బ్రిటన్ రాజకుటుంబ బాధ్యతల నుంచి వైదొలగుతామన్న హ్యారీ-మేఘన్ జంట.. కుటుంబ సభ్యుల అసంతృప్తి

మేఘన్, హ్యారీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మేఘన్, హ్యారీ

బ్రిటన్ రాజకుటుంబ 'సీనియర్ సభ్యుల' బాధ్యతల నుంచి వైదొలగుతామని, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు పనిచేస్తామని రాజకుమారుడు 'డ్యూక్ ఆఫ్ ససెక్స్' హ్యారీ, ఆయన భార్య 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మార్కెల్ ప్రకటించారు.

బ్రిటన్, ఉత్తర అమెరికా రెండింటిలో ఉండే విధంగా సమతూకంతో సమయం కేటాయించుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రకటనకు ముందు వీరు రాణి ఎలిజబెత్-2, రాజకుమారుడు విలియం సహా రాజకుటుంబీకులు ఎవరినీ సంప్రదించలేదని బీబీసీకి తెలిసింది. ఈ ప్రకటన రాజకుటుంబానికి అసంతృప్తి కలిగించింది. సీనియర్ రాజకుటుంబీకులు బాధపడినట్లు తెలిసింది.

మీడియా తమపై దృష్టి కేంద్రీకరించడం వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను హ్యారీ, మేఘన్ 2019 అక్టోబరులో వెల్లడించారు.

బుధవారం నాటి ప్రకటన ఊహించని పరిణామం. ఈ ప్రకటనను హ్యారీ, మేఘన్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలోనూ పెట్టారు. చాలా నెలలపాటు ఆలోచించి, అంతర్గతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పారు.

ఆర్చీ, ప్రిన్స్ హ్యారీ

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, తనయుడు ఆర్చీతో ప్రిన్స్ హ్యారీ

రాజకుటుంబ సీనియర్ సభ్యుల బాధ్యతల నుంచి వైదొలగాలని, ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడేందుకు పనిచేయాలని అనుకొంటున్నామని, అదే సమయంలో రాణికి సంపూర్ణ సహకారం అందిస్తామని వారు తెలిపారు.

రాణి, కామన్వెల్త్, తమ మద్దతుదారుల పట్ల తమకున్న బాధ్యతలను గౌరవిస్తూనే, బ్రిటన్, ఉత్తర అమెరికా రెండింటిలో ఉండేందుకు సమతూకంతో సమయం కేటాయిస్తామని హ్యారీ, మేఘన్ చెప్పారు.

దీనివల్ల రాజకుటుంబ సంప్రదాయాల పట్ల తమ కుమారుడు ఆర్చీ హారిసన్‌కు అవగాహన కల్పిస్తూ పెంచడానికి, కొత్తగా సేవాసంస్థ ఏర్పాటు సహా జీవితంలోని తదుపరి అధ్యాయంపై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుందని వారు వివరించారు.

హ్యారీ-మేఘన్ ప్రకటన రాజకుటుంబానికి అసంతృప్తి కలిగించిందని రాజప్రాసాదం బకింగ్‌హాం ప్యాలస్ అధికారులు చెప్పారని బీబీసీ రాజకుటుంబ ప్రతినిధి జానీ డైమండ్ తెలిపారు.

ఈ ప్రకటనతో రాజకుటుంబం ఎంత తీవ్రంగా అసంతృప్తికి లోనైందనేది అధికారుల స్పందన సూచిస్తోందని ఆయన చెప్పారు. హ్యారీ-మేఘన్ నిర్ణయం కంటే, వారు తమను సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం కుటుంబసభ్యులను బాధ పెట్టి ఉండొచ్చని తెలిపారు. ఈ జంటకు, రాజకుటుంబంలోని మిగతా సభ్యులకు మధ్య ఉన్న తీవ్రమైన అంతరాన్ని ఈ పరిణామం స్పష్టంగా చూపిస్తోందని వివరించారు.

మేఘన్, హ్యారీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మేఘన్, హ్యారీ

ఈ నిర్ణయంపై హ్యారీ, మేఘన్‌లతో రాజకుటుంబం చర్చలు జరుపుతోందని, ఇవి ప్రాథమిక దశలో ఉన్నాయని రాజప్రాసాదం అధికార ప్రతినిధి చెప్పారు. భిన్నమైన దారిలో నడవాలనే వారి కోరికను రాజకుటుంబం అర్థం చేసుకుంటుందని, కానీ ఇవి సంక్లిష్టమైన అంశాలని, తేలడానికి సమయం పడుతుందని తెలిపారు.

క్రిస్మస్ సమయంలో హ్యారీ-మేఘన్ ఆరు వారాలపాటు రాజకుటుంబ విధుల నుంచి విరామం తీసుకొన్నారు. అప్పుడు కొంత సమయం కుమారుడు ఆర్చీ హారిసన్‌తోపాటు కెనడాలో గడిపారు.

ఆర్చీ హారిసన్ మేలో పుట్టాడు. హ్యారీకి 35 ఏళ్లు, మేఘన్‌కు 38 ఏళ్లు.

ఈ నెల 7న ఈ జంట బ్రిటన్‌కు తిరిగి వచ్చింది. తర్వాత లండన్‌లోని కెనడా హైకమిషన్‌కు వెళ్లి, కెనడాలో తమకు గొప్ప ఆతిథ్యం లభించిందంటూ ధన్యవాదాలు తెలిపారు.

ప్రేక్షకాదరణ పొందిన అమెరికా డ్రామా 'సూట్స్'‌లో నటించే సమయంలో మేఘన్ టొరంటోలో నివసించారు. ఆమెకు పలువురు కెనడియన్ స్నేహితులు ఉన్నారు.

హ్యారీ తన మనసు మాట విన్నారని ఈ నిర్ణయం చెబుతోందని బకింగ్‌హాం ప్యాలస్ మాజీ మీడియా అధికారి డికీ ఆర్బిటర్ వ్యాఖ్యానించారు. ఆర్చీ హారిసన్ పుట్టినప్పుడు మీడియా చేసిన అతి ఈ నిర్ణయానికి కొంత మేర కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

అప్పటికే రెండుసార్లు విడాకులు పొందిన వాలిస్ సింప్సన్‌ను పెళ్లి చేసుకోవడానికి 1936లో ఎడ్వర్డ్-VIII రాజరిక హోదాలను వదులుకోవడాన్ని ఆర్బిటర్ ప్రస్తావిస్తూ, ఈ ఘటనతో హ్యారీ నిర్ణయాన్ని పోల్చారు. ఇలాంటి ఘటన ఇప్పటివరకు ఒక్కటే జరిగిందని, ఆధునిక కాలంలో ఇలాంటి పరిణామం జరగనేలేదని చెప్పారు.

ఇటీవల లండన్‌లో కెనడా సీనియర్ దౌత్యవేత్తలను కలిసిన హ్యారీ, మేఘన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇటీవల లండన్‌లో కెనడా సీనియర్ దౌత్యవేత్తలను కలిసిన హ్యారీ, మేఘన్

హ్యారీ పేదరికంలో లేకపోయినప్పటికీ, రెండు వేర్వేరు ఖండాల్లో స్థిరపడటానికి, ఒక కుటుంబాన్ని పోషించడానికి, భద్రతా ఏర్పాట్లకు, ఇలాంటి ఇతర అవసరాలకు డబ్బు ఎలా సమకూర్చుకుంటారనేది చూడాల్సి ఉందని ఆర్బిటర్ చెప్పారు.

సంవత్సరంలో కొంత కాలం వేరే చోట నివసించాలనే ఆలోచన ఉన్నవాళ్లు విండ్సర్ పట్టణంలోని వారి నివాసం ఫ్రాగ్మోర్ కాటేజ్‌ నవీకరణకు 24 లక్షల పౌండ్లకు పైగా ప్రజాధనాన్ని ఎందుకు వెచ్చించారనే ప్రశ్న కూడా వస్తుందని ఆయన తెలిపారు.

హ్యారీ-మేఘన్ వద్ద పొదుపు చేసుకున్న సొమ్ము గణనీయంగానే ఉందని బీబీసీ ప్రతినిధి జానీ డైమండ్ చెప్పారు. ఇందులో ప్రిన్సెస్ డయానా ఎస్టేట్ నుంచి హ్యారీకి వారసత్వంగా వచ్చినది, నటిగా మేఘన్ సంపాదించుకొన్న డబ్బు ఉన్నాయని తెలిపారు.

పత్రికలు చూపే అమితాసక్తి వల్ల 'మాతృత్వం'లో తాను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని 2019లో ఐటీవీ డాక్యుమెంటరీలో మేఘన్ చెప్పారు.

తన సోదరుడు, డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ విలియంకూ, తనకూ మధ్య విభేదాల వార్తలపై హ్యారీ స్పందించారు. తాము రెండు వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నామని ఆయన చెప్పారు.

హ్యారీ, మేఘన్ 2018 మేలో పెళ్లి చేసుకున్నారు.

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, హ్యారీ, మేఘన్ 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఇతర రాజకుటుంబీకులు చేరువకాని ప్రజలకు వీరు చేరువయ్యారు.

తన వ్యక్తిగత లేఖను ఒకటి చట్టవిరుద్ధంగా ప్రచురించిందంటూ 'ద మెయిల్ ఆన్ సండే' పత్రికపై అక్టోబర్లో మేఘన్ చట్టపరమైన చర్యలు మొదలుపెట్టారు. అలాగే ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలకు సంబంధించి ద సన్, న్యూస్ ఆఫ్ ద వరల్డ్, ద డైలీ మిర్రర్ పత్రికలపై హ్యారీ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.

"కొన్ని బలమైన శక్తుల వల్ల నేను నా తల్లిని కోల్పోయాను. ఇప్పుడు నా కళ్ల ముందే నా భార్య ఇదే శక్తుల వల్ల బాధితురాలిగా మారుతున్నారు" అని హ్యారీ ఒక ప్రకటనలో చెప్పారు.

రాజకుమారుడు విలియం, కేట్ మిడిల్‌టన్ దంపతులతో కలసి నిర్వహిస్తున్న సేవాసంస్థ నుంచి గత వేసవిలో హ్యారీ, మేఘన్ దంపతులు బయటకు వచ్చేశారు.

బాలలపై లైంగిక దాడుల దోషి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై వివాదం నేపథ్యంలో డ్యూక్ ఆఫ్ యార్క్ ప్రిన్స్ ఆండ్రూ ప్రజాజీవితానికి దూరమైన రెండు నెలలకు హ్యారీ-మేఘన్ నిర్ణయం వెలువడింది.

బీబీసీ రాజకుటుంబ ప్రతినిధి జానీ డైమండ్ విశ్లేషణ...

హ్యారీ-మేఘన్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, ఎక్కడ నివసించబోతున్నారు, ఆ ఖర్చులు ఎవరు భరిస్తారు, రాజకుటుంబంలోని మిగతావారితో ఈ జంట సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

రాజకుటుంబ విధుల నుంచి ప్రిన్స్ ఆండ్రూ తప్పుకొన్న తర్వాత కొంత కాలానికే తాజా పరిణామం జరిగింది. 21వ శతాబ్దానికి తగినట్లుగా సంఖ్యాపరంగా పరిమితమైన రాజరిక వ్యవస్థగా బ్రిటన్ రాజరిక వ్యవస్థ మారుతున్నట్లు కొందరికి అనిపించవచ్చు. అయితే ఇతర రాజకుటుంబీకులు చేరువకాని ప్రజలకు హ్యారీ, మేఘన్ చేరువయ్యారు. రాజరిక వ్యవస్థలో వస్తున్న కొత్త మార్పుల్లో వారు భాగమయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)