికలో పేర్కొన్న మరో ఇద్దరు ఐరోపా పార్లమెంటు సభ్యుల్లో ఏంజెల్ జంబాజ్కి (బల్గేరియా), గ్రేజ్‌గార్జ్ తోబిజోవ్‌స్కీ (పోలండ్)కు చెందిన వారున్నారు. వీరి కథనాలు ఈయూ క్రానికల్స్‌లో ప్రచురితం అయ్యాయి. అయితే, తాము ఎలాంటి కథనాలు రాయలేదని వారు చెబుతున్నారు.
ఈ కథనాలపై ఏఎన్‌ఐలో కూడా వార్తలు వచ్చాయి.

తప్పుడు వార్తలను అడ్డుకోవడానికి ఐయూ ఏం చేస్తోందని ప్రశ్నించగా..‘‘ఇలాంటి అసత్య ప్రచారాలు చేపడుతున్న వారి వివరాలు బయటపెడుతున్నాం. ఇలా వివరాలు బయటపెట్టే ప్రక్రియ కొనసాగుతుంది’’అని ఈయూ విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
అయితే, బ్రసెల్స్‌లో నెలకొల్పుతున్న ఎన్‌జీవోల పారద్శకతపై బెల్జియం అధికారులే సమాధానం చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎన్‌జీవోలు తమకు నచ్చిన అంశాన్ని లేవనెత్తడంపై యూఎన్‌హెచ్‌ఆర్‌సీ అధికార ప్రతినిధి రోలాండో గోమెజ్ స్పందించారు.
‘‘ఎన్‌జీవోలు ఇలాంటి అంశాలపైనే స్పందించాలని నిబంధనేదీ లేదు. ఒకవేళ ఏమైనా నిబంధనలు విధిస్తే.. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకున్నట్లు అవుతుంది’’అని ఆయన చెప్పారు.

శ్రీవాస్తవ ఎవరు?
ఈ నెట్‌వర్క్‌కు అంకిత్ శ్రీవాస్తవ కేంద్ర బిందువని గతేడాది ఈయూ డిస్‌ఇన్ఫోల్యాబ్ చేపట్టిన పరిశోధనలో తేలింది. శ్రీవాస్తవ ప్రైవేటు మెయిల్ అడ్రస్‌తో 400కుపైగా వెబ్‌సైట్ డొమైన్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
మరోవైపు ఎస్‌జీకి సంబంధించిన టెక్నాలజీ సంస్థ ఆగ్లాయా విషయంలోనూ ఇంకా చిక్కు ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి సంస్థ వెబ్‌సైట్ పనిచేయడంలేదు. అయితే గతంలో హ్యాకింగ్, స్పైటూల్స్ పై సంస్థ చాలా ప్రకటనలు ఇచ్చింది.
దేశాల స్థాయిలో తాము సేవలు అందించగలమని తమ మార్కెటింగ్ బ్రోచర్‌లో ఆగ్లాయా పేర్కొంది. 2017 అంకుర్ శ్రీవాస్తవ.. ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాము భారతీయ గూఢచర్య సంస్థల కోసం పనిచేసినట్లు తెలిపారు.
అంకిత్, అంకుర్‌ల మధ్య సంబంధమేంటో తేలియదు.
మరోవైపు ఎస్‌జీ గ్రూప్‌కు ఛైర్‌పర్సన్ డాక్టర్ ప్రమీలా శ్రీవాస్తవ. ఈమె అకింత్‌కు తల్లి.
భారత్‌లోని పంజాబ్‌కు చెందిన పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ హర్షీందర్ కౌర్‌ను.. 2009లో జెనీవాలోని యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ప్రసంగించేందుకు ఆహ్వానించారు. శిశుమరణాలపై ఆమెను ప్రసంగించమని కోరారు. అయితే, తనను ప్రమీలా శ్రీవాస్తవ పేరున్న మహిళ తీవ్రంగా బెదిరించారని కౌర్ బీబీసీకి తెలిపారు. ప్రమీల సీనియర్ ప్రభుత్వ అధికారిని అయ్యుంటారని వివరించారు.
ఈ ఆరోపణలపై స్పందించాలని అంకిత్ శ్రీవాస్తవను బీబీసీ సంప్రదించింది. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు. దిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని సంస్థ కార్యాలయాన్ని బీబీసీ సందర్శించింది. అయితే బీబీసీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అక్కడ ఎవరూ సమాధానం ఇవ్వలేదు.
భారీగా అసత్య ప్రచారాలు వెలుగులోకి రావడంతో ఈ నెట్‌వర్క్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పష్టతలేదు.
అంతర్జాతీయ సంస్థలను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఇదొక హెచ్చరికలా మారాలని ఇండియన్ క్రానికల్స్ పరిశోధనలో పాలుపంచుకున్నవారు వ్యాఖ్యానించారు.
‘‘2019 పరిశోధన తర్వాత.. ఈ నెట్‌వర్క్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు’’అని అల్ఫిలిప్ చెప్పారు.
‘‘అసత్య ప్రచారాలు చేపడితే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు బయటపడిన వ్యక్తులు మరో అసత్య ప్రచారాన్ని చేపట్టారని వచ్చే ఏడాది కూడా వస్తే ఎలా? అందుకే చర్యలు తీసుకోవాలి’’
‘‘చర్యలు తీసుకోకపోతే.. విదేశీ జోక్యానికి ఈయూ సంస్థలు పెద్దగా అభ్యంతర చెప్పనట్లే అవుతుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఎవరెస్టు శిఖరం ఎత్తు సుమారు ఒక మీటరు పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- రైతుల నిరసనలు: మోదీ మంచి వక్త... కానీ, రైతులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
- చైనా ఆహార సంక్షోభం ఎదుర్కొంటోందా? వృథా చేయవద్దని జిన్‌పింగ్ ఎందుకంటున్నారు?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- Cyclone Nivar: తుపాన్లకు పేరెందుకు పెడతారు, ఎవరు నిర్ణయిస్తారు?
- లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








