ఎవరెస్టు సహా హిమాలయాలపై పెరుగుతున్న మొక్కలు.. మంచు తగ్గడమే కారణమంటున్న శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, Elizabeth A. Byers
- రచయిత, నవీన్‌సింగ్ ఖడ్కా
- హోదా, పర్యావరణ ప్రతినిధి, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఎవరెస్ట్ పర్వత ప్రాంతం సహా హిమాయాలంతటా సరికొత్త ఎత్తుల్లో మొక్కలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన చెప్తోంది.
ఇంతకుముందు మొక్కలు పెరగని ప్రాంతాలకు ఇప్పుడవి విస్తరిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
హిమాలయాల్లోని వివిధ ప్రాంతాల్లో.. శాశ్వత హిమనీనదాలు, మంచు ఉండే విస్తీర్ణం కన్నా ఐదు నుంచి 15 రెట్ల వరకూ ఎక్కువగా మొక్కలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది.
హిమాలయాల మీద మొక్కల పెరుగుదల విస్తరించటం వల్ల.. దక్షిణాసియా, ఆగ్నేయాసియాలో నివసించే 150 కోట్ల మంది ప్రజలకు హిమాలయాల హిమనీనదాల నుంచి సరఫరా అయ్యే తాగునీరు పరిస్థితి అనిశ్చితంగా మారుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
బ్రిటన్‌లోని ఎక్సిటర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. 1993 నుంచి 2018 వరకూ శాటిలైట్ సమాచారాన్ని ఉపయోగించి హిమాలయాల మీద చెట్ల పెరుగుదల తీరును విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Elizabeth A. Byers
విస్తరిస్తున్న మొక్కలు
''హిమాలయాల మీద 5,000 మీటర్ల ఎత్తు నుంచి 5,500 మీటర్ల ఎత్తు వరకూ మొక్కల పెరుగుదల చాలా ఎక్కువగా పెరిగింది'' అని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన శాస్త్రవేత్త కారెన్ ఆండర్సన్ చెప్పారు.
''ఇంకా ఎక్కువ ఎత్తుల్లో చదునైన ప్రాంతాల్లో మొక్కల విస్తరణ బలంగా ఉంది. ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో బలహీనంగా ఉంది'' అని వివరించారు.
నాసాకు చెందిన లాండ్‌శాట్ ఉపగ్రహం తీసిన చిత్రాల ఆధారంగా ఈ పరిశోధన నిర్వహించారు. హిమాలయాల్లో 4,15 మీటర్ల నుంచి 6,000 మీటర్ల వరకూ ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని నాలుగు భాగాలుగా వర్గీకరించారు.
హిందూ కుష్ హిమాలయాల్లో.. తూర్పున మయన్మార్ నుంచి పశ్చిమాన అఫ్ఘానిస్తాన్ వరకూ విభిన్న ప్రాంతాలను ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు.
ఈ అధ్యయనాన్ని గ్లోబల్ చేంజ్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు.

ఫొటో సోర్స్, Dominic Fawcett
ఎవరెస్ట్ మీద మొక్కలు
ఎవరెస్ట్ ప్రాంతంలో.. నాలుగు రకాల ఎత్తుల్లోనూ మొక్కల పెరుగుదల గణణీయంగా ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది.
ఈ ఎత్తులో హిమాలయాల మీద పెరుగుతున్న మొక్కల్లో ప్రధానంగా వివిధ రకాల గడ్డి, పొదలు ఉన్నాయి.
హిమాలయాల్లోని హిమనీనదాలు, జల వ్యవస్థల మీద పరిశోధనలు జరిపే ఇతర శాస్త్రవేత్తలు, పరిశోధకులు కూడా.. మొక్కల విస్తరణను ధృవీకరించారు.
''ఎక్సిటర్ యూనివర్సిటీ పరిశోధన ఫలితం.. మరింత వేడి, మరింత తడి వాతావరణంలో ఏం జరుగుతుందనే అంచనాలకు అనుగుణంగా ఉంది'' అని నెదర్లాండ్స్ అట్రెచ్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాల్టర్ ఇమర్జీల్ పేర్కొన్నారు.
''హిమాలయాల మీద మంచు రేఖ మరింత ఎక్కువ ఎత్తుకు తగ్గిపోవటం వల్ల.. దానికి దిగువ ప్రాంతంలో మొక్కలు పెరగటానికి అవకాశం లభిస్తుంది'' అని వివరించారు.
అయితే.. ఈ మార్పుకు కారణాలు ఏమిటనేది ఎక్సిటర్ యూనివర్సిటీ పరిశోధన పరిశీలించలేదు.
వాతావరణం వల్ల కలిగే మొక్కల పెరుగుదల మార్పుల ప్రభావం హిమాలయ పర్యావరణ వ్యవస్థ మీద చాలా అధికంగా ఉంటుందని ఇతర పరిశోధనలు చెప్తున్నాయి.
''ఉష్ణోగ్రతలు పెరుగుతండటంతో నేపాల్, చైనాలలోని ఆల్పైన్ దిగువ ప్రాంతాల్లో చెట్ల పెరుగుదల రేఖ విస్తరించటం మేం గుర్తించాం'' అని నేపాల్ త్రిభువన్ యూనివర్సిటీలో బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అచ్యుత్ తివారి తెలిపారు. ఆయన రాసిన పరిశోధన పత్రం ''ట్రీ-లైన్ డైనమిక్స్ ఇన్ ద హమాలయాస్'' డెండ్రోక్రోనాలజియా జర్నల్‌లో ప్రచురితమైంది.
''తక్కువ ఎత్తుల్లో ఉన్న చెట్ల విషయంలో ఇలా జరుగుతన్నట్లయితే.. ఎక్కువ ఎత్తుల్లోని మొక్కలు సైతం పెరుగుతున్న ఉష్ణోగ్రతకు ప్రతిస్పందిస్తున్నాయనేది స్పష్టం'' అని ఆయన పేర్కొన్నారు.
హిమాలయాలను తరచుగా సందర్శించే కొందరు శాస్త్రవేత్తలు కూడా.. మంచు పర్వతాల మీద మొక్కల విస్తరణ దృశ్యాన్ని ధృవీకరించారు.

ఫొటో సోర్స్, Karen Anderson
'ఆక్రమించే' మొక్కలు
''హిమాలయాల మీద ఒకప్పుడు హిమనీనదాలతో నిండిన ప్రాంతాలను ఇప్పుడు మొక్కలు ఆక్రమిస్తున్నాయనేది నిజం'' అని ఎలిజబెత్ బేయర్స్ పేర్కొన్నారు. ఆమె మొక్కల పర్యావరణవేత్త. నేపాల్‌లోని హిమాలయాల్లో గత 40 సంవత్సరాలుగా క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహించారు.
''చాలా ఏళ్ల కిందట స్వచ్ఛమైన హిమనీనదాలు ఉండిన కొన్ని ప్రాంతాల్లో.. ఇప్పుడు చెత్త నిండిన రాళ్లు కనిపిస్తాయి. వాటి మీద నాచు, పాచితో పాటు.. పుష్పాలు కూడా కనిపిస్తాయి'' అని ఆమె చెప్పారు.
ఈ ఎత్తుల్లో మొక్కల గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే.. చాలావరకూ శాస్త్రీయ అధ్యయనాలు.. ఉష్ణోగ్రతల పెరుగుదల మధ్య హిమనీనదాలు తరిగిపోవటం, మంచు సరస్సులు విస్తరించటం మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి.
హిమాలయాల్లోని అంత ఎత్తులో పెరుగుతన్న మొక్కలు మట్టితో, మంచుతో ఎలా పనిచేస్తాయనేది అర్థం చేసుకోవటానికి ఆ మొక్కల మీద సవివరమైన క్షేత్రస్థాయి అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెప్పారు.

ఫొటో సోర్స్, Karen Anderson
జల వనరులపై ప్రభావం
''హిమాలయాల్లో మొక్కల పెరుగుదలలో ఈ మార్పు.. ఈ ప్రాంతపు జల వ్యవస్థల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకమైన ప్రశ్నల్లో ఒకటి'' అని ఎలిజబెత్ తెలిపారు.
''హిమనీనదాలు, మంచు పొరలు కరిగిపోవటాన్ని నెమ్మదింప చేస్తుందా? లేక వేగవంతం చేస్తుందా?'' అనేది తెలుసుకోవాల్సి ఉందన్నారు.
హిందూకుష్ హిమాలయ ప్రాంతం.. పశ్చిమాన అఫ్ఘానిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ వరకూ ఎనిమిది దేశాల్లో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి వచ్చే నీటి మీద 140 కోట్ల మంది పైగా జనాభా ఆధారపడి ఉంది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీసు ఇది.. భారత్‌లోనే ఉంది
- మోదీ చెప్పిన లద్దాఖ్‌లోని 'సోలో' మొక్క విశేషాలేంటి?
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- స్మార్ట్ ఫోన్‌ను అతిగా వాడుతున్న పిల్లలను ఎలా నియంత్రించాలి?
- భూమి మీద నివసించిన అతి పెద్ద కోతి రహస్యాలు
- ఎవరెస్టు మీద బయటపడుతున్న పర్వతారోహకుల మృతదేహాలు
- జోకర్ సినిమాకు 11 ఆస్కార్ నామినేషన్లు
- విశాఖపట్నంకు ఆ పేరు ఎలా వచ్చింది? వైజాగ్‌గా ఎలా మారింది? చరిత్ర ఏం చెబుతోంది?
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
- 'నోబెల్ శాంతి బహుమతి నాకు రావాల్సింది... ఎవరికో ఇచ్చేశారు' - డోనల్డ్ ట్రంప్
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








