బ్రిటన్: ఘనంగా రాకుమారుడు హ్యారీ వివాహం
బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల వివాహం బ్రిటన్ వేసవి కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం (భారత్‌లో సాయంత్రం) ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది.
బెర్క్‌షైర్ కౌంటీలోని విన్సర్ పట్టణంలోని రాజ భవనం విన్సర్ క్యాజిల్ ఈ వివాహ వేడుకకు వేదిక.
విన్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్స్ ఛాపెల్‌లో ఎలిజబెత్ రాణి, 600 మంది అతిథుల సమక్షంలో వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.
ఇప్పటివరకున్న రాజకుటుంబ సంప్రదాయానికి భిన్నంగా హ్యారీ పెళ్లి ఉంగరం ధరించారు. వధూవరులు ప్రమాణాలు చేసే సమయంలో ''విధేయురాలై ఉంటాను'' అనే మాటను మేఘన్ మార్కెల్ ఉచ్చరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇకపై హ్యారీని ‘డ్యూక్ ఆఫ్ ససెక్స్’గా, ఆయన భార్య మేఘన్ మార్కెల్‌ను ‘డచెస్ ఆఫ్ ససెక్స్’గా వ్యవహరిస్తారు.
రాజకుటుంబ సంప్రదాయం ప్రకారం హ్యారీని 'డ్యూక్ ఆఫ్ ససెక్స్'గా, మార్కెల్‌ను 'డచెస్ ఆఫ్ ససెక్స్'గా వీరి వివాహానికి ముందు ఎలిజబెత్ రాణి ప్రకటించారు.
ఎర్ల్ ఆఫ్ డంబార్టన్, బ్యారన్ కిల్‌కీల్ అనై టైటిళ్లు కూడా హ్యారీ పొందారు.
దేశదేశాల నుంచి విశిష్ట వ్యక్తులెందరో ఈ పెళ్లికి హాజరయ్యారు.
అమెరికా టెలివిజన్ సెలబ్రిటీ ఓప్రా విన్‌ఫ్రే, బ్రిటన్ నటుడు ఇడ్రిస్ ఎల్బా, ప్రముఖ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్హామ్, టెన్నిస్ తార సెరెనా విలియమ్స్, సినీరంగానికి చెందిన జార్జ్ కూల్నీ, అమల్ కూల్నీ దంపతులు, ఇతర ప్రముఖులు వివాహ వేడుకలో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, PA
హాజరైన హ్యారీ మాజీ ప్రియురాళ్లు
హ్యారీ మాజీ ప్రియురాళ్లు ఇద్దరు వివాహ మహోత్సవానికి వచ్చారు.
వీరిలో ఒకరైన క్రెసీడా బొనాస్ 2012-14 మధ్య హ్యారీతో డేటింగ్ చేశారు.
2004-10 మధ్య చెల్సీ డేవీ, హ్యారీల మధ్య రిలేషన్‌షిప్ ఉంది.
హ్యారీ, మేఘన్ మార్కెల్ వివాహానంతరం సెయింట్ జార్జ్స్ హాల్‌లో రాణి ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు 600 మంది అతిథులు హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










