ఆస్ట్రేలియా జూ పార్క్: ప్రపంచంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శనశాల ప్రారంభం... కొందరు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో అతి పెద్ద జూ (జంతు ప్రదర్శన శాల) శనివారం ప్రారంభమైంది. సిడ్నీలో గత 100 ఏళ్లలో నిర్మించిన జూలలో ఇదే అతి పెద్ద జూ. జంతు సంక్షేమం గురించి పెద్ద జరుగుతున్న ఈ రోజుల్లో... ఇటువంటి జూల వల్ల ఇంకా మంచి జరుగుతుందా? సిడ్నీ నుంచి గ్యారీ నన్ కథనం.
జూలు మొట్టమొదట నెలకొల్పినప్పటి నుంచి నేటికి ఎంతో అభివృద్ధి చెందాయి.
అసలు మొదట వీటిని ఏర్పాటు చేసింది.. సంపన్నులు తమ శక్తిని తమ వ్యక్తిగత సేకరణ ద్వారా ప్రదర్శించే ఉద్దేశంతో. తర్వాత అవి శాస్త్ర పరిశోధనకు దోహదపడ్డాయి. ఆ తర్వాత పర్యాటక ఆకర్షణలుగా మారాయి. వాటిని చూడటానికి జనం డబ్బులు చెల్లిస్తారు. అయితే.. జంతు పరిరక్షణ అనేది జూల ప్రధాన లక్ష్యంగా మారటం మొదలైంది 1970ల తర్వాతే.
జూలలో జంతువులను నిర్బంధంలో ఉంచే ఎన్‌క్లోజర్లు గత 50 ఏళ్లలో చాలా మెరుగుపడ్డాయని కొందరు జంతు సంక్షేమ పరిశోధకులు వాదిస్తారు. కానీ.. ఇంకొందరు విభేదిస్తూనే ఉన్నారు. జంతువుల నిర్బంధానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉన్నారు.
''మనకు మరిన్ని జూలు అవసరం లేదు'' అని ఒక పరిశోధకుడు బీబీసీతో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, SYDNEY ZOO
సిడ్నీ నగరం నడిబొడ్డు నుంచి పశ్చిమంగా 40 కిలోమీటర్ల దూరంలో సిడ్నీ జూను నెలకొల్పారు. ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద సరీనృపాలు, నిశాచర జీవుల నిలయం తమదని ఈ జూ ప్రచారం చేసుకుంటోంది.
ఈ జూలో ప్రదర్శించే జంతువుల్లో ఆఫ్రికా సింహాలు, సుమత్రా పులులు, చిరుతపులులు, చింపాజీలు, ఆస్ట్రేలియాకే విశిష్టమైన అడవి జంతువులు ఉంటాయి.
''ఈ జూ నెలకొల్పాలన్న ఆలోచన వాస్తవంగా నా తండ్రిది. ఆయన సిడ్నీ ఆక్వేరియంను నిర్వహిస్తున్నపుడు 80వ దశకంలో ఈ ఆలోచన చేశారు. పశ్చిమ సిడ్నీలో సరైన ప్రదేశం దొరికిన తర్వాత మేమిద్దరం కలిసి ఈ ఆలోచనను అమలులోకి తెచ్చాం'' అంటారు కొత్త జూ మేనేజింగ్ డైరెక్టర్ జేక్ బర్జెస్.
ఈ జూ ప్రధాన ప్రత్యర్థి టరోంగా జూ. సిడ్నీ నగర కేంద్రానికి సమీపంలో 1916లో ప్రారంభించిన ఈ జూ చాలా ప్రజాదరణ గల పర్యాటక ఆకర్షణ. సిడ్నీ జూ.. సముద్ర తీరానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వేడిగా ఉండటం వల్ల ఉష్ణోగ్రత నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం మీద అధికంగా వ్యయం చేసింది. జంతువులను చల్లగా ఉంచటంతో పాటు పర్యాటకులను ప్రోత్సహించటం కూడా దీని లక్ష్యం.
''చాలా ఎన్‌క్లోజర్లలో వెనుకవైపు ఆవరణల్లో ఎయిర్ కండిషన్డ్ ప్రాంతాలు, పొగ మంచు కేంద్రాలు, నీడనిచ్చే నిర్మాణాలు ఉంటాయి. ఇవి జంతువులు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పిస్తాయి'' అని బర్జెస్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జూ వ్యతిరేక వాదనలు
జంతు సంక్షేమం తమ ''ప్రథమ ప్రాధాన్యం'' అని ఈ కొత్త జూ చెప్తోంది. అయినప్పటికీ ఈ జూను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు.
''నా ప్రతిస్పందన ఇది: మనకు మరిన్ని జూలు అవసరం లేదు'' అని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో ఎవల్యూషనరీ బయాలజీ ప్రొఫెసర్ మార్క్ బెకాఫ్ పేర్కొన్నారు. జూల నిర్వహణను ఆయన తీవ్రంగా విమర్శిస్తారు.
జంతువుల సంవేదన మీద ప్రొఫెసర్ బ్లెకాఫ్ చేసిన పరిశోధనలు.. జంతువులు తమ సహజ అవాసాల విస్తృతిలో పది లక్షల వంతు కూడా ఉండని జూ ఎన్‌క్లోజర్లలో నిర్బంధించటం వల్ల వాటిలో కలిగే పరిమితి భయం (క్లస్టరోఫోబియా), ఒత్తిడి, ఆందోళన, విసుగు తదితర అంశాల గురించి వివరిస్తుంది.
''మనుషులకు తోడుగా ఉండే జంతువులైన కుక్కులు, పిల్లుల వంటి వాటిని గదిలో నిర్బంధించినపుడు అవి ఎలాంటి భావోద్వేగాలకు లోనవుతాయో జూలో నిర్బంధించిన జంతువులు కూడా సరిగ్గా అటువంటి భావోద్వేగాలకే లోనవుతాయి'' అంటారాయన.
జూలలో ఏనుగులు చాలా ఒత్తిడికి లోనవుతుంటాయని.. అడవి ఏనుగుల కన్నా వీటి జీవిత కాలం గణనీయంగా తగ్గిపోతుందని చెప్తున్న ఒక అధ్యయనం ప్రొఫెసర్ బెకాఫ్ పరిశోధనను బలపరుస్తోంది.

ఫొటో సోర్స్, HUMANE SOCIETY INTERNATIONAL
ఇక భయానకమైన ఘటనలు కూడా ఉన్నాయి: 2016లో సినిసినాటి జూలో పాకుతూ వెళ్లిన ఒక చిన్నారిని లాక్కువెళ్లిన.. హరాంబే అనే ఒక గొరిల్లాను కాల్చి చంపారు. సీ వరల్డ్ ఆర్లాండోలో డాన్ బ్రాంచో అనే శిక్షకుడిని టిలికుమ్ అనే కిల్లర్ వేల్ చంపేసింది. 2001లో లండన్ జూలో నిర్వాహకుడు జిమ్ రాబ్సన్‌ను ఒక ఏనుగు భారీ జన సందోహం కళ్లముందే చంపేసింది.
మరో ఆందోళనకరమైన విషయం కూడా ఉందని వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ సంస్థకు చెందిన బెన్ పియర్సన్ చెప్తారు. ''ఈ ప్రైవేటు జూ దివాలా తీస్తే ఏం జరుగుతుంది? జూస్ విక్టోరియా (మెల్‌బోర్న్), టరోంగా జూ (సిడ్నీ)లకు ప్రభుత్వం నిధులు అందిస్తోంది. కాబట్టి అవి మంచి సంక్షేమ ప్రమాణాలు పాటించగలవు'' అని ఆయన సందేహం వ్యక్తంచేశారు.
''ఒకవేళ సిడ్నీ జూ దివాలా తీస్తే, డబ్లిన్ నుంచి ఇక్కడి వరకూ రవాణా చేసిన ఏనుగును మళ్లీ తిప్పి పంపాంల్సి ఉంటుంది. దానివల్ల ఆ జంతువు పరిస్థితి మరింత దిగజారుతుంది'' అని ఆయన అన్నారు.
ఈ కొత్త జూ పట్ల సంతోషించించటానికి ఏమీ లేదని జంతు హక్కుల సంస్థ పెటా పేర్కొంది. అడవి జంతువుల మీద అభిమానం ఉన్న ఆస్ట్రేలియన్లు ఈ జూను ఆదరించటానికి బదులు అడవిలో ఉండే జంతువులకు మద్దతు అందించే సంస్థలకు విరాళాలు ఇవ్వాలని సూచించింది.

ఫొటో సోర్స్, Reuters
మేలు చేస్తున్న జూలు ఎక్కడ?
జంతువులు సహజంగా నివసించే అటవీ ఆవాసాలను జూలలో అసలు ఏమాత్రం ప్రతిసృష్టి చేయలేరని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన వెటరినరీ సైన్స్ ప్రొఫెసర్ డేవిడ్ ఫాలెన్ పేర్కొన్నారు. నిర్బంధంలో ఉన్న చిరుతపులులకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తన అధ్యయన ఫలితాలను ప్రచురించారు.
కానీ, ''మరిన్ని దేశాలలో పట్టణీకరణ అంతకంతకూ పెరుగుతున్నపుడు విస్తృత పర్యావరణం గురించి ప్రజలకు ఈ జూలు అవగాహన కలిగిస్తాయి. జనం డేవిడ్ అటెన్‌బరో టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. కానీ.. ఒక పులిని అత్యంత సమీపం నుంచి చూడటానికి.. ఈ టీవీ కార్యక్రమాలకు ఏమాత్రం పోలిక ఉండదు'' అని ఆయన విశ్లేషిస్తారు.
ఈ ప్రత్యక్ష అనుభవాలు.. జంతు సంక్షేమం వంటి కార్యక్రమాల విషయంలో.. ఉదాహరణకు ఒరాంగుటాన్ ఆవాసాలను ధ్వంసం చేసే పామ్ ఆయిల్ ఉత్పత్తులను బహిష్కరించటం వంటి కార్యక్రమాల పట్ల జనంలో ఆసక్తిని ప్రోత్సహించగలవని ఆయన అభిప్రాయం.
చాలా జూలు తమ లాభాలలో కొంత మొత్తాన్ని పరిరక్షణ కోసం వెచ్చిస్తాయి.

ఫొటో సోర్స్, SYDNEY ZOO
వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఆక్వేరియమ్స్.. తన సభ్య సంస్థల నిర్వహణా వ్యయంలో 10 శాతాన్ని పరిరక్షణ ప్రాజెక్టుల కోసం వెచ్చించేలా ప్రోత్సహిస్తుంది.
సిడ్నీ జూ ఈ సంస్థ గుర్తింపు పొందే ప్రక్రియ కొనసాగుతోంది.
జంతువుల సంక్షేమం, సంరక్షణ ప్రోత్సాహం, ప్రజల్లో అవగాహన పెంపొందించే విషయంలో ప్రపంచంలోనే అగ్రగామి జూగా సిడ్నీలోని 103 ఏళ్ల వయసున్న టరోంగా జూ పేరుగాంచింది.
ఈ జూలో జంతువుల సంక్షేమం, సంరక్షణ కోసం కృషి చేసే 66 మంది బృందానికి నిక్ బోయెల్ సారథ్యం వహిస్తున్నారు.
టరోంగా జోక్యం లేకపోతే ఏడు జాతుల జంతువులు అంతరించిపోతాయని ఆయన చెప్తారు. అవి.. బెలింగర్ రివర్ టర్టిల్ లిస్టర్స్ గెకో, క్రిస్టమస్ ఐలాండ్ బ్యూ-టెయిల్డ్ స్కింక్, నార్తరన్ కొరాబరీ ఫ్రాగ్, సదరన్ కొరాబరీ ఫ్రాగ్, ఎల్లో-స్పాటెడ్ బెల్ ఫ్రాగ్, బూరూలాంగ్ ఫ్రాంగ్.
ఈ జూ చేపట్టిన పలు ఇతర కార్యక్రమాల గురించి కూడా బోయెల్ వివరించారు. ''మేం ప్రతి ఏటా 50 సముద్ర తాబేళ్లకు పునరావాసం కల్పిస్తాం. తరచుగా ఇవి సముద్రంలో ఏదో ఒక వస్తువులలో చిక్కుబడిపోవటమో.. వాటి పొట్టల్లో ప్లాస్టిక్ చేరటమో వంటి సమస్యలతో వీటిని తెస్తుంటారు. జూ సందర్శకులకు వీటిని చూపించటం ద్వారా.. రీసైక్లింగ్, చెత్త పారేయటంలో జాగ్రత్తలు పాటించేలా ప్రోత్సహిస్తుంటాం'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాధాన్యాలు ఎలా ఉండాలి?
కొత్తగా ఒక జూను ప్రారంభిస్తున్నపుడు.. ఉత్తమ ఆచరణల గురించి అది నేర్చుకోవాల్సింది ఏమిటి?
వినూత్న ఆవిష్కరణలలో ముందున్న జూలలో పోర్ట్‌ల్యాండ్ జూ ఒకటని ప్రొఫెసర్ ఫాలెన్ చెప్తారు. ''అక్కడ పులులు, సింహాలను ఉంచిన ఎన్‌క్లోజర్‌లలో మాంసం బంతులను గాలిలోకి విసిరే ఏర్పాటు ఉంది. వాటిని విసిరే శబ్దం విన్న ఈ జంతువులు.. వేటాడటానికి సిద్ధమవుతాయి. దీనివల్ల అవి ఏదో ఒక పనిలో కొంతసేపు తలమునకలవుతాయి. దిగులుకలిగించే విసుగును తగ్గిస్తాయి'' అని ఆయన తెలిపారు.
జూలలో జంతువులు ఉండే ఎన్‌క్లోజర్లను మనుషులు శుభ్రం చేయాలంటే జంతువులను తరచుగా చిన్న బోనుల్లోకి బదిలీ చేయాల్సి ఉంటుంది. దీనిని నివారించటానికి కొన్ని జూలలో ఈ ఎన్‌క్లోజర్లను శుభ్రం చేయటానికి ఇప్పుడు రోబోలను ఉపయోగిస్తున్నారు.
నిర్బంధంలో పునరుత్పత్తిని నిలిపివేయటం, జంతువులను ''పునరుత్పత్తి యంత్రాలు''గా ప్రపంచమంతటా రవాణా చేయటాన్ని నిలిపివేయటం కనీస చర్యలని.. జూలను వ్యతిరేకించే ప్రొఫెసర్ బెకాఫ్ వంటి వారు కోరుతున్నారు.
''జంతువులకు తమ పర్యావరణం విషయంలో, ముఖ్యంలో సామాజిక బృందాలలో కలిసే విషయాల్లో సాధ్యమైనంత వెసులుబాటు, నియంత్రణ ఇవ్వాలి'' అంటారాయన.

ఫొటో సోర్స్, SYDNEY ZOO
జంతువులను పరిశీలించటానికి, వాటి సంక్షేమాన్ని పర్యవేక్షించటానికి టరోంగా జూ ఒక ప్రవర్తనా నిపుణుడిని కూడా నియమించింది. ఈ జూలో కూడా జంతు పునరుత్పత్తి కార్యక్రమం ఉంది. అయితే, ఆస్ట్రేలియా ఉన్న ప్రాంతాన్ని బట్టి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు కష్టమని జూ యాజమాన్యం వాదిస్తుంది.
''యూరప్, అమెరికాలకు చాలా దూరంగా ఒంటరిగా ఉంది ఆస్ట్రేలియా. ఈ దేశంలో చాలా కఠినమైన జీవ-భద్రత ప్రమాణాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంతర్జాతీయ పునరుత్పత్తి కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం కష్టం కాదు. కానీ ఆ పని సక్రమంగా చేయాల్సి ఉంటుంది'' అని బోయెల్ అన్నారు.
ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామని సిడ్నీలోని కొత్త జూ ఉద్ఘాటిస్తోంది.
''మా జూలోని ఆవాసాలను.. జంతు సంక్షేమమే ప్రధానంగా రూపొందించాం. ఆరుబయలు ప్రాంతంగా, విస్తారమైన ప్రదేశంగా అనిపించేలా చేయటానికి మేం అగడ్తలను ఉపయోగించుకున్నాం. ఇవి జంతు సంక్షేమాన్ని, అతిథులను అనుభవాన్ని మెరుగుపరుస్తాయి'' అని మేనేజింగ్ డైరెక్టర్ జేక్ బర్జెస్ చెప్పారు.
సిడ్నీ జూ ప్రారంభమయ్యే తొలి వారాంతపు టికెట్లు నిర్ణీత సమయానికి ముందే అమ్ముడైపోయాయి. ఇటువంటి జంతుశాలలను సందర్శించటంలో ప్రజల ఆసక్తికి ఏమాత్రం కొదవ లేదని ఇది సూచిస్తోంది.
నగరాల్లోని జనాలను - అడవుల్లోని జంతుజాలం సంక్షేమంతో అనుసంధించటానికి జూలు ఒక మంచి మార్గమేనా అని అడినిపుడు.. ''అవి అర్థవంతమైన రీతిలో అవగాహన పెంపొందిస్తాయనేందుకు ఆధారాలు లేవు'' అని ప్రొఫెసర్ బెకాఫ్ బదులిచ్చారు.
''అటవీ జంతుజాలానికి సంబంధించిన టీవీ కార్యక్రమాల ద్వారా జనానికి తగినంత మంచి అవగాహన లభిస్తుంది. జూలు చెప్పే పాఠం ఏమిటంటారా? జంతువులను బోనుల్లో పెట్టటం సరైనదేనని చెప్పటం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ ‘ఎన్కౌంటర్’: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- హైదరాబాద్ ఎన్కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- దిశ అత్యాచారం, హత్య: ‘ఆడదానిగా కాదు.. సాటి మనిషిగా, కొలీగ్‌గా గుర్తించండి’
- మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా?
- నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్
- 'ఒక మహిళ ఒక వ్యక్తితో సెక్స్‌కు అంగీకరిస్తే, దాని అర్థం అతడు ఏం చేసినా ఫరవాలేదని కాదు'
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








