ఆస్కార్ 2020: జోకర్ సినిమాకు 11 నామినేషన్లు

జోకర్

ఫొటో సోర్స్, WARNER BROS

ఫొటో క్యాప్షన్, జోకర్ సినిమా ద్వారా వాకీన్ ఫీనిక్స్ నాలుగోసారి ఆస్కార్ నామినేషన్ పొందారు

ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు నామినేషన్లను ప్రకటించారు. ఇందులో 11 నామినేషన్లతో 'జోకర్' అగ్రస్థానంలో నిలిచింది.

కామిక్ బుక్ విలన్ 'జోకర్' మూలాల కథను చెప్పే ఈ సినిమా.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (వాకీన్ ఫీనిక్స్)తో పాటు మరో ఎనిమిది విభాగాల్లో అవార్డులకు నామినేట్ అయింది.

ఇక ద ఐరిష్‌మాన్, 1917, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాలు.. ఒక్కోటి 10 నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచాయి.

బ్రిటన్‌కు చెందిన సింథియా ఎరీవో, ఆంథొని హాప్కిన్స్, జొనాథన్ ప్రైస్, ఫ్లోరెన్స్ పగ్‌లు ఉత్తమ నటన అవార్డుల కోసం పోటీ పడుతున్నారు.

జోకర్ సినిమా.. గత వారం ప్రకటించిన బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులకు సైతం 11 నామినేషన్లు పొందింది.

అయితే, ఉత్తమ దర్శకుడి విభాగంలో మరోసారి అందరూ పురుషుల పేర్లనే నామినేట్ చేయటం పట్ల విమర్శలు వినిపిస్తాయనటంలో సందేహం లేదు.

2018లో లేడీ బర్డ్ సినిమాతో ఉత్తమ దర్శకత్వం విభాగానికి నామినేట్ అయిన దర్శకురాలు గ్రెటా జెర్విగ్ ఈసారి తన 'లిటిల్ ఉమెన్' సినిమాతో ఆ నామినేషన్ పొందలేకపోయారు.

ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుల కేటగిరీలో ఇప్పటివరకూ కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే నామినేట్ అయ్యారు. వారిలో 'ద హర్ట్ లాకర్' దర్శకురాలు కాథరిన్ బిగెలో ఒక్కరే అవార్డు గెలుచుకున్నారు.

‘నెట్‌ఫ్లిక్స్‌’కు 20 నామినేషన్లు

మ్యారేజ్ స్టోరీ, ద ఐరిష్‌మాన్, ద టు పోప్స్ సినిమాల వెనుక ఉన్న సబ్‌స్క్రిప్షన్ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ మొత్తంగా 20 నామినేషన్లు పొందింది.

వీటిలో ఉత్తమ యానిమేషన్ చిత్రం విభాగంలో ఈ సంస్థకు చెందిన రెండు సినిమాలు - ఐ లాస్ట్ మై బాడీ, క్లాస్ - ఉన్నాయి. ఇవి.. మిస్సింగ్ లింక్, టాయ్ స్టోరీ 4, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమాలతో పోటీపడుతున్నాయి.

92వ అకాడమీ అవార్డుల ప్రకటన, ప్రదానోత్సవం ఫిబ్రవరి 9వ తేదీన లాస్ ఏంజెలెస్‌లో జరుగుతుంది.

ఈ ఏడాది కూడా గత ఏడాది తరహాలోనే ఒక వ్యాఖ్యాత మొత్తం కార్యక్రమం నడిపించటం ఉండదు. ఒక్కో విభాగాన్ని పలువురు సెలబ్రిటీ అతిథులు ప్రకటిస్తారు.

గత ఏడాది ‘బొహీమియన్ రాప్సొడి’ ఉత్తమ నటుడు సహా నాలుగు ఆస్కార్లు గెలుచుకుంది.

నిరుడు ఉత్తమ చిత్రంగా గ్రీన్ బుక్ నిలవగా, ఉత్తమ నటిగా ఒలీవియా కోల్మన్ (ద ఫేవరైట్) ఎంపికయ్యారు.

వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్

ఫొటో సోర్స్, Sony

ఫొటో క్యాప్షన్, టరాంటినో సినిమా వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ నటులు బ్రాడ్ పిట్, లియొనార్డో డికాప్రియో ఇద్దరూ ఆస్కార్ నామినేషన్లు పొందారు

ఈ ఏదాది ఐదు ప్రధాన విభాగాల్లో నామినేషన్లు ఇలా....

ఉత్తమ చిత్రం

  • వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్
  • ద ఐరిష్‌మాన్
  • పారసైట్
  • 1917
  • మారియేజ్ స్టోరీ
  • జోజో రాబిట్
  • జోకర్
  • లిటిల్ ఉమన్
  • ఫోర్డ్ వర్సెస్ ఫెరారి

ఉత్తమ నటుడు

  • వాకీన్ ఫీనిక్స్ (జోకర్)
  • ఆడమ్ డ్రైవర్ (మారియేజ్ స్టోరీ)
  • లియొనార్డో డికాప్రియో (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్)
  • ఆంటోనియో బాండరస్ (పెయిన్ అండ్ గ్లోరీ)
  • జొనాథన్ ప్రైస్ (ద టు పోప్స్)
స్కార్లెట్ జాన్సన్

ఫొటో సోర్స్, NETFLIX/FOX

ఫొటో క్యాప్షన్, స్కార్లెట్ జాన్సన్.. మారియేజ్ స్టోరీ (ఎడమ), జోజో రాబిట్ (కుడి) రెండు సినిమాల్లోనూ తల్లి పాత్ర పోషించింది

ఉత్తమ నటి

  • రినీ జిల్విజర్ (జూడీ)
  • చార్లీ థెరాన్ (బాంబ్‌షెల్)
  • స్కార్లెట్ జాన్సన్ (మారియేజ్ స్టోరీ)
  • సోయిర్స్ రోనన్ (లిటిల్ ఉమన్)
  • సింథియా ఎరీవో (హారియెట్)

ఉత్తమ దర్శకుడు

  • మార్టిన్ స్కోర్సెసీ (ద ఐరిష్‌మాన్)
  • బాంగ్ జూన్ హు (పారసైట్)
  • క్విన్టిన్ టరాంటినో (ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్)
  • శాం మెండిస్ (1917)
  • టాడ్ ఫిలిప్స్ (జోకర్)
హారియెట్

ఫొటో సోర్స్, UNIVERSAL

ఫొటో క్యాప్షన్, బానిసత్వ వ్యతిరేక ఉద్యమకారిణి హారియెట్ ట్యూబ్‌మన్ జీవిత కథ ‘హారియెట్’ రెండు ఆస్కార్ నామినేషన్లు పొందింది

ఉత్తమ సహాయ నటి

  • లారా డెర్న్ (మారియేజ్ స్టోరీ)
  • మార్గట్ రోబీ (బాంబ్‌షెల్)
  • ఫ్లోరెన్స్ పగ్ (లిటిల్ ఉమన్)
  • స్కార్లెట్ జాన్సన్ (జోజో రాబిట్)
  • కేథీ బేట్స్ (రిచర్డ్ జివెల్)

ఉత్తమ సహాయ నటుడు

  • బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్)
  • అల్ పసీనో (ద ఐరిష్‌మాన్)
  • జో పెస్కీ (ద ఐరిష్‌మాన్)
  • టామ్ హ్యాంక్స్ (ఎ బ్యూటిఫుల్ డే ఇన్ ద నైబర్‌హుడ్)
  • ఆంథొనీ హాప్కిన్స్ (ద టు పీపుల్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)