అల వైకుంఠపురములో రివ్యూ: అల్లు అర్జున్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో మూడో సినిమా ఎలా ఉందంటే..

ఫొటో సోర్స్, facebook/GeethaArts
- రచయిత, భవానీ ఫణి
- హోదా, బీబీసీ కోసం
మూడు నెలలుగా చాలా మంది ఇళ్ల నుంచీ, ఫోన్ల నుంచీ, నోళ్ల నుంచీ వినిపిస్తున్న పాట 'సామజవరగమనా'. ఈ పాటతో తన మీద ఎన్నో ఆశలను కలిగేలా చేసుకుంది 'అల వైకుంఠపురములో' సినిమా.
అందునా అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాగా, ఈ సినిమాపై అప్పటికే అభిమానులకు అనేక అంచనాలు ఉన్నాయి. సులువుగా నోటికి దొరికేలా తమన్ అందించిన కమ్మని బాణీలు, యువతనే కాక, అన్ని వయసుల వారినీ ఆకట్టుకుని, ఈ సినిమా వైపు మరింత ఆసక్తితో చూసేందుకు మరో ముఖ్య కారణమయ్యాయి.
తెలుగు ప్రేక్షకులకు సంక్రాతి కానుకగా 2020 జనవరి 12న విడుదలైన ఈ 'అల వైకుంఠపురములో' సినిమా నిర్మాణ బాధ్యతలను, గీతా ఆర్ట్స్, హారిక & హాసిని బ్యానర్లు కలిసి ఉమ్మడిగా చేపట్టాయి. ఇక అల్లు అర్జున్, పూజా హెగ్డే కలిసి, డీజే తర్వాత నటించిన రెండో సినిమా ఇది.
టబు, జయరాం, సుశాంత్, నివేతా పేతురాజ్ లాంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. 'అంగు వైకుంఠపురంతు' పేరుతో, ఈ సినిమా మలయాళ డబ్బింగ్ వర్షన్ కూడా ఇదే రోజు కేరళలో విడుదలైంది.
'అల వైకుంఠపురములో' అంటే అక్కడ 'ఆ వైకుంఠమనే నగరంలో...' అని అర్థం.

ఫొటో సోర్స్, FB/Allu Arjun
'సామజవరగమనా' పాట స్థాయిలోనే తర్వాత విడుదలైన 'రాములో రాములా' పాట కూడా సంచలనం సృష్టించింది. సులువుగా, హుషారుగా సాగిపోయే బాణీ, అల్లు అర్జున్ వేసిన హాఫ్ కోట్ స్టెప్‌లు, పదే పదే ఆ పాటను చాలా మంది వినేలా, చూసేలా చేశాయి.
చివర్లో విడుదలైన బుట్టబొమ్మ పాట కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. ప్రఖ్యాత శాస్త్రీయ గాయనీమణులు ప్రియా సోదరీమణులు, గాయకుడు కృష్ణతో కలిసి పాడిన 'అల వైకుంఠపురములో' టైటిల్ సాంగ్, అర్థవంతమైన, లోతైన భావంతో అలరించింది. ఈ పాటను కల్యాణ చక్రవర్తి రాయగా, 'బుట్టబొమ్మా' పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు.
'సామజవరగమనా...' పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి, 'రాములో రాములా' పాటను కాసర్ల శ్యామ్, 'ఓ మై గాడ్ డాడీ' పాటను కృష్ణ చైతన్య రాశారు.
ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్ వినోద్ పనిచేశారు.
ఫ్రాన్స్‌లోని 'మాంట్ సెయింట్ మిషెల్' దీవిలోనూ, పారిస్‌లోని 'లిడో డీ' థియేటర్లోనూ, ఈఫిల్ టవర్ వద్దా పాటల చిత్రీకరణ జరిగింది. హాఫ్ కోట్ స్టెప్, బుట్ట బొమ్మ స్టెప్, 'ఓఎంజీ డాడీ' హుక్ మూవ్, 'స్పై డాడీ' హుక్ మూవ్ లాంటి కొన్ని సిగ్నేచర్ మూవ్స్‌తో, స్టెప్స్‌తో ట్రైలర్స్‌ను నింపడంలో, సినిమాను కొత్తగా ప్రజెంట్ చేయడానికి జరిగిన ప్రయత్నం కనిపించింది.

ఫొటో సోర్స్, FB/TrivikramCelluloid
కథ
ఎంతగా తెలివితేటల్ని ప్రదర్శించినా కలిసిరాని కాలంతోనూ, ఇంకెంతగా కష్టపడినా ఇష్టపడని తండ్రితోనూ కుస్తీ పట్లు పడుతూ కూడా, జీవితాన్ని తేలిగ్గా నడిపించే ప్రయత్నం చేస్తుంటాడు బంటూ(అల్లు అర్జున్) అనే మధ్యతరగతి అబ్బాయి. ఇంతలో బుట్టబొమ్మలాంటి ఒకమ్మాయి ఎదురు కావడంతో, ఆమె ప్రేమలో పడి, మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తుంటాడు.
అంతలోనే ఒక అనుకోని నిజం అతనికి తెలుస్తుంది. తన తండ్రి చేసిన ఒక భయంకరమైన తప్పు, తన జీవితాన్నే కాక, మరో కుటుంబాన్ని కూడా అతలాకుతలం చేస్తోందని అర్థం చేసుకున్న బంటూ, ఆ పరిస్థితుల్ని మార్చాలని నిర్ణయించుకుంటాడు.
తనకు తెలిసిన నిజాన్ని బయటకి రానివ్వకుండానే, అలా ఆ వైకుంఠపురమనే భవంతిలోకి అతను అడుగుపెడతాడు.
తన అల్లరి చేష్టలతో, మంచి మనసుతో, తెలివైన పనులతో, ధైర్యమైన నిర్ణయాలతో అక్కడ అందరి మనసుల్లోనూ స్థానాన్ని సంపాదించుకుంటాడు.
ఆ దారిలోనే ఎదురైన చిన్న చిన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ వెళ్లి, చివరికి తాననుకున్న పని చేయగలుగుతాడు.
ఇంతకూ బంటూకు తెలిసిన ఆ నిజం ఏమిటి? దాని వల్ల ఎదురైన సమస్యలు ఏమిటి? వాటిని అతను ఎలా పరిష్కరించాడు- అనేది కథాంశం.

ఫొటో సోర్స్, FB/Trivikram Srinivas
తెర మీద ఎలా కనిపించింది?
అల్లు అర్జున్ తనదైన శైలిలో సులువుగా నటిస్తూ, సినిమాను ముందుకు నడిపాడు. మంచి డాన్సర్ అయిన అల్లు అర్జున్, ఎప్పటిలానే తన శరీరాన్ని ఒడుపుగా మెలికలు తిప్పి, ఉర్రూతలూగించే స్టెప్స్‌తో ఉత్సాహపరిచాడు.
పూజా హెగ్డే అందంగా బుట్టబొమ్మలానే కనిపించింది. మరో ముఖ్యమైన పాత్రలో, అల్లు అర్జున్ తండ్రిగా నటించిన మురళీ శర్మ నటన ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది.
'యాంగ్రీ విమెన్' పాత్రలకు బాగా సరిపోయే టబు, అలాంటి పాత్రలోనే ఇమిడిపోయారు. జయరాం, సచిన్ ఖాదేకర్‌లవి మరో రెండు ముఖ్య పాత్రలు.
నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, తనికెళ్ళ భరణి లాంటి ప్రముఖ నటులు మాత్రం అక్కడక్కడా కాసేపు మెరిసి మాయమయ్యేందుకే కనిపించారు.

ఫొటో సోర్స్, facebook/GeethaArts
తెర వెనుక ఏం జరిగింది?
ప్రతి మాటా పంచ్‌లా అనిపించే సంభాషణలతో, సినిమా మొదట్నుంచీ చివరి వరకూ ఒకే ఫ్లోలో సాగుతుంది. ఆ ఫ్లో కాస్త ఎక్కువై కథ స్థానాన్ని సంభాషణలే ఆక్రమించుకున్న భావం కలుగుతుంది.
ఇప్పటికీ చెప్పుకుని నవ్వుకునేలా చేసే, 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు' సినిమాల స్థాయి సంభాషణలను త్రివిక్రమ్ మళ్లీ ఈసారి రాసినప్పటికీ, కథ కనెక్టివిటీలోకీ, కథనంలోకీ అవి చొచ్చుకు రావడం ఒక మైనస్ పాయింట్‌గా మారింది.
అల్లు అర్జున్ శైలి, త్రివిక్రమ్ సంభాషణలూ, 'సరదా సినిమా కోసం తపన పడటం' వలన వచ్చిన కామెడీ, ఇంకా మన సినిమాలకు ముఖ్యమైన ఎమోషన్, సెంటిమెంట్లవన్నీఒకదానితో ఒకటి పోటీ పడటంతో, ఏది ఏమిటో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా మారుతుంది. అలాగని దేనికదే విడిగా తీసుకుని చూడగలిగితే, తప్పకుండా ఈ సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. సూదిలో దారంలా, కనిపించకుండానే సినిమాను పట్టుకుని నిలపగల, అతి ముఖ్యమైన ఒక ఎమోషన్ బాండింగ్ మాత్రం దీనిలో లోపించిన విషయం, కాస్త జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది.
బావున్న దృశ్యాలనూ, స్టెప్పుల్నీ, ట్రైలర్స్ లోనూ, పాటల్లోనూ ముందే చూపించెయ్యకుండా, సినిమా కోసం కూడా కాస్త దాచి ఉంటే బావుండేది. సినిమా మొదటి భాగం, కామెడీ భుజం మీద వాలి సులువుగానే ముందుకు నడిచిపోయినా, రెండో భాగం మాత్రం స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ వంటి విషయాల్లో కొద్దిగా తొట్రుపాటు పడింది.
హీరోతో పాటే మొత్తం సినిమా కలిసి నడవటం వలన, వైకుంఠపురంలోని వ్యక్తుల పాత్రలను ఎలివేట్ చేసే అవకాశం లేకుండా పోయి, ఒక ఉద్వేగం ముడిపడక, ఏ సన్నివేశానికాసన్నివేశం విడివిడిగా చూసిన ఫీలింగ్ అప్పుడప్పుడూ కలుగుతుంది. ఆ లోటును కనిపించనీయకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ వచ్చాడు అల్లు అర్జున్.
హీరో ఒక ఇంటర్వ్యూకు వెళ్లి అక్కడ తన కష్టాలను సరదాగా చెప్పుకోవడం, ఫైట్‌ను ఒక పాటతో పాటుగా నడిపించడం లాంటి కొన్ని ప్రయోగాలు, కొత్తదనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాయి.
సంభాషణలను విడిగా చూసినప్పుడు చాలా బలంగా కనిపించి, అవి పుట్టడం వెనుకనున్న తపనను తెలియజేస్తాయి.
"ఏంట్రోయ్ గ్యాపిచ్చావు... లేదు, అదే వచ్చింది" వంటి కొన్ని రిపీటెడ్ మాటలూ, అల్లు అర్జున్, మురళీ శర్మ మధ్య సాగే సన్నివేశాల్లో కనిపించే కొన్ని 'మ్యానరిజంతో కూడిన కదలికలూ' ఆసక్తికరంగా ఉంటాయి.
'సన్ ఆఫ్ సత్యమూర్తి'లానే, తండ్రీ కొడుకుల బంధం గురించి మరి కాస్త తేలిక స్వరంతో మాట్లాడిందీ సినిమా.
మొత్తంగా చూస్తే, సరదాగా కుటుంబంతో కలిసి వెళ్లి వినోదానికి నవ్వుకుని, మాటలకు ముచ్చటపడి, స్టెప్పులకు ఉత్సాహపడి, సెంటిమెంట్‌లో చిక్కుబడి, చివరికంతా మంచే జరుగుతుందని ఆనందపడి, సంతోషంగా పండగ జరుపుకొనే మూడ్‌లో బయటకు రావడం కోసం, ఈ సినిమాను చూడవచ్చు.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శనశాల ప్రారంభం...
- మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా?
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- భారత్‌లో అత్యాచార ఘటనల వెనకున్న కారణాలేంటి?
- జేఎన్‌యూ విద్యార్థులతో దీపిక ఏం మాట్లాడారు?
- ఇరాన్: ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై 'అబద్ధాలు' చెబుతారా అంటూ ఆగ్రహించిన ప్రజలు
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- కేరళలో రెండు ఎత్తయిన భవనాలు క్షణాల్లో నేలమట్టం
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








