ఎవరెస్టు శిఖరం ఎత్తు సుమారు ఒక మీటరు పెరిగింది.. చైనా, నేపాల్ దేశాల సంయుక్త ప్రకటన

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
- రచయిత, ప్రదీప్ భష్యల్
- హోదా, బీబీసీ ప్రతినిధి, నేపాల్
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లని మంగళవారం నేపాల్, చైనా దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి.
చైనా, నేపాల్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఈ శిఖరం ఎత్తు 8848 మీటర్లు ఉన్నట్లు గతంలో ఆమోదించగా, ఇప్పుడు దాని ఎత్తు మరో 86 సెంటీమీటర్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు. శిఖరాన్ని కప్పిన మంచుతో కలిపి ఈ ఎత్తును లెక్కించారు.
"చైనా, నేపాల్ సర్వే శాఖలు ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచిన ఈ చారిత్రక క్షణంలో సాగర్ మాత/చోమోలుంగ్మ్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తో కలిసి ప్రకటించడానికి సంతోషిస్తున్నాను" అని అంటూ నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి లిఖిత పూర్వక సందేశాన్ని విడుదల చేశారు.
ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగర్ మాత అని పిలువగా టిబెట్లో చోమోలుంగ్మ్ అని పిలుస్తారు.
ఈ శిఖరం ఎత్తును కొలిచే పనిని, చైనా నేపాల్ బృందాలు విడివిడిగా చేపట్టాయి. ఇప్పటి వరకు చైనా.. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు బ్రిటిష్ కాలం నాటి సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన ఎత్తు కంటే 4 మీటర్ల తక్కువ అని చెబుతూ వచ్చింది. అయితే సర్వే ఆఫ్ ఇండియా కొలతలనే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించారు.
నేపాల్ లో 2015లో చోటు చేసుకున్న భారీ భూకంపం ప్రభావం ఈ శిఖరం పై పడిందని భావించడంతో 2017లో ఈ శిఖరం ఎత్తును కొలిచే పనిని నేపాల్ మొదలుపెట్టింది.
టిబెట్‌లో చోమోలుంగ్మ్ అని పిలిచే ఈ శిఖరం ఇరు దేశాలలోనూ విస్తరించి ఉంది. కానీ, దీని శిఖరాగ్రం మాత్రం నేపాల్‌లో ఉంది.
గతంలో చాలా సార్లు దీనిని కొలిచినప్పటికీ నేపాల్ అధికారికంగా ఈ శిఖరం ఎత్తును కొలవడం ఇదే మొదటిసారి.
ఇలాంటి సర్వేని చేయడానికి ముందు చైనా పూనుకుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి 2019లో నేపాల్, చైనా దేశాల నేతలు ఒప్పందం చేసుకున్నారు.
ఒక సంవత్సరం తర్వాత ఇరు దేశాలు అధికారిక ప్రకటనలు చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
2019 వసంత కాలంలో ఇరు దేశాల సర్వేయర్లు ఎవరెస్ట్ శిఖరం పైకి చేరుకున్నారు.
సాధారణంగా ఎవరెస్టును అధిరోహించడం కన్నా ఈ శిఖరాగ్రాన్ని చేరడం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ఎవరెస్టును అధిరోహించాలనుకునే పర్వతారోహకులు చాలా మంది శిఖరం చేరుకునేటప్పటికి శారీరకంగా , మానసికంగా అలిసిపోతారు.
కానీ, ఖిమ్లాల్ గౌతం నేతృత్వం వహించిన బృందానికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో వారి పని పూర్తయినట్లు కాదు. వారికి మానసికంగా, శారీరకంగా అలసట వచ్చినప్పటికీ అక్కడకు చేరిన తర్వాత చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి.
"శిఖరాగ్రాన్ని చేరడం పర్వతారోహకులకు చాలా సాధించిన అనుభూతిని ఇస్తుంది. కానీ, మాకు ఇది ప్రారంభం మాత్రమే" అని గౌతం బీబీసీతో చెప్పారు.
శిఖరాగ్రం పైన జిపిఎస్ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చడానికి ఆయన బృందం రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు. దాంతో ఆయనకు కాలి బొటనవేలును కూడా మంచు వలన పోగొట్టుకున్నారు.
ఈ పరికరం నేపాల్లో వివిధ ప్రాంతాలలో అమర్చిన మరో 8 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలతో అనుసంధానమవుతుంది.
శిఖరాగ్రం పై అమర్చిన జిపిఎస్ ఆంటెన్నా సాటిలైట్ నెట్వర్క్ ద్వారా వారి స్థానాన్ని సరిగ్గా రికార్డు చేస్తుంది.
ఈ జిపిఎస్ ద్వారా శిఖరాగ్రం నుంచి భూమధ్య భాగానికి ఉన్న దూరాన్ని అటూఇటుగా ఒక సెంటీమీటర్ తేడాతో కొలవగలమని కొలరాడో యూనివర్సిటీలో జియోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ పీటర్ హేల్ మొల్నార్ అన్నారు.
"మేము సముద్రపు మట్టపు స్థాయి నుంచి ఎత్తులను కొలుస్తాం. ఎవరెస్ట్ ఎత్తు సముద్రపు మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉందో కొలవడం కష్టం" అని ఆయన అన్నారు.
"భూమికున్న గురుత్వాకర్షణ శక్తి సరిసమానంగా ఉండని ప్రాంతం కావడం వలన, ప్రతి చోటా సముద్రపు మట్టం ఒకేలా ఉండదు" అని చెప్పారు.
"అందుకే ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న ఒక విలువ" అని గౌతం చెప్పారు. ‘‘కానీ, మేము అవలంబించిన వినూత్నమైన విధానం , సాంకేతికత వలన ఇప్పటి వరకు కొలిచిన విధానాలలో ఇది కచ్చితమైనదని చెప్పవచ్చని మేము భావిస్తున్నాం" అని చెప్పారు.
ఈ సర్వేలో భాగంగా ఎక్కువ మొత్తంలో సమాచారం సేకరించడానికి సర్వే బృందం అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం గడిపారు.
"గతంలో జరిగిన సర్వేలు, చైనా చేసిన సర్వేలా కాకుండా పగటి పూట సూర్యోదయ సమయంలో చోటు చేసుకునే తప్పులు జరిగే అవకాశం లేకుండా మేము తెల్లవారు జామున 3 గంటలకు ఈ ఎత్తును కొలిచే పనిని పెట్టుకున్నాం" అని గౌతం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కొలరాడో యూనివర్సిటీ జియోలాజికల్ సైన్సెస్ విభాగంలో పని చేస్తున్న రోజర్ బిల్హమ్ ఈ ప్రాంతంలో ఇది వరకు జరిగిన సర్వేలను పర్యవేక్షించారు.
గతంలో సర్వే చేసిన వారికి అందుబాటులో లేని గురుత్వాకర్షణ శక్తి, స్పిరిట్ లెవెలింగ్ సమాచారాన్ని ఉపయోగించి జియోడ్ దూరాన్ని చాలా వరకు సరిగ్గా వచ్చేటట్లు నేపాలీ సర్వేయర్లు కొలిచారని ఆయన చెప్పారు. భూమి గురుత్వాకర్షణ శక్తి, భ్రమణ ప్రభావం వలన సముద్ర ఉపరితలంలో ఏర్పడే ఆకారాన్ని జియోడ్ అంటారు.
శిఖరం ఎత్తును కొలవడానికి అనేక రకాల విధానాలను వాడటం వలన ఈ రోజు ప్రకటించిన శిఖరం ఎత్తు సరైనదని గౌతం అభిప్రాయ పడ్డారు.
ఈ బృందం ఆధునిక జిపిఎస్ సర్వే మాత్రమే కాకుండా 19 వ శతాబ్దంలో పేరొందిన సముద్ర మట్టం నుంచి శిఖరాల ఎత్తును కొలిచే పాత పద్దతిలో కూడా ఎత్తును కొలిచారు.
1857లో కరాచీ, కోల్‌కతాలో నెల రోజుల పాటు సముద్ర మట్టాన్ని కొలిచేవారని రోజర్ చెప్పారు. దీని ఆధారంగా బిహార్, భారతదేశంలో ఉన్న పలు ప్రాంతాల ఎత్తుని కొలిచేవారని చెప్పారు. బిహార్లో ఉన్న ఈ ప్రాంతాల ఆధారంగా త్రిభుజాకార విధానంలో పర్వతాల ఎత్తును కొలిచే వారని చెప్పారు.
జిపిఎస్ సర్వే, లెవెలింగ్ సర్వే - రెండు విధానాలలోనూ ఎవరెస్ట్ ఎత్తును నిర్ధరించడానికి త్రిభుజాకార పద్దతిని అవలంబించినట్లు గౌతం చెప్పారు.
చైనా 1975లో ఒక సారి, 2005లో మరోసారి ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచింది. చైనా ఎవరెస్ట్ శిఖరం ఎత్తును, శిఖరాన్ని కప్పిన మంచును మినహాయించి 8844.43 మీటర్లుగా చెబుతోంది.
చైనా సర్వే బృందం శిఖరాగ్రం పై జిపిఎస్ పరికరాన్ని అమర్చారు. కానీ, వారు చైనా బెయి డౌ నావిగేషన్ శాటిలైట్ విధానాన్ని అవలంబించారు. దీనిని అమెరికా జిపిఎస్ కి విరోధి శాటిలైట్ గా భావిస్తారు.
5 కోట్ల సంవత్సరాల క్రితం వరుసగా ఏర్పడిన వరుస భూకంపాల వలన భారత భూభాగం ఆసియాతో ఢీకొనడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్లో 2015 లో సంభవించిన భూకంపం వలన ఖాట్మండు లోయ ఉత్తరాన ఉన్న హిమాలయ శిఖరాల ఎత్తు ఒక మీటర్ మేర పెరిగినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎర్త్ సైన్సెస్ ప్రొఫెసర్ మైక్ సీర్లే చెప్పారు.
ఈ సారి చేసిన సర్వేలో మంచు పొరను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సర్వేయర్లు చెప్పారు.
అయితే, ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని మైక్ చెప్పారు. వర్షాకాలంలో మంచు ఎత్తు మరింత పెరగవచ్చని అన్నారు. కానీ, పడమర నుంచి తూర్పుకు వీచే గాలులు దీనిని వేగంగా నిర్మూలిస్తాయని చెప్పారు.
శిఖరం పైనున్న ఒక రాతికి అమర్చిన శాశ్వత జిపిఎస్ స్టేషన్ నుంచి శిఖరం ఎత్తును కొలిచారు. శిఖరం కింద హిల్లరీ మెట్టు మీద సౌత్ కోల్ , శిఖరం కింద ఉండే బేస్ క్యాంపు దగ్గర చాలా జీపీఎస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని అమెరికన్లు అమర్చారు. ఒకటి నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ అమర్చింది.
ప్రపంచంలో అత్యంత బలహీనమైన ఆర్ధిక వ్యవస్థ అయిన నేపాల్ కి ఇప్పటి వరకు ఇతర దేశస్థులు కొలిచిన ఎత్తును నమ్మడమే తప్ప సొంతంగా కొలిచే అవకాశం లేకపోయింది.
గతానుభవం లేకపోవడం వలన, ఈ బృందం కొన్ని పుస్తకాలు చదివి ఈ సర్వేను చేపట్టినట్లు నేపాలీ అధికారులు తెలిపారు.
ఈ పనిని చేపట్టడానికి అతి తక్కువ వనరుల వలన ఇదొక సవాలుగా నిలిచింది. "మా దగ్గర ఉన్నది బాధ్యత, ఇది మాది అనిపించుకోవాలనే తపన. మేము ఇతరుల పై ఆధారపడటం ఆపాలని అనుకుంటున్నాం" అని గౌతం చెప్పారు.
"ఇది నేపాల్ బృందం చేసిన ప్రయత్నం. చాలా మంది తమ మేధస్సును వాడారు కానీ, మేము ఈ పని చేయడానికి మా జీవితాలనే పణంగా పెట్టాం" అని ఆయన అన్నారు.
ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. కానీ, దీనికయిన ఖర్చు ఏమంత ఎక్కువ కాదని నిపుణులు అంటున్నారు. దీనికి అవసరమైన పరికరాలకు 100000 డాలర్ల (సుమారు 73 లక్షల 59,870 వేల రూపాయలు) ఖర్చు అయిందని చెప్పారు.
"దీనికంతటికీ సరైన ప్రణాళిక, శక్తి, సామర్ధ్యం అవసరం" అని రోజర్ అన్నారు. నేపాల్ సర్వే బృందం ప్రకటించిన కొలతలు సరైనవేనని ఆయన అభిప్రాయ పడ్డారు.
"నేపాల్ సర్వే శాఖ సామర్ధ్యం కలిగిన వారు. వీరు మళ్ళీ మళ్ళీ ఈ శిఖరం కొలతలు కొలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు" అని ఆయన అన్నారు.
ఎవరెస్టు శిఖరాన్ని 161 సంవత్సరాల క్రితం బ్రిటిష్ అధికారులు కొలిచారు.
కొన్ని విదేశీ బృందాలు గతంలో ఎవరెస్టు శిఖరం ఎత్తును కొలిచాయి. ఉదాహరణకు శిఖరం ఉత్తర దిక్కులో 1920 లలో బ్రిటిష్ వారు కొలిచారు. తరువాత చైనా 1960లలో కొలిచింది.
1999లో నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఈ ఎత్తును కొలిచి 8850 మీటర్లుగా ప్రకటించింది. అయితే నేపాల్ ఈ ఎత్తును ధ్రువీకరించలేదు.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే మేయర్ పీఠం దక్కించుకోవచ్చా?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








