దర్బార్ సినిమా రివ్యూ: రజినీ స్టైల్ కోసమే చూడాలి

ఫొటో సోర్స్, LYCA
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ కాప్స్ హీరోలుగా ఇప్పటివరకూ అనేక సినిమాలొచ్చాయి. ఇక రజినీకి అలాంటి పాత్రలు ఏమాత్రం కష్టం కాదు. మరి జనవరి 9న విడుదలైన దర్బార్ సినిమాలో ముంబయిలో పోలీస్ కమిషనర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో రజినీకాంత్ ఎలా నటించారు, ఆ సినిమా ప్రేక్షకులు, అభిమానుల అంచనాలను అందుకుందా?
దర్బార్ కథేంటి?
కథ విషయానికొస్తే 'అనగా అనగా పూర్వం...' అని మొదలెట్టాలి. అంత పాత కథ. సినిమా మొదలవ్వడమే ఫ్లాష్ బ్యాక్‌తో మొదలవుతుంది. చాలావరకు ఫ్లాష్ బ్యాకే ఉంటుంది. వరుసగా ఎన్‌కౌంటర్లు చేస్తున్న అరుణాచలాన్ని హూమన్ రైట్స్ కమిషన్ నిలదీస్తుంది. అతని ప్రవర్తనకి కారణమేంటో చెబుతూ సినిమా మొదలవుతుంది.
కమిషనర్ ఆదిత్య అరుణాచలం ఒక రౌడీ పోలీస్. నవ్వుతూ, నవ్విస్తూ, తోటివారిలో ఉత్సాహం నింపుతూ క్రిమినల్స్ పని పట్టడంలో ఆయనో మాస్టర్. అతనికి వల్లి (నివేదా థామస్) అనే కూతురుంటుంది. కూతురంటే అరుణాచలానికి ప్రాణం. తండ్రి తప్ప వేరే లోకం తెలియదు వల్లికి.
ముంబయిలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని, యువత మత్తులో మునిగి తేలుతున్నారని, ఈ డ్రగ్ మాఫియా పని పట్టాలని అరుణాచలాన్ని ముంబయికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ సమస్యను మూలాల నుంచి పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా పెద్ద డ్రగ్ డీలర్ వినోద్ మల్హోత్రాని ఢీకొంటాడు అరుణాచలం. ఆ క్రమంలో అతడి కొడుకు అజయ్‌ను అంతం చేస్తాడు.

ఫొటో సోర్స్, DARBAR
ముంబయిలో డ్రగ్స్ సమస్య అంతమైంది, అంతా ప్రశాంతంగా ఉందని సంతోషించే సమయంలో ఓ ముఖ్యమైన విషయం బయటపడుతుంది. దాంతో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాలో ముఖ్యడు హరి చోప్రా (సునీల్ శెట్టి) తెరపైకొస్తాడు. చనిపోయిన అజయ్‌కు, హరి చోప్రాకి ఉన్న సంబంధం ఏంటి? అరుణాచలం, అసలు విలన్ హరి చోప్రాని ఎలా ఎదుర్కొంటాడు అన్నదే మిగతా కథ.
ప్రతి రాజు కథలో ఓ రాణి ఉన్నట్లే ఈ కథలో లిల్లీ పాత్రలో నయనతార ఉన్నారు. ఎప్పటిలాగానే ముంబయి పోలీసులు ఏదైనా సాధించేయగలరు. వారికి కావలసినవి ఏవైనా చిటికెలో అందిపోతుంటాయి. చిత్రమేమిటంటే కథలో తరువాతేం జరుగుతుందో మనకు ముందే తెలిసిపోతుంటుంది.

ఫొటో సోర్స్, DARBAR
సాంకేతికాంశాలెలా ఉన్నాయి?
సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ వంకపెట్టడానికేమీ లేదు. అనిరుధ్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం ఇంతకుముందు విన్నట్టుగానే అనిపిస్తాయి. రజనీకాంత్ పాత సినిమా అరుణాచలంలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంత రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. పాటలు తొందరగా అయిపోతే బాగుండునని ఒకటి రెండుసార్లు అనిపించినా ఆశ్చర్యం లేదు. చంద్రముఖిని గుర్తు చేస్తూ రజనీ, నయనతారల మధ్య ఒక పాట, బాషా, నరసింహలను గుర్తు చేస్తూ మరో రెండు పాటల పిక్చరైజేషన్ ఉంది.
కాలా, కబాలీ అని రజనీకాంత్ ఒక అడుగు అటు పెట్టారు. నడక సరిగ్గా కుదరలేదేమో! మళ్లీ అడుగు వెనక్కి తీసేసుకుని తన సూపర్‌స్టార్ ఇమేజ్ పంథాలోనే మరో సినిమా చేశారు. నటన విషయానికొస్తే రజనీ స్టైల్ మేరు పర్వతం. చూడ్డానికి కన్నులపండుగగా ఉంటుంది. శరీరంలో వయసు తెలుస్తున్నా ఉత్సాహంలో మాత్రం యువకుడే! రజనీకాంత్ స్టైల్ మాత్రమే చూడాలనుకుంటే ఈ సినిమాకి తప్పకుండా వెళ్లొచ్చు.
మిగతా నటులందరికి పెద్దగా నటనకు అవకాశం రాలేదు కానీ విలన్‌గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటన ఉన్న కాసేపూ ఆకట్టుకుంది.

ఫొటో సోర్స్, LYCA PRODUCTIONS
సినిమాలో రెండు విషయాలను కచ్చితంగా ప్రస్తావించాలి. అరుణాచలం టీంలో ఒక మహిళా పోలీసు అధికారిగా హిందీ టెలివిజన్ నటి షమత అంచన్ చేశారు. ఆమె సినిమా అంతా కనిపిస్తూ, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా డ్యూటీ చేస్తూ హీరోకి సపోర్టింగ్ పాత్రలో మెరిపించారు. ఇలాంటి పాత్రను కథలో పెట్టినందుకు దర్శకుడు మురుగదాస్‌ను మెచ్చుకోవాలి.
అంతేకాకుండా ఒక సీనులో హిజ్రాలను అరుణాచలం ఎంతో మర్యాదగా 'జీ' అని పిలిచి డబ్బులిచ్చి ఒక మంచి పాట పాడమంటాడు. అలాగే పాట చివర్లో వాళ్లకి వీడుకోలు చెప్తూ అతను ఒక హిజ్రాని తమకంతో కౌగిలించుకుని ఉండిపోతాడు. అందులో లేకితనం లేకుండా తనకో తోడు వెతుక్కుంటున్న అరుణాచలం పాత్ర.. ఆమెని ఒక మనిషిగా, ఆపోజిట్ జెండర్‌గా గుర్తించినట్టు కనిపిస్తుంది. చిన్నవే అయినా ఇలాంటి సీన్లు ఒకటి రెండు పెట్టి హిజ్రాల పట్ల సమాజం దృక్పథం మారుతోందని చూపించారు.
సినిమా చివరికొచ్చేసరికి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన మురుగదాస్ ఏమైపోయారా అనిపిస్తుంది!
అయితే, ఈ సినిమాకి దర్బార్ అని పేరెందుకు పెట్టినట్టు అనే సందేహం మాత్రం బయటకొచ్చే ప్రతి ప్రేక్షకుడికీ కలగకమానదు.
ఇవి కూడా చదవండి.
- JNUలో దాడి జరిగినప్పుడు వీసీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? :వైస్ చాన్స్‌లర్‌తో ఇంటర్వ్యూ
- చంద్రగ్రహణం: ఈరోజు ఎప్పుడు మొదలవుతుంది... ఎలా కనిపిస్తుంది?
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య: ‘అది ఆడమనిషి శరీరంలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర
- బ్రిటన్ రాజకుటుంబ బాధ్యతల నుంచి వైదొలగుతామన్న హ్యారీ-మేఘన్ జంట
- విమానం చక్రాల వెనుక దాక్కుని ప్రయాణం.. పదేళ్ల బాలుడి మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








